Monday 30 January 2023

సందిగ్ధత వీడింది.. స్పష్టత వచ్చింది


తెలంగాణ ప్రభుత్వం 2023-24 ఏడాదికి ప్రవేశపెట్టే బడ్జెట్‌ అంశం, గవర్నర్‌ ప్రసంగంపై స్పష్టత వచ్చింది. బడ్జెట్‌ను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టడానికి గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలపలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరింది. మధ్యాహ్నం విచారణ జరపడానికి సీజే ధర్మాసనం అంగీకరించింది. ఈ సందర్భంగా గవర్నర్‌కు కోర్టు నోటీసు ఇవ్వగలదా? ఆలోచించుకోవాలని పేర్కొన్నది.  గవర్నర్‌ విధుల్లో కోర్టులు న్యాయ సమీక్ష చేయవచ్చా? కోర్టులది మితిమీరిన జోక్యం అని మీరే అంటారు కదా? అని హైకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో ఏం జరగనున్నదనే ఉత్కంఠ నెలకొన్నది. 


బడ్జెట్‌ ప్రవేశపెట్టే అంశం,  గవర్నర్‌ ప్రసంగంపై హైకోర్టులో విచారణ జరిగింది. సీజే ధర్మాసనం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌ తరఫు న్యాయవాదులు దుష్యంత్‌ దవే, అశోక్‌ ఆనంద్‌లు జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. చర్చల్లో పరిష్కారం లభించిందని ఇరుపక్షాల న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగబద్ద నిర్వహణకు నిర్ణయించుకున్నట్టు చెప్పారు. గవర్నర్‌ ప్రసంగానికి అంగీకరించినట్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి గవర్నర్‌ అనుమతిస్తారని న్యాయవాదులు తెలిపారు. ఇరుపక్షాల న్యాయవాదుల సమ్మతితో కోర్టు విచారణను ముగించింది. 

Labels: , , , ,

Wednesday 25 January 2023

బీఆర్‌ఎస్‌తో ఏ కూటమికి మేలు, ఏ కూటమికి ముప్పు



ఖమ్మం జి


ల్లాలో జరిగిన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు ముగ్గురు సీఎంలు కేజ్రీవాల్‌, పినరయ్‌ విజయ్‌, భగవంత్‌ మాన్‌ లతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌, సీపీఐ జాతీయ నేత డి. రాజా హాజరయ్యారు. అయితే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి బీజేపీ, కాంగ్రెస్‌ యేతర కూటమి కోసం ప్రయత్నిస్తున్న సమయంలో వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలు, సీఎంలను కలిశారు. వారిలో తమిళనాడు సీఎం స్టాలిన్‌, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ఠాక్రే, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌, బీహార్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ తదితరులతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. వీళ్లలో చాలామంది కాంగ్రెస్‌ లేకుండా బీజేపీ వ్యతిరేక ప్రత్యామ్నాయ కూటమి సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 


కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందని కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. దాన్ని ఆ పార్టీ ఖండించలేదు. కర్ణాటకలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా జేడీఎస్‌ ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పా బీఆర్‌ఎస్‌, జేడీఎస్‌ పోటీ చేయడం దాదాపుగా ఖాయం. ఇక ఖమ్మం బీఆర్‌ఎస్‌ సభలో వేదిక పంచుకున్ననేతలంతా బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నవాళ్లే, కొట్లాడుతున్నవాళ్లే. అలాగే వీళ్లు ఎప్పుడూ అటు ఎన్డీఏలోనూ, బీజేపీతోనూ భాగస్వాములుగా లేరు.  బీహార్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ పార్టీ కలిసే ఉన్నాయి. బీహార్‌, జార్ఖండ్‌ ప్రభుత్వాల్లో కాంగ్రెస్‌ భాగస్వామి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్లు కాంగ్రెస్‌ను కాదని కేసీఆర్‌తో కలిసి వచ్చే అవకాశాలు తక్కువ. కాకపోతే ఉద్యమకాలం నుంచి తెలంగాణకు మద్దతుగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలు, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎంఐఎం తమ అలయెన్స్‌ అని కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు. ఇది రాష్ట్రం వరకే పరిమితం. జాతీయస్థాయిలో రేపు బీఆర్‌ఎస్‌ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తే ఆ పార్టీని కూడా కలుపుకుని వెళ్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఎందుకంటే ఒకవేళ ఎంఐఎంను కలుపుకుంటే అది అంతిమంగా బీజేపీకి లబ్ధి జరుగుతుందనే అబిప్రాయం ఉండనే ఉన్నది. 


ఈసారి కేంద్రంలో కిసాన్‌ ప్రభుత్వం రావాలి అంటున్న కేసీఆర్‌ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీకి కూడా గత రెండు ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ ఈసారి తగ్గే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణతో సహా 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాల ప్రభావం కచ్చితంగా వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలపై ఉంటుది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోబీఆర్‌ఎస్‌ వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేయవచ్చు. ఈ కూటమి 30-40 సీట్లు దక్కించుకుంటే రేపు అటు యూపీఏకు గాని, ఎన్డీఏకు గాని పూర్తి మెజారిటీ రాకపోతే ఎవరికి మద్దతు ఇవ్వాలన్నది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. వైసీపీ, బీజూజనతాదళ్‌ లాంటి పార్టీలు కూడా ప్రస్తుతం తటస్థంగానే ఉన్నాయి. ఈ పార్టీలకు వచ్చే సీట్లు కూడా కీలకంగా మారుతాయి. 

అలాగే కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ప్రయోగం అంతిమంగా బీజేపీకి మేలు చేయడానికే అనే వాదనలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీనే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌ వైఖరి మారవచ్చు, కాంగ్రెస్‌ అధిష్ఠానం అభిప్రాయం మారవచ్చు.  రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు కదా!

Labels: , , , , , , , , ,

Sunday 22 January 2023

బీఆర్‌ఎస్‌కు కేటీఆర్‌ దూరం.. కేసీఆర్‌ వ్యూహమేనా?




టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత కేసీఆర్‌ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఈసారి దేశంలో కాంగ్రెస్‌, బీజేపీ యేతర రైతు ప్రభుత్వం రావాలని చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ కీలక నేతలు మొదలు కార్యకర్తలంతా కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వందలాది కార్యకర్తల మధ్య బీఆర్‌ఎస్‌ పేరును కేసీఆర్‌ గత ఏడాది డిసెంబర్‌ 9న తెలంగాణ భవన్‌లో అధికారికంగా ప్రకటించారు. ఆరోజు కేటీఆర్‌ కూడా పాల్గొన్నారు. కానీ ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ట్విటర్‌లో మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాత్రమే ఎక్కువగా స్పందిస్తున్నారు. 


ఢిల్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం, ఆ సందర్భంగా నిర్వహించిన యాగానికి కేటీఆర్ హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ వెళితే.. కేటీఆర్ మాత్రం ఇక్కడే ఉండిపోయారు. ముందుగా  నిర్ణయించిన వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల కేటీఆర్ హాజరుకాలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభించిన సందర్బంగా నిర్వహించిన యాగానికి కేటీఆర్‌ హాజరుకాలేదు. ఆ సమయంలో బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలంతా హస్తినలో ఉంటే కేటీఆర్‌  మాత్రం హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. ముందుగా నిర్ణయించిన ఇతర కార్యక్రమాలు ఉండటంతోనే ఆయన హాజరుకాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఖమ్మంలో జరుగుతున్న ఆవిర్బావ సభలో కూడా ఆయన లేరు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి ఆయన దావోస్‌ వెళ్లారు. అయితే ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? లేక కేసీఆరే తన తనయుడిని రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడటానికి కేటీఆర్‌ను బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతున్నారా? అనేది ప్రస్తుత చర్చనీయాంశమైంది. 


కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలను విస్తరిస్తూ.. వివిధ రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులను, ఏపీ బీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించారు.  జాతీయ పార్టీలకు నీళ్లు, వ్యవసాయం, పంటల మద్దతు ధరలు వంటి విషయాల్లో జాతీయ విధానం ఉండాలంటున్నారు. దేశంలో నీటి లభ్యత, దేశంలో ఉన్న వనరులు,  ఆర్థిక విధానాలు, రైతు సంక్షేమం వంటి గురించి ఉప ఎన్నికల సందర్భంలోనూ, మీడియా సమావేశాల్లోనూ మాట్లాడారు. తెలంగాణ నమూనా ఇప్పుడు దేశానికి కావాలని అంటున్నారు. కానీ తెలంగాణ ప్రయోజనాలు, రాష్ట్ర హక్కులు, కృష్ణ నదీలో వాటా గురించి ఈ మధ్య కాలంలో ప్రస్తావించడం లేదు. తాను జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి దానికి అనుగుణంగానే దేశం గురించి మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్‌ వేదికల ద్వారా కేసీఆర్‌ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడితే.. రాష్ట్ర రాజకీయాల గురించి కేటీఆర్‌ మాట్లాడేలా ఒక పథకం ప్రకారం ఈ వ్యూహాత్మాకంగా దూరంగా ఉంచుతున్నారని అనుకుంటున్నారు.

Labels: , , ,

బలం ఉన్నా.. బాధ్యత తీసుకుంటేనే...

 ఉమ్మడి పాలమూరు, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్నది. కానీ ఆ పార్టీ నేతల అనైక్యత అధికారపార్టీ అనుకూలంగా మలుచుకున్నది. ఫలితంగా ఇవాళ నల్గొండ, పాలమూరు జిల్లాలో ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేకుండా పోయాడు. పాలమూరులోని కొల్లాపూర్‌లో గెలిచిన హర్షవర్ధన్‌రెడ్డి, నకిరేకల్‌లో నెగ్గిన చిరుమర్తి లింగయ్య  బీఆర్ఎస్‌లో ఉన్నారు. నల్గొండ జిల్లాలో గత ఎన్నికల్లో 3 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ ఉత్తమ్‌ ఎంపీగా కొనసాగుతూ హుజుర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ, మునుగోడు గెలిచిన రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ గెలిచింది. ప్రస్తుతం ఈ రెండు జిల్లాలోని మొత్తం 26 సీట్లు బీఆర్‌ఎస్‌ ఖాతాలోనే ఉన్నాయి. 


నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినేపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో దళిత,గిరిజన ఆత్మగౌరవ సభలో రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దళితులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందని, ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని మొత్తం సీట్లను గెలిపించే బాధ్యతను తానే తీసుకుంటానని, సీఎం సీట్లో పార్టీ అధిష్ఠానం ఎవరికి వచ్చినా వారిని సీఎం సీట్లో తానే కూర్చోబెడుతానని క్లియర్‌గా చెప్పారు. అంటే అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ఎవరికి అవకాశం ఇచ్చినా స్వాగతిస్తానని చెప్పారు. అంతకంటే ముందు విభేదాలు వీడి ఐక్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తేవాల్సిన బాధ్యతను పార్టీ రాష్ట్ర బాధ్యుడిగా తన వైఖరిని స్పష్టం చేశారు. అప్పుడే అధికారపార్టీని ఓడించగలమనే సందేశాన్ని పంపారు. 


అందుకే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఠాక్రే నిన్న హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర రేవంత్‌రెడ్డి 50 నియోజకవర్గాలకు తగ్గకుండా, సీనియర్లు 20-30 నియోజకవర్గాల్లో యాత్ర చేయాలని సూచించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యాత్రను విజయవంతం చేయాలన్నారు.  70-80 నుంచి స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్నదని, రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నందున కొంచెం కష్టపడితే గెలువొచ్చని చెప్పకనే చెప్పారు. ఇది ఎన్నికల ఏడాది కాబట్టి నేతలు పార్టీ వీడినా కార్యకర్తలు కాంగ్రెస్‌తోనే ఉన్నారు అనడానికి మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన ఓట్లను బట్టి తెలుస్తోంది. కష్టపడే కార్యకర్తలకు, నేతలు భరోసా ఇచ్చి బాధ్యత తీసుకుంటే బీఆర్‌ఎస్‌ను నిలువరించడం కష్టమేమీ కాదని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.


Labels: , , , ,

బీఆర్‌ఎస్‌ సభపై నితీశ్‌ ఆసక్తికర మాటలు అందుకేనా?


బీఆర్‌ఎస్‌ ఆవిర్బావ సభపై బీహార్‌ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ యేతర పక్షాలతో కలిసి సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమావేశం గురించి తనకు సమాచారం లేదని, తనకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ అందినా వెళ్లేవాడిని కాదన్నారు. సావధాన్‌ యాత్ర.  రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలలతో  పాటు ఇతర కార్యక్రమాలు ఉన్నందున తాను హాజరుకాలేదని దానికి కారణం చెప్పారు. అట్లనే స్వప్రయోజనాలు ఏమీ కోరుకోవడం లేదు, జాతీ ప్రయోజనాల కోసం విపక్ష నేతలంతా ఏకతాటిపైకి వచ్చి సాగితే చూడాలని ఉన్నది, తెలంగాణలో అది జరిగింది. అయితే బీఆర్‌ఎస్‌కు సంబంధించిన సభ మాత్రమే. కొత్త కూటమి ఏర్పాటు కోసం నిర్వహించిన సభగా దీన్ని చూడకూడదన్నారు. 


బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయంగా విపక్షాలన్నీ ఒకే వేదికపైకి రావాలని కోరుకుంటూ..నితీశ్‌ ఈ దిశగా సోనియాగాంధీ, మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తదితరులతో ఆ మధ్య భేటీ అయ్యారు. యూపీఏ, ఎన్డీఏ కూటములకు దూరంగా తటస్థంగా ఉంటున్నవారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఆ కూటమికి తాను ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నారు. బీహార్‌ సీఎంగా మరోసారి కొనసాగే ఆలోచన ఆయనకు లేదు. ఎందుకంటే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ ప్రకటించాక దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఎన్డీఏ కూటమిని నుంచి జేడీయూ వైదొలిగింది. అనంతరం బీహార్‌లో ఆయన ఆర్జేడీ, కాంగ్రెస్‌తో జతకట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత  ఆర్జేడీతో విభేదాలతో తిరిగి కాషాయ పార్టీతో జట్టు కట్టి తిరిగి అధికారంలోకి వచ్చారు. మళ్లీ బీజేపీకి బైబై చెప్పి తిరిగి ఆర్జేడీ, కాంగ్రెస్‌ తో కలిసిపోయారు. ప్రస్తుతం ఆ కూటమి తరఫున సీఎంగా కొనసాగుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలో వెళ్తామన్నారు. అంటే పరోక్షంగా తాను జాతీయ రాజకీయాలకు వెళ్తాను అన్న సిగ్నల్స్‌ ఇచ్చారు. అందుకు అనుగుణంగా బీజేపీ కూటమికి వ్యతిరేకంగా  విపక్ష నేతలను ఐక్యం చేసే పని పెట్టుకున్నారు. అది ప్రక్రియ ప్రస్తుతం ఆగిపోయింది. ఈలోగా కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పేరుతో జాతీయ రాజకీయాలపై మాట్లాడుతుండటం, కాంగ్రెస్‌, బీజేపీ యేతర సీఎంలతో పాటు ప్రాంతీయ పార్టీల అధినేతలతో సంప్రదింపులు చేశారు. 


బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు కేరళ, ఢిల్లీ, పంజాబ సీఎంలతో పాటు వామపక్ష జాతీయ నేతలను ఆహ్వానించి బల ప్రదర్శన చేశారు. ఈ వేదిక నుంచే ఆయన బీజేపీపై, ప్రధాని మోడీపై తీవ్రమైన విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ యేతర కిసాన్‌ ప్రభుత్వం రావాలని కోరారు. అయితే కాంగ్రెస్‌ లేకుండా మరో కూటమి సాధ్యం కాదని శివసేన, ఎన్సీపీ, జేడీయూ, ఆర్జేడీ లాంటి పార్టీలు మొదటి నుంచి స్పష్టంగా చెబుతున్నాయి. అలాగే కాంగ్రెస్‌తో కలిసి బీహార్‌లో అధికారంలో ఉన్న నితీశ్‌  బీఆర్‌ఎస్‌ సభకు రాలేడని, ఒకవేళ ఆయన వస్తే అది వేరే సంకేతానికి దారి తీస్తుందని కేసీఆర్‌కు తెలియదా? అందుకే ఆయన కాంగ్రెస్‌, బీజేపీ యేతర పార్టీలతోనే ముందుకు వెళ్లాలని బావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ సభను భవిష్యత్తు మార్పునకు సంకేతమని ఆ సభకు వచ్చిన నేతలంతా అన్నారు. కానీ నితీశ్‌ మాత్రం దీన్నిఅంగీకరించలేపోతున్నారు. నితీశ్‌  జాతీయస్థాయిలో తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా కాంగ్రెస్‌తో వెళ్లడం మినహా మరో మార్గం లేదు. దీన్ని బీఆర్‌ఎస్‌ సభగా మాత్రమే చూడాలని, కొత్త కూటమి ఏర్పాటు కోసం నిర్వహించిన సభగా చూడకూదని అందుకే అన్నారు.

Labels: , , , ,