Saturday 13 May 2023

కర్ణాటకలో కుదిరింది.. కానీ తెలంగాణలో కష్టమే!


కర్ణాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతమౌతాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. దీంతోపాటు సోషల్‌మీడియాలో ఇదే విషయంపై చర్చ జరుగుతున్నది. అయితే నిజంగా తెలంగాణలో ఆ పరిస్థితులు ఉన్నాయా? ఇక్కడ కాంగ్రెస్‌ లేదా బేజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదా? కేసీఆర్‌ ఢీ కొట్టగలిగే రాష్ట్ర స్థాయి నేత ఇరు పార్టీల్లో ఉన్నారా? అంటే అంత ఈజీ కాదనే సమాధానమే వస్తుంది. కర్ణాటకలో ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగ సమస్య, నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం, కుల, మత రాజకీయాలు, బొమ్మై సర్కారు అవినీతిపై అక్కడి నేతలు సమిష్టిగా పోరాడారు. అక్కడ సీఎం సీటు కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ల మధ్యే పోటీ ఉన్నది. ఎన్నికల సమయంలో వారిద్దరి మధ్య విభేదాలు కాంగ్రెస్‌ పార్టీ పరిష్కరించింది. వారు కూడా ముందు పార్టీ గెలుపు తీరాలకు తీసుకెళ్లాలి. ఆ తర్వాత సీఎం సీటు సంగతి చూసుకుందామనే అభిప్రాయంతో ముందుకు వెళ్లారు. సిద్ధరామయ్య సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఐదేళ్లు సీఎంగా, అంతకు ముందు రెండుసార్లు డిప్యూటీ సీఎంగా, అత్యధిక సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఆర్థికమంత్రిగా ఆయనకు రాష్ట్రమంతా పట్టున్నది. బీజేపీ ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు చేసి జైలుకు పంపినా పార్టీ కోసం గట్టిగా డీకే నాయకత్వ ప్రతిభ కూడా కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపునకు ఉపకరించాయి. అలాగే కాంగ్రెస్‌ పార్టీని ఎవరూ ఓడించలేరు, ఆ పార్టీ నేతలే ఓడిస్తారనే నానుడిని కర్ణాటక నేతలు నిజం చేయలేదు. రాహుల్‌ భారత్‌ జోడోయాత్ర ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో ఉన్నది. 


 సంకీర్ణ ప్రభుత్వాలతో విసిగిపోయిన ఆ రాష్ట్ర ప్రజలు సుస్థిర ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. అందుకే పార్టీలు కులం, మతం ఆధారంగా సీట్లు ఇచ్చినా... వాటినే ప్రచారం చేసినా అన్నివర్గాల, అన్ని మతాల ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతోనే గంపగుత్తగా ఓట్లు వేశారు. సాధారణ మెజారిటీనే కాదు భారీ మెజారిటీని కాంగ్రెస్‌కు కట్టబెట్టారు. ప్రజల చైతన్యానికి అనుగుణంగా కర్ణాటక ప్రజాప్రతినిధులు పరిణతి ప్రదర్శించారు. ఐటీ పరిశ్రమలకు కేంద్ర బిందువుగా బెంగళూరు లాంటి సిటీ బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వ మూడేళ్ల  పాలనలో కాలంలో మత రాజకీయాలతో మసకబారింది. దీన్ని కూడా ప్రజలు నిరసించారు. కొవిడ్‌ కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం చూస్తున్నారు. వాటిని కల్పించడానికి కృషి చేయాల్సిన పాలకులు మతం పేరుతో శాంతిభద్రతల సమస్యలు సృష్టించ చూసిన వారిని కూడా చిత్తుగా ఓడించారు. హిజాబ్‌ వంటి సున్నిత అంశాన్ని తెరమీదికి తెచ్చి వివాదాస్పదం చేసిన  విద్యాశాఖ మంత్రి ఓటమే దీనికి ఉదాహరణ. 


కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఉండొచ్చు. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని దించే పరిస్థితులు మాత్రం లేవు. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక సీనియర్లు, బైటి నుంచి వచ్చిన వారు పార్టీలో పెత్తనం చేస్తున్నారనే రచ్చ ఆ పార్టీలో జరుగుతున్నది. ఫలితంగా ఇప్పటికే కొంతమంది నేతలు పార్టీ వీడగా.. సీనియర్లు రేవంత్‌ నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. అయితే వాళ్లు పార్టీని గెలిపించగల స్థితిలో లేరు. కానీ వాళ్లను పక్కనపెట్టి అధికారపార్టీపై పోరు చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వాళ్లంతా వారి వారి నియోజకవర్గాల్లో గట్టి పట్టున్న నేతలే. ఎన్నిలకు ఇంకో ఏడెనిమిది నెలల సమయం మాత్రమే ఉన్నది. నేతల మధ్య సయోధ్య కుదిరి అంతా ఏకతాటిపైకి వస్తే ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంటుంది. కానీ అంతర్గత కుమ్ములాటలు ఇలాగే కొనసాగితే అంతిమంగా అది అధికారపార్టీకే మేలు చేస్తుంది. 


ఇక గత ఎన్నికల్లో 100 పైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నది. అయితే తెలంగాణలో ఆ పార్టీకి అంత సీన్‌ లేదనే అంటున్నారు. కేసీఆర్‌ లేదా రేవంత్‌రెడ్డి లపై అసంతృప్తితో బీజేపీలో చేరిన వారే ఎక్కువ. అలాంటి వారు ఆ పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేయలేరు. అలాగే బండి సంజయ్‌ ఏకపక్ష నిర్ణయాలు కూడా ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి నచ్చడం లేదు. కర్ణాటక ఫలితాల తర్వాత కొత్తగా బీజేపీలోకి చేరాలనే ఆలోచన ఉన్నవారు తమ అభిప్రాయం మార్చుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బీఆర్‌ఎస్‌తో అధినాయత్వంతో రాజీ పడలేక బీజేపీలో కొనసాగలేక సతమతమవుతున్న నేతలు కూడా కాంగ్రెస్‌ వైపు చూడొచ్చు అంటున్నారు.


బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలు, వైఫల్యాల సంగతి ఎలా ఉన్న సంక్షేమ పథకాల అమలు, సాగునీరు, ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా వంటివి ఆపార్టీకి సానుకూల అంశాలు. కేసీఆర్‌ నాయకత్వం కంటే స్థానిక ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉండొచ్చు. గడిచిన రెండు ఎన్నికల్లోనూ కేసీఆర్‌ నాయకత్వానికే ప్రజలు జైకొట్టిన సంగతి రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పై బీజేపీ ఎన్ని విమర్శలు చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు ఇస్తున్న అవార్డులు, ప్రభుత్వ పనితీరుపై నీతి ఆయోగ్‌ విడుదల చేస్తున్న సూచీల్లో సంతృప్తి వ్యక్తం చేస్తుండటం బీఆర్‌ఎస్‌ కు లబ్ధి చేకూర్చవచ్చు. రాజకీయంగా విభేదాలు ఎలా ఉన్నా రాహుల్‌గాంధీపై అనర్హత వేటును తప్పుపడుతూ.. అందరికంటే ముందుగా కేసీఆరే స్పందించారు. అయితే తెలంగాణ ఇచ్చిన నేతగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పాదయాత్ర ప్రభావం ఇక్కడ ఉండొచ్చు. అంతేకాదు విభజన, విద్వేష రాజకీయాలను కన్నడ ప్రజలు తిరస్కరించారు. అలాంటిది కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తన అసంతృప్తిని, అక్కసు వెళ్లగక్కిన మోడీ ప్రభావం మాత్రం అస్సలే ఉండదు.  ధరణి, ప్రశ్నాపత్రాల లీకేజీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల వంటివి ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. అయితే ఆ వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మలుచుకుని కర్ణాటక ఫలితాలను ఇక్కడ కూడా పునరావృతం చేయాలంటే  కాంగ్రెస్‌ పార్టీ నేతలు బాగా కష్టపడితే తప్పా అది సాధ్యం కాదు. 

Labels: , , , , , , ,

Friday 12 May 2023

కాంగ్రెస్‌కే పట్టం కట్టిన కన్నడ ప్రజలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు:


-మోడీ మానియా పనిచేయలేదు

-బజరంగ్‌దళ్‌ నినాదం నిలబెట్టలేదు

-భావోద్వేగాలు ఓట్లు రాల్చలేదు

-ఉచితాలు దేశాభివృద్ధికి నిరోధకాలన్న మోడీ కర్ణాటకలో అనేక ఉచిత హామీలు ఇచ్చినా ప్రజలు విశ్వసించలేదు

-తొమ్మిదేళ్ల కేంద్ర ప్రభుత్వ, మూడేళ్లకు పైగా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ సాధించిన ప్రగతిని చెప్పలేని పరిస్థితి  

-ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం ఎన్నికల ఫలితాల్లో కనిపించింది.

-


అందుకే కమలం పార్టీని కాదని కాంగ్రెస్‌కే పట్టం కట్టిన కన్నడ ప్రజలు 

Labels: , , , , , ,

పవన్‌ నిలకడలేని నిర్ణయాలు.. ప్రశ్నార్థకంలో ఆ పార్టీ మనుగడ


పొత్తులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికలకు ముందు కూటములుగా ఏర్పడటం, పొత్తులు పెట్టుకోడం సహజమే. కానీ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసమే పొత్తులు పెట్టుకుంటామనడమే ఆశ్చర్యంగా ఉన్నది. ఆయన పొత్తులపై మాట్లాడుతూ..' వైసీపీ నుంచి రాష్ట్రాన్ని రక్షించి  అధికారాన్ని చేజిక్కించుకోవడం, కూటమి ద్వారా తిరిగి ప్రజలకు దక్కాలి' అన్నారు. పొత్తులపై కొందరు అంగీకరించకపోవచ్చని, వాస్తవ గణాంకాలు చూపి ఒప్పిస్తామని, ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వచ్చిన తర్వాత ఇదే చెప్పాం. తన నిర్ణయం మారదు' అన్నారు.


అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే పవన్‌ వ్యాఖ్యల ప్రకారం చూస్తే.. వైసీపీని ఓడించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేయాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలి. మొత్తం 175 స్థానాల్లో ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే సీట్ల విషయంలో అన్నిపార్టీలు రాజీపడాలి. జనసేన అధినేతగా పవన్‌ ఆధేశాల ప్రకారం వాళ్ల నేతలు అంగీకరిస్తారు అనుకుందాం. మరి బీజేపీ, టీడీపీ ల నేతలు పొత్తులో భాగంగా సీట్లు త్యాగాలు చేయడానికి సిద్ధపడుతారా? మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఏపీలో బీజేపీ కంటే వామపక్షాల బలమే ఎక్కువ. విపక్ష కూటమిలో బీజేపీ ఉంటే వామపక్షాలు వారితో కలిసి వస్తాయా? భిన్న సిద్ధాంతాలు, భావజాలాలు ఉన్న పార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తామని, అందుకు కొంతమంది అంగీకరించకున్నా ఒప్పిస్తానని పవన్‌ అనడం హాస్యాస్పదం. 


ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు సీఎం అయితే బాగుంటుందని ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. కానీ ఐదేళ్లలో బాబు ఏం చేశారో అనుభవంలో ఉన్నదే. అలాగే టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలతో విసిగిపోయిన జనాలు జగన్‌కు జై కొట్టారు. గడిచిన నాలుగేళ్లుగా ఆయనేం చేస్తున్నారో చూస్తున్నాం. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వంటివి ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా మరో ప్రభుత్వం రావాలనే అభిప్రాయం అక్కడి ప్రజల్లో ఉన్నది. ఆ అవకాశం పవన్‌ పార్టీ లేదా ఇతర పార్టీలకు ఉంటుంది. కానీ ఎన్నికలకు ముందే పొత్తుల కోసం పాలకులాడుతున్న పవన్‌ తానకు సీఎం కావాలనే కోరిక లేదని, ఆ పదవి వరించి రావాలి కానీ.. మనం కోరుకుంటే అయ్యేది కాదన్నారు. దీంతో పవన్‌ లక్ష్యం బాబు ను మళ్లీ సీఎం చేయడమే అన్నది స్పష్టమైంది. దీన్నిరాజకీయ ప్రయోజనాల దృష్ట్యా జనసేన, బీజేపీ అంగీకరించినా ప్రజలు దాన్ని ఆమోదిస్తారా? అన్న గ్యారెంటీ ఏమీ లేదు. అంతేకాదు పవన్‌ టీడీపీకి బీ టీమ్‌ అన్న వైసీపీ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. రాజకీయాల్లో పవన్‌ నిలకడలేని నిర్ణయాలు ఆ పార్టీ మనుగడను ప్రశ్నార్థం చేస్తున్నాయి. ఎందుకంటే ఏపీ ప్రజల ఆకాంక్షలు తొమ్మిదేళ్లైనా ఇప్పటికీ నెరవేరలేదు. ఈ వైఫల్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాల పాత్ర ఉన్నది. కానీ పవన్‌ ఈ విషయాన్ని మరిచి తిరిగి బీజేపీ, టీడీపీ పొత్తులు పెట్టుకునేలా తాను కృషి చేస్తానని చెబుతుండటంపై ప్రజలు కూడా పెదవి విరుస్తున్నారు. అందుకే వైసీపీ నేత సజ్జల పవన్‌ కల్యాణ్‌ ఇమేజ్‌ నీటి బుడగ అని,చంద్రబాబు పల్లకి మోయడమే ఆయన నైజం అని,బలం లేదని పవన్‌ అంగీకరించారని కౌంటర్‌ ఇచ్చారు. పొత్తులపై పవన్‌కు అంత తొందర ఎందుకో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 



Labels: , , , , , ,

Wednesday 10 May 2023

కర్ణాటక కాంగ్రెస్‌దే!



దక్షిణాది భారతంలో బీజేపీకి అధికారం కట్టబెట్టిన కర్ణాటక ఎన్నికలవైపు దేశమంతా ఆసక్తిగా చూసింది. ఈ ఎన్నికల్లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి ఈ ఏడాది జరగనున్నమధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో సత్తా చాటాలని బీజేపీ భావించింది. కర్ణాటక ఎన్నికల చరిత్ర చూస్తే గత 25 ఏళ్లలో 1999, 2013 లోనే ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈసారి ఆ రికార్డులను బద్దలు కొట్టాలని కమలనాథులు భావించారు. అయితే బీజేపీకి చెక్‌ పెట్టి ఈ విజయం ద్వారా ఈ ఏడాది జరగనున్న ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, మధ్యప్రదేశ్‌లోనూ విజయానికి బాటలు వేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలని 2024 లోక్‌సభ ఎన్నికలకు గెలుపు దారులు వేయాలని కాంగ్రెస్‌ గట్టిగా కొట్లాడింది. ప్రధానంగా బీజేపీ వైఫల్యాలపైనే ఫోకస్‌ పెట్టింది. అవినీతి, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం వంటి అంశాలనే ప్రచారాస్త్రాలుగా హస్తం పార్టీ ఎంచుకున్నది. ప్రధానంగా నిరుద్యోగం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపినట్టు ఎగ్జిట్‌పోల్‌ అంచాలను బట్టి తెలుస్తోంది. బీజేపీలో నెలకొన్న అంతర్గత కలహాలు, కొంతమంది సీనియర్లకు పార్టీ టికెట్లు నిరాకరించడంతో వారంతా తిరుగుబాటు చేశారు. ఆ ప్రభావం కూడా ఎన్నికల్లో ఉంటుందని అంటున్నారు. అలాగే ఎన్నికలకు ముందు ముస్లిం రిజర్వేషన్లు రద్దుచేసి లింగాయత్‌, వొక్కలిగ సామాజికవర్గాలకు పంచినా అవి బీజేపీకి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు రాజకీయ విశ్లేకులు చెబుతున్నారు. గుజరాత్‌లో  ప్రధాని మోడీ తానే సీఎం అభ్యర్థిని అన్నట్టు చేసిన ప్రచారం ఇక్కడ కూడా బీజేపీ అమలు చేసింది.  స్థానిక నాయకత్వాన్ని పక్కన పెట్టి అంతా తానే అన్నట్టు 18 భారీ బహిరంగ సభలు, 6 రోడ్‌ షోలు చేసినా బీజేపీని విజయతీరాలకు చేర్చలేవు అని సర్వేల సారాంశం.  గుజరాత్‌లో వలె ఇక్కడ కూడా కొత్తవారికి టికెట్లు ఇచ్చిన ప్రయోగం విఫమౌతుందని తెలుస్తోంది. 

ఇక పాతమైసూర్‌ ప్రాంతంలో గట్టి పట్టున్న జేడీఎస్‌ కు ఈ ఎన్నికలు నిరాశనే మిగిల్చబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే పోలింగ్‌ జరుగుతున్న సమయంలోనే జేడీఎస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి  ఎన్నికల ఫలితాలపై సంచలన కామెంట్లు చేశారు. ఈ ఎన్నికలు జేడీఎస్‌కు పెద్ద దెబ్బ అని మా పార్టీకి 25 సీట్లకు మంచి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. 

సర్వేల శాస్త్రీయత ఎంత అన్న చర్చను పక్కనపెడితే ఎగ్జిట్‌పోల్స్‌లో చాలావరకు కాంగ్రెస్‌ పార్టీనే మెజారిటీ సీట్లు దక్కించుకుంటుందని తేల్చాయి. ఇండియాటుడే, టైమ్స్‌ నౌ, పీపుల్స్‌ పల్స్‌, సీ ఓటర్‌ లాంటి సర్వేలు కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ  మార్క్‌ను దగ్గరలో ఉంటుందని పేర్కొన్నాయి. 224 నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అన్నది ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నది. మే 13న కర్ణాటక ఫలితాలు వెల్లడికానున్నాయి.


ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు ఇవే


రిపబ్లిక్‌ టీవీ సర్వే: బీజేపీ 85-100, కాంగ్రెస్‌  94-108, జేడీఎస్‌ 24-32, ఇతరులు 2-6

టీవీ9 భారత్‌వర్ష్‌ సర్వే: బీజేపీ 88-98,  కాంగ్రెస్‌ 99-109, జేడీఎస్‌ 21-26,  ఇతరులు 0-4

జీ న్యూస్‌ సర్వే: బీజేపీ 79-94,  కాంగ్రెస్‌ 103-118, జేడీఎస్‌ 25-33,  ఇతరులు 2-5

పోల్‌ స్ట్రాట్‌ సర్వే: బీజేపీ 88-98,  కాంగ్రెస్‌ 99-109, జేడీఎస్‌ 21-26,  ఇతరులు 0-4

ఇండియా టుడే: కాంగ్రెస్‌-122-140, బీజేపీ- 62-80, జేడీఎస్‌-20-25, ఇతరులు 0-3

టైమ్స్‌ నౌ : కాంగ్రెస్‌- 106-120, బీజేపీ- 78-92, జేడీఎస్‌-20-26, ఇతరులు 2-4

సీ ఓటర్‌ : కాంగ్రెస్‌- 100-112, బీజేపీ- 83-95, జేడీఎస్‌-21-29, ఇతరులు 2-6

పీపుల్స్‌ పల్స్‌ : కాంగ్రెస్‌- 107-119, బీజేపీ- 78-90, జేడీఎస్‌-23-29, ఇతరులు 1-3

జన్‌కీ బాత్‌ : కాంగ్రెస్‌- 91-106, బీజేపీ- 94-`117, జేడీఎస్‌-14-24


Labels: , , , , , , , ,

Saturday 6 May 2023

ఎన్నికల పోరుకు ముందే పొంగులేటికి అనేక సవాళ్లు




బీఆర్‌ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారా? ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేక కన్ఫ్యూజన్‌లో ఉన్నారా? కేసీఆర్‌ను గద్దె దింపడమే తన లక్ష్యమన్న ఆయన ప్రస్తుతం ఊగిసలాటలో ఉన్నారా? అంటే ఔననే అంటున్నారు. ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రంగానే బరిలోకి దిగి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వనని శపథం చేసిన ఆయన ఏ పార్టీవైపు అడుగువేయాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు.

ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాల్లో సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. పది నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు స్థానం గెలుపే లక్ష్యంగా కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో మీడియా అంతా ఆయనఫైనే ఫోకస్‌ పెట్టింది. కానీ ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకోబుతున్నారని వార్తలు రావడం, మరోవైపు ఈటల రాజేందర్‌ నేతృత్వంలోని బృందంతో ఆయన భేటీ కావడంతో పొంగులేటికి ఆయన అనుచరుల నుంచే ప్రశ్నలు ఎదురవుతున్నాయని సమాచారం. వామపక్ష భావజాల ప్రభావం ఉన్న ఆ జిల్లాలో బీజేపీకి అంతగా బలం లేదు. కానీ ఆయన బీజేపీ నేతలతో సమావేశం కావడంతో ఇప్పటివరకు ఆయనపై ఉన్న కొద్దిపాటి సానుభూతి కూడా పోయింది అంటున్నారు. అలాగే ఆయనను బీఆర్‌ఎస్‌ సస్పెండ్‌ చేసిన తర్వాత ఏదో ఒక పార్టీలో చేరితో పరిస్థితి ఇక్కడిదాకా రాకపోయిది. కానీ వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ ఇలా అన్ని పార్టీల నేతలతో టచ్‌లో ఉండటంతో పొంగులేటికి తాను రాజకీయంగా అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నది.

మరోవైపు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన నేతలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ప్రచారం జరుగుతున్నది. వాళ్లంతా వేరే పార్టీ పెట్టి ఒకే గొడుగు కిందికి రావాలనే ఆలోచనతో ఉన్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. అందుకే ఖమ్మంలో పొంగులేటి తో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి సమావేశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని స్పందన అడిగితే తనకు సమాచారం లేదన్నారు. దీన్నిబట్టి రాష్ట్ర నాయకత్వాన్ని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల నుంచి బీజేపీలో చేరిన వారికి మధ్య సఖ్యత లేదనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  బీఆర్‌ఎస్‌ను ఓడించే పార్టీలో తాను చేరుతానని గతంలో ప్రకటించారు. అధికారపార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజలే కాదు అదికారపార్టీ కూడా  కాంగ్రెస్‌ పార్టీనే అంంటున్నది.  మరి బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ నేతలు చెబతున్నారు కదా అని కొందరు అంటుండవచ్చు. అయితే   రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమిటి అని అడిగితే రాజకీయంగా అవగాహన ఉన్న ఎవరైనా ఇట్టే చెబుతారు. దానికి పెద్దగా ఆలోచన కూడా అక్కరలేదు. కాబట్టి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  తాను పార్టీలో చేరాలనేది ఆయన కార్యకర్తల అభిప్రాయం మేరకు, వ్యక్తిగత ఆలోచన మేరకు ఏదైనా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆయనకు ఉన్నది. అయితే బీజేపీ సిద్ధాంతాలు నచ్చకున్నా బీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌ ను వీడి  తమ వ్యక్తిగత ప్రయోజనాల దృష్ట్యా కాషాయ తీర్థం పుచ్చుకుంటే ఏం జరుగుతున్నదో చూస్తున్నాం. పొంగులేటి కూడా వారి బాటలోనే నడిస్తే రాజకీయంగా బలోపేతం కంటే ఇబ్బందులే అధికంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  ఎందుకంటే ఈటల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌ వీడిన తర్వాత ఉప ఎన్నిక అనివార్యం అని తేలడంతో ఆయన గ్రాఫ్‌ 75 శాతానికిపైగానే ఉన్నది. ఆయన కాషాయ కండువా కప్పుకున్న తర్వాత పోలింగ్‌ తేదీ నాటికి చాలా తగ్గిపోయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉదంతాన్నికూడా ఉదాహరణగా చెబుతున్నారు.

Labels: , , , , , , , ,