Friday 30 March 2012

ముప్పైఏళ్ళ పార్టీని చుట్టుముట్టిన ముళ్ళకంచెలు



టిడిపి ఆవిర్భవించి ముప్పై ఏళ్ళు పూర్తయ్యాయి. కానీ ఈ వేడుకలు తెలుగు తమ్ములు సంతోషంగా జరుపుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే టిడిపి  సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి... పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చింది. అయితే ఇదో అద్భుతం అనేవాళ్ళు లేకపోలేదు.అది వేరేసంగతి ! కానీ అన్న స్థాపించిన టిడిపికి బాబు టిడిపికి చాలా తేడా ఉన్నది . ఎందుకంటే చంద్రబాబు యిప్పుడు ఆ పార్టీని కార్పొరేటే సంస్థగా మార్చేశారు. క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకునే ఆ పార్టీలో యిప్పుడు ఆ పదమే పెద్ద సమస్యగా మారిపోయింది. దీనికి కారణం చంద్రబాబే. ప్రజలు రెండుసార్లు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ఆయన వైఖరిలో మార్పు రాలేదు. వస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు కూడా భావించడం లేదు. ప్రస్తుతం  రాష్ట్రంలో ఆ పరిస్థితి ఏమిటో వారికి అర్థం కాకపోవడమే ఇందుకు కారణం.ఎందుకంటే మొన్నఎన్నికలపై బాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే.. బాబు అంత నిర్వేదంలో ఉన్నారో అర్థమవుతుంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికలను ఎదుర్కోవడానికి అయన పడుతున్న పాట్లు అంతా ఇంతా కాదు. తొమ్మిదేళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను చేసిన అభివృద్ధిని... ఆంధ్ర హజారే లాగా అవినీతిపై తను చేస్తున్న యుద్ధాన్ని కూడా ప్రజలు గుర్తించడం లేదనేదే బాబు గారి బాధకు కారణం అయి ఉంటుంది. ఏం చేస్తాం బాబు ఏ పోరాటం చేసిన ఏదో ఆశించి చేస్తాడు కనుక (అన్ని రాజకీయ పార్టీలు అదే చేస్తాయి).. అదీ ఏదీ ఎక్కువ కాలం చేయరు. ప్రధాన ప్రతిపక్ష నేతగా బాబు ఏమి చేసిన (బాబు గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రిగా తాను నెలకొల్పిన రికార్డు గురించి) తన హయంలో జరిగిన తప్పులే ప్రజలకు టక్కున ప్రజలకు గుర్తుకొస్తుంటాయి మరి.తాను మారాను మహా ప్రభో అని గొంతెత్తి నినదీస్తున్నా.. ఎవరూ నమ్మడంలేదు. దీనిపై బాబు సమీక్ష కూడా చేయరాయే.. ఎందుకంటే ఆయన తన చుట్టూ పెట్టుకున్న భజన పరులు వచ్చే ఎన్నికల్లో టిడిపిదే గెలుపు.. బాబు గారే సిఎం అని గొప్పలు చెబుతుంటారు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే... పార్టీ ముప్పై ఏళ్ళు పూర్తైన సందర్భంగా.. పార్టీ ప్రస్తుత పరిస్థితిపై  నందమూరి హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు .. ఎవరిని ఉద్దేశించి చేశారో వేరే చెప్పనక్కర లేదు..అందుకే టిడిపి తిరిగి అధికారంలోకి వస్తుందా...? రాదా అనే చర్చల కంటే ఆ పార్టీ మనుగడపైనే ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. దీనికి కూడా బాబు గారి ముందు చూపే కారణం కావచ్చు. టిడిపి కాపాడుకోవడానికి తాను ముందుకు తెచ్చిన రెండుకళ్ళ సిద్ధాంతం యిప్పుడు ...ఆ పార్టీలోని సంక్షోభానికి కారణం. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడం సంగతి అటుంచి .. రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది అ పార్టీ. అందుకే మూడు దశాబ్దాల పార్టీని అనేక సమస్యలు చుట్టు ముట్టాయి. గత రెండున్నర ఏళ్లుగా రాష్ట్రంలో దాదాపు ఇరవై శాసనసభ స్థానాలకు.. ఒక పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టిడిపి ఒక్క స్థానాన్ని గెలుచుకోలేక పోగా చాలాచోట్ల డిపాజిట్ కూడా దక్కలేదు..ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చాలాచోట్ల మూడో స్థానంలోకి దిగజారిపోయింది. ఇదీ కార్యకర్తలనే కాదు బాబును కూడా నైరాశ్యంలోకి నెట్టింది. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే. ఒక సారి కాకపోయినా మరోసారి అయినా ..ప్రధాన ప్రతిపక్షం తన సత్తా చాటాలి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ పని తీరు ఎలాఉందో అందరికీ తెలిసిందే..అయినా టిడిపి పుంజు కోవడం లేదు ఎందుకని? ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలను తిప్పికొట్టడంలో .. వ్యూహాలు పన్నడంలో బాబు ముందుంటారని ఆయనకు పేరు కూడా ఉన్నది. ఒక ప్రాంతీయ పార్టీ మూడు దశాబాల్లో దాదాపు పదిహేడేళ్ళ పాటు అధికారంలో ఉండడం మామూలు విషయం కాదు. ఇన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్న టిడిపిని ప్రజలు ఎందుకు ఆదరించడం లేదు. ఈ రాష్ట్రంలో అన్ని రంగాలను నిర్వీర్యం చేసి..ఐ టీ నెత్తిన పెట్టుకొని .. బిల్ గేట్స్ .. బిల్ క్లింటన్ల ప్రశంశలు అందుకున్న బాబు ... ఏడేళ్ళుగా ప్రజల మెప్పు మాత్రం పొందలేకపోతున్నాడు.దీనికంతటికి కారణం ఒక్కటే .. అదే తెలంగాణ. టిడిపికి బలమైన క్యాడర్ ఉన్నదంటే (సీమాంధ్ర కంటే కూడా ) అది తెలంగాణలోనే .యిప్పుడు తెలంగాణాలో ఆ పార్టీ మునిగిపోతున్న నావా వలె తయారయ్యింది. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గౌరవిస్తామని మహా కూటమి పెట్టి .. తరువాత మాట మార్చి .. యిప్పుడు తెలంగాణ ప్రజల దృష్టిలో బాబు ద్రోహిగా మిగిలిపోయాడు. ఒకప్పుడు తెలంగాణాలో టిడిపికి కంచుకోటలుగా ఉన్న స్థానలన్ని కూలి పోతున్నాయి. క్యాడర్ కూడా చెల్లా చెదురైంది. నిజానికి బాబు చెబుతున్నట్టు తెలంగాణ పై తేల్చాల్సింది కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీయే . కానీ ప్రధాన ప్రతిపక్షం అవలంబిస్తున్న ద్వంద్వ విధానం వల్లే తాము తెలంగాణ పై ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నాము అని చెప్పగలుగుతున్నది, ఒకవేళ చంద్రబాబు గతంలో తెలంగాణ కు  అనుకూలంగా  ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చినట్టే .. యిప్పుడు కూడా కేంద్రానికి లేఖ రాస్తే ... ఈ సమస్య కాంగ్రెస్ కోర్టులోకి వెళ్ళేది. బాబు భారం కొంత దిగేది. కానీ బాబు అలా చేయకుండా.. రెండు కళ్ళ సిద్ధాంతం రాద్ధాంతం చేస్తుండడం వల్లే ఈ సమస్య ఇంతా జటిలం అయ్యింది. దాదాపు ఎనిమిది వందలకు పైగా మంది బలిదానాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కాదు.. బాబు విధానాలు కూడా కారణమని ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తున్నారు. పార్టీల్లో  సమస్యలు ఉండడం సహజమే. కానీ వాటిని అధిగమించాలంటే.. వాటిపై సమీక్ష జరగాలె.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవలె. అప్పుడే ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకం ఏర్పడుతుంది.. కానీ బాబు వలె సమస్యను తన కనుసన్నల్లో దాచి .. ఆ పార్టీ నాయకులను.. కార్యకర్తలను నియంత్రించగలరేమో కానీ... ప్రజలను శాసించలేరు. అది బాబు గుర్తించనంత కాలం.. అ పార్టీది మొన్నటి దాకా రెండో స్థానం.. నేడు మూడో స్థానం.. రేపటి సంగతి....?
-రాజు ఆసరి

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home