Sunday 28 January 2024

కూటమిలో విభేదాలు.. ఒంటరి పోరుకు సిద్ధపడుతున్న పార్టీలు

 


సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు ఎవరి దారి అవి చూస్తుకుంటున్నాయి. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీపార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌ పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, ఫలితాల అనంతరమే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. మమతా ఒంటరిగానే వెళ్తామని ప్రకటించిన కొద్దీసేపటికే పంజాబ్‌లో ఆప్‌ ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ  రాష్ట్ర సీఎం భగవంత్‌మాన్‌ వెల్లడించారు. పంజాబ్‌లోని 13 నియోజకవర్గాల్లోనూ ఆప్‌ బరిలోకి దిగుతుందన్నారు. దీనికోసం 40 మంది అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేశాం. సర్వే చేసిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. ఆప్‌ పంజాబ్‌లో ఒంటరిగానే పోటీ చేయడానికి సిద్ధపడింది అంటే ఢిల్లీలోనూ ఆపార్టీ అదే విధానాన్ని అనుసరిస్తుంది. ఎందుకంటే ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌కు తెలియకుండా భగవంత్‌మాన్ ఆ ప్రకటన చేయలేరు. 


ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో కాంగ్రెస్‌ పార్టీ సంప్రదింపులు చేస్తున్నది. అయితే మమతా బెనర్జీ మొదటి నుంచి ఒకటే ప్రతిపాదన చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ 300 స్థానాల్లోనే పోటీ చేయాలని, బెంగాల్‌లో తనకు, పంజాబ్‌, ఢిల్లీలో కేజ్రీవాల్ కు, యూపీలో అఖిలేశ్‌కు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఈ క్రమంలో బెంగాలోని 42 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీకి 2 సీట్లు మాత్రమే ఇవ్వాలని టీఎంసీ భావించింది. దీనికి కాంగ్రెస్‌ పార్టీ నిరాకరించింది. అలాగే ఈ విషయంపైనే కాంగ్రెస్‌, టీఎంసీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే  ఆ రాష్ట్ర  కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ ఛౌదర్‌  'ఆమె అవకాశవాది అని, మమతా సహాయంతో మేము ఎన్నికల్లో పోటీ చేయం . సొంతంగా పోటీ చేయడం ఏమిటో మా పార్టీకి తెలుసు. కాంగ్రెస్‌ పార్టీ సహకారంతోనే మమతా అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తించుకోవాలి' అని మమతా బెనర్జీపై  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  అధీర్‌ వ్యాఖ్యలను రాహుల్‌ గాంధీ తప్పుపట్టారు. 'మమత తనకు అత్యంత ఆత్మీయురాలని, మా వాళ్లు కొన్నిసార్లు ఏదోఏదో మాట్లాడుతుంటారు. వాటిని  పట్టించుకోవాల్సిన పనిలేదని' సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అధీర్‌ రంజన్‌ మమతా బెనర్జీపై వ్యాఖ్యలు చేయడం ఇవ్వాల కొత్తకాదు. కొంతకాలంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆయనను కట్టడి చేయలేదు. ఫలితంగా పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. ఇప్పుడు మమత లేకుండా ఇండియా కూటమిని ఊహించలేని ఆ పార్టీ అంటున్నది. కానీ ఎస్పీ, టీఎంసీ, ఆప్‌లు మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకత్వంతో సఖ్యతతోనే ఉంటున్నా ఆయా రాష్ట్రాల కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర నాయకుల వ్యవహారశైలి వల్ల ఆ పార్టీలు కాంగ్రెస్‌కు దూరంగా జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోనూ కమల్‌నాథ్‌ వ్యవహారశైలి వల్లనే ఎస్పీ, కాంగ్రెస్‌ పొత్తు కుదరలేదు. ఈ విషయాన్ని రాహుల్‌ గాంధే పరోక్షంగా ప్రస్తావించారు. 


కేంద్రంలో బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం కూటమిలోని భాగస్వాములతో సీట్ల సర్దుబాటుపై సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నది. సాధ్యమైనంత వరకు ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట సీట్ల త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నది. కానీ ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వాల దూకుడు చర్యల వల్ల పొత్తులకు విఘాతం కలుగుతున్నది. బీజేపీ కోరుకుంటున్నట్టే కొంతమంది కాంగ్రెస్‌ నేతలు వ్యవహరిస్తున్నారు. ఇండియా కూటమిలో విభేదాలకు ప్రాంతీయ పార్టీల కారణం ఎంతున్నదో అంతకంటే ఎక్కువగా కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు నేతల వ్యాఖ్యలే కారణమన్నది ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. నిజానికి బీజేపీ నేరుగా ఎదుర్కొని అధికారంలోకి రాగలిగే సత్తా కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికైతే లేదు. ఎందుకంటే యూపీ, బెంగాల్‌, పంజాబ్‌, ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలు, కేరళ, త్రిపుర వంటి రాష్ట్రాల్లో వామపక్షాలు బలంగా ఉన్నాయి. అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కలుపుకుని వెళ్లకుండా ఒంటరిగా పోటీ చేస్తే త్రిముఖ పోరులో అంతిమంగా కాషాయపార్టీ లబ్ధి పొందుతున్నదని గత రెండు సార్వత్రిక ఎన్నికల సందర్భంలోనే కాదు, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తేలింది. ఇండియా కూటమి ఛైర్మన్‌గా  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే‌నే ఎన్నుకున్నాయి. దీంతో కూటమిలో విభేదాలు పరిష్కరించడం, సీట్ల సర్దుబాటుపై ఆపార్టీ పైనే ఎక్కువ బాధ్యత ఉన్నది. ఈ సమయంలో కాంగ్రెస్‌ పార్టీలోని నాయకులు ఏది పడితే అది మాట్లాడటం వల్ల కూటమి లోని పార్టీలో ఒక్కొక్కటిగా సొంతంగా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ, టీఎంసీ, ఆప్‌లు  నిర్ణయానికి వచ్చాయి.  సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ నాటికి కూటమిలో విభేదాలు పరిష్కరించుకుని, సీట్ల సర్దుబాటుపై అన్నిపార్టీలు ఒక అభిప్రాయానికి రావాలి. దానికి కాంగ్రెస్‌ పార్టీనే కృషి చేయాలి. అప్పుడే బీజేపీని నిలువరించడం సాధ్యమౌతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా కూటమిలోని పార్టీలు ఒంటరిగా వెళ్తే నష్టం జరుగుతుందని అంటున్నారు. 

Labels: , , ,

ఆ ముగ్గురికి ప్రధాని పదవిపై ఆశ


బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా 'ఇండియా' కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బెంగాల్‌, బీహార్‌ సీఎంలు మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్‌లలో దీదీ ఇప్పటికే యూటర్న్‌ తీసుకున్నారు. నితీశ్‌ కూడా అదే బాటలో నడుస్తారని టాక్‌.  ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న పార్టీల అధినేత నేతలలో మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ వీళ్ల ముగ్గురికి ప్రధాని పదవిపై ఆశ ఉన్నది.   తమిళనాడు సీఎం స్టాలిన్‌, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ఠాక్రే, ఎస్పీ అధినేత అఖిలేశ్‌కు గాని కేంద్ర రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు. వాళ్ల రాష్ట్రాల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం అని వాళ్లు అనేకసార్లు చెప్పారు. అలాగే కేంద్రంలో సమాఖ్య స్ఫూర్తిని కొనసాగించే పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాలకు మేలు జరుగుతుందని వీళ్ల అభిప్రాయం. అందుకే వాళ్లు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి నడువాలని నిర్ణయించుకున్నారు. ఇక ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌,ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌ లాంటి వాళ్లు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వాళ్లే.  కేంద్రం మంత్రులుగా వాళ్లు తమ పనితీరుతో ఆకట్టుకున్నవాళ్లే. 


నితీశ్‌ కోరిక అదే

కానీ నితీశ్‌ కుమార్‌ వీళ్లలా కాదు. అధికారం కోసం అన్ని ఎన్ని ఫీట్లు అయినా వేస్తారు అనడానికి ఆయన వ్యవహారశైలినే ఉదాహరణ. 2015 నుంచి ఇప్పటి వరకు ఆయన ఒకసారి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో తర్వాత బీజేపీతో మరోసారి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో, మళ్లీ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారనే వాదన వినిపిస్తున్నది. ఎనిమిదిసార్లు బీహార్‌ ముఖ్యమంత్రిగా పనిచేసినా ఆయనకు కేంద్రంలో ప్రధాని పదవిపై చేపట్టాలనే ఆకాంక్ష ఉన్నది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రాంతీయపార్టీలను ఏకం చేసే సమయంలో ఇదే  అంశంపై ఆయనను ప్రశ్నిస్తే తనకు ప్రధాని పదవిపై ఆశ లేదన్నారు. కానీ ఇండియా కూటమికి తానే నాయకత్వం వహించాలని భావించారు. కానీ మిగతా పక్షాలు ఖర్గేను ప్రతిపాదించగా.. కన్వీనర్‌ పదవిని నితీశ్‌కు కట్టబెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన టార్గెట్‌ ప్రధాని పదవి. అందుకే ఆయన తనకు తాను ఆశించిన పదవి దక్కని చోట ఉండటం ఎందుకు అన్న ఆలోచనతోనే మరోసారి ఆయన కాషాయపార్టీవైపు చూస్తున్నారనేది రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇప్పటికైతే నితీశ్‌ మళ్లీ బీజేపీతో చేతులు కలుపుతారు అన్నది అధికారికంగా వెల్లడికాకున్నా.. ఎన్నికల షెడ్యూల్‌ నాటికి ఆయన ఒంటరిగా పోటీ చేయడమో లేదా బీజేపీతో కలిసి పోటీ చేయడమో ఏదో ఒకటి మాత్రం కచ్చితంగా జరుగుతుంది. 


మమతకు ఆలోచన అదే

ఇండియా కూటమిలో తాను కొనసాగాలంటే బెంగాల్‌ బాధ్యతలు తనకే అప్పగించాలని ఆమె స్పష్టం చేశారు. 'దేశంలో కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా 300 సీట్లలో పోటీ చేయాలని, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కట్టుగా ఉన్నాయి. అవి మిగతా సీట్లలో పోటీ చేస్తాయి. అయితే బెంగాల్‌లో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ జోక్యాన్ని మేం అనుమతించబోమన్నారు. విపక్ష కూటమికి మేం కట్టుబడే ఉన్నాయం. జాతీయస్థాయిలో కూటమి భాగస్వామిగా మేం మా వ్యూహాన్ని ఎన్నికల తర్వాత నిర్ణయిస్తాం. విపక్షాలంటే ఏ ఒక్క పార్టీకి చెందినవో కావు. మేమంతా ఐక్యంగా ఉండి, బీజేపీని ఓడించడానికి ఏం చేయాలో అది చేస్తామని' అన్నారు. దీనికి వామపక్షాలు, బెంగాల్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలు అంగీరించే పరిస్థితి లేదు. అంతేకాదుబెంగాల్‌లో కాంగ్రెస్‌, వామపక్షపార్టీలు టీఎంసీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.  కాంగ్రెస్‌ పార్టీ సీపీఎంను కలుపుకని వెళ్తే కేరళ, బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల్లోనే కాదు తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాల్లోనూ వారికి కొంత ఓటు బ్యాంకు ఉంటుంది. అది లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి విజయానికి దోహదపడుతుందని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆలోచన. బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై మమత నిర్ణయం ఫలించదని తెలుసు. అందుకే ముందుగానే తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎన్నికల ఫలితాల అనంతరం మా వ్యూహాన్ని నిర్ణయిస్తామనడం వెనుక గతంలో ప్రాంతీయపార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు దేవెగౌడ ప్రధాని అయిన విషయం విదితమే. అలాంటి ఒప్పందాన్నే ఇప్పుడు ఇండియా కూటమికి దూరంగా జరుగుతున్న ముఖ్యంగా నితీశ్‌కుమార్‌, మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ ల మధ్య పరోక్ష అంగీకారం అయి ఉంటుంది.  


అరవింద్‌ కేజ్రీవాల్‌ అడుగులు క్లీయర్‌

నితీశ్‌కుమార్‌, మమతా బెనర్జీ వలె కాకుండా అరవింద్‌ కేజ్రీవాల్‌ క్లియర్‌గానే ఉన్నారు. ఢిల్లీలో అధికారం చేపట్టిన తర్వాత ఆయన తనపార్టీని విస్తరించే పనిని చాలా ఏళ్ల కిందటే మొదలుపెట్టారు.  గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో పోటీ చేసినా పంజాబ్‌లో మాత్రం ఆయన వ్యూహాలు ఫలించాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన వీలైనంత ఎక్కువస్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు.  అందుకే ముందుగా పంజాబ్‌, ఢిల్లీ బాధ్యతలు తనకే ఇవ్వాలని మమతా ద్వారా చెప్పించారు. కానీ పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆ ప్రతిపాదనకు అంగీకరించవద్దని తమ అధిష్ఠానానికి సూచించింది. దీంతో దీదీ బాటలోనే పంజాబ్‌, ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేయాలని ఆప్‌ నిర్ణయించింది. కేజ్రీవాల్‌ కూడా ప్రధాని పదవి చేపట్టాలని ఉన్నది. అందుకే  ఆయన వివిధ రాష్ట్రాల్లో తన పార్టీని విస్తరించి అక్కడ అధికారంలోకి రావడానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ రాష్ట్ర అభివృద్ధి నమూనాను పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయన అంతిమ లక్ష్యంగా ప్రధాని పదవే. బహుశా ఎన్నికల ఫలితాల అనంతరం తమ  నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పే అవకాశాలున్నాయి. 


కాంగ్రెస్‌ ముందున్న లక్ష్యం


కూటమి ప్రతిపాదనలకు విరుద్ధంగా వెళ్లాలనుకునే వారితో సంప్రదింపులు, సీట్ల సర్దుబాటు చర్చల జరిపే కంటే కలిసి వచ్చేవారిని, సర్దుకుపోయే పార్టీలతో కలిసి నడిస్తే ఫలితం ఉండొచ్చు అనే వాదన ఉన్నది. పదేళ్ల కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నది. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలంటే కాంగ్రెస్‌ పార్టీ కూడా త్వరగా ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా అడుగులు వేయాలి. దానికి సమయం ఎక్కువ లేదు. ఎంత త్వరగా దీనిపై తుది నిర్ణయానికి వచ్చి ఇండియా కూటమి కామన్‌ అజెండా, కార్యాచరణ ప్రకటించిన ప్రచారం మొదలుపెట్టడం మేలనే అభిప్రాయం వ్యక్తమౌతున్నది.

Labels: , , , ,

బీజేపీ రాజకీయాలకు బలయ్యేది ఎవరు?


బీహార్‌లో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జేడీయూ-ఆర్జేడీ కూటమి కూలిపోయి బీజేపీ-జేడీయూ కొత్త ప్రభుత్వం ఆదివారం కొలువుదీరనున్నదనే వార్తలు వస్తున్నాయి. బీజేపీ బీహార్ లో సంఖ్యాపరంగా చూస్తే బీజేపీ (74) జేడీయూ (43),హిందుస్థానీ అవామీ మోర్చా (4), వికాస్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (4), లోక్‌జన్‌శక్తి పార్టీకి ఒక్క స్థానం ఉన్నది. మొత్తం 243 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం. ఈ పార్టీలన్నీ కలిస్తే 126 అవుతుంది. అధిష్ఠానం, నితీశ్‌కుమార్‌ ఆలోచనలు ఎలా రాష్ట్రంలోల మాత్రం భిన్నపరిస్థితులున్నట్టు తెలుస్తోంది. ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌కుమార్‌ రాజకీయాల్లో ఎవరికీ శాశ్వతంగా తలుపులు మూసి ఉండవని చెప్పినా ఆపార్టీలోని కొందరు నేతలు మాత్రం నితీశ్‌ రాకను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. అధికారం కోసం నితీశ్‌ వ్యవహారశైలి వల్ల ఆయన పూర్తిగా బలహీనపడిపోయారన్నది వారి వాదన. బీజేపీ, జేడీయూల సంగతి పక్కనపెడితే చిన్నపార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ప్రశ్న. 


బీజేపీ-జేడీయూ ప్రభుత్వం ఏర్పడితే వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు నితీశే సీఎం. దీనికి ప్రతిగా రాష్ట్రంలో ఎక్కువ లోక్‌సభ స్థానాలు బీజేపీకి ఇవ్వడానికి నితీశ్‌కుమార్‌ అంగీకరించినట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా బీజేపీ, జేడీయూ, లోక్‌జనశక్తి పార్టీ కలిసి పోటీ చేశాయి. మొత్తం 40 స్థానాలకు గాను ఎన్డీఏ 39 గెలచుకున్నది. అందులో బీజేపీ 17, జేడీయూ 16, లోక్‌జనశక్తికి 6 సీట్లు వచ్చాయి. కేంద్రంలోని బీజేపీకి కూడా లోక్‌సభ సీట్లే కావాలి. అలాగే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదా బీజేపీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వాలే ఉండాలన్నది ఆపార్టీ పెద్దల భావన. అందుకే బీజేపీ యేతర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి పదేళ్లుగా ఆపార్టీ చేసిన ప్రయత్నాలు తెలిసిందే. తాజాగా కూడా మరోసారి ఆ ప్రయత్నాన్ని చేయనున్నది. ఎందుకంటే ఇండియా కూటమి కంటే బీహార్‌లో మహాఘట్‌బంధన్‌ కలిసి పోటీ చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో స్వీప్‌ చేస్తాయని బీజేపీ హైకమాండ్ అంచనా. అందుకే అక్కడ ఆ కూటమిని బద్దలు కొట్టి బీజేపీ-జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆదివారమే గవర్నర్‌ను కలిసి బీజేపీ-జేడీయూ ప్రభుత్వ ఏర్పాటునకు అవకాశం ఇవ్వాలని కోరనున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. 'కూటమి నుంచి నితీశ్‌ విడిపోతే మా తలుపులు తెరుస్తాం. మాకూ మెజారిటీ ఉన్నది' అన్న ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. నితీశ్‌ను మళ్లీ సీఎం కాకుండా చిన్నపార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆర్జేడీ సన్నాహాకాలు చేస్తున్నది. 


 

ప్రస్తుతం ఆర్జేడీకి (75), కాంగ్రెస్‌కు (19)మంది శాసనభ్యులున్నారు. వీళ్లిద్దరు కలిస్తే ప్రభుత్వ ఏర్పాటునకు ఇంకా 28 మంది సభ్యుల మద్దతు కావాలి. ఎన్డీఏలోకి నితీశ్‌రాకను హిందుస్థానీ అవామీ మోర్చా అధ్యక్షుడు జీతన్‌ రాం మాంఝీ,లోక్‌జన్‌శక్తి నేత చిరాగ్‌ పాశ్వాన్‌లు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. మాంజీ పార్టీకి నాలుగు సీట్లు, ఎల్‌జేపీకి ఒక్క సీటు ఉన్నది. అలాగే  సీపీఐ (ఎంఎల్‌) ఎల్‌ (12), ఎంఐఎం (5) సీపీఐ, సీపీఎంలకు చెరో రెండు సీట్లున్నాయి. బీఎస్పీ తరఫున ఒకరు,స్వతంత్ర అభ్యర్థిగా మరొకరు విజయం సాధించారు. ఆర్జేడీ అధినేత చిన్నపార్టీలతో సంప్రదింపులు జరుతున్నారని సమాచారం. అలాగే నితీశ్‌ వైఖరి పట్ల జేడీయూలోని కొంతమంది, బీజేపీలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, బలనిరూపణ సమయంలో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా ఉన్నాయి. సీఎం సీటు కోసం  ఆర్జేడీ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నందున బీహార్‌లో చివరికి ఏం జరుగుతుంది?బీజేపీ రాజకీయాలకు ఎవరు బలవుతారన్నది చూడాలి. ఇండియా కూటమిలో ప్రధాన్యం దక్కలేదని అలబూనిన నితీశ్‌కు రాష్ట్రంలోనూ ఉన్న పదవి తిరిగి దక్కుతుందా? లేక రెంటికి చెడ్డ రేవడి అవుతారా? అన్నది త్వరలో తేలనున్నది.

Labels: , , , , ,

Saturday 20 January 2024

ఉచిత ప్రయాణంపై ప్రజలు ఏమనుకుంటున్నారు?




కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. వాటి కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ప్రతిపక్షాలన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇస్తామన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఆపార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు ఇప్పటికే అమలు చేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. కానీ ఆర్టీసీ బస్సుల్లో నిత్యం జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వం దృష్టికి వచ్చే ఉంటాయి. ఫ్రీ బస్సు వల్ల కండక్టర్లు మహిళా ప్రయాణికుల మధ్య  ఘర్షణ నిత్యకృత్యంగా మారాయి. ఈ ఉచిత ప్రయాణానికి అర్హతలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. దాన్ని కండక్టర్లు అమలు చేస్తున్నారు. ఆధార్‌ వంటివి చూపెట్టాలనే నిబంధన ఉన్నది. అదీ కూడా అప్‌డేట్‌ చేసుకుని ఉండాలని పేర్కొన్నది. కానీ కొంతమంది అప్‌డేట్‌ చేసుకోకుండా తాము చేసుకున్నామని, ఇంకా కొత్త కార్డు ఇవ్వలేదని, కావాలంటే ఆన్‌లైన్‌లో చూసుకోవాలని కండక్టర్‌తో వాగ్వాదానికి దిగుతున్నారు. నిబంధనల మేరకు లేకపోతే మా అధికారులకు నేను సంజాషీ ఇచ్చుకోవాల్సి ఉంటుందని, తాను బాధ్యత వహించాలని కండకర్లు చెబుతున్నారు. నిబంధనలమేరకు ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేసుకోకపోతే టికెట్‌ తీసుకోవాలని కోరుతున్నారు. కానీ ప్రయాణీకులు అందుకు అంగీకరించడం లేదు.  దీంతో ఒకానొక సమయంలో కండక్టరే బస్సు దిగిపోతానని అని అంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వాటిపై ప్రయాణికుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుని సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే ఆర్టీసీ మనుగడే ప్రమాదంలో పడే పరిస్థితులు వస్తాయి అంటున్నారు. ఉచిత ప్రయాణం విషయంలో ప్రతిపక్షాలు, అధికారపక్షాల వాదనల సంగతి పక్కనపెడితే ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నదే ప్రధానం కావాలి. 

Labels: , , , , ,

అంతా తానే అనుకోవడమే అసలు సమస్య


దావోస్‌ పర్యటనలో సీఎం రేవంత్‌ అనర్గళంగా, అర్ధవంతంగా ఆంగ్లం మాట్లాడలేదన్నది చర్చ కాదు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం, పెట్టుబడులు పెట్టే వారిని కార్లతో పోల్చడం, ప్రభుత్వాన్ని రోడ్డుతో పోల్చడం, పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులను ఆకర్షించడానికి  గత ప్రభుత్వం చేసిన పదేళ్ల కృషిని అంగీకరించడానికి ఇష్టపడక ఐటీ రంగాన్ని, వ్యవసాయరంగాన్ని న్యూక్లియర్‌ ఛైన్‌ రియాక్షన్‌ అని సంబంధం లేని సమాధానం చెప్పడం వల్లకదా సీఎంపై సెటైర్లు పేలుతున్నాయి. సీఎం తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా తనకు బాగా తెలిసిన భాషలో చెప్పవచ్చు. కానీ రేవంత్‌ రెడ్డి మొదటి నుంచీ పార్టీలోనూ, ఇప్పుడు ప్రభుత్వంలోనూ అంతా తానే అన్నట్టు వ్యవహరించడం వల్లనే ప్రస్తుత పరిస్థితి కారణం. జ్ఞానాన్ని పంచాలి, అజ్ఞానాన్ని దాచుకోవాలంటారు. దావోస్‌ పర్యటనలో సీఎం చేసింది ఏమిటి అన్నది భజనపరులు ప్రశ్నించుకుంటే సమాధానం వారికే దొరుకుతుంది.

Labels: , , ,

Saturday 13 January 2024

ఏపీలో సిట్టింగ్‌ల మార్పుతో 'ఫ్యాన్‌' గాలి వీస్తుందా?


అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో అధికార వైసీపీలో ఎమ్మెల్యే, ఎంపీల రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. తెలంగాణలో ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ రాజకీయాలపై పడింది. సిట్టింగులను మార్చి ఉంటే తెలంగాణలో ఫలితాలు వేరేలా ఉండేవన్న అభిప్రాయం వ్యక్తమౌతున్నది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం, వైసీపీ అధినేత కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను కాదని నియోజకవర్గ బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తున్నారు. ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అంటే ఆ అభ్యర్థికే దాదాపు అసెంబ్లీ టికెట్‌ ఖారారు అయినట్టు భావించాలి. జగన్‌ సుమారు 50 మంది ఎమ్మెల్యేలను మారుస్తారనే ప్రచారం జరుగుతున్నది. పార్టీని వీడిన వాళ్లలో ఎక్కువ శాతం మంది అయితే జనసేన లేదా కాంగ్రెస్‌ పార్టీలోకి చేరాల్సిందే. ఎందుకంటే  టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే ప్రకటించాయి. ఎన్నికల షెడ్యూల్‌ నాటికి ఏమైనా రాజకీయ పరిణామాలు మారొచ్చు అంటున్నారు. అదే జరిగితే జనసేనతో బీజేపీ జట్టుకట్టే అవకాశాలున్నాయి. ఆ పార్టీ కేంద్ర నాయకత్వంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఏపీ బీజేపీ రాష్ట్ర చీఫ్‌ పురంధేశ్వరీ కూడా ఇప్పటికైతే జనసేనతో తమ పార్టీకి పొత్తు కొనసాగుతున్నది. పొత్తులపై తమ పార్టీ అధిష్టానిదే తుది నిర్ణయమన్నారు. 


పదేళ్ల కేంద్ర ప్రభుత్వం, విభజన తర్వాత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ, వైసీపీలు ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదన్నది వాస్తవం. ముఖ్యంగా రాజధాని విషయంలో, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో, విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు సంబంధించిన అంశాలు ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలకం కానున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నది. నాటి యూపీఏ ప్రభుత్వం విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ ప్రభుత్వంతో పాటు వాటిని సాధించడంలో టీడీపీ, వైసీపీ విఫలమయ్యాయి అన్నది ఆ పార్టీ విమర్శ. కాబట్టి ఏపీ ఎన్నికల తీర్పు ఈసారి ఏకపక్షంగా ఏ పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలు లేవు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 'వోటా' సర్వే సంస్థ రెండు నెలలుగా అక్కడి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఆ సంస్థ సీఈవో కంభాలపల్లి కృష్ణ కూడా ఏపీలో ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని అంటున్నారు. దాదాపు 50 మంది సిట్టింగులను మార్చడం వల్ల వైసీపీ అందులో సగానికి పైగా గెలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒకవేళ మార్చకుండా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, అందుకే జగన్‌ నష్టనివారణ చర్యలో భాగంగానే చర్యలు చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. ఎన్నికల నాటికి ఏపీలో ఇంకా ఎన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. 

Labels: , , , , , , ,

Friday 12 January 2024

కీలకమార్పు దిశగా ఏపీ రాజకీయాలు!


 

కొలువుల భర్తీకి లైన్‌క్లియర్‌





 

సామాజిక కేంద్రమైన బడి సజీవంగా ఉండాలె


 

టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై ప్రతిష్ఠంభన


 

సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించిన పార్టీలు


 

సర్దుకుపోదాం రండి!



 

బీజేపీ 'ఆపరేషన్‌ సౌత్‌ స్టేట్స్‌'