Tuesday 7 December 2021

ముందస్తుగానే కండువలు మారుస్తున్నరు


రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీనే అని ప్రజలు భావిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు. సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇప్పటికీ 20 నుంచి 30 స్థానాల్లో బలంగా ఉన్నది. కానీ ఆ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాలే గుదిబండగా మారాయి. అందుకే ఉద్యమ కాలంలో కేసీఆర్ తో కలిసి సుదీర్ఘ కాలం పనిచేసిన వారు కూడా కాంగ్రెస్ ను కాదని కాషాయ కండువా కప్పుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. దుబ్బాక, నాగార్జున సాగర్, జీహెచ్ఎంసీ మొదలు హుజురాబాద్ ఉప ఎన్నిక వరకు వచ్చే సరికి ఆ పార్టీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. హుజురాబాద్ లో అయితే మూడు వేల ఓట్లకే పరిమితం అయి అధికార పార్టీ ఓటమి భారం కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేరింది. 

త్వరలో వేములవాడ, మునుగోడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావొచ్చు అని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ దుబ్బాక లో స్వల్ప మెజారిటీ తో గట్టెక్కింది. నాగార్జున సాగర్ ఉప ఉన్నికల్లో ఉనికి కూడా చాటలేకపోయింది. కానీ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. ఆ ఫలిత ప్రభావాన్ని తగ్గించడానికి ముఖ్యమంత్రి రెండు మూడు ప్రెస్ మీట్లు పెట్టినా అధికార పార్టీలోని అసంతృప్త నేతలు, కొందరు ఉద్యమకారులు బీజేపీ లో చేరుతున్నారు. దుబ్బాక లో బాగానే ఓట్లు సంపాదించినా, నాగార్జున సాగర్ లో రెండో స్థానంలో నిలిచినా అధికార పార్టీకి ప్రత్యామ్నాయం మనమే అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వాళ్ళ కార్యకర్తలకు నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. అందుకే కాంగ్రెస్ నేతలు టీఆర్ ఎస్ లో, టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతున్నారు.

ధ్యానం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య మాటల యుద్ధం గ్రామ స్థాయిలో మొదలు పార్లమెంటు సమావేశాల్లోనూ నడుస్తున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికీ కలిసి పనిచేయడం లేదు. ఒక్క తాటి మీదికి రావడం లేదు. కానీ బీజేపీ మాత్రం రాజకీయంగా గుర్తింపు ఉన్న నేతలను, ఉద్యమం లో పనిచేసిన ఫెమిలియర్ వ్యక్తులను పార్టీలోకి తీసుకువచ్చే పని పెట్టుకున్నది. ఈ నెల 13వ తేదీ తో టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు పూర్తి అవుతాయి. ఇగ పాలనను పరుగులు పెట్టిస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్నా ఆచరణలో అది కనిపించడం లేదు. అనేక సమస్యలు, హామీలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఎన్నికల కు ఇంకా రెండేండ్ల సమయం మాత్రమే ఉన్నది. అందుకే రాజకీయ ఆశావహులు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.  ఆ మధ్య కేసీఆర్ ముందస్తు ఎన్నికలు వెళ్ళము అన్నారు. కానీ మొదటిసారి ఆరు నెలల ముందుగానే ఎన్నికల కు పోయినట్టు వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే కేసీఆర్ వెళ్లొచ్చు అనే అంచనాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. అందుకే రాష్ట్రంలో వివిధపార్టీల నేతల ముందస్తుగా కండువలు మార్చుతున్నారు.

Labels: , , ,

Friday 3 December 2021

ఆ ఆలోచనే అసంబద్ధం!


కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీని ఎదుర్కొని కేంద్రంలో అధికారంలోకి రావడం అంత ఈజీ కాదు. మమతాబెనర్జీ యూపీఏ అంటే ఏమిటి? యూపీఏ లాంటిదేమీ లేదు అని చేసిన వ్యాఖ్యలకు అంతేధీటుగా కాంగ్రెస్ స్పందించింది. అట్లనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీని, రాహుల్‌గాంధీ నాయకత్వంపై చేసిన విమర్శలను కూడా కాంగ్రెస్ నేతలు కొట్టిపారేశారు. పశ్చిమబెంగాల్‌లో భారీ విజయం తర్వాత మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ నాయకత్వానికి తానే ప్రత్యామ్నాయం అని భావిస్తుండవచ్చు. ఇటీవల ఈశాన్య రాష్ర్టాల్లో తన పార్టీని విస్తరిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమితోనే కమలం పార్టీని ఢీ కొట్టవచ్చు అని అనుకుంటుండవచ్చు. మమతా వ్యాఖ్యలు, ప్రశాంత్ కిశోర్ ట్వీట్ల సారాంశం ఒక్కటిగానే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గానే వారి ఇరువురి విమర్శలు సాగుతున్నాయి. అయితే ప్రాక్టికల్‌గా ఇది వర్కౌట్ అవుతుందని అనుకోలేము. ఎందుకంటే 42 స్థానాలున్న పశ్చిమబెంగాల్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు 22 స్థానాలు వస్తే, బీజేపీ 18 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు దక్కించుకున్నది. కాంగ్రెస్ వరెస్స్ బీజేపీ ఉన్న రాష్ర్టాల్లో కూడా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్వీప్ చేసింది. కానీ ఆ తర్వాత జరిగిన వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలను బీజేపీ కోల్పోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చీలిక తెచ్చి మధ్యప్రదేశ్‌లో తిరిగి కుర్చీలో కూర్చున్నది. అంతేకాదు గుజరాత్‌లో అయితే మొత్తం 26 స్థానాలు బీజేపీ గెలుచుకున్నది. కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి అవసరమైన స్వల్ప మెజారిటీతోనే బైట పడిన విషయం విదితమే. మహారాష్ట్రలో శివసేన బీజేపీల సుదీర్ఘకాల భాగస్వామ్యానికి బీటలు పడ్డాయి. అనేక నాటకీయ పరిణామాల తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటకలోనూ జనతాదళ్ (సెక్యూలర్), కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ  కూటమిలో చిచ్చుపెట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రుల మార్పు అనేది కషాయ పార్టీలో అనేక సమస్యలు తెచ్చింది. యడ్యూరప్పను మార్చి బసవరాజ్ బొమ్మైని కూర్చొబెట్టింది. ఇప్పుడు ఆయనను మారుస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బీజేపీ గుజరాత్‌లో సీఎంతో ఉత్తరాఖండ్‌లో ముగ్గురు ముగ్గురు సీఎంలను మార్చింది. ఇదంతా ఆయా రాష్ర్టాల్లో బీజేపీని తిరిగి అధికారంలోకి తేవడం, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయా రాష్ర్టాల్లో మెజారిటీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది.


దీనికంటే ముందు వచ్చే ఏడాది జరుగనున్న ఐదు రాష్ర్టాల ఎన్నికలే బీజేపీ అధిష్టానానికి, కాంగ్రెస్ నాయత్వం ముందు సవాలు. ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో సొంతంగా రెండుసార్లు సంపూర్ణ మెజారిటీ సాధించడానికి కారణమైన యూపీ ఎన్నికలపైనే అందరి దృష్టి ఉన్నది. అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో యోగీ ప్రభుత్వం తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్‌పోల్స్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే గణనీయంగా సీట్లను కోల్పోతుందని ఆ సర్వేల సారాంశం. కాబట్టి ఇప్పుడే అక్కడ ఏ పార్టీ కచ్చితంగా గెలుస్తుందో అని చెప్పలేసి పరిస్థితి. సమాజ్‌వాదీ పార్టీ ఓటు శాతం భారీ పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కూడా పెరుగుతుందని అంటున్నాయి. కాబట్టి ఈ త్రిముఖ పోరులో ఏ పార్టీ యూపీ పీఠంపై జెండా ఎగురవేస్తుందో అన్న సస్పెన్స్ ఇప్పట్లో తేలేలా లేదు. అలాగే పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ అమరిందర్ సింగ్‌ను దించి చరణ్‌జిత్ సింగ్‌ను సీఎం సీటులో కూర్చోబెట్టింది. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలోనూ ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ ఆప్ ప్రభావం చాలా ఉంటుంది అంటున్నారు. అయితే అమరీందర్ పార్టీ వీడినా కాంగ్రెస్ పార్టీపై పెద్దగా ప్రభావం ఏమీ లేదు. గోవా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీతో పాటు ఆప్ అక్కడ గెలుపు ఓటములు నిర్ణయిస్తుంది అంటున్నారు. మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ కల్లోలం సృష్టించింది. అక్కడ ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చేలా లేదు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టే ఉన్నది. 


ఈ నేపథ్యంలో 20కి పైగా లోక్‌సభ స్థానాలు ఉన్న రాష్ర్టాలు దాదాపు ఎనిమిది ఉన్నాయి. యూపీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బీహార్, తమిళనాడులో కలిపి 249 స్థానాలున్నాయి. ఈ రాష్ర్టాల్లో ఒక్క యూపీ, పశ్చిమబెంగాల్ మినహా మిగిలిన రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు బాగానే ఉన్నట్టు గత లోక్‌సభ ఎన్నికల, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే అర్థమౌతుంది. బెంగాల్ గెలువగానే బీజేపీకి ప్రత్యామ్నాయం తామే అని తృణమూల్ అధినేత భావిస్తూ కాంగ్రెస్ పార్టీ లేకుండానే కూటమిని ఏర్పాటు చేయవచ్చు అని ఎట్లా అనుకుంటున్నారు? ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రాజకీయ అవకాశాల దృష్ట్యా ఆయన కూడా మమతా బెనర్జీ వలె ఆలోచిస్తుండవచ్చు. కానీ ఇప్పుడు దేశంలో 90వ దశకం నాటి పరిస్థితులు లేవు. చాలా రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. డీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, శివసేన, జేఎంఎం, లోక్‌జనశక్తి, బీజూ జనతాదళ్, జనతాదళ్ (సెక్యూలర్), వామపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగానే ఉన్నాయి. అలాంటప్పుడు కాంగ్రెసేతర కూటమి ఎట్లా సాధ్యం అవుతుందో మమతా బెనర్జీ,  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌లకే తెలియాలి. ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల తర్వాతే హస్తిన రాజకీయాలపై ఒక క్లారిటీ వస్తుందనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో  వచ్చే సార్వత్రిక ఎన్నికల కూటమి గురించి చర్చలు చేయడంలో తప్పులేదు. కానీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లేకుండా కూటమి అనే ఆలోచనే అసంబద్ధంగా ఉన్నది.

Labels: , ,