Saturday 26 August 2023

కామ్రేడ్లు ఇకనైనా కళ్లు తెరవండి!


బీఆర్‌ఎస్‌ ను ఓడించాలనే నినాదంతోనే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతామని సీపీఐ, సీపీఎం నేతల ప్రకటించడం హాస్యాస్పందగా ఉన్నది. దీనికి వాళ్లు చెప్పిన కారణాలు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత పొత్తు ఉంటుందని సీఎం కేసీఆర్‌ చెప్పారని, కానీ మమ్మల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడాన్ని వామపక్ష నేతలు తప్పుపడుతున్నారు. అలాగే బీజేపీతో సఖ్యత ఏర్పడిన కారణంగానే కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందని ఆరోపించారు. కనీస మిత్ర ధర్మం పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వాపమక్షాలు మిత్ర ధర్మం గురించి మాట్లాడటం వారి బలహీనతను తెలియజేస్తున్నది. బీజేపీతో సఖ్యత అన్న సంగతి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఇండియా కూటమిలోకి బీఆర్‌ఎస్‌ను ఎందుకు ఆహ్వానించలేదు అన్న ప్రశ్నకు ఆ కూటమిలోని పార్టీల నేతలు చెప్పిన విషయాలు కూడా వాపమక్ష నేతలు అప్పుడు అర్థం కాలేదా? మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో 'విధాత' తెలుసుకునే ప్రయత్నంలో ఆ నియోజకవర్గ ప్రజలు చెప్పిన విషయాలు ఆసక్తి కలిగించాయి. ఒకప్పుడు మునుగోడు కమ్యూనిస్టుల కంచుకోట. ఆ తర్వాత చాలాకాలం కాంగ్రెస్‌కు అనంతరం బీఆర్‌ఎస్‌ కు అవకాశం ఇచ్చింది. కానీ ప్రస్తుతం బీజేపీకి ఇక్కడి ఓటర్లు మారే ప్రశ్నే తలెత్తదు అని తేల్చిచెప్పారు. మునుగోడు బీఆర్‌ఎస్‌ విజయం వెనుక వామపక్షాల పాత్ర కూడా ఉన్నది. తెలంగాణలో బీజేపీ విస్తరణను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే నాడు వామపక్షాలు బీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన విషయం విదితమే. వామపక్షాల బలం తెలిసే కేసీఆర్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటించగానే వారి మద్దతు కోరారు. ఆ ఎన్నిక అయిపోయే వరకు వరకు వారితో సత్ససంబంధాలు నెరిపారు. ఫలితం అనంతరం వారికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని వామపక్ష నేతలే చెప్పారు. అప్పుడైనా కమ్యూనిస్టులు కళ్లు తెరవాల్సింది. 


ఇండియా కూటమిలో సీపీఐ, సీపీఎం జాతీయ నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్నారు. కేసీఆర్‌ ఎంఐఎం మా మిత్ర పక్షం అని అసెంబ్లీ వేదికగా.. బహిరంగసభల్లోనూ బాహాటంగానే ప్రకటిస్తున్నారు. కానీ ఎన్నడూ ఆయన వామపక్షాల గురించి ప్రస్తావించలేదు. అలాంటప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి అవసరం ఏమొచ్చింది? బీఆర్‌ఎస్‌ వామపక్షాలకు చెరో టికెట్‌, రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వజూపినట్టు సమాచారం.  ఈ మాత్రం దానికి వాళ్లు బీఆర్‌ఎస్‌తో పొత్తు కోవడం దేనికి? వామపక్షాలు ఐక్యంగా వాళ్లకు బలం ఉన్నచోట కలిసి పోటీ చేస్తే అవే సీట్లు వారికి సొంతంగానే దక్కుతాయి. అవసరం అనుకుంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో కలిసి వారి జాతీయ నాయకత్వం కలిసి పనిచేస్తున్నందున వారు పోటీ చేసే చోట ఇరువురు సహకరించుకునే అవకాశం ఉన్నది. ఇన్ని అవకాశాలను వదిలేసి బీఆర్‌ఎస్‌తోనే కలిసి వెళ్దామనుకున్నామని, కానీ కేసీఆర్‌ మమ్మల్ని పట్టించుకోవడం లేదని కామ్రేడ్‌లు ఆవేదన చెందడం అభ్యుదయవాదులకు, ప్రజాస్వామికవాదులకు నచ్చడం లేదు. 


వామపక్షాలు ఇప్పటికే త్రిపుర, బెంగాల్‌ వంటి రాష్ట్రాలను కోల్పోయాయి. రానున్నరోజుల్లో వారి ఉనికే ప్రశ్నార్థం అయ్యే ప్రమాదం ఉన్నది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే వాళ్లు ఇంకో పార్టీని టికెట్లు అడగటం కంటే సొంతంగానే పోటీ చేసి తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటే మంచిదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతున్నది. కనుక  కామ్రేడ్లు దేశంలో ప్రస్తుతం నెలకొన్నప్రతికూల పరిస్ఙితులు దృష్ట్యా మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడే పార్టీలతో కలిసి వెళ్లడం వారికీ మంచిది. దేశానికి శ్రేయస్కరం.

Labels: , , ,

ఆరేళ్ల తర్వాత డీఎస్సీ


ఆరేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం  ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో టీచర్‌ పోస్టుల భర్తీకి రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మొత్తం 6,500 కు పైగా పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.  ఇందులో పాఠశాల విద్యలో 5,089, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూళ్లలో 1,523 పోస్టులున్నాయి. ఈసారి టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే పోస్టుల భర్తీ చేపట్టనున్నట్ల మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం పాఠశాలలను కార్పొరేట్‌ పాఠాశాలల స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. 


ఆరేళ్ల నుంచి కొత్త పోస్టుల భర్తీ లేదు


రాష్ట్రావిర్భావం తర్వాత 2017 లో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. డీఎస్సీని టీఆర్‌టీ ( (టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌) మార్చి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నియామకాలు చేపట్టింది. అపట్లో దాదాపు 25 వేల పోస్టులు ఖాళీలు ఉంటే ప్రభుత్వం 13,500 పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపింది. కానీ 8,792 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ నియామక ప్రక్రియ పూర్తై ఆరేళ్లు అవుతున్నా.. కొత్తగా భర్తీ ప్రక్రియ చేపట్టలేదు. గత మార్చిలో తెలంగాణ రాష్ట్రంలో 1 నుంచి 8 వ తరగతి వరకు బోధించే టీచర్ పోస్టులు 11,348 ఉన్నట్లు రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి తెలిపారు. 




24 వేల వరకు ఖాళీలు...నాలుగు లక్షల మంది నిరీక్షణ

రాష్ట్రంలో 80 వేల పోస్టులకు పైగా భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత ఏడాది మార్చి 9న అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అప్పుడు  పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఇందులో భాగంగా సెకండరీ ఎడ్యుకేషన్‌లో ఖాళీగా ఉన్న 13,086 పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. ఏడాది దాటినా ఆ హామీ ఇప్పటివరకు అమల్లోకి నోచుకోలేదు. రాష్ట్రంలో సుమారు 24 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. వీటి కోసం నాలుగు లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించి  ప్రభుత్వ ప్రకటనల్లో చెప్పిన పోస్టులకు నోటిఫికేషన్లలో జారీ అవుతున్న పోస్టులకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది.  ఉమ్మడి రాష్ట్రంలో 6 నెలలకు ఒకసారి టెట్‌, రెండేళ్లకు ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యా శాఖకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. గురుకులాలు ఏర్పాటు చేసినా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఏటా ఖాళీ అవుతున్న టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియపై అలసత్వాన్ని ప్రదర్శించింది. ఫలితంగా విద్యాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలో దేశంలో రాష్ట్రాల వారీగా చూస్తే అట్టడుగుస్థాయిలో ఉన్నది. 


ఎనిమిదేళ్లుగా పదోన్నతులు, ఐదేళ్లుగా బదిలీల లేవు

అలాగే రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లుగా పదోన్నతులు, ఐదేళ్లుగా బదిలీల కోసం  గురించి ఎదురుచూస్తున్నారు. ఇవి గత ఏడాది వేసవి సెలవుల్లో పూర్తి చేస్తామని టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలకు సీఎం హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌లు, ఎస్జీటీలు  బదిలీలు, పదోన్నతులపై  ఈ ఏడాది జనవరిలో విద్యాశాఖ జీవో జారీ చేసింది. బదిలీలపై స్పౌజ్‌ టీచర్స్‌, గుర్తింపు పొందిన సంఘ నాయకులకు అదనపు పాయింట్లు కేటాయించడంపై కొందరు ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్లారు.  దీంతో బదిలీలకు హైకోర్టు ఫిబ్రవరిలో బ్రేక్‌ వేసింది. మార్చి 14 వరకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నిలిపివేస్తున్నామని కోర్టు స్టే విధించింది.   ప్రమోషన్లకు, బదిలీలకు అంతర్గత సంబంధం ఉన్నది. ముందుగా పీజీ హెచ్‌ఎంల బదిలీలు జరగాలి. తర్వాత పీజీ హెచ్‌ఎంల పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలి. తర్వాత స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీ జరగాలి. ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంల  బదిలీల జరగాలి. తదుపరి స్కూల్‌ అసిస్టెంట్ ఖాళీలకు పదోన్నతులు నిర్వహించాలి. చివరగా ఎస్‌జీటీ, పండిట్లకు ట్రాన్స్‌ఫర్లు జరగాలి. ఈ మొత్తం ప్రక్రియ జరగాలంటే ముందుగా ప్రధానోపాధ్యాయుల బదిలీలు జరగాలి. బదిలీల ప్రక్రియ కోర్టు స్టే ఇవ్వడంతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది.  ప్రస్తుతం కోర్టులో అంశం కోర్టు పరిధిలో ఉన్నది. దీనిపై వాదనలు జరుగుతున్నాయి. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయితే మరిన్ని ఖాళీలు ఏర్పడుతాయి.  కానీ ప్రభుత్వం ఈ సమస్య  పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపడం లేదని, అందుకే పోస్టులు తక్కువగా ఉంటున్నాయని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు.

Labels: , , , ,

బీఆర్‌ఎస్‌కు రెబెల్స్‌ బెడద


బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అందరి కంటే ముందుగానే 115 మంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తులు ఒకటి రెండు రోజులు మౌనంగా ఉన్నారు. టికెట్లు రానివారు బాధ పడవద్దని భవిష్యత్తులో వారికి ఇతర అవకాశాలు ఉంటాయని సీఎం చెప్పారు. అయితే అసంతృప్తుల్లో చాలామందికి సీఎం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఇంకా మౌనంగా ఉంటే అదే అంగీకారమవుతుందని భావించిన నేతలు మెల్లగా స్వరం పెంచారు. పాలేరు టికెట్‌ ఆశించిన తుమ్మల నాగేశ్వర్‌ రావు సుమారు వెయ్యి కార్లు, 2 వేల బైక్‌లతో ఆయన ఖమ్మం వెళ్లారు. ఆయనకు టికెట్‌ రాకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ మారి పాలేరు నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. 


కార్యకర్తలతో సమావేశం అనంతరం తుమ్మల వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని తేల్చారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసినట్టు చెప్పారు. నా జిల్లా కోసం, ఖమ్మం జిల్లా వాసుల రాజకీయ రుణం తీర్చుకోలేనిదన్నారు. గోదావరి జిల్లాలతో తన ప్రజల పాదాలు కడుగడానికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. అయితే తుమ్మల మాటల బట్టి చూస్తే ఆయన పాలేరు నుంచి కాకుండా ఖమ్మం నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయనతో పాటు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. జిల్లా మంత్రిగా అందరిని సమన్వయం చేయాల్సిన  అజేయ్‌కుమార్‌ పార్టీలో తమవర్గాన్నిఇబ్బందిపెట్టారని, తమకు  అన్యాయం చేశారని గతంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. తుమ్మల కూడా నేరుగా మంత్రిపై ఆరోపణలు చేయకున్నా ఖమ్మం నుంచే పోటీ చేసి ఆయనను ఓడించాలనే కృత నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన గతంలో జిల్లా టీడీపీ కార్యకర్తలతోనూ సమావేశమయ్యారు. ఆ సందర్భంలో వారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తుమ్మలను గెలిపించుకుంటామని శపథం చేసిన సంగతి తెలిసిందే. 


షర్మిల పార్టీ కూడా కాంగ్రెస్‌లో విలీనమౌతుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. అయితే ఒకవేళ అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకున్నా.. రెండు పార్టీల మధ్య అవగాహన కుదరవచ్చని కలసి పోటీ చేసే అవకాశం లేకపోలేదంటున్నారు. పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించడంతో తుమ్మలకు ఖమ్మం నియోజకవర్గాన్ని ఆఫర్‌ చేసి ఉండొచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని సవాల్‌ విసిరిన పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాలను కాంగ్రెస్‌ ఖాతాలో వేయించేందుకు కృషి చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వర్‌రావు, జలగం వెంకటరావులను పార్టీలోకి తీసుకొస్తే మెజారిటీ అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ సీటును కూడా గెలుచుకోవచ్చనే యోచనలో ఉన్నారు. దానికి అనుగుణంగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నది. 


స్టేషన్‌ ఘన్‌పూర్‌లోనూ బరిలో ఉంటానని ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. ఆరునూరైనా రాబోయే రోజుల్లో ప్రజా జీవితంలోనే ఉంటానని, భూమి కొని దుక్కిదున్ని, నారు నీరు పోసి, రాశి చేస్తే.. ఎవరో వచ్చి దానిపై కూర్చుకుంటానంటే ఊరుకుంటానా? అని పరోక్షంగా కడియం శ్రీహరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన కూడా పార్టీ మారొచ్చు అంటున్నారు. టికెట్లు రాని వారిని బుజ్జగించేందుకు బీఆర్‌ఎస్‌ కమిటీ వేసినా ఫలితం కనిపించడం లేదు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్‌ నుంచి తన తనయుడిని పోటీ చేయించడానికే మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ తనపై వేటు వేసినా అందుకు సిద్ధంగా ఉన్నట్టున్నారు. అట్లనే ఉప్పల్‌  ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలతో పాటు రామగుండంలో కందుల సంధ్యారాణి లతో పాటు టికెట్లు ఆశించి భంగపడిన వారు రానున్నరోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వాళ్లంతా తిరుగుబాటు జెండా ఎగురవేస్తే అధికారపార్టీకి 15-20 స్థానాల్లో సొంతపార్టీ నేతల నుంచే ముప్పు తప్పేలా లేదంటున్నారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ తనకు టికెట్‌ కేటాయించకపోవడంతో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన పౌరసత్వానికి సంబంధించిన వివాదం కొనసాగుతున్నందున పార్టీ అధిష్ఠానం ఆ నిర్ణయం తీసుకుని ఉంటుంది. అందుకే ఆయన సేవలను మరో రకంగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా ఆయనను నియమించింది. 


దీనికి తోడు వామపక్షాలు కూడా తాము బలంగా ఉన్నచోట బరిలో ఉంటామన్నారు. హుస్నాబాద్‌తో పాటు తమకు పట్టున్న ఐదు స్థానాల్లో పోటీ చేస్తామని  సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. సీపీఎం కూడా మిర్యాలగూడ, మునుగోడుతో పాటు ఖమ్మం జిల్లాలో పోటీ చేయవచ్చు. తమ బలాన్ని తక్కువ అంచనా వేసిన బీఆర్‌ఎస్‌ అధినేతకు తమ సత్తా ఏమిటో చూపెడుతామని వామపక్ష నేతలు ఇప్పటికే చెప్పారు.  దీంతో ఏడెనిమిది నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు గండిపడే ప్రమాదం ఉన్నది. అక్టోబర్‌ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్‌ రావొచ్చు. ఆ లోగా అధికార బీఆర్‌ఎస్‌, బీజేపీకీ వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీతో కమ్యూనిస్టులు, ఇతర చిన్న పార్టీలు అవగాహనకు రావొచ్చు. కలిసి పోటీ చేయవచ్చు. అదే జరిగితే బీఆర్‌ఎస్‌కు డేంజర్‌ బెల్స్‌ ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.

Labels: , , ,

బీఆర్‌ఎస్‌కు టాస్క్‌.. విపక్షాలకు టఫ్‌


 

Labels: , , , , ,

వివాదాస్పదం.. ఆ నేతల వైఖరి


 

Labels: , ,

నియామకాలపై అసత్య ప్రచారాలు..నిజాలు


 

Labels: , , ,

స్వరాష్ట్రంలో విద్యా వికాసం దిశగా..


 

Labels: , , ,

సకల జనుల సంక్షేమం...


 

Labels: , , ,

కర్ణాటకలో కుదిరింది... కానీ తెలంగాణలో కష్టమే


 

Labels: , ,

Tuesday 22 August 2023

అందరికంటే ముందే అభ్యర్థుల ప్రకటన ఉద్దేశం?


కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. అప్పటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఆగస్టు నెలలోనే అన్నిపార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తాయని ప్రచారం మొదలైంది. దానికి అనుగుణంగానే అన్నిపార్టీల కంటే ముందుగానే బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసే జాబితాను సీఎం కేసీఆర్‌ ఇవాళ  ఏడు స్థానాల్లో మాత్రమే మార్పులు చేశారు. నాలుగు స్థానాలు మినహా 119 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో పెద్దగా మార్పులేమీ లేవు. కేసీఆర్‌ ముందు నుంచీ చెబుతున్నట్టే దాదాపు సిట్టింగులందరికీ టికెట్‌ ఇచ్చారు. 


కేసీఆర్‌ కామారెడ్డి నుంచి ఎందుకు?


ప్రగతిభవన్‌లో సీఎం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థుల జాబితా ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. కేసీఆర్‌ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి బరిలోకి దిగడం విశేషం. ముచ్చటగా మూడో సారి అధికారం మాదేనని విశ్వాసంతో ఉన్న ముఖ్యమంత్రి ఈసారి రెండు స్థానాల్లో పోటీ చేయనుండటంపైనే చర్చ జరుగుతున్నది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 2018లో ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తప్పా మిగిలిన 8 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఈసారి అక్కడ కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ నుంచి త్రిముఖ పోరు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. సీఎం అక్కడి నుంచి నిలబడితే మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఆ ప్రభావం ఉంటుందనేది ఒక అభిప్రాయం కాగా, గజ్వేల్‌ సారుకు అంత అనుకూలంగా లేదనే మరో వాదన ఉన్నది. ముందుగా అధికారపార్టీ అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి కాంగ్రెస్‌, బీజేపీల తొలి జాబితా తర్వాత సీఎం కామారెడ్డి లేదా గజ్వేల్‌లలో ఏదో ఒక దానిపైనే ఫోకస్‌ చేసే అవకాశమూ లేకపోలేదు. 


జనగామ, నర్సాపూర్‌లో మార్పు తథ్యం!


ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే దుబ్బాక, స్టేషన్‌ఘన్‌పూర్‌, ఉప్పల్‌, వైరా, ఖానాపూర్‌, వేములవాడ, కామారెడ్డి, బోధ్‌, కోరుట్ల నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. ఇందులో కామారెడ్డి నుంచి సీఎం పోటీ చేస్తుండటం, కోరుట్ల నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు కుమారుడికే టికెట్‌ ఇచ్చారు. కాబట్టి ఈ రెండు స్థానాలపై పెద్దగా పేచీ ఏమీ లేదు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఎంపీగా నిలబెడుతారని ప్రచారం జరుగుతున్నది. వేములవాడ ఎమ్మెల్యేకు పౌరసత్వం అంశం అడ్డంకిగా మారిందంటున్నారు. ఇంకా ప్రకటించని నాలుగు స్థానాల్లో నాంపల్లి, గోషామహల్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టినా ఎంఐఎంకు పరోక్షంగా సహకరించవచ్చు. ఇక జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్‌లో సునీత లక్ష్మారెడ్డిలు బరిలోకి దిగడం దాదాపు ఖాయమంటున్నారు. టికెట్లు దక్కని వారు నిరాశపడవద్దని రాజకీయ జీవితమంటే ఎమ్మెల్యేగా పనిచేయడమే కాదని, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ ఇలా అనేక అవకాశాలు ఉంటాయని చెప్పారు. 


బుజ్జగిస్తూనే... హెచ్చరికలు

టికెట్లు దక్కని వారిని బుజ్జగిస్తూనే... పార్టీలో ధిక్కారస్వరం వినిపిస్తే సహించలేదని ఇవాళ కేటీఆర్‌ ట్వీట్‌ ను బట్టి తెలుస్తోంది. మంత్రి హరీశ్‌పై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన మేమంతా హరీశ్‌ వెంటే ఉంటామని చెప్పారు. దీంతో గీత దాటితే ఎంతటివారైనా వేటు తప్పదనే సంకేతాలు ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్ బీఆర్‌ఎస్‌ అధిష్ఠానంపై మైనంపల్లిపై వేటు అవకాశమూ లేకపోలేదంటున్నారు. టికెట్‌ ఇచ్చిన తర్వాత వేటు వేస్తారా? అనే ప్రశ్న తలెత్తవచ్చు. కానీ కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలను సహించేది లేదనట్టు బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం వైఖరిగా కనిపిస్తున్నది. 


 మంత్రివర్గ విస్తరణ?


ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆసరా ఫించన్లు పెంచుతామని చెప్పిన సీఎం మంత్రివర్గంలో ఒక ఖాళీని భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క స్థానాన్నే భర్తీ చేస్తారా? ఇంకా ఏమైనా మార్పులు చేస్తారా అన్నది చూడాలి. తాండూరు నుంచి తానే పోటీ చేస్తానని పార్టీపై ధిక్కార స్వరం వినిపించిన మాజీ మంత్రి మహేందర్‌ రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారని టాక్‌. ఎందుకంటే ఇవాళ జాబితా విడుదల చేసిన అనంతరం సీఎం పాత రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలోని 29 స్థానాల్లో  బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ గెలుస్తాయని చెప్పారు. మహేందర్‌రెడ్డిని తీసుకుంటే  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టు నిలుపుకోవచ్చని పార్టీ అధినేత అంచనా వేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్‌ అందరి కంటే ముందుగానే ఆట మొదలుపెట్టారు. తొలి జాబితా అనంతరం పార్టీలో మొదలైన అసంతృప్తి, నిరసనలు ఎన్ని రోజులు సాగుతాయి? ఎవరు ఎటు వైపు వెళ్తారు? పార్టీ విధేయులు ఎంత మంది? ఇలాంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్తులో ఎవరికి అవకాశాలు ఇవ్వాలి? ఎవరిని పూర్తిగా పక్కనపెట్టాలన్నది తేల్చేస్తారని అంటున్నారు.

Labels: , , ,

సర్వేలు పోయాయి.. సమీకరణాలు మారుతున్నాయి




అసెంబ్లీ టికెట్ల కోసం బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటిస్తారని మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల నియోజకవర్గాల వారీగా దాదాపు 100 సీట్లకు అభ్యర్థులు వీరే అని మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో రాడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే నువ్వా నేనా అన్న రీతిలో నేతలు బలప్రదర్శన మొదలుపెట్టారు. అసలు అధికారపార్టీలో ఏం జరుగుతున్నది? కచ్చితంగా మూడోసారి మాదే అధికారం అన్న నేతలు ఇప్పుడు రోడ్డు మీదికి ఎందుకు వస్తున్నారు? సొంతపార్టీ నేతల్లోనే చిచ్చు రాజేసే ఈ లీకులు ఎవరు ఇస్తున్నారు? కార్యకర్తలను, పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేసే కొందరు నేతల ప్రకటనలపై పార్టీ అధినేతల ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు కేసీఆర్‌ గతంలో ఏం చెప్పారు? ప్రస్తుతం ఆ పార్టీలో ఏం జరుగుతున్నదో ఒకసారి పరిశీలిస్తే...


సిట్టింగులందరికీ టికెట్లు గ్యారెంటీ, ఇంతకంటే మంచి అభ్యర్థులు మాకు దొరుకుతారా అని అప్పుడెప్పుడో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. అంతేకాదు సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని, వందకు పైగా స్థానాలు గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఆ సందర్భంలోనే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో తలదూర్చవద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు. నాటి మాటలన్నీ వమ్మయ్యాయి. ఈ ఐదారు నెలల కాలంలోనే అధికార 'కారు' పార్టీలో కల్లోలం మొదలైంది. స్టేషన్ ఘన్పూర్, జనగామ నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలే అధికార పార్టీ ఎమ్మెల్యేకు పోటీ అయ్యారు. ఇది ఇక్కడితోనే ఆగే అవకాశం లేదు. చాలా నియోజకవర్గాల్లో ఆశావహులు ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ పరిణామాలు చూస్తుంటే అధికారపార్టీలో సీఎం చెప్పిన సర్వేలు ప్రామాణికం కాదని స్పష్టమౌతున్నది. 




నాగార్జునసాగర్‌, రామగుండం,వరంగల్‌ తూర్పు, భూపాలపల్లి, తాండూరు, ఆలేరు, నకిరేకల్‌, హుజురాబాద్‌, పెద్దపల్లి, చెన్నూరు, కోరుట్ల ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 20 స్థానాలకు పైగా అధికారపార్టీ నేతలే బలప్రదర్శనకు దిగుతున్నారు. సర్వేల సంగతి పక్కకు పోయి మారుతున్న సమీకరణాలతో అధికారపార్టీ కార్యకర్తలు, శ్రేణులు అయోమయంలోకి గురవుతున్నారు. టికెట్ల కేటాయింపు తుది నిర్ణయం సీఎం కేసీఆర్‌దే అయినా మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులది కూడా కీలకపాత్రే అన్నది బహిరంగ రహస్యమే.  అందుకే కొన్నినియోజకవర్గాల్లో టికెట్‌ నాదంటే నాది అని కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారంటే ఈ ముగ్గురు నేతలలో వారికి ఎవరైనా హామీ ఇచ్చారా?  ఇవే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు జనగామలో అయితే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశాంతంగా ఉన్న తన నియోజకవర్గాన్ని కార్పొరేట్‌ పద్ధతిలో అస్థిరపరుస్తున్నారని ఆరోపించారు. తనను ఎదురుకోలేక తన ఇంట్లో చిచ్చు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏడ్చాడు.  ఏనాడూ జనగామ ప్రజలను ఆదుకోని వ్యక్తి ఇప్పుడు నియోజకవర్గంలో తనకే టికెట్‌ వచ్చిందని ఎలా ప్రచారం చేసుకుంటారని ప్రశ్నిస్తూ.. ఆయనపై ధ్వజమెత్తారు. ముత్తిరెడ్డి మాటలు చూస్తే కేసీఆర్‌పై తనకు నమ్మకం ఉన్నదని, ఆయన ఈ కుట్రలన్నీ చూస్తున్నారంటూ.. ఒకవేళ తనకు టికెట్‌ రాకపోతే ఏం జరుగుతుందో అని చెప్పకనే చెప్పారు. 


ఒక్కో నియోజకవర్గంలో నేతల బలప్రదర్శనతో టికెట్‌ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసే అవకాశం లేదని తేలిపోయింది. నాగార్జున సాగర్‌ నుంచి తానే పోటీ చేస్తాననని హీరో అల్లు అర్జున్‌ మామ, బీఆర్‌ఎస్‌ నేత కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో చంద్రశేఖర్‌రెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాల ప్రారంభోత్సవంలో అల్లు అర్జున్‌ పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంతో చంద్రశేఖర్‌రెడ్డి బలప్రదర్శన చేశారు. రెండు మూడు రోజుల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థుల జాబితా విడుదల అవుతుందని ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో ముత్తిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయా నియోజకవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో మారుతున్న సమీకరణాలతో అభ్యర్థుల ప్రకటనకు ముందే నాలుగైదు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు  టికెట్ల చిచ్చు రాజేయగా తీరా సమయానికి ఇంకా ఎంతమంది బైటపడుతారన్నది చూడాలి. ఇవాళ వీఎస్‌టీ-ఇందిరాపార్క్‌ స్టీల్‌ బ్రిడ్జ్‌ ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మీరు చూసిన అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే.. సినిమా ముందుంది అన్నారు. సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కానీ హ్యాట్రిక్‌ సంగతి ఏమో గాని కొన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న గందరగోళానికి తెరపడుతుందా? నేతల మధ్య సయోధ్య కుదురుతుందా? అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.

Labels: , ,