Sunday 3 October 2021

దీదీ దృష్టి ఇక ఆ రాష్ట్రాలపై


పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  భవానీపుర్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై  58,832 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడిపోయిన మమతా బెనర్జీ.. ఈసారి భవానీపుర్‌ నుంచి బరిలో నిలిచారు. ఈ ఉప ఎన్నికపై అందరి దృష్టి పడింది. సీఎంగా కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ ఎన్నికలో మమత భారీ విజయంతో సత్తా చాటారు. భవానీపూర్‌తో పాటు శంషేర్‌గంజ్‌, జాంగిపూర్‌లోనూ తృణమూల్‌ అభ్యర్థుల విజయం సాధించారు. 

ఆ రాష్ట్రాలపై తృణమూల్, ఆప్ ల దృష్టి

కాంగ్రెస్ పార్టీని బీజేపీ నిలువరిస్తుంటే ప్రాంతీయ పార్టీలు బీజేపీ విస్తరణకు అడ్డుకట్ట వేస్తున్నాయి. రానున్న పంజాబ్ ఎన్నికల్లో ఆప్ కు అవకాశాలు ఉంటాయి అని.ఇప్పటికే సర్వేలు వెల్లడించాయి. గోవా, గుజరాత్ లోనూ ఆప్ ప్రభావం బాగానే ఉంటుంది అని అంటున్నారు. 
బెంగాల్‌‌కు ఆనుకున్న అస్సాం, త్రిపుర రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో తృణమూల్ కాంగ్రెస్ విస్తరణ యత్నాలు మొదలు పెట్టింది.గోవా మాజీ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్యే (కాంగ్రెస్) లూజినో ఫెలిరో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టీఎంసీలో చేరారు. సిద్ధం చేసుకున్న ఫెలిరో.. బీజేపీని ఎదుర్కోవాలంటే కావాల్సింది మమత బెనర్జీలాంటి స్ట్రీట్ ఫైటర్సేనని వ్యాఖ్యానించారు. ఫెలిరో ద్వారా త్వరలో జరగబోయే గోవా ఎన్నికల్లో తృణమూల్ అడుగుపెడుతున్నది. 

ఈశాన్య రాష్ట్రాల్లో పూర్వ వైభవం కోరుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడు పీజూష్‌ విశ్వాస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే, అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పిజూష్‌ విశ్వాస్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అసోంకు చెందిన కాంగ్రెస్ నేత, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుష్మితా దేవ్‌ తృణమూల్‌లో చేరారు. 2024 లోక్ సభ ఎన్నికలకు  మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నారు.

Labels: ,