Sunday 25 March 2012

ప్రజల అవస్తలే పాలకుల అభివృద్ధి!



భారత దేశంలో  ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం  2005 నాటికి 41.6 శాతం మంది దారిద్ర్య రేఖ కు దిగువన జీవిస్తున్నారని పేర్కొన్నది. 2010 యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రకారం 37.2 శాతం దారిద్ర్య రేఖ కు దిగువన ఉన్నారు. ఈ రెండు నివేదికల ప్రకారం 2005-2010 మధ్యకాలంలో మన దేశంలో పేదరికం తగ్గింది దాదాపు నాలుగు శాతమే! కానీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు అహ్లువాలియా మాత్రం రోజుకు ఇరవై ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టే వారంతా పేదలు కారని తేల్చేశారు. అయన లెక్కప్రకారం రోజుకు రెండు సార్లు టీ తాగి.. ఒక కర్రితో ఒక్క పూట భోజనం చేసేవాళ్ళంతా ధనికులే. అహ్లువాలియా లెక్కల ప్రకారం దేశంలో పేదరికం లేనే లేదు. బ్యూరోక్రాట్లు ఈ దేశాన్ని ఏలితే ప్రజల జీవన ప్రమాణ స్థాయి ఎలా ఉన్నా... పాలకుల పట్టికలో మాత్రం మెరుగ్గానే కనిపిస్తారు. స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా ఈ దేశంలో ప్రజలు చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. మెరుగైన విద్య, వైద్యం లేక అక్షరాస్యతలో, ఆరోగ్యంలో ప్రపంచంలో చిన్న దేశాల కంటే వెనుకబడే ఉన్నారు. 187 దేశాలాలోని మానవాభివృద్ధిలో మన దేశ స్థానం 134. ప్రజల అవస్తలు పాలకులకు అభివృద్ధిగా ఎందుకు కనిపిస్తున్నది? ఎవరి మెప్పు కోసం మన దేశం సుభిక్షంగా ఉందని మన విధానకర్తలు ప్రకటిస్తున్నారు? ప్రపంచ వాణిజ్య సంస్థ విధానాలు మెల్లగా మన పాలకులు  దేశంలో అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజా సంక్షేమాన్ని సందుగలో పెట్టి తాళం వేస్తున్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలు తలుపులు తెరిచే చర్యలు ఇప్పటికే  ప్రారంభమయ్యాయి. ప్రజారోగ్యాన్ని కార్పోరేట్ ఆస్పత్రులకు కట్ట బెట్టారు. అణు ఒప్పందం పేరుతో ఈ దేశ సార్వబౌమత్వాన్ని అమెరికా కాళ్ళ దగ్గర పెట్టింది మన్మోహన్ ప్రభుత్వం. దాదాపు నాలుగు లక్షల ఎంవోయులు కుదుర్చుకుని అటవీ ప్రాంతాలలోని సహజ వనరులను బహుళజాతీ సంస్థలకు అప్పజెప్పింది.ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న అడవిబిద్దాలను ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో అంతమొందిస్తున్నది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ...దాన్ని నిలదీస్తున్న ప్రజలను, ప్రజా సంఘాలను అణచివేస్తూ అదే దేశం సాధించిన అభివృద్ధి అహ్లువాలియా ప్రకటిస్తున్నారేమో! అభివృద్ధి అంటే వందకోట్ల మంది భారతీయులది కాదు, పాతిక మంది బడా పెట్టుబడి దారులదని పాలకుల ప్రగాడ విశ్వాసం. అందుకే గోదాంలలో ముక్కిపోతున్న బియ్యాన్ని పేదలకు పంచాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన కుదరదు అని చెప్పిన ప్రధాని మన్మోహన్ దివాలా దీస్తున్న కంపెనీలకు మాత్రం బెయిల్ అవుట్ ప్రకటిస్తున్నారు. అందుకే మిత్రులారా స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మనం పుస్తకాల్లో చదువుకుంటున్న భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనే పదాన్ని సవరించి చదువుకోవాలి . వచ్చే ఏడాది విద్యార్థుల పుస్తకాల పునర్ ముద్రణలో ఈ మార్పు చేస్తే, మనం బాధపడుతుంటే పాలకులు మురిసిపోతారు. వాళ్ళ సంతోషం కోసమైనా కొంతకాలం మన సమస్యలను పక్కన పెడదాం!

--
rajuasari@gmail.com


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home