Thursday 22 March 2012

వాదం గెలిచినచోట వితండవాదనలేల!


ఈ ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏమిటో ప్రపంచానికి తెలియజేశాయి. తెలంగాణాలో జరిగిన ఆరు స్థానాల్లో సీమాంధ్ర పార్టీలకు చోటు దక్కలేదు. అయితే ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు కాంగ్రెస్, టిడిపిలు వ్యవహరిస్తున్నాయి. మహబూబ్ నగర్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవడాన్ని బూచిగా చూపెట్టి తప్పుకోవాలని చూస్తున్నాయి.అక్కడ బిజెపి అభ్యర్థి గెలిచినా టిఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా ఓడింది మాత్రం సమైక్యవాదమే! ఎందుకంటే డిసెంబర్ తొమ్మిది ప్రకటన తరువాత ఈ ప్రాంతంలో ఇప్పటి ఎన్నికలతో కలిపి మూడు సార్లు తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అయినా ఈ చిత్తూరు బాబులకు సోయి రావడం లేదు. ఇంకా ఈ ఫలితాలపై వింత వాదనలు చేస్తున్నారు. టిఆర్ఎస్ కు గతంలో కంటే మెజారిటీ తగ్గింది అని ఒకరు..ఈ మ్యాచ్ ఓడిపోతే మరో మ్యాచ్ లో గెలుస్తామని మరొకరు పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఒక్క కాంగ్రెస్, టిడిపి లకే కాదు .. కాలం చెల్లిన భాష ప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంత చెబుతున్న సిపిఎం కు.. కోవూరులో గెలిచామని సంబరపడుతున్న వైఎస్ఆర్ సిపికి కూడా హెచ్చరికలే. ఎందుకంటే త్వరలో జరగబోయే మరో పద్దెనిమిది స్థానాల ఉప ఎన్నికల్లో తెలంగాణాలో కూడా ఒక స్థానం ఉన్నది. చంద్రబాబు నేను తెలంగాణకు వ్యతిరేకం కాదని గొంతుపోయేలా అరిచినా ప్రజలు విశ్వసించలేదు. అందుకే రేపు జగన్ కూడా పరకాల ప్రచారంలో బాబు పాటే పాడుతనంటే బాబుకు పట్టిన గతే పడుతుంది. అలాగే బిజెపి కూడా మహబూబ్ నగర్ ఫలితాన్ని చూసి...ఒక జాతీయ పార్టీగా రాష్ట్ర విభజన కోసం ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదని గ్రహించలే.  రేపు జరగబోయే ఎన్నికల్లో ఆ పార్టీ సీమాంధ్ర లో జై ఆంధ్ర నినాదంతో పోటీ చేయాలి. ఆ పార్టీ జాతీయ నేతలంతా రాష్ట్ర విభజన ఆవశ్యకతను ఆ ప్రాంత ప్రజలకు తెలియచెప్పాలి. మంత్రి టిజి వెంకటేష్, ఆనం వివేకానంద వంటి నేతలు  కోవూరులో వైఎస్ఆర్ సిపి ఓటు వేస్తే అది రాష్ట్ర విభజనకు వేసినట్టే అవుతుందని ప్రచారం చేశారు. అయినా అక్కడి ప్రజలు ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపించారు. అంటే రాష్ట్ర విభజనకు సీమాంధ్ర ప్రజానీకం కూడా సంసిద్ధంగా ఉన్నదని అర్థమవుతున్నది. ఈ ఎన్నికల ఫలితాల తరువాత మంత్రి డిఎల్ కూడా తెలంగాణపై తేల్చాల్సిందేనని కుండ బద్దలు కొట్టారు. ఇప్పటికే హర్షకుమార్, బొత్స వంటి నేతలు తెలంగాణకు జై కొట్టారు. ఆ ప్రాంతం లోన్ బడుగు బలహీన వర్గాల వారుకూడా రాష్ట్ర విభజన కావాలని కోరుకుంటున్నారు. ఇంకా కొన్ని సంఘాలు జై ఆంధ్ర కోసం పనిచేస్తున్నాయి. ఇక్కడ తెలంగాణ రాజకీయ ఐకా స అన్ని  వర్గాలను ఏకం చేసినట్టే .. అక్కడ కూడా విభజన  కోరుకునే వారందరిని బిజెపి ఏకం చేయాల్సిన బాధ్యత ఉన్నది.  కాబట్టి బిజెపికి ఇదోక మంచి అవకాశం. గతంలో ఆ పార్టీ చేసినా కాకినాడ తీర్మానానికి అనుగుణంగా వచ్చే ఉప ఎన్నికల్లో ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు నినాదం తో పోటీ చేయాలి. ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ప్రస్తుతానికి అనవసరం. కానీ ఆ పార్టీ అక్కడ ఎంతో కొంత ఓట్ల శాతాన్ని దక్కించుకుంటే ఈ పెట్టుబడిదారుల నోళ్ళు మూయించవచ్చు. మెజారిటీ ప్రజలు సమైక్యవాదాన్నే కోరుకుంటున్నారు అంటున్న వారికి తగిన బుద్ధి చెప్పవచ్చు.ఇక కాంగ్రెస్, టిడిపి లు కూడా రెండు ప్రాంతాల్లో తమ పార్టీలను కాపాడుకునే ప్రయత్నంలో చాలా తప్పులు చేస్తున్నాయి. అవి మొదటికే మోసం తెస్తాయని గుర్తించుకోవాలి. ఇవాళ కాకపోయిన రేపు అయినా రాష్ట్ర విభజన ఖాయం. అందులో ఎలాంటి అనుమానం లేదు. సీమాంధ్ర ప్రజలు కూడా నలుగురు పెట్టుబడిదారుల మాటలు నమ్మి మోసపోకుండా నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను మన్నిస్తే మంచిది. అలాగే తెలంగాణ టిడిపి, కాంగ్రెస్ నేతలు ఉద్యమ నాయకత్వం పై అవాకులు చెవాకులు మాని వారి వారి అధిష్టానాల పై ఒత్తిడి పెంచాలి. అప్పుడే వారికి రాజకీయ భద్రత ఉంటుంది. లేకపోతే శంకరగిరి మాన్యాలే దిక్కు.
--
rajuasari@gmail.com


Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home