Tuesday 7 December 2021

ముందస్తుగానే కండువలు మారుస్తున్నరు


రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీనే అని ప్రజలు భావిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు. సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇప్పటికీ 20 నుంచి 30 స్థానాల్లో బలంగా ఉన్నది. కానీ ఆ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాలే గుదిబండగా మారాయి. అందుకే ఉద్యమ కాలంలో కేసీఆర్ తో కలిసి సుదీర్ఘ కాలం పనిచేసిన వారు కూడా కాంగ్రెస్ ను కాదని కాషాయ కండువా కప్పుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. దుబ్బాక, నాగార్జున సాగర్, జీహెచ్ఎంసీ మొదలు హుజురాబాద్ ఉప ఎన్నిక వరకు వచ్చే సరికి ఆ పార్టీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. హుజురాబాద్ లో అయితే మూడు వేల ఓట్లకే పరిమితం అయి అధికార పార్టీ ఓటమి భారం కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేరింది. 

త్వరలో వేములవాడ, మునుగోడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావొచ్చు అని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ దుబ్బాక లో స్వల్ప మెజారిటీ తో గట్టెక్కింది. నాగార్జున సాగర్ ఉప ఉన్నికల్లో ఉనికి కూడా చాటలేకపోయింది. కానీ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. ఆ ఫలిత ప్రభావాన్ని తగ్గించడానికి ముఖ్యమంత్రి రెండు మూడు ప్రెస్ మీట్లు పెట్టినా అధికార పార్టీలోని అసంతృప్త నేతలు, కొందరు ఉద్యమకారులు బీజేపీ లో చేరుతున్నారు. దుబ్బాక లో బాగానే ఓట్లు సంపాదించినా, నాగార్జున సాగర్ లో రెండో స్థానంలో నిలిచినా అధికార పార్టీకి ప్రత్యామ్నాయం మనమే అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వాళ్ళ కార్యకర్తలకు నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. అందుకే కాంగ్రెస్ నేతలు టీఆర్ ఎస్ లో, టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతున్నారు.

ధ్యానం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య మాటల యుద్ధం గ్రామ స్థాయిలో మొదలు పార్లమెంటు సమావేశాల్లోనూ నడుస్తున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికీ కలిసి పనిచేయడం లేదు. ఒక్క తాటి మీదికి రావడం లేదు. కానీ బీజేపీ మాత్రం రాజకీయంగా గుర్తింపు ఉన్న నేతలను, ఉద్యమం లో పనిచేసిన ఫెమిలియర్ వ్యక్తులను పార్టీలోకి తీసుకువచ్చే పని పెట్టుకున్నది. ఈ నెల 13వ తేదీ తో టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు పూర్తి అవుతాయి. ఇగ పాలనను పరుగులు పెట్టిస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్నా ఆచరణలో అది కనిపించడం లేదు. అనేక సమస్యలు, హామీలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఎన్నికల కు ఇంకా రెండేండ్ల సమయం మాత్రమే ఉన్నది. అందుకే రాజకీయ ఆశావహులు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.  ఆ మధ్య కేసీఆర్ ముందస్తు ఎన్నికలు వెళ్ళము అన్నారు. కానీ మొదటిసారి ఆరు నెలల ముందుగానే ఎన్నికల కు పోయినట్టు వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే కేసీఆర్ వెళ్లొచ్చు అనే అంచనాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. అందుకే రాష్ట్రంలో వివిధపార్టీల నేతల ముందస్తుగా కండువలు మార్చుతున్నారు.

Labels: , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home