Monday 12 February 2024

కోమటిరెడ్డి బ్రదర్స్‌ కామెంట్స్‌.. రేవంత్‌రెడ్డికి కౌంటర్స్‌

కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్‌ పార్టీకి ఎంత బలమో అంతే బలహీనత. వాళ్లు ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియని పరిస్థితి. ముఖ్యంగా రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితం. ఎమ్మెల్యే హరీశ్‌రావు కాంగ్రస్‌లోకి వస్తే తీసుకుంటామని అనడం హాస్యస్పదం.  25 మందితో పార్టీ ఫిరాయించాలని  షరతు కూడా పెట్టారు. బీఆర్‌ఎస్‌లో చేరిన పాపాలు కడుక్కోవడానికి ఆయనకు దేవాదాయశాఖ ఇస్తామన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాదు, పీసీసీ అధ్యక్షుడు కాదు. కానీ ఏది పడితే అది మాట్లాడుతూ.. హామీ ఇస్తున్నారు. ఆయనే కాంగ్రెస్‌ పార్టీని వీడి, కాషాయ తీర్థం పుచ్చుకుని ఆపార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వ్యక్తి. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరిన ఆయన సమస్యల పై మాట్లాడకుండా ఎంతసేపూ విపక్ష నేతలను పార్టీ మారాలని సూచించడంపై సోషల్‌ మీడియాలో ఆయనపై సెటైర్లు పేలుతున్నాయి. 


అలాగే మంత్రి వెంకట్‌రెడ్డి కూడా విపక్ష నేతలను ఇరుకున పెట్టాలని ప్రయత్నంచేస్తూ చివరికి సీఎం రేవంత్‌ రెడ్డి ఇరుకున పడే విధంగా మాట్లాడుతుంటారు. ఇవాళ అసెంబ్లీలోనూ అలాంటి వాదనే చేశారు. కేసీఆర్ సోనియాగాంధీని దేవత అని కొనియాడారు అన్నారు. దీంతో ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందిస్తూ.. మా నేత దేవత అంటే మీ సభా నాయకుడు బలి దేవత అన్నారని ఆ వీడియో ప్రదర్శించారు. ఎన్నికల సమయంలో ఓ టీవీ ఛానల్ లో వాళ్ల తమ్ముడు పార్టీ ఫిరాయింపు గురించి ప్రశ్నిస్తే మా వాడు ఒక్క పార్టీనే మారాడు. కానీ మా పీసీసీ అధ్యక్షుడు నాలుగు పార్టీలు మారాడని రేవంత్‌పై వ్యంగ్యాస్త్రం వదిలారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ కామెంట్లు చూస్తుంటే కాంగ్రెస్‌ను రక్షించబోయి రేవంత్‌ను టార్గెట్‌ చేస్తున్నారేమో అనిపిస్తుంటుంది. 

Labels: , , , , , ,

Sunday 4 February 2024

రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’

 


సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అధికారిక గీతంగా 'జయ జయహే తెలంగాణ'కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని, ఈ నెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. వాహనాల రిజిస్ట్రేషన్‌లో టీఎస్‌ను టీజీగా మార్చాలని, అలాగే.. తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు చేయాలని నిర్ణయించారు. 

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసినా మేము ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామన్నారు. దీనిపై ప్రజలకు ఎలాంటి సందేహాలు అక్కరలేదని మంత్రులు తెలిపారు. అలాగే ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఖాళీలపై ఇంకా కసరత్తు జరుగుతున్నదని కచ్చితంగా మేము నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 

రాష్ట్రంలో కుల గణన జరపాలని, కొడంగల్‌ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని, హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయించాలని కేబినెట్‌ నిర్ణయించారు. 65 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్‌ టెక్నాలజీ కేంద్రాలుగా అప్‌డేట్ చేయాలని, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయాలని నిర్ణయించారు. 

Labels: ,

విభజన చట్టం ప్రకారమే ప్రాజెక్టులు అప్పగించాం: సీఎం రేవంత్‌

కేటీఆర్‌, హరీశ్‌ రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోనే ఉందన్నారు. కేంద్రం నన్ను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని కేసీఆర్‌ చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన తప్పులను ఇప్పుడు కాంగ్రెస్‌ పై వేయాలని చూస్తున్నారని సీఎం విమర్శించారు. విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను అప్పగించడం జరిగిందన్నారు. 


Labels: , , , , , ,

50-60 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ?

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పార్టీ సీనియర్‌ నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీశ్‌రావులతో పాటు మాజీ మంత్రులు  పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, జిల్లాల పర్యటనపై చర్చించారు. తొంటి ఎముక విరిగి గాయపడిన కేసీఆర్‌ ఇటీవలే కోలుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాల్లోనే కాదు, ఏపీ, ఒడిషా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనూ బీఆర్‌ఎస్‌ పోటీ చేసే అవకాశం ఉన్నది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 50-60 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. 

Labels: , ,

Saturday 3 February 2024

బీఆర్‌ఎస్‌ గత ఎన్నికల్లో గెలిచిన సీట్లు నిలబెట్టుకోగలదా?

బీజేపీని ఆపగలిగే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉన్నదని, కాంగ్రెస్‌ పార్టీ బీజేపీకి ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 40 సీట్లు గెలవడం అనుమానమే అన్న మమతా బెనర్జీ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి అధికారాన్ని ఎందుకు కట్టబెట్టారు? బీఆర్‌ఎస్‌ ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎందుకు ఆదరించలేదు? బీఆర్‌ఎస్‌ పాలన దేశానికి దిక్సూచీ అని ప్రచారం చేసుకున్నా ప్రజలు ఎందుకు పట్టించుకోలేదు? ఇత్యాది విషయాలపై ఆ పార్టీ సమీక్ష చేసుకోవాలి. ఇంట గెలిచి రచ్చ గెలువాలని అంటారు. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారి పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే సొంత రాష్ట్రంలోనే అధికారం కోల్పోయిన విషయంపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ బలం, బలహీనతల గురించి మాట్లాడితే బాగుంటుంది. 


ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. జార్ఖండ్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్నది. అలాంటి పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాదని కేటీఆర్‌ ఎలా చెబుతున్నారు? రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు స్థానిక అంశాలతో ముడిపడి ఉంటాయి. కానీ లోక్‌సభ ఎన్నికలు జాతీయ  అంశాలతో పాటు కూటములపైనే ఆధారపడి ఉంటాయి. అంతెందుకు ఆర్జేడీ, డీఎంకే, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్‌వర్గం), వాపమక్షాలు ఇప్పటికీ కాంగ్రెస్‌తోనే ఉన్నాయి. ఈ విషయాన్ని కేటీఆర్‌ మరిచిపోయారా? మమతా బెనర్జీ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నాని అన్న ఆయన గత లోక్‌సభ ఎన్నికల్లో గెలుచుకున్న 9  సీట్లను తిరిగి నిలబెట్టుకుంటుందా? అన్నది కూడా చూడాలి. 

Labels: , ,

రాజయ్య రాజీనామా ఊహించిందే!


 బీఆర్‌ఎస్‌కు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు. పార్టీ  ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు ఆ లేఖను చూపెట్టారు.అంతకు ముందే ఓ మీడియాఛానల్‌తో మాట్లాడుతూ పార్టీలో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే అన్నారు. నిజానికి రాజయ్యకు టికెట్‌ నిరాకరించినప్పుడే ఆయన పార్టీ మారుతారని అనుకున్నారు. కానీ పార్టీ మారినా స్టేషన్‌ ఘన్‌పూర్ టికెట్‌ వస్తుందనే విశ్వాసం ఆయనకు లేదు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ టికెట్‌ త్యాగం చేసినందుకు 2023 అక్టోబర్‌ 5న ఆయన తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి (రైతుబంధు) ఛైర్మన్‌గా నియమించింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే రాజయ్య పదవిలో కొనసాగేవారు. ప్రభుత్వం రాకపోతే తన పదవి పోతుందని తెలుసు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో కొంతమంది సిట్టింగులను మారుస్తారనే టాక్‌ వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వరంగల్‌ సీటును ఆశించారు. కానీ అది కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు ఇస్తారని సమాచారం. అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. 


తెలంగాణ ఉద్యమ సమయంలో రాజయ్య కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో 2012లో రాష్ట్ర సాధనలో భాగస్వామి కావడం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. మంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై ఆరోపణలతో కేసీఆర్‌ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. 2018లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్న ఎన్నికల్లో ఆయనపై సర్పంచ్‌ నవ్వ చేసిన ఆరోపణ కారణంగా టికెట్‌ నిరాకరించారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని సమాచారం. ఆ పార్టీ నుంచి వరంగల్‌ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాజీనామా సందర్భంగా ఆయన ఇదే విషయాన్ని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో తాను 15 ఏళ్ల పాటు పనిచేశానని, ఆ పార్టీలో ఉండే తాను తెలంగాణ కోసం కొట్లాడనని చెప్పుకొచ్చారు. అయితే రాజయ్య రాజీనామా ఊహించిందే!

Labels: , ,

Friday 2 February 2024

కాంగ్రెస్‌ పార్టీ 40 సీట్లు కూడా గెలువడం అనుమానమే


వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 40 సీట్లు కూడా గెలువడం అనుమానమే అని బెంగాల్‌ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ధైర్యం ఉంటే  యూపీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో బీజేపీని ఓడించాలని సవాల్‌ విసిరారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌ పార్టీకి 2 సీట్లు ఇస్తామని ప్రతిపాదించాను. కానీ ఎక్కువ సీట్లు కావాలని ఆ పార్టీ కోరడం వల్లనే పొత్తు కుదరలేదన్నారు. ఎన్నికల అనంతరం భావసారూప్యత కలిగిన పార్టీలతో చర్చించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 


దీదీ బాటలోనే ఆప్‌, ఎస్పీ

ఇండియా కూటమిలో కీలకంగా పనిచేసిన మమతాబెనర్జీ తన ప్రతిపాదనలను ఆపార్టీ అంగీకరించేలేదన్న కారణంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీదీ బాటలోనే ఆప్‌ పంజాబ్‌, ఢిల్లీలలో, ఎస్పీ యూపీలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. యూపీలో కాంగ్రెస్‌ పార్టీకి 11 సీట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. దానికి కాంగ్రెస్‌ పార్టీ ఇంకా ఆమోదించలేదు. అయితే ఇప్పటికే అఖిలేశ్‌ ఆర్‌ఎల్‌డీతో ఒప్పందం చేసుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఇండియా కూటమి నుంచి ఆ పార్టీ కూడా దూరంగా జరగడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. 

Labels: , , ,

సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ బహిరంగ లేఖ


ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలని .మాజీ మంత్రి కేటీఆర్‌ సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.ఆటోలకు గిరాకీ లేక కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక  15 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా? అని ప్రశ్నించారు.  ప్రజాభవన్‌ ముందే ఆటో తగలబెట్టినా కనికరించరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్నారు. బాధిత డ్రైవర్ల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఉన్న 2.5 లక్షల మంది ఆటోడ్రైవర్ల పరిస్థితిని అర్థం చేసుకోవావాలని వారి పక్షాన కోరుతున్నట్టు, ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటోడ్రైవర్‌కు నెలకు రూ. 10 వేలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ప్రజాభవన్‌ అని పేరు మారిస్తేనే సరిపోదన్న కేటీఆర్‌ అది ఆచరణలో చూపెడితేనే ప్రజలు హర్షిస్తారన్నారు. 

Labels: , , , ,

Thursday 1 February 2024

'ఇండియా' కూటమికి కలిసివచ్చే పరిణామాలే ఇవి!


'చావనైనా చస్తాను గానీ బీజేపీతో మళ్లీ కలువను' అని భీష్మ ప్రతిజ్ఞ చేసిన బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ మళ్లీ మాటమార్చారు. ఎన్నడూ సొంతంగా పూర్తి మెజారిటీ సాధించకున్నా తొమ్మిదోసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అవకాశవాద రాజకీయాలే ఆలంభనగా ఆయన సీఎం స్థానాన్ని స్థిరపరుచుకుంటూ వస్తున్నారు. బీహార్‌లో కాంగ్రెస్‌, బీజేపీల ప్రభావం ఉన్నప్పటికీ ఆ పార్టీలు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు. దీంతో ఈ రెండు పార్టీల మద్దతుతోనే నితీశ్‌ మాటిమాటికి కూటములు మార్చినా కుర్చీ మాత్రం వదలడం లేదు. సమతా పార్టీ పెట్టిన రెండేళ్లేకే విధేయతను పక్కనపెట్టి నాటి వాజపేయ్‌ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేని కేంద్ర మంత్రి అయ్యారు. 2003లో జనతాదళ్‌ (యూ) పేరుతో వేరే కుంపటి పెట్టుకున్నారు. 2005, 2010లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన 2013లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా మోడీ అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ బీజేపీకి బైబై చెప్పేశారు. బీజేపీతో ఉన్నంతకాలంలో, తాను సొంతంగా బలపడాలని భావించినంత కాలం ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలపై దుమ్మెత్తిపోశారు. మోడీ ప్రధాని అయ్యాక ఆయనను ఢీ కొట్టడం తన ఒక్కడి వల్ల కాదని 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి మహాఘట్‌బంధన్‌ ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చారు. నితీశ్‌ కూటములు మార్చిన ప్రతిసారి ఆ ప్రయాణాన్ని ఎప్పుడు మొదలుపెట్టాలి. ఎప్పుడు దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలన్నది ఆయన తాను ఆశించినది దక్కనప్పుడో లేదా బీహార్‌లో తన ప్రాభవం తగ్గుతున్నదని అనుకున్నప్పుడో చేస్తుంటారు. అట్లా 2017లోనే మహాఘట్‌బంధన్‌ వదిలిపెట్టి కమలనాథులతో కలిసి మళ్లీ జట్టు కట్టారు. 2020లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2022లోనే కూటమి మార్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా ఆ కూటమిని కటీఫ్‌ చెప్పి కాషాయపార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.  


బీజేపీ అవకాశవాదం వల్లనే 

ఆర్జేడీ, కాంగ్రెస్‌ల విషయాన్ని పక్కనపెడితే బీజేపీ బీహార్‌లో, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచినా కాంగ్రెస్‌ పార్టీ లేదా బీజేపీ యేతర ప్రభుత్వాలు ఏర్పడకూడదు అన్న ఒకే ఒక కారణంతో అక్కడి ప్రాంతీయపార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. దీనికి కారణం బీహార్‌, మహారాష్ట్ర, కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో(40+48+26) ఉన్న 114 లోక్‌సభ స్థానాలే లక్ష్యం. యూపీలో మెజారిటీ స్థానాలు దక్కించుకున్నా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఇలాంటి పెద్ద రాష్ట్రాలు కూడా ముఖ్యమే. అందుకే సిద్ధాంతాలు పక్కనపెట్టి, అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబ రాజకీయాల వల్ల ప్రగతి కుంటుపడుతున్నదని దుమ్మెత్తిపోసి ఫలితాల అనంతరం అవేపార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బీజేపీకి పరిపాటిగా మారింది. బీజేపీ రాజకీయ అవకాశవాదం బీహార్‌లో నితీశ్‌కుమార్‌కు, మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ శిండే, అజిత్‌పవార్‌లకు, కర్ణాటకలో కుమారస్వామి వంటి వారికి కూటములు మార్చడానికి దోహదం చేస్తున్నది. బీజేపీకి ఈ రాష్ట్రాల్లో బలం లేదని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసినా, ఇలా  కూలిపోయే ప్రభుత్వాలను నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను చూసినా అర్థం అవుతుంది. 


ఈ పరిణామాలు మంచివే

కేంద్రంలో తాను అధికారంలోకి రావడానికి ప్రాంతీయ పార్టీలను ముందుపెట్టి కాంగ్రెస్‌ను ఖతం చేయడం. తీరా అధికారంలోకి వచ్చాక ఆయా ప్రాంతీయపార్టీల్లోనే చిచ్చుపెట్టి చీల్చడం మోడీ-షాలు పదేళ్లుగా అనుసరిస్తున్న విధానాలు. అందుకే ఈసారి ఎలాగైనా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి విపక్షపార్టీలు ఐక్యం అయ్యాయి. సీట్ల సర్దుబాటుపై చర్చ జరుగుతున్నాయి. యూపీలో ఎస్సీ, ఆర్‌ల్‌డీ, కాంగ్రెస్‌ల మధ్య చర్చలు కొలిక్కి వస్తున్నాయి. బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లు కలిసి పనిచేయనున్నాయి. జార్ఖండ్‌లో జేఎంఎం ప్రభుత్వంలో కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉన్నది. తమిళనాడులో డీఎంకే జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌తోనే కలిసి నడుస్తామని ప్రకటించింది. వామపక్షాలు మొదటి నుంచి బీజేపీ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. లౌకిక స్ఫూర్తిని  కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్‌తోనే కలిసి ప్రయాణం చేస్తున్నాయి. అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీ ఈసారి అధికారంలోకి రాకపోతే 2029లో తాము బలపడవచ్చు, బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబడవచ్చు అనే మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌, నితీశ్‌కుమార్‌ వంటి నేతల ఆలోచనలకు అనుగుణంగానే నితీశ్‌ ఆయారాం-గయారాం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే ఇండియా కూటమిలో నెలకొన్న విభేదాలు ఒకంతుకు మంచివే. ఈ కూటమిలోని పార్టీలో కేంద్ర ప్రభుత్వానికే కాదు ఇంకా ఎవరితో పోరాడాలన్న స్పష్టత వచ్చింది. ప్రస్తుత రాజకీయా పరిణామాలకు అనుగుణంగా ఇండియా కూటమి తగిన ప్రణాళికన రూపొందించుకుని ముందుకు వెళ్లాలని ప్రజాస్వామికవాదులు కోరుకుంటున్నారు. ఇండియా కూటమి విచ్ఛిన్నానికి బీజేపీ ఆడే ఆటలో పావులుగా మారుతున్న అవకాశవాద పార్టీల వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని సూచిస్తున్నారు.

Labels: ,

నాడు లేవనెత్తిన అంశాలే నేడు ప్రతిబంధకమవుతాయా?


బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణలను 2023 జూలై 31న మంత్రివర్గం సిఫార్సు చేసింది. వీళ్లద్దరూ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని, ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనలేదన్న వంటి సాంకేతిక కారణాలతో గవర్నర్‌ తమిళిసై వీరిద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. రాజ్యాంగంలోని 171(3), 171(5) అధికరణాల్లో నిర్దేశించిన ప్రకారం సాహిత్యం, వైజ్ఞానిక శాస్త్రం, కళలు, సహకార ఉద్యమం, సమాజ సేవ రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యం లేదా ఆచరణాత్మక అనుభవం వీళ్లిద్దరికిలేదని అందుకే వారి అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తున్నామని గవర్నర్‌ 2023 సెప్టెంబర్‌ 25 ప్రకటించారు. 


రాజ్యాంగంలో సెక్షన్‌ 171(5) లో ప్రస్తావించిన రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యం, అనుభవం కలిగి, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వారు రాష్ట్రంలో చాలామంది ఉన్నారని, వారిని ఎమ్మెల్సీలుగా నియమించవచ్చని ఆ సందర్భంగా గవర్నర్‌ పేర్కొన్నారు. అంతేగాకుండా రాజ్యాంగంలోని సెక్షన్‌ 171 (5) కింద వారికి కల్పించిన ప్రయోజనాలు కూడా నీరుగారిపోతాయన్నారు. అర్హుల అవకాశాలను లాక్కున్నట్టు అవుతుందని, ఇది రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు విరుద్ధమన్నారు. ఇకపై సెక్షన్‌ 171 (5) కింద నామినేట్‌ చేసే పదవుల కోసం రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులను పరిగణనలోకి తీసుకోవద్దని ముఖ్యమంత్రి, మంత్రివర్గానికి విజ్ఞప్తి చేశారు. 


గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాసోజు శ్రవణ్‌,నత్యనారాయణలు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసుపై వాదోపవాదాలు జరిగాయి.  ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్నది.కేసు విచరణలో ఉండగానే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌లను ఎంపిక చేసింది. తమ కేసు తేలేవరకు కొత్తగా నియమితులైన ఎమ్మెల్సీల నియామకాలపై స్టే విధించాలని కోరారు. ఈ మేరకు తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌ వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్‌ కోటాలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ ఎమ్మెల్సీలుగా నియమితులైన విషయం విదితమే. 


నాడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నామినేట్‌ చేసిన అభ్యర్థుల అర్హతలపై గవర్నర్‌ లేవనెత్తిన అంశాలే ప్రస్తుతం ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు వర్తిస్తాయని ఆ పార్టీ నేతల వాదన. ఎందుకంటే రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని తెలిపిన గవర్నర్‌ మరి కోదండరామ్‌ అయితే ఏకంగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కూడా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని గుర్తుచేస్తున్నారు. నాటి ప్రభుత్వ సిఫార్సులను పక్కనపెట్టడానికి గవర్నర్‌ లేవనెత్తిన అంశాలు ప్రస్తుతం కొత్తగా నియామకమైన ఎమ్మెల్సీలకు ప్రతిబంధకంగా మారాయా? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

Labels: , , , ,

పొంగులేటి వ్యాఖ్యలతో టీడీపీకి లాభమా? నష్టమా?



తెలంగాణలో టీడీపీ పోటీకి దూరంగా ఉండి 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలుపడం వల్లనే ప్రజలు కోరుకున్న మార్పు వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ ఏ ఆశయాలతో టీడీపీ స్థాపించారో నారా చంద్రబాబు నాయుడు దానికి ఎన్నడో తిలోదకాలిచ్చారన్నది ఆయన అభిమానుల వాదన. అందుకే ఎన్టీఆర్‌పై అభిమానంతో ఆపార్టీలో చేరిన వారు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాంటి వారంతా అభిమాన నాయకుడి ఆశయాల మేరకే పనిచేస్తున్నారు. ఎన్టీఆర్‌ టీడీపీ పెట్టిన ఉద్దేశాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నారు. పొంగులేటి వ్యాఖ్యల వల్ల ఏపీలో టీడీపీ లాభమా? నష్టమా? అన్న చర్చ జరుగుతున్నది. 


అలాగే తెలంగాణలో వలె ఏపీలోనూ టీడీపీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తుందా? లేదా అక్కడ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనందున టీడీపీకి ఆ పార్టీ మద్దతు ఇస్తుందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం వద్ద ఉండదు. దీనిపై స్పందించడానికి టీడీపీ సిద్ధంగా ఉండదు. మరో ముఖ్యమైన విషయం తెలంగాణ ప్రజలు కూడా రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని భావించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో విస్మరించిన అంశాల పరిష్కారం కోసం కాంగ్రెస్‌పార్టీకి ఓటు వేశారు. అంతేగాని టీడీపీ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగాని, ఆ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ఆ పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించినట్టుగాని అధికారికంగా ఎక్కడా ప్రకటించిన దాఖలాలు లేవు. మరి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంటులో ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ సీటు గెలుచుకోవడానికి ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ జరుగుతున్నది. 


పొంగులేటి వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేక తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ  అభిప్రాయమా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఒకవేళ పొంగులేటి వ్యాఖ్యలు నిజమైతే ఏపీలో టీడీపీకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి అన్యాయం చేసిందని అక్కడ పార్టీలన్నీ విమర్శిస్తున్నాయి. ఎన్నికల సమయం కాబట్టి ఈ విషయాన్నే అధికార వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా షర్మిల ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు ఎక్కువయ్యాయి. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  వ్యాఖ్యల వల్ల టీడీపీకి లబ్ధి జరుగుతుందో లేదో తెలియదు. కానీ విమర్శలు మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అక్కడి రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

Labels: , , , ,