Wednesday 8 March 2023

ఎన్నికల తర్వాత ఇక్కడ ఏక్‌నాథ్‌ షిండే ఎవరో?


ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న సార్వత్రిక ఎన్నికలపై ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో దాదాపు 119 లోక్‌సభ స్థానాలు ఉండటమే దీనికి కారణం. అందుకే ఈశాన్యరాష్ట్రాలైన నాగాలాండ్‌, త్రిపుర, మేఘాలయ మొదలు దక్షిణాది రాష్ట్రాల్లో కమలం పార్టీ వికాసానికి దోహదపడిన కర్ణాటక తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ ఏడాడే ఉండనున్నాయి. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి కర్ణాటక కంటే తెలంగాణకే తన ప్రధాన్యం అని రాష్ట్ర బీజేపీ కీలక నేతల భేటీలో స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే బీజేపీ అధిష్ఠానం ఇప్పటి నుంచే తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నది.


ఇక నుంచి నా దృష్టి అంతా తెలంగాణపైనే. ఆ రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా మీరంతా ముందుకు సాగాలి. పాత, కొత్త నేతలనే అనే తేడాలు వద్దు. అభిప్రాయభేదాలు ఉంటే పరిష్కరించుకోండి. చేరికలను ప్రోత్సహించండి అని ఆయన రాష్ట్ర  నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్‌ రావడానికి ఇంకా ఏడు నెలల సమయం ఉన్నది. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సభ, ఉమ్మడి జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సూచించారు. 


కర్ణాటకలో ఆ పార్టీ పరిణమాలు బీజేపీ అధిష్ఠానాన్ని కలవరపరుస్తున్నాయి. పైకి అక్కడ కూడా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నా తెలంగాణపై మోడీ-షాలు దృష్టి సారించారు అంటే ఎక్కడో తేడా కొడుతున్నట్టు కనిపిస్తున్నది. అక్కడ జరిగే నష్టాన్ని తెలంగాణలో పూడ్చుకోవాలని భావిస్తున్నారు. అయితే ఆ పార్టీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయని విధంగా చేరికల కమిటీ ఒక ఏర్పాటు చేసి దానికి ఈటల రాజేందర్‌ కన్వీనర్‌గా నియమించింది. ఆయన నేతృత్వంలో పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని భావించింది. కానీ వారు ఆశించిన స్థాయిలో చేరికలు లేకపోగా అధికార పార్టీ పై అసంతృప్తితో బీజేపీ చేరిన నేతలు తిరిగి సొంతగూటికి చేరుతున్నారు. ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, విజయశాంతిలతో పాటు తుల ఉమ వంటి నేతలు రాష్ట్ర నాయకత్వ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. పాత, కొత్త తేడా ఉండొద్దని అమిత్‌ షా చెప్పినా కొత్త వారికి ముఖ్యంగా బీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన నేతలకే తగిన ప్రాధాన్యం లేదనే చర్చ జరుగుతున్నది. ఆ పార్టీలో నేతల మధ్య అంతర్గత అభిప్రాయభేదాల ఫలితంగా చాలామంది పార్టీలో చేరకపోవడానికి ముఖ్యకారణమని పార్టీ అధిష్టానం గుర్తించింది. అందుకే దీనివల్ల పార్టీలో చేరికలు లేకపోగా పార్టీకి నష్టం చేస్తున్నదని అంచనా వేసింది. పేరుకు తెలంగాణలో గెలుపే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేశారని పత్రికల్లో వచ్చినా.. నేతల మధ్య ఉన్న అంతరాలు పార్టీ పుట్టి ముంచుతుందని దాన్ని సరిచేయాలని అమిత్‌ షా సూచనలు చేశారు. 


తెలంగాణలో బీజేపీ గెలుపు అంత తేలిక కాదని వారికీ తెలుసు. అయితే గతంలో గెలిచిన నాలుగు లోక్‌సభ స్థానాలు తిరిగి నిలబెట్టుకోవడంతో పాటు మరో మూడు నాలుగు స్థానాలు దక్కించుకోవాలన్ని ఆ పార్టీ పెద్దల వ్యూహం. మొత్తం పదిహేడు స్థానాల్లో సగం తమ ఖాతాలో వేసుకోవాలని కమలనాథులు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని రెండు మూడు అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నా 20-30 స్థానాల్లో పాగా వేయవచ్చు అని, ఒకవేళ రాష్ట్రంలో హంగ్‌ లాంటి పరిస్థితి వస్తే మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే ను ముందుపెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు ఇక్కడ కూడా అదే వ్యూహాన్ని అమలుచేయవచ్చు అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏక్‌నాథ్‌ షిండేలను సృష్టిస్తామని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత ఆ ఏక్‌నాథ్‌ షిండే ఇక్కడ ఎవరు అవుతారు అన్నది తేలుతుంది.

Labels: , , , , , , ,

అన్నిపార్టీల్లో సినీ సందడి.. అందుకేనా?



తెలంగాణలో  2014లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఉద్యమకారులు, తెలంగాణ తెచ్చిన పార్టీ, ఇచ్చిన పార్టీ అనే అంశాల ప్రాతిపదికన జరిగాయి. 2018లో అధికారపార్టీ సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, రైతు బీమా ప్రచారాస్త్రాలుగా.. ప్రభుత్వ వైఫల్యాలే అజెండా మహాకూటమి బరిలోకి దిగాయి. కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికలు గత రెండుసార్ల కంటే భిన్నంగా జరగబోతున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీలోసిట్టింగులందరికీ తిరిగి సీట్లు ఇస్తామని  ఇప్పటికే సీఎం ప్రకటించారు. అయితే 20-30 మంది సిట్టింగులను మారిస్తేనే బీఆర్‌ఎస్‌ వంద సీట్లకు చేరువ అవుతుందని ఆ మధ్య మంత్రి ఎర్రబెల్లి చేసిన కామెంట్లు సంచలనం సృష్టించాయి. అవి ఆయన యాధృచ్ఛికంగా చేశారా? లేక పార్టీ అధిష్ఠానం ఆలోచనా అనేది తెలియదు. కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీల తరఫున పోటీ చేయాలని భావిస్తున్న సినీ ప్రముఖుల జాబితా రోజురోజుకూ పెరుగుతున్నది. ఈసారి సార్వత్రిక ఎన్నికలకు అన్నిపార్టీలు సినీ సొబగులు అద్దనున్నాయి. 

ఇదే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 


దీనికి కారణం లేకపోలేదు. గత రెండు పర్యాయాలు అధికారపార్టీని ప్రజలు ఆదరించారు. కానీ ఈసారి ఆ పరిస్థితి తిరిగి పునరావృతమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్‌ఎస్‌, ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌, ఎన్నికల్లో గెలువాల్సిందేనని బీజేపీ అధిష్ఠానాలు కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. దీంతో సిట్టింగ్‌లతో పాటు కొత్తగా టికెట్‌ ఆశిస్తున్న సినీ ప్రముఖులు కూడా తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఆయా పార్టీల అధినేతలను, ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.  సినీ నటులు ప్రకాశ్‌రాజ్‌, విజయశాంతి, బాబుమోహన్‌, నితిన్‌ జీవిత, దర్శకుడు ఎన్‌. శంకర్‌, నిర్మాతలు దిల్‌రాజు, తాళ్లూరి రామ్‌, బిగ్‌బాస్‌ ఫేం కత్తికార్తికలు టికెట్‌ ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. ఈసారి  ఎన్నికల బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, బీజేపీలు కూడా వీరికి టికెట్లు ఇచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. 


బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న ప్రకాశ్ రాజ్‌ గత లోక్‌సభ ఎన్నికల్లో సెంట్రల్‌ బెంగళూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఏ పార్టీలో చేరకున్నా తన వాదనలు వినిపిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమి ప్రయత్నాల్లో భాగంగా ఆ మధ్య మహారాష్ట్రకు వెళ్లారు. అప్పటి సీఎం ఉద్ధవ్‌ఠాక్రే తో పాటు, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కలిశారు. ఆ సమయంలో సీఎం వెంట ప్రకాశ్‌రాజ్‌ ఉండటం చర్చనీయాంశమైంది. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత కేసీఆర్‌ వివిధ రాష్ట్రాలకు అధ్యక్షులను ప్రకటించారు. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తో కలిసి పోటీచేస్తామని కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రకాశ్‌రాజ్‌ కర్ణాటకలో ఏదో అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? లేక ఎంపీగా పోటీ చేస్తారా? అన్నది త్వరలో తేలనున్నది. నిర్మాత దిల్‌రాజు నిజామాబాద్‌ జిల్లా నర్సింగ్‌పల్లి వాసి. ఆయన బీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ అధికార పార్టీ అసంతృప్తులతో పాటు సినీ ప్రముఖులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అప్పుడెప్పుడో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు హీరో నితిన్‌ ఆయనతో సమావేశమయ్యారు. దీంతో ఆయన ఆపార్టీ నుంచి ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా బరిలో నిలుస్తారనే చర్చ కొంతకాలంగా జరుగుతున్నది. ఇక విజయశాంతి బీజేపీ మహిళా విభాగంలో జాతీయస్థాయి నాయకురాలిగా పనిచేశారు. ఆమె టీఆర్‌ఎస్‌ తరఫున 2009లో మెదక్‌ ఎంపీగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆమె 2014లో మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బాబు మోహన్‌ కూడా 2014లో టీఆర్‌ఎస్‌ నుంచి ఆందోల్‌ లో పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో ఆయను టికెట్‌ ఇవ్వకపోవడంతో పార్టీ అధిష్ఠానంపై తీవ్ర విమర్శలు చేసి బీజేపీలోకి వెళ్లారు. తిరిగి ఆయన ఆందోల్‌ నుంచే పోటీ చేయనున్నారు. దాదాపు అన్నిపార్టీలు తిరిగి వచ్చిన జీవిత ఈసారి బీజేపీ తరఫున జహీరాబాద్‌ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. 


ఖమ్మం జిల్లాకు చెందిన సినీ నిర్మాత తాళ్లూరి రామ్‌ చుట్టాల అబ్బాయి, నేలటికెట్‌, డిస్కోరాజా వంటి సినిమాలు నిర్మించారు. ఆయన జనసేన తరఫున ఖమ్మం పార్లమెంటు లేదా అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో ఉన్నారు. దర్శకుడు ఎన్‌. శంకర్‌  2014లో కాంగ్రెస్‌పార్టీ నుంచి ఆయనకు మిర్యాలగూడ నుంచి అవకాశం వచ్చినా వదులుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన  ఆయన ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. బిగ్‌బాస్‌ ఫేం, టీవీ యాంకర్‌ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి ఆమె అదే స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారు. జైబోలో తెలంగాణ సినిమాలో నటించిన రోషన్‌ బాలు గత ఎన్నికల సమయంలో ముషీరాబాద్‌ టికెట్‌ ఆశించినా దక్కలేదు. ఈసారి మరోసారి అదే నియోజకవర్గం నుంచి అధికార పార్టీ తరఫున టికెట్‌ దక్కించుకోవడానికి యత్నిస్తున్నారు. 

Labels: , , , , ,

అధికారపార్టీపై పొంగులేటి పోరాటం ఫలించేనా?



తెలంగాణలో ఎన్నికలకు ఇంకా దాదాపు తొమ్మిది నెలల సమయం ఉన్నది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాదయాత్రలు, ప్రచారాలు మొదలుపెట్టాయి. ఖమ్మం జిల్లాలో అయితే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  ప్రధాన పార్టీలతో సమంగా మరోమాటలో చెప్పాలంటే ఇంకో అడుగు ముందుకు వేశారని చెప్పవచ్చు. కొంతకాలంగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అధికారపార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆయన పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జెండా ఏదైనా కేసీఆర్‌ను గద్దె దింపడమే తమ అజెండా అన్నారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలను ఇంటికి పంపించడమే తమ లక్ష్యమన్నారు. 


నిజానికి 2014లో, 2018లోనూ ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ గెలిచింది ఒక్క సీటే. మొదటిసారి ఎన్నికల్లో కొత్తగూడెం సీటు కాగా, రెండవసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానంలోనే ఆ పార్టీ గెలిచింది. 2019లో కాంగ్రెస్‌ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారే. పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌లు రాజకీయ సమీకరణాల్లో భాగంగా వాళ్లంతా బీఆర్‌ఎస్‌లోకి జంప్‌  అయ్యారు.  టీడీపీ గత ఎన్నికల్లో సత్తుపల్లి ఎమ్మల్యే సండ్ర వెంకటవీరయ్య, ఆశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావులు కూడా బీఆర్‌ఎస్‌లో కలిసిపోయారు. ఇక వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లావుడ్యా రాములు నాయక్‌ అనంతరం బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. వాళ్ల చేతిలో ఓడిపోయిన అధికారపార్టీ కి చెందిన నేతలు తమను పార్టీ అధిష్ఠానం పట్టించుకోవడం లేదని అప్పుడప్పుడు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అయినా వారికి పార్టీ నుంచి ఎలాంటి హామీలు దక్కలేదు. దీంతో చాలా కాలం మౌనంగా ఉన్నా పొంగులేటి ఎప్పుడైతే అదికారపార్టీతో ఢీ అంటే డీ అని సవాల్‌ చేశారో వారందరికీ ఒక వేదిక దొరికినట్టైంది. దీంతో పొంగులేటి అంటున్న ఎంపీ, ఎమ్మెల్యేలను ఇంటికి పంపడమే తమ లక్ష్యమని అదికారపార్టీ నేతలను ఉద్దేశించి చేసినవే. 


పొంగులేటి బీఆర్‌ఎస్ కు దూరంగా ఉంటూ తన అనుచరులతో కలిసి స్వతంత్రంగానే ఉమ్మడి జిల్లాలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయన ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరకపోయినా ఎన్నికల అనంతరమో లేక ఎన్నికలు సమీపించే సమయానికి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఆయన అడుగులు ఏ పార్టీ వైపు అన్నది క్లారిటీ లేదు. కానీ ఆయన కుదిరితే బీజేపీ లేదా వైఎస్‌ షర్మిల వెంట నడుస్తారనే చర్చ ఉన్నది. ఎందుకంటే బీజేపీ అధిష్టానంతో పాటు రాష్ట్ర బీజేపీ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నట్టు సమాచారం. అలాగే పొంగులేటి బీఆర్‌ఎస్‌ నేతలను, కేసీఆర్‌ను సవాల్‌ చేసిన అనంతరం వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో భేటీ అయ్యారు. ఈ రెండు పార్టీలు ప్రచారం చేసుకుంటున్నట్టు మాదే అధికారం అనే పరిస్థితులేమీ ప్రస్తుతం కనిపించడం లేదు. అందుకే పొంగులేటి ఏ పార్టీ వైపు వెళ్లకుండా స్వతంత్రంగానే పోటీ చేస్తానని చెబుతున్నారు. ఖమ్మం ఎంపీ సీటు తో పాటు, పది అసెంబ్లీ స్థానాల్లో అధికారపార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రచార ప్రభావం ఎంత ఉంటుంది? ఆయన అంటున్నట్టు ఎంపీ, ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్తారా? లేక ఆయన వ్యూహం బెడిసి కొట్టి విపక్ష పార్టీలకే నష్టం కలుగుతుందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Labels: , , , , , ,