Friday 23 March 2012

ఇక ఆ'నందన' నామ సంవత్సరమే..



పుస్తకం పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది. అనుభవం పరీక్ష పెట్టి పాఠం చెబుతుంది.తెలంగాణ ఉద్యమ్యానికి రెండోది సరిగ్గా సరిపోతుంది. శ్రీ ఖర నామ సంవత్సరంలో చేదు గులికలో తీపి గురుతులో ఎవైతేనేమి తెలంగాణ ప్రజానీకం  ఆ రెంటినీ చూసింది. అణచివేత నుంచి విప్లవాలు పుడుతాయని మిలియన్ మార్చ్ ద్వారా ప్రపంచానికి చూపెట్టింది. సంఘటితం అయితే ఐక్యత సాధ్యమే అని సకల జనుల సమ్మె నిరూపించింది. ఇవన్ని ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే గడిచిన రెండున్నర ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఎంత చైతన్య వంతులయ్యరో ... తెలంగాణ ఉద్యమం దేశంలోని ఎన్ని ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నదో చెప్పడానికే. ఉద్యమాలు ఎప్పుడూ ఒకేలా ఉండాలనే నియమమేది లేదు. సందర్భాలను బట్టి వాటి స్వరూపం మారుతూ ఉంటుంది. అందుకే ఏదీ ఏమైనా గమ్యాన్ని ముద్దడడానికి తమది ఒకటే నినాదమని ఎన్నికల ఫలితాల ద్వారా ఎలుగెత్తి చాటుతున్నారు. వాటిపై ఎవరి విశ్లేషణలు వారివే కావచ్చు. కానీ అందులో సీమాంధ్ర మీడియా ఆంతర్యం మాత్రం ఒక్కటే. కోడి గుడ్డుపై ఈకలు పీకడం. ఎందుకంటే ఇంకా కాంగ్రెస్, టిడిపిలకు గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెరిగిందనే చర్చలే చేస్తున్నాయి.అందరూ జై తెలంగాణ నినాదం తోనే పోటీ చేశారనే వాస్తవాన్ని తోక్కిపెడుతున్నాయి. తెలంగాణలో జరిగిన ఉపఎన్నికల స్థానాలన్నీ అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీ లవే అనే విషయాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే రోజు మీడియా లో చర్చల సమయంలో రాష్ట్రంలో ఈ సంధిగ్తత ఎప్పుడు తొలుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు కానీ దానికి కారకులు ఎవరో చెప్పడం లేదు. ఎంత సేపు మా చానల్ ఏ పార్టీకి కొమ్ము కాయదు అని చేబుతాయే కానీ ఆచరణలో మాత్రం తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మడమే వాటి ప్రధాన ఉద్దేశం. తెలంగాణ ప్రజలు వాటి నుంచి ఏమి ఆశించడం లేదు. వాస్తవాలను చెప్పాలనే కోరుతున్నాయి. ఎందుకంటే మొన్నటి దాకా తెలంగాణ ఉద్యమ నాయకత్వం పై ఒంటి కాలుపై లేచిన మోత్కుపల్లి, ఎర్రబెల్లి వంటి నేతలు ఉప ఎన్నికల తరువాత కనబడడం లేదు.దీన్ని సీమాంధ్ర మీడియా ప్రసారం చేయదు. అదే కెసిఆర్ రెండు రోజులు కనబడక పొతే కెసిఆర్ ఎక్కడ అని హెడ్డింగులు పెడుతాయి. ఇదీ ఆయా చానళ్ళ ద్వంద్వ నీతి! అందుకే  చంద్రబాబు మెప్పు కోసం చిల్లర మాటలు మాట్లాడిన వీరికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.ప్రజాభిప్రాయానికి విలువివ్వని వీళ్ళకు ఉద్యమం గురించి మాట్లాడే అర్హత లేదు. తెలంగాణ ఉద్యమం కెసిఆర్ పేటెంట్ హక్కు అని వారు చెప్పుకోలేదు.ప్రజలు అలా భావించడం లేదు. దీన్ని విస్తృతంగా ప్రచారం చేసింది సీమాంధ్ర నేతలు.. వారి మీడియా మాత్రమే. ఎందుకంటే కెసిఆర్ ఉద్యమం చేయడం మానేస్తే తెలంగాణ ఉద్యమం ఉండదు అనేది వారి భ్రమ! కానీ వాస్తవం అది కాదు. దశాబ్ద కాలంగా ఉద్యమాని గల్లి నుంచి ఢిల్లీ దాకా తీసుకపోయిన ఘనత  టిఆర్ఎస్ పార్టీదే. కేంద్రంలో ముప్పై నాలుగు పార్టీల మద్దతు కూడగట్టడం లో ఆ పార్టీ.. కెసిఆర్ చేసిన కృషి ఫలితమే ఇవ్వాళ ఏ పార్టీ అయినా నై తెలంగాణ అనలేకపోతున్నాయి. యిప్పుడు తెలంగాణ సొంత రాజకీయ అస్తిత్వాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నది. ఇక 'రాజీ'నామ డ్రామాలు ఉండవు. పదవుల కోసం వంచన ఉండదు. రాజీ లేని పోరాటమే ఉంటది. అది స్వరాష్ట్ర సాధన లక్ష్యంగానే సాగుతది. అందుకే ఇప్పటి నుంచి తెలంగాణ ప్రజలకు ఆ'నందన' నామ సంవత్సరమే.
-అసరి

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home