Thursday 8 March 2012

విభజన యూపీలో అంశమే.. కానీ ఏపీలో ఆకాంక్ష ...


ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రభావం కేంద్ర ప్రభుత్వం పైన.... జాతీయ పార్టీల పైన పడుతుంది కానీ... తెలంగాణ రాష్ట్ర డిమాండ్ పై మాత్రం పడదు. దీన్ని సీమాంధ్ర మీడియా పనిగట్టుకుని ప్రచారం చేయడం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వాటికి  ఉన్నఅక్కసు మాత్రమే.. ఉత్తరప్రదేశ్ లో సైకిల్ జోరు చూసి చంద్రబాబు మళ్లీ  థర్డ్ ఫ్రంట్ అని, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా తమ సైకిల్ దూసుకు పోతదని బీరాలు పలుకుతున్నాడు. యూపీలో కాంగ్రెస్ పార్టీ ది నాలుగో స్థానం అయితే  ఏ పీ లో కూడా టిడిపి డి మూడో స్థానమే. టిడిపి ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నది. ఇవ్వాళ రాష్ట్రం లో జగన్ అవినీతి ఒక్కటే కాదు బాబు గారి అవినీతి బాగోతాల గురించి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. అవినీతి విషయంలో చంద్రబాబు, జగన్ బాబు దొందు దొందే..ఇక అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో జరగబోతున్న ఉప ఎన్నికల్లో విజయం మాదంటే మాదే అని ఉదరగోట్టే ఉపన్యాసాలు ఇస్తున్నాయి. ఓటరు నాడి తమకు బాగా తెలుసన్నట్టు వ్యవహరిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి జగన్ ను... తెలంగాణ డిమాండు ను తమ ఉమ్మడి సమస్యలుగా భావిస్తున్నాయి. అందుకే ఇరు పార్టీలు ఒక్కటై కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తుంటే వీళ్ళకు కాక ఎవరికి వేస్తారు మరి! అలాగే బిజెపి కూడా తెలంగాణ విషయంలో  కాంగ్రెస్, టిడిపిల వలె  వ్యవహరిస్తున్నది. ఎందుకంటే తెలంగాణ కోసం ఉద్యమిస్తూనే.. యిప్పుడు ఈ ప్రాంతంలో జరగబోయే ఉప ఎన్నికల్లో తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది. మహబూబ్ నగర్ లో ఎన్నికలు అనుకోకుండా వచ్చాయి. అక్కడ తెలంగాణ కోసం ఎవరు రాజీనామా చేయలేదు. అక్కడ ఆ పార్టీ పోతిచేయడం మంచిదే. కానీ తెలంగాణ పై ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తున్న కాంగ్రెస్, టిడిపి లను కార్నర్ చేయకుండా, రాష్ట్ర సాధన  కోసం దశాబ్ద కాలంగా పోరాడుతున్న పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడాన్ని తెలంగాణ ప్రజానీకం హర్షించదు. నిజానికి బిజెపి రాష్ట్ర విభజనకు కట్టుబడి ఉన్నట్లయితే రేపు సీమాంధ్ర లో జరగబోయే పదహారు అసెంబ్లీ, ఒక్క పార్లమెంటు స్థానంలో జై ఆంధ్ర నినాదంతో పోటీ చేయాలే. ఒక జాతీయ పార్టీగా రాష్ట్ర విభజన ఆవశ్యకతను అక్కడి ప్రజలకు తెలియజేయలే. దాన్ని తెలంగాణ ప్రజలే కాదు సీమాంధ్ర లో రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్న దళిత, బహుజనులు కూడా స్వాగతిస్తారు. అంతే కానీ చంద్రబాబు లాగా తమది కూడా రెండుకళ్ళ సిద్ధాంతం అన్నట్టు వ్యవహరించకూడదు. మహబూబ్ నగర్ స్థానంలో బల బలాల దృష్టితో కాకుండా టిఆర్ఎస్ కూడా ఉద్యమంలో కలిసి పనిచేస్తున్న పార్టీల తో చర్చించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది. ఒక్క స్థానం కోసం ఒకరినొకరు దూషించుకుంటే అది శత్రువుకు ఆయుధం అయితది. లక్ష్య సాధనకు చేరువగా ఉన్నసమయంలో రెండు పార్టీలు పట్టు విడుపులతో పనిచేయలే. అప్పుడే తెలంగాణ వ్యతేరేకులకు బుద్ధి చెప్పగలం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home