Monday 1 July 2013

ముందే కూస్తున్న కోయిలలు



ఈ మధ్య ఓ చానల్ తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం అంతర్గం ఏమిటో ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. మినట్ టూ మినట్ అప్‌డేట్ అంటూ రకరకాల కథనాలు ప్రసారం చేసింది. విభజన ఖాయం అని తేల్చేసింది. ఇక నిర్ణయమే మిగిలింది అన్నట్టు సాగింది ఆ చానల్ హడావుడి. దీనిపై చర్చలు కూడా చేసింది. పైకి చూస్తే ఇదంతా ప్రజాహితం కోసం ఆ చానల్ తెగ ఆరాటపడుతున్నట్టు కనిపిస్తుంది. కానీ అసలు కథ అది కాదు. తెలంగాణపై నిర్ణయం రాకుండా మళ్లీ సీమాంధ్రలో అగ్గిరాజేయడానికి చేసిన ప్రయత్నం అది. అందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై మూడు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసిందని చెప్పుకొచ్చింది. ఒకటి పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమని, రాయల తెలంగాణ అని, ప్యాకేజీ అని రకరకాలుగా విశ్లేషణలు మొదలుపెట్టింది. తెలంగాణపై షిండే నేతృత్వంలో జరిగిన అఖిలపక్షంలో ఒకటి రెండు పార్టీలు మినహా అన్ని పార్టీలు తెలంగాణకు జై కొట్టాయి. దీంతో ఇంత కాలం ఏకాభిప్రాయం అనే మాట మాట్లాడిన కాంగ్రెస్‌కు అఖిలపక్ష సమావేశం తర్వాత ఇక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఆంధ్రా లాబీయింగ్ ఆజాద్ రూపంలో తెలంగాణ అంశాన్ని మళ్లీ మొదటికి తెచ్చింది. కాంగ్రెస్ ఊతపదాలు మరిన్ని చర్చలు, విస్తృత సంప్రదింపులు, ఏకాభిప్రాయం వంటివి వచ్చాయి. షిండే పెట్టిన గడువుకు ఆజాద్ తాత్కాలికంగా గండికొట్టాడు. ఆ తర్వాత కాంగ్రెస్ నెలలు గడిచినా దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదు.

ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైంది. తెలంగాణపై ఏదో ఒకటి తేల్చకుంటే ప్రజలు తిరగబడతారని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇక  లోక్‌సభ ఎన్నికలు కూడా నవంబర్‌లో జరగవచ్చు అనే వాదనలూ వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్న, యూపీఏ 1, 2 ప్రభుత్వాల ఏర్పాటులో కీలక రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని భావిస్తూ ఉండవచ్చు. అందుకే తెలంగాణపై ఇప్పటికే ఎన్నో మాటలు, ఎన్నో గడువులు పెట్టింది. తెలంగాణ ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు అనేది సత్యం. అందుకే ఇక తెలంగాణపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది. కేంద్రంలో కదలిక రాగానే ఆంధ్రా చానళ్ల, నేతల్లో ఆందోళన మొదలవుతుంది. హస్తిన పెద్దలు ఏ నిర్ణయం చెప్పకుండానే ఇక్కడ మాత్రం హడావుడి ప్రారంభమవుతుంది. ఇదే ప్రజాహితమని, మెరుగైన సమాజం కోసం ప్రజలను మభ్యపెడుతుంటాయి. నిజానికి రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఇరు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. కేంద్రం కూడా ఈ అంశంపై తేల్చాల్సిన సమయమూ ఆసన్నమైంది. అది ఏమిటో ఇంత వరకు అటు కాంగ్రెస్ పెద్దలు కానీ, ఇటు రాష్ట్ర పెద్దలు కానీ పెదవి విప్పడం లేదు. మరికొన్ని కోయిలలు ముందే ఎందుకు కూస్తున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి.

అట్లాగే కావూరి సాంబశివరావు తెలంగాణపై మాటమార్చారని ప్రసారం చేస్తున్నాయి. కావూరి తెలంగాణ అనుకూల వ్యాఖ్యలేమీ చేయలేదు. ఇప్పుడు సమైక్యవాద నినాదం వినిపిస్తున్న నేతల మాటనే ఆయన చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా అంతిమంగా కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలన్నారు. ఒకవేళ హస్తిన పెద్దలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాజీ పడక తప్పదు అన్నారు. దీన్ని భూతద్దంలో చూపెడుతూ.... కావూరిని తెలంగాణకు అనుకూల వ్యక్తిగా, సమైక్యాంధ్రకు వ్యతిరేకిగా చిత్రిస్తున్నాయి. ఒక వర్గం కొమ్ము కాస్తున్న మీడియా చిత్తశుద్ధి ఉంటే 2009 డిసెంబర్ 7 అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు జైకొట్టి, డిసెంబర్ 10న మాట మార్చిన చంద్రబాబును నిలదీయాల్సి ఉండే. అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని చెబుతూనే...  సీమాంధ్ర కాంగ్రెస్ నేత చేస్తున్న వితండవాదాన్ని తప్పుపట్టాల్సి ఉండే. కానీ ఇవేవీ చేయకుండా వాళ్ల కంటే ఒక అడుగు ముందుకేసి ఒక వర్గం మీడియా ప్రజల్లో లేని అపోహలను, విద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదు.

1 comment:

  1. you are working in namaste telanganna , hence u obviously support telangana , Hence u r words does not have a value

    ReplyDelete