Thursday 30 September 2021

అధికార పార్టీ ఇచ్చిన అవకాశం


 కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ నేతల మధ్య ఉండే అంతర్గతంగా కలహాలే ఒడిస్తాయి అనేది నానుడి. ఇందులో కొంత నిజం ఉన్నది. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడి గా ఎంపిక చేసిన తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ పార్టీ కార్యకర్తలో కదలిక ఆయన తెచ్చాడు అన్నది రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ. ఇది వాస్తవం కూడా. ఇంద్రవెల్లిలో దళిత దండోరా సభ మొదలు గజ్వేల్ , ఇప్పుడు భూపాలపల్లి బహిరంగ సభల సక్సెస్ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది.

అధికార టీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు దక్కాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరారు. ఇదే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు ఆయా పార్టీలకు అభ్యర్థులను అందిస్తున్నది. ఎన్నికలకు ఇంకో రెండేళ్ల సమయం ఉన్నది. ఇప్పటి నుంచే చాలా నియోజక వర్గాల్లో అధికార పార్టీ నుంచి టికెట్ కష్టం అనుకుంటున్న నేతలు బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం అయ్యాయి. పార్టీలకు ఉండే సహజమైన ఓటు బ్యాంకు కు తోడు ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతలను పార్టీలకు తీసుకుని వచ్చే కార్యాచరణను మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా నే వివిధ నేతల చేరిక సందర్భంగా బహిరంగ సభల ద్వారా బలప్రదర్శన చేస్తున్నాయి. 

ఎన్నికల నాటికి ఇంకా చాలామంది ఆశావహులు, అధికారపార్టీలోని అసంతృప్త నేతలు పార్టీ మారే అవకాశం ఉన్నది. తమ రాజకీయ అవసరాల కోసం అధికార పార్టీ చాలా మంది నేతలను పార్టీలో చేర్చుకున్నది. కొందరికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఇంకా కొంతమంది కి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టింది. ఇంకా కొంతమందిని హామీలు ఇచ్చి తీసుకున్నది. ఈ ఏడేండ్ల కాలంలో అధికార పార్టీ నుంచి పదవులు ఆశించి వివిధ పార్టీల నుంచి వచ్చిన వారి సంఖ్య పెద్దదే. అయితే ప్రత్యామ్నాయం కనిపించనంత కాలం మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలనే వ్యూహాలకు పదును పెట్టాయి. వీటి ఫలితమే అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలలోకి చేరికలు మొదలు అయ్యాయి. ఇది అధికార పార్టీ ప్రతిపక్షాలకు ఇచ్చిన అవకాశమే.


Labels: , , ,

Sunday 26 September 2021

పార్టీలో పూర్తి పట్టు ఇక ఆ ఇద్దరిదే!

జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్నయ్య కుమార్‌, గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. మహాత్మగాంధీ జయంతి రోజైన అక్టోబర్‌ 2న వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరనున్నారని సమాచారం. వాస్తవానికి సెప్టెంబర్‌ 28నే వీరు పార్టీలో చేరుతారనే వార్తలు వినిపించాయి. అయితే ఆలస్యం అయినా ఈ ఇద్దరు యువనేతల చేరిక దాదాపు ఖరారైంది.

ఇటీవల రాహుల్‌ గాంధీతో  కన్నయ్య కుమార్‌ భేటీ అయ్యారు. అప్పుడే ఆయన కాంగ్రెస్‌లో చేరుతారన్న అంతా అనుకున్నారు. సీపీఐలో ఇమడలేకపోవడం ఆయన చేరికకు కారణమని అంటున్నారు. ఆయనను బీహార్‌ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిని చేసే యోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గత ఎన్నికల్లో ఆర్జేడీ ప్రచార బాధ్యతలన్నీ తన భుజానికెత్తుకున్న తేజస్విని లాలు ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన సంగతి విదితమే. రామ్ విలాస్ పాశ్వాన్ చనిపోయిన  తర్వాత ఆయన కుమారుడు గత ఎన్నికల సమయంలో నితీశ్ కు వ్యతిరేకంగా, బీజేపీ కి అనుకూలంగా పనిచేశారు. అయినా ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత ఆ పార్టీలో చీలిక వచ్చింది. ఇప్పుడు చిరాగ్ను బీజేపీ దూరం పెట్టింది. పార్టీలో చీలిక తెచ్చిన తన బాబాయ్ పశుపతి పాశ్వాన్ కు కేంద్ర మంత్రి మండలి లో చోటు దక్కింది. కన్హయ్య కుమార్, తేజస్వి యాదవ్, చిరాగ్ లు కలిసి రానున్న రోజుల్లో బీజేపీ, నితీశ్ కు వ్యతిరేకంగా పనిచేయన్నారు. 

మరోవైపు గుజరాత్‌ వాద్గాం నియోజకవర్గానికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ కూడా చాలా రోజులుగా కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌లో ఉన్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చరణ్‌జిత్‌ సింగ్‌ను ఎంపిక చేయడాన్ని ఆయన స్వాగతించడం గమనార్హం. వచ్చే ఏడాది గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిగ్నేశ్‌ చేరిక కాంగ్రెస్‌కు కొంతమేర కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ ఇటీవలే గుజరాత్ ముఖ్యమంత్రిని మార్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అనైక్యత వల్లనే స్వల్ప మెజారిటీతో బీజేపీ గటెక్కింది. రాష్ట్ర కాంగ్రెస్ కూడా నాయకత్వ సమస్య ఎదురుకొంటున్నది. అందుకే జిగ్నేశ్‌ను పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌ను చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నది. హార్దిక్ పటేల్ ను కూడా కలుపుకుని గుజరాత్ లో బీజేపీ కి చెక్ పెట్టాలన్నది కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనగా కనిపిస్తున్నది.అప్పట్లో కాంగ్రెస్ నాయకత్వ సమస్యపై సీనియర్లు సంధించిన లేఖాస్త్రాలపై సోనియా, రాహుల్ లు పెద్దగా స్పందించలేదు. అప్పుడప్పుడు నాయకత్వం పై సీనియర్లు విమర్శులు చేస్తున్నా మౌనమే సమాధానం అవుతున్నది.


కానీ  ఇటీవల యువ నాయకులకు పార్టీలో పెద్ద పీట వేసే నిర్ణయాలు తీసుకుంటున్నది. పార్టీలో ఇప్పటిదాకా  సోనియా గాంధీ నిర్ణయమే అందరికీ శిరోధార్యం. కానీ పంజాబ్ లో ముఖ్యమంత్రి మార్పు మొదలు కన్హయ్య కుమార్, జిగ్నేశ్‌ మేవాని వంటి నేతలను కాంగ్రెస్ లో తీసుకునివచ్చి రానున్న ఎన్నికల్లో బీజీపీని నిలువరించే వ్యూహాలకు రాహుల్, ప్రియాంక వాద్రాలు ఇప్పటి నుంచే అమలుచేస్తున్నారు. రానున్న రోజుల్లో రాహుల్, ప్రియాంకలే పార్టీపై పూర్తి పట్టు సాధించబోతున్నారు అనడానికి ఇవే సంకేతాలు.

Labels: , ,

Sunday 19 September 2021

అర్హత పరీక్ష నిర్వహణ లోనూ అలసత్వం


ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం నుంచి త్వరలో వంటి ప్రకటనలే తొమ్మిది నెలలుగా వినిపిస్తున్నాయి. నియామకాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్థమౌతున్నది. కానీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను నాలుగేండ్లుగా నిర్వహించలేని స్థితిలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపడుతున్నది. దీంతో ఇప్పటికే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారని, ఖాళీలు ఉండవని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ గురుకులాలతో పాటు మోడల్ స్కూళ్లలో 6నుంచి 8వ తరగతి వరకు బోధించే ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్స్ (టీజీటీ) ఉద్యోగాలు భర్తీ చేయలన్నా టెట్ అర్హత తప్పనిసరి. 

ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం ఏడాదికి ఒకసారి అయినా టెట్ నిర్వహించాలి. కానీ నాలుగేండ్లుగా టెట్ నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2016,2017లో పరీక్ష నిర్వహించారు.  2018లో మరోసారి పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి అప్పటి విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి సమీక్ష జరిపారు. దీనికి నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన పంపింది. దానిపై ప్రభుత్వంపై నుంచి ఇప్పటికీ నిర్ణయం వెలువడలేదు. 2019 ఎన్‌సీటీఊ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో బీఈడీ అభ్యర్థులు కూడా ఎస్‌జీటీ పోస్టులకు పోటీపడవచ్చు. టెట్‌లో పేపర్-1 రాసేలా నిబంధనలు మార్చాలని అధికారులు 2019 మార్చిలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దానిపై కూడా స్పందనలేదు. 

రాష్ట్రంలో ఇప్పటికే టెట్ అర్హత సాధించిన వారు 2.50 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. ప్రభుత్వం ప్రకటిస్తున్నట్టు త్వరలో చేపట్టబోయే నియామకాల్లో వీరికి మాత్రమే అవకాశం కల్పిస్తామని అనుకుంటే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. టెట్ నిర్వహించకుండా టీచర్ల ఖాళీలపై నోటిఫికేషన్ ఇవ్వడం కుదరని విద్యాశాఖ వర్గాలే అంగీకరిస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం. కొలువుల భర్తీపై త్వరలో ప్రకటనలే వెలువడుతున్నాయి. ఆ తర్వలో ఎప్పుడు అన్నదే ప్రశ్న. అప్పట్లో క్యాబినెట్ భేటీలో ఖాళీలు అస్పష్టంగా ఉన్నాయని పూర్తి సమాచారంతో రావాలని మంత్రివర్గం ఆదేశించింది. ఆ తర్వాత జరిగిన క్యాబినెట్ భేటీలోనూ ఖాళీలపై స్పష్టత ఉన్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులేమీ లేవు. కానీ నియామకాలు చేపట్టాలనే ఆలోచన లేనప్పుడు ప్రకటనలకే పరిమితం అవుతుంది. తొమ్మిది నెలలుగా నిరుద్యోగుల కండ్ల ముందు కనిపిస్తున్నది ఇదే.

Labels: ,

Saturday 18 September 2021

మార్పు పంజాబ్ లో మొదలై

మొన్నటిదాకా సీఎం లను మార్చుతూ బీజేపీ వార్తల్లో నిలిచింది. పంజాబ్ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ జాబితాలో చేరింది. ఆ రాష్ట్రానికి కొత్త సీఎం రానున్నారు.

పంజాబ్‌లో రాజకీయాలు కొంత కాలంగా అనేక పరిణామాల అనంతరం ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేసేదాకా వచ్చింది. మెజార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలని కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధిష్ఠానం పై ఒత్తిడి చేస్తున్నారు. అధిష్ఠానం రాజీనామా చేయాలని అమరీందర్‌కు సూచించినట్లు సమాచారం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న  నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నది.


రాష్ట్రంలో రాజకీయ పరిణామాలతో విసిగిపోయానని, కాబట్టి పదవిలో కొనసాగలేనని సోనియాగాంధీకి  కెప్టెన్ వివరించినట్టు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొన్ని గంటల్లోనే రాజీనామా సమర్పించారు. అయితే రాజీనామా అనంతరం మీడియా మాట్లాడిన కెప్టెన్‌ అమరిందర్ సింగ్ దీన్ని అవమానంగా భావిస్తున్నానని అన్నారు. తన మద్దతుదారులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాను  అన్నారు. అయితే కొంతకాలంగా కెప్టెన్, సిద్ధూ ల మధ్య నెలకొన్న విభేదాలు తారా స్థాయికి చేరాయి. వచ్చే ఏడాది ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్ఠానం కార్యాచరణ ఇప్పటికే మొదలు పెట్టింది. అందుకే కెప్టెన్ వ్యతిరేకించినప్పటికి సిద్దూని నియమించింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనలను కాంగ్రెస్ అధిష్ఠానం ఆచరణలో పెట్టినట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేసే రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తిరిగి పవర్ ను నిలబెట్టుకోవడం, భాగస్వామ్య పక్షాలు బలంగా ఉన్నచోట ఆయాపార్టీలకు మద్దతు ఇచ్చి బీజేపీని నిలువరించడం వంటి ప్రణాళికలను వ్యూహాత్మక అమలుచేస్తున్నది. జార్ఖండ్ లో ఇదే చేసింది. మహారాష్ట్ర లో ఎన్నికల తర్వాత కొత్త కూటమిలో కాంగ్రెస్ పార్టీనే కీలకం. ఛత్తీస్ గఢ్ లో సీఎం మార్పు పై ఆ పార్టీలో నెలకొన్న విభేదాలకు కూడా త్వరలో ముగింపు ఉండొచ్చు. రాజస్తాన్ లో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. పంజాబ్


 లో ప్రస్తుత మార్పు అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినట్టే భావించాలి.


Labels: , ,

Wednesday 15 September 2021

ప్రత్యామ్నాయం లేకుండా వరి వద్దంటే ఎట్లా?

వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు సమాఖ్య ప్రభుత్వానికి విరుద్ధంగా ఉన్నాయి. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెప్తున్నారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో వ్యవసాయ రంగం కుప్పకూలిపోయే ప్రమాదం ఉన్నదని, దీనివల్ల ఆహార భద్రత కు ముప్పు వాటిల్లనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు, రైతు సంఘాల నేతలు ఆందోళనలు చేస్తున్నారు. 

ఉప్పుడు బియ్యాన్ని కొనేది లేదని కేంద్రం చెప్పింది. ఈ నేపథ్యంలో వచ్చే యాసంగి నుంచి వరి పంట వేయడం అంటే రైతులు ఉరి వేసుకోవడమే! అన్న సీఎం కేసీఆర్ అభిప్రాయం పై వివాదం చెలరేగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. ఎందుకంటే ప్రత్యామ్నాయ ప్రణాళికలు లేకుండా ఉన్నపళంగా రైతులను వరి వేయవద్దు అనడం సరికాదు. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వరి దిగుబడులు సాధించిన రాష్ట్రం తెలంగాణ అని, దీనికి కారణం తమ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం వల్లనే ఇది సాధ్యమైందని ఆ మధ్య కేసీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే ఆఖరి గింజ వరకు ధాన్యం కొంటామని కూడా అన్నారు. ఇప్పుడు మాట మారుస్తున్నారు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

రాష్ట్రంలో దాదాపు 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల వారు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ఇతర పంటలు వేయాలంటే ఆ భూములు వాటికి అనుకూలంగా ఉన్నాయో లేదో ఒక శాస్త్రీయ అధ్యయనం అంటూ ఏదీ లేదు. రెండు మూడు శాతం మంది ఆదర్శ రైతులు చేసే ప్రయోగాలను మిగిలిన రైతులంతా అనుసరించాలనడం అశాస్త్రీయం. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు కట్టి, ఒక నిర్దిష్ట వ్యవసాయ విధానం లేకుండా ఇప్పడు వరి సాగు చేయవద్దు అనడం పాలకుల అవివేకానికి నిదర్శనం.ముఖ్యమంత్రి గతంలోనూ సన్న రకం వడ్లు సాగు చేయాలని చెప్పి విమర్శల పాలయ్యారు. మాట్లాడితే దేశానికి మన పథకాలు ఆదర్శం అనే టీఆర్ ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కారణంగా చూపెట్టి  రాష్ట్ర రైతుల మెడ పై కత్తి పెట్టడం కరెక్టు కాదు. అంతేకాదు జిల్లాల్లో ఫుడ్ ప్రాసెస్ పరిశ్రమలు నెలకొల్పుతామని ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు ప్రకటించింది. జిల్లాల వారీగా వీటిపై సమగ్ర అధ్యయనం చేసి ఆచరణలో పెట్టి అప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లిస్తే ఫలితం ఉంటుంది. ఇవేవీ లేకుండా రైతులు వరి కి బదులు ఇతర పంటలు సాగు చేస్తే లాభాలు వస్తాయి అనడం రాష్ట్ర ప్రభుత్వం సమస్య నుంచి తప్పుకోవడమే కానీ పరిష్కార మార్గాల కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు


చూపెట్టినట్టు కాదు.

Labels: ,

Tuesday 14 September 2021

సార్వత్రిక ఎన్నికల సన్నద్ధానికే


ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉండేది. ఇప్పుడు కమలనాథులు కూడా ఆ జాబితాలో చేరిపోయారు. గడిచిన ఆరు నెలల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులను మార్చింది. పార్టీలో నెలకొన్న అన్నిరకాల సమస్యలను పరిష్కరించుకొని  వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి సన్నద్ధం కావాలన్నది మోదీ,షా ల వ్యూహంగా కనిపిస్తున్నది. అందుకే ఇటీవల చేపట్టిన కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులతో పాటు నలుగురు సీఎం మార్పుల ఇందులో భాగం అంటున్నారు. 


ముఖ్యమంత్రులపై అసంతృప్తి వ్యక్తమైతే వెంటనే గుర్తించాలి. దాన్ని పరిష్కరించాలనే సూత్రాన్ని బీజేపీ అమలు చేస్తున్నది. బీజేపీ అధినాయకత్వం 2017 ఎన్నికలకు 16 నెలల ముందు అప్పటి సీఎం ఆనందీబెన్‌తో రాజీనామా చేయించి విజయ్ రూపాణీకి కుర్చీ కట్టబెట్టింది. ఎన్నికలు 15 నెలల్లో ఉన్నాయనగా రూపాణీని దించి పాటీదార్ వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్‌ను తెరపైకి తెచ్చింది. నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఎన్నికైన నాటి నుంచి రెండున్నర దశాబ్దాలుగా అక్కడ బీజేపీ అధికారంలో కొనసాగుతున్నది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉన్నది. అలాగే కోవిడ్ కట్టడిలో రూపాణీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దీంతోపాటు ప్రకృతి విపత్తుల సమయంలో సరిగ్గా పనిచేయకపోవడం, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల్లో ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొన్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఆప్ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నది.ఆమ్ ఆద్మీ పార్టీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తన బలాన్ని పెంచుకుంటున్నది. అలాగే రాష్ట్రంలో నిర్ణాయత్మక శక్తిగా 12 శాతం ఉన్న పాటీదార్లు కొంతకాలంగా ముఖ్యమంత్రి పదవి తమ సామాజికవర్గానికి ఇవ్వాలంటూ డిమాండు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో సరైన నాయకత్వం లేని స్థితి వంటి అంశాలను తమకు లాభిస్తాయి అని, మళ్లీ గుజరాత్ కాషాయ జెండాను ఎగురవేయాలన్నది బీజేపీ అధినాయకత్వం ఆలోచన. అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌తో దీర్ఘకాల అనుబంధం ఉన్న భూపేంద్ర పటేల్‌ను సీఎం సీటులో కూర్చొబెట్టింది. మృదు స్వభావి, గుజరాత్‌లో బూత్ మేనేజ్‌మెంట్ పితామహుడిగా పేరున్న భూపేంద్ర నేతృత్వంలో మళ్లీ గెలువవచ్చనే అభిప్రాయం ఆ పార్టీ అధినాయకత్వంలో ఉండి ఉంటుంది. అందుకే విజయ్ రూపాణీ రాజీనామా తర్వాత రకరకాల పేర్లు తెరమీదికి వచ్చాయి. కానీ ఊహాగానాల జాబితాలో కూడా లేని పేరు భూపేంద్ర పటేల్‌ను ఎంపిక చేశారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

ప్రస్తుతం బీజేపీ రూటు మార్చింది. కొత్తవారినే సీఎం కుర్చీలో కూర్చొబెడుతున్నది. తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్ ను గుజరాత్ లో,  ఉత్తరాఖండ్‌లో పుష్కర్‌సింగ్ ధామీని నియమించింది. ఆరు నెలల్లో మార్చిన నలుగురు సీఎంలు పార్టీని విజయపథంలో నడిపించలేరని బీజేపీ అంతర్గత సర్వేలో వెల్లడైనట్టు సమాచారం. ఉత్తరాఖండ్ త్రివేంద్ర సింగ్‌తో మొదలైన మార్పులో ఆయన స్థానంలో తీరథ్ సింగ్ రావత్‌ను నియమించినా నాలుగు నెలలు కూడా ఆయన కొనసాగలేదు. అలాగే కర్ణాటకలో యడ్యూరప్పపై పార్టీలో నెలకొన్న అసంతృప్తితో ఆయన సామాజికవర్గం పార్టీకి దూరం కాకుడదని ఆయన అనుచరుడైన బసవ బొమ్మైకి బాధ్యతలు అప్పగించారు. 


ముఖ్యమంత్రుల మార్పుపై బీజేపీలో అంతర్గత కలహాలే కారణమని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నది. కానీ వారి పార్టీలో ఉన్న విభేదాలను పరిష్కరించుకోకుండా పక్కవారిపై విమర్శలు చేసినంత మాత్రానా ప్రజాదరణ ఉండదని ఆ పార్టీ నేతలు గుర్తించాలి. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియాల మధ్య తలెత్తిన విభేదాల ఫలితమే అక్కడ అధికారాన్ని కోల్పోయింది. రాజస్థాన్‌లోనూ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య పోరు నడుస్తున్నది. ఛత్తీస్‌గఢ్‌లో   అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగిపోతున్నాయి.  సీఎం భూపేశ్ బఘేల్, ఆరోగ్యమంత్రి టీఎస్​ సింగ్ దేవ్​ మధ్య నెలకొన్న విభేదాలు పరిష్కారం కాక అనిశ్చితి కొనసాగుతున్నది. వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కొబోతున్న పంజాబ్‌లోనూ సీఎం అమరిందర్, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పంజాబ్, గుజరాత్ రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాల వైఫల్యాల ఫలితంగా ఆప్ అక్కడ బలపడుతున్నది. ఢిల్లీలో అధికారంలో ఉన్నది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నదని ఇటీవల ఆ పార్టీ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాల బట్టి స్పష్టం అవుతున్నది.

Labels: , ,

Thursday 9 September 2021

వాస్తవాలను విస్మరిస్తే..

ఈ మధ్య ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆసక్తికరమైన అంశాన్ని లేవనెత్తారు. పద్నాలుగు ఏండ్లు ఉద్యమంలో అగ్రభాగం లో ఉన్న పార్టీ, ఏడేండ్లుగా అధికారంలో కొనసాగుతున్న పార్టీ ఎన్నికల్లో గెలవడానికి చాలా కష్టపడుతున్నది అన్నారు. నిజమే. ముఖ్యంగా రెండోసారి ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారు. అయినా వారు ఆశించిన స్థాయిలో పాలన లేదని భావించారో ఏమో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన ఆరు నెలలకే లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో అధికార పార్టీకి ఆశ్చర్యాన్ని, షాక్ కు గురిచేసే ఫలితాలు వచ్చాయి. నాలుగు స్థానాలు బీజేపీ, మూడు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి పోయాయి. 

ఇక అప్పటి నుంచి జరిగిన వివిధ ఎన్నికల్లో ఫలితాలు అయితే హిట్ లేదా ఫట్ అన్నట్టే వచ్చాయి. దీనికి కారణం ఇప్పటికీ సంస్థాగతంగా అధికార పార్టీ బలంగా లేదు. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన కీలక నేతలు వెళ్ళిపోతే అక్కడ పార్టీ నిర్మాణాన్ని మొదటి నుంచి చేపట్టాల్సి వస్తున్నది. అది కూడా ఇతర పార్టీల నుంచి అప్పటికప్పుడు కొంత జనాలకు తెలిసిన నేతలను పార్టీలోకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఫలితంగా ద్వితీయ శ్రేణి నేతలు కొత్తగా వచ్చిన వారితో కలిసి పార్టీ గెలుపు కోసం కృషి చేసినా కొన్నిసార్లు ఫాయిదా ఉండటం లేదు. దీనికి కారణం కొన్నివర్గాలు అధికార పార్టీకి అనుకూలంగా కొన్నివర్గాలు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ లెక్కల అంచనాలు అప్పుడప్పుడు బెడిసి కొడుతున్నాయి. దీంతో ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తున్నాయి. 

మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులు మంచి ఫలితాలను అందించాయి. వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ని దృష్టిలో పెట్టుకొని కొత్త పథకాలు ప్రారంభించి ఉండి ఉంటే బాగుండేది. విధాన పరమైన నిర్ణయాలు ఆచరణలో కి వచ్చేసరికి సరిగ్గా అమలు కావడం లేదు. అలాగే చాలా ఏండ్లుగా అసంతృప్తితో ఉన్న నిరుద్యోగులను, ఇంకా ఇతర వర్గాల సమస్యలపై సరైన స్పందన లేదు. ఎన్నికల సమయంలో ఈ వర్గాలు ఎక్కడ తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారో అన్న అనుమానంతో అప్పటికప్పుడు వాళ్లను ప్రసన్నం చేసుకునే ప్రకటనలు ఇస్తున్నారు. అవి ఆయా ఎన్నికలు అయిపోగానే అటకెక్కుతున్నాయి. అందుకే ఓట్ల వేటలో వివిధ ఎన్నికల్లో ఆపసోపాలు పడుతున్నది. వాస్తవాలను విస్మరించి చేసే రాజకీయాలు ఎల్లకాలం నడువవు అన్న విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.


Labels: ,

Monday 6 September 2021

త్వరలో..త్వరలో.. త్వరలో

నియామకాలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు మంత్రుల దాకా తొమ్మిది నెలలుగా "త్వరలో" " అంటున్నారు. ఇది చిన్నప్పుడు గోడల మీద కనిపించిన "ఓ స్త్రీ రేపు రా" రాతలను గుర్తుచేస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో నియామకాల వార్త నిత్యం పత్రికల్లో కనిపిస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత నియామకాల మాట వినిపించదు. వార్త కనిపించదు. ఇది కొన్ని నెలలుగా చూస్తున్నదే అని నిరుద్యోగులు అంటున్నారు.

ప్రమోషన్ల తో ఖాళీ అయ్యేవి రెండో దఫా మొదటి దఫా లో యాభై వేల ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్టు వెలువడిన ప్రకటన నెలలు గడిచాయి. కానీ ఖాళీల భర్తీ కోసం ఎలాంటి కార్యాచరణ ఇప్పటివరకు లేదని నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పోనీ ఇయర్ క్యాలెండర్ అయినా ప్రకటించి ఈ ఏడాది ఈ పోస్టులు భర్తీ చేస్తామన్న స్పష్టత కూడా ప్రభుత్వం నుంచి లేదు. 

కొన్నినెలలుగా చిత్తశుద్ధి లేని ప్రకటనలతో నిరుద్యోగులను అయోమయానికి గురిచేయడం మినహా చేసింది ఏమీ లేదు. ముందుగా ఒకేసారి యాభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అనేది ఆచరణలోకి రాలేదు. కానీ ఖాళీలకు సంబంధించిన అంకెల వార్తలు వారం వారం మారుతున్నాయి. అంతిమంగా నియామకాలపై ప్రభుత్వ అసలు ఉద్దేశం "త్వరలో" అంటే తొందరేమి లేదని అని అర్థం చేసుకోవాలి అన్నట్టు ఉన్నది.


Labels: , ,

Saturday 4 September 2021

ఎన్నిక వాయిదాతో ఫాయిదా ఎవరికి?

హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడింది. పండుగల సీజన్ ముగిసిన తర్వాతే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరినట్టు ఈసీ వెల్లడించింది. దసరా తర్వాతే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఉప ఎన్నిక ఉండే అవకాశం  పేర్కొంది. ఈ నెల 1వ తేదీన 12 రాష్ట్రాల సీఎస్‌లతో సీఈసీ సమావేశమై ఎన్నికల నిర్వహణ పై కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకున్నది.

హుజురాబాద్ ఉప ఎన్నికను టీఆర్ ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నేడో రేపో షెడ్యూల్ రావొచ్చని, అందుకే దళితబంధు పథకాన్ని హుజురాబాద్ లో కాకుండా వాసాలమర్రిలోనే ముఖ్యమంత్రి ప్రారంభించా రు వార్తలు కూడా వచ్చాయి. ఇంకా అధికార పార్టీ ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఆ నియోజకవర్గ నేతలకు కట్టబెట్టింది. నిధులు విడుదల చేసింది. వాగ్దానాలను చేసుకుంటూ పోతున్నది. ఎన్నిక ప్రచార హీట్ ను పెంచింది అధికార పార్టీనే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం మేరకు ఈసీ ఉప ఎన్నిక ను వాయిదా వేసింది. దీంతో నిన్నటి దాకా ఉధృతంగా జరిగిన ఉప ఎన్నిక ప్రచార వాతావరణం చల్లబడనున్నది. 

అయితే ఈ ఉప ఎన్నిక వాయిదాతో ఫాయిదా ఎవరికి?ఎలాగైనా ఈ ఎన్నికలో గెలువాలనే పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అందుకే ఈ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. అన్ని అధికార అస్త్రాలు వినియోగించుకున్నది. అయినా ఎన్నిక ఫలితం ఏకపక్షం కాదన్న విషయం అవగతం అయ్యిందని ఆ నియోజకవర్గ ప్రజలు చెప్తున్న మాట. ఈటల రాజేందర్ రాజీనామా నేపథ్యం అధికార పార్టీ ప్రచారంలో పెట్టినా అక్కడ అమలవుతున్న పథకాలు, పనులు మా నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలనే డిమాండ్లు ప్రజలు , ప్రజాప్రతినిధుల నుంచి ఎక్కువగా వస్తున్నది. ఎన్నిక వాయిదా పడటం వల్ల ఈటల రాజేందర్ కు ప్రజల్లో ఉన్న సానుభూతి తగ్గుతుందా? అధికార పార్టీకి ఈ వాయిదాతో ఫాయిదా ఉంటుందా వేచిచూడాలి.


Labels: ,

Thursday 2 September 2021

సమయం కాదు, సందర్భం కాదు


రెండు దశాబ్దాలకు పైగా సంకీర్ణ ప్రభుత్వాలకు కాలం చెల్లి కమలనాథులకు ప్రజలు పట్టంగట్టారు. ఈ ఏడేండ్ల కాలంలో మోదీ, షాలు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ర్టాల్లో పాగా వేయడానికి ప్రయత్నం చేసి మొదటి ఐదేండ్లు విజయం సాధించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ర్టాల్లో అధికారాన్ని కోల్పోవడమే కాకుండా కకావికలం అయ్యింది. అయితే 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీలో బీజేపీ అధికారం దక్కించుకున్నది. ఆ ఎన్నికల సమయంలో ఒక సందర్భంలో బీజేపీ ఓడిపోతుందనే సంకేతాలు కూడా వచ్చాయి. మోదీ సొంతరాష్ట్రం కావడం వల్ల ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాల గురించి అంత ఆసక్తి నెలకొన్నది. అయితే చివరికి సాధారణ మెజారిటీ కంటే కొన్ని సీట్లను దక్కించుకుని తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్నది. ఆ క్రమంలోనే బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ కూటమి బీజేపీని మట్టికరిపించాయి. అ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు తిరిగి జేడీయూ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా చేశాయి. ఒడిషాలోనూ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ 2019 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి నవీన్ పట్నాయక్ క్లీన్ ఇమేజ్, రాజకీయ అనుభవం ముందు చతికిలపడింది. ఆ తర్వాత మహారాష్ట్రలో దశాబ్దాల బీజేపీ-శివసేన కూటమి బద్దలు అయ్యింది. పంజాబ్‌లో అకాలీదళ్-బీజేపీ కూటమి చెదిరిపోయింది. ఫలితంగా బీజేపీ పాలిత, భాగస్వామ్య పార్టీల చేతిలో ఉన్న మహారాష్ట్ర, పంజాబ్ పోయాయి. 2019లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ పార్టీ సహకారంతో మనోహర్ లాల్ ఖట్టర్ తన ఖుర్చీని పదిలం చేసుకున్నాడు. 2018లో జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ పాలిత రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. మొన్న బెంగాల్ ఎన్నికల్లో ఏం జరిగిందో విదితమే. తమిళనాడులో డీఎంకే గెలువడంతో బీజేపీ పాలిత, భాగస్వామ్య పార్టీల పాలిత జాబితా నుంచి చాలా రాష్ర్టాలు పోయాయి. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టి గద్దెనెక్కినా యడ్యూరప్ప స్థానంలో బసవరాజు బొమ్మై సీఎం అయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ బీజేపీ పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడే చెప్పలేం. మధ్యప్రదేశ్‌లోనూ జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటు ఫలితంగా మధ్యప్రదేశ్‌లో బీజేపీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకున్నది.  


కేంద్రంలో అధికారాన్ని నిర్ణయించే కీలక రాష్ర్టాలన్నింటిలో బీజేపీ ఐదేండ్ల కిందటి కంటే చాలా బలహీనపడింది. ఒక్క యూపీలోనే బలంగా ఉన్నది. అయితే ప్రస్తుత బలమే తిరిగి బీజేపీని వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలో నిలబెట్టలేవు. అట్లా అని కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారా? అంటే అదీ లేదు. ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలే ఆ పార్టీని నిండా ముంచుతున్నాయి. కలిసి పోరాడాల్సిన సమయంలోనే గ్రూపులుగా విడిపోయి అధికారానికి దూరమౌతున్న సందర్భాలు ఈ ఏడేండ్ల కాలంలో అనేక రాష్ర్టాల్లో చూశాం. ఇప్పటికీ ఆ పరిస్థితి మారలేదు. ఈ సమయంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీలు కీలకం కానున్నాయా? అంటే అవుననే అంటున్నారు. ముఖ్యంగా యూపీ, బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, ఒడిషా, ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ర్టాల్లో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఏకపక్షంగా సీట్లు గెలుచుకునే పరిస్థితి లేదు. మిగతా రాష్ర్టాల సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే మెరుగైన స్థానాలనే దక్కించుకునే అవకాశం ఉన్నది. అలాగే కమలనాథులు కూడా తమ పట్టును నిలుపుకుని లోక్‌సభ ఎన్నికల్లో గతంలో కంటే మెరుగైన స్థానాలు దక్కించుకునే వ్యూహ రచన ఇప్పటి నుంచే చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ఆశిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ఇప్పుడు సాధ్యమయ్యేలా లేదు. ఎందుకంటే ఉన్న ప్రాంతీయ పార్టీల అధినేతలు ఇప్పుడు కేసీఆర్ ఫ్రంట్‌తో జతకట్టే అవకాశాలు అంతగా లేవు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలతో సతమతమౌతున్నప్పటికీ 19 ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు చేస్తున్నది. ఇటీవల ఆన్‌లైన్ ద్వారా సమావేశం నిర్వహించింది. బీజేపీ వ్యతిరేక కూటమిని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నది. ఈ సమయంలో ఇటు బీజేపీతో గాని, అటు కాంగ్రెస్‌తో గాని సమాన దూరం పాటిస్తున్నవి ఏపీ, తెలంగాణలోని అధికార పార్టీలు. కాంగ్రెస్ మద్దతు లేకుండా కేంద్రంలో అధికారం అంత ఈజీ కాదన్నది అందరూ అంగీకరిస్తున్నదే. అందుకే రేపటి సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారం దక్కించుకోవడం సంగతి ఏమో గాని గతంలో కంటే ఎక్కువగానే లోక్‌సభ సీట్లను కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నది. అధికార పార్టీపై అన్నివర్గాల్లో నెలకొన్న అసంతృప్తి దీనికి కారణం. అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికలు బీజేపీ అనుకూల, వ్యతిరేక కూటముల మధ్యనే జరుగుతాయి. తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు కూడా తమ రాష్ట్రాలను వదిలి హస్తిన రాజకీయాలవైపు చూసే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఆశిస్తున్న హస్తిన రాజకీీీయ కూటమికి స్థానం లేదు. ఇది సమయం కాదు, సందర్భం కాదు.

Labels: , ,

గ్యాస్ సిలిండర్ ధర మళ్లా మండింది


పదిహేను రోజుల వ్యవధిలోనే గ్యాస్ ధర మళ్లా మండింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అన్నట్టు దేశ జీడీపీ పెరగడం లేదు. కానీ గ్యాస్, డీజీల్, పెట్రోల్ (జీడీపీ) ధరలు మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. తాజా పెరిగిన గ్యాస్ ధరలతో సంవత్సర కాలంలో ప్రజలపై అధికభారం పడనున్నది. గ్యాస్ ధర ఎంత పెరిగినా కేంద్రం ఇచ్చే సబ్సిడీ పెరగడం లేదు. గడిచిన ఏడాది కాలంలో ఒక్కో సిలిండర్‌పై 287 రూపాయలు పెరిగింది. కానీ కేంద్రం ఇచ్చే సబ్సిడీ రూ. 40.71 మించింది లేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్సీడీపై కోత విధిస్తూ వచ్చింది. 


సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని అధికారంలోకి వచ్చిన తర్వాత కమలనాథులు ఇస్తున్న నినాదాలు నీటిమాటలే అవుతున్నాయి. ప్రజలపై పన్నుల భారాన్ని వేస్తూ దేశ సంపదను అంతా కొంతమంది చేతుల్లోనే పెట్టే విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేట్‌పరం చేస్తున్నది. కరోనా కారణంగా రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. లాక్‌డౌన్ వల్ల కొన్ని నెలల పాటు వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. అట్లనే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉపాధి అవకాశాలు పోయాయి. ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లిన కూలీలు పల్లెల బాట పట్టారు. కోవిడ్ సమయంలో బతికుంటే బలిసాకు తిని అయినా బతుకవచ్చు అని సొంత ఊళ్లకు వచ్చిన వారికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. గడిచిన నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన కేంద్రంలోని పెద్దలు ప్రజల నిత్యావసర వస్తువుల ధరలతోపాటు గ్యాస్, డీజీల్, పెట్రోల్ ధరలు నెల నెలా పెంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలపై భారం పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజల బతుకులు కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి లెక్క తయారయ్యాయి. ఉల్లిగడ్డల ధరల పెరుగుదలపై జరిగిన నిరసనలతో రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయి.  మోదీ అధికారంలోకి రాకముందు పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుదలపై అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచారు. ఇప్పుడేమో ధరల పెరుగుదలపై మౌనంగా ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ఈ సమయంలో ధరల పెంపుతో వారిపై భారాన్ని వేస్తున్నారు. ఉల్లి ధరల పెరుగుదలపై జరిగిన నిరసనలతో రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయి. ఈ ఏడేండ్ల కాలంలో దేశ ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన సమయంలో తగిన విధంగా సమాధానం ఇస్తారు. 


Labels: