కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. అప్పటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఆగస్టు నెలలోనే అన్నిపార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తాయని ప్రచారం మొదలైంది. దానికి అనుగుణంగానే అన్నిపార్టీల కంటే ముందుగానే బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసే జాబితాను సీఎం కేసీఆర్ ఇవాళ ఏడు స్థానాల్లో మాత్రమే మార్పులు చేశారు. నాలుగు స్థానాలు మినహా 119 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో పెద్దగా మార్పులేమీ లేవు. కేసీఆర్ ముందు నుంచీ చెబుతున్నట్టే దాదాపు సిట్టింగులందరికీ టికెట్ ఇచ్చారు.
కేసీఆర్ కామారెడ్డి నుంచి ఎందుకు?
ప్రగతిభవన్‌లో సీఎం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థుల జాబితా ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి బరిలోకి దిగడం విశేషం. ముచ్చటగా మూడో సారి అధికారం మాదేనని విశ్వాసంతో ఉన్న ముఖ్యమంత్రి ఈసారి రెండు స్థానాల్లో పోటీ చేయనుండటంపైనే చర్చ జరుగుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2018లో ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తప్పా మిగిలిన 8 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఈసారి అక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నుంచి త్రిముఖ పోరు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. సీఎం అక్కడి నుంచి నిలబడితే మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఆ ప్రభావం ఉంటుందనేది ఒక అభిప్రాయం కాగా, గజ్వేల్ సారుకు అంత అనుకూలంగా లేదనే మరో వాదన ఉన్నది. ముందుగా అధికారపార్టీ అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి కాంగ్రెస్, బీజేపీల తొలి జాబితా తర్వాత సీఎం కామారెడ్డి లేదా గజ్వేల్‌లలో ఏదో ఒక దానిపైనే ఫోకస్ చేసే అవకాశమూ లేకపోలేదు.
జనగామ, నర్సాపూర్‌లో మార్పు తథ్యం!
ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే దుబ్బాక, స్టేషన్‌ఘన్‌పూర్, ఉప్పల్, వైరా, ఖానాపూర్, వేములవాడ, కామారెడ్డి, బోధ్, కోరుట్ల నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. ఇందులో కామారెడ్డి నుంచి సీఎం పోటీ చేస్తుండటం, కోరుట్ల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కుమారుడికే టికెట్ ఇచ్చారు. కాబట్టి ఈ రెండు స్థానాలపై పెద్దగా పేచీ ఏమీ లేదు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఎంపీగా నిలబెడుతారని ప్రచారం జరుగుతున్నది. వేములవాడ ఎమ్మెల్యేకు పౌరసత్వం అంశం అడ్డంకిగా మారిందంటున్నారు. ఇంకా ప్రకటించని నాలుగు స్థానాల్లో నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టినా ఎంఐఎంకు పరోక్షంగా సహకరించవచ్చు. ఇక జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్‌లో సునీత లక్ష్మారెడ్డిలు బరిలోకి దిగడం దాదాపు ఖాయమంటున్నారు. టికెట్లు దక్కని వారు నిరాశపడవద్దని రాజకీయ జీవితమంటే ఎమ్మెల్యేగా పనిచేయడమే కాదని, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ ఇలా అనేక అవకాశాలు ఉంటాయని చెప్పారు.
బుజ్జగిస్తూనే... హెచ్చరికలు
టికెట్లు దక్కని వారిని బుజ్జగిస్తూనే... పార్టీలో ధిక్కారస్వరం వినిపిస్తే సహించలేదని ఇవాళ కేటీఆర్ ట్వీట్ ను బట్టి తెలుస్తోంది. మంత్రి హరీశ్‌పై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన మేమంతా హరీశ్ వెంటే ఉంటామని చెప్పారు. దీంతో గీత దాటితే ఎంతటివారైనా వేటు తప్పదనే సంకేతాలు ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్ బీఆర్‌ఎస్ అధిష్ఠానంపై మైనంపల్లిపై వేటు అవకాశమూ లేకపోలేదంటున్నారు. టికెట్ ఇచ్చిన తర్వాత వేటు వేస్తారా? అనే ప్రశ్న తలెత్తవచ్చు. కానీ కేసీఆర్ కుటుంబంపై విమర్శలను సహించేది లేదనట్టు బీఆర్‌ఎస్ అధిష్ఠానం వైఖరిగా కనిపిస్తున్నది.
మంత్రివర్గ విస్తరణ?
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆసరా ఫించన్లు పెంచుతామని చెప్పిన సీఎం మంత్రివర్గంలో ఒక ఖాళీని భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క స్థానాన్నే భర్తీ చేస్తారా? ఇంకా ఏమైనా మార్పులు చేస్తారా అన్నది చూడాలి. తాండూరు నుంచి తానే పోటీ చేస్తానని పార్టీపై ధిక్కార స్వరం వినిపించిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారని టాక్. ఎందుకంటే ఇవాళ జాబితా విడుదల చేసిన అనంతరం సీఎం పాత రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలోని 29 స్థానాల్లో బీఆర్‌ఎస్, మజ్లిస్ గెలుస్తాయని చెప్పారు. మహేందర్‌రెడ్డిని తీసుకుంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టు నిలుపుకోవచ్చని పార్టీ అధినేత అంచనా వేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ అందరి కంటే ముందుగానే ఆట మొదలుపెట్టారు. తొలి జాబితా అనంతరం పార్టీలో మొదలైన అసంతృప్తి, నిరసనలు ఎన్ని రోజులు సాగుతాయి? ఎవరు ఎటు వైపు వెళ్తారు? పార్టీ విధేయులు ఎంత మంది? ఇలాంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్తులో ఎవరికి అవకాశాలు ఇవ్వాలి? ఎవరిని పూర్తిగా పక్కనపెట్టాలన్నది తేల్చేస్తారని అంటున్నారు.
No comments:
Post a Comment