Monday, 1 August 2022

మునుగోడు ఉప ఎన్నిక ఆ మూడు పార్టీల‌కూ కీల‌క‌మే

తెలంగాణ రాష్ట్రంలో మ‌రో ఉప ఎన్నిక రానున్న‌దా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తున్న‌ది. మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి కాషాయ కండువా క‌ప్పుకోవ‌డం దాదాపు ఖ‌రారైంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న చేరిక‌తో న‌ల్గొండ జిల్లాలో బీజేపీ బ‌లోపేతమ‌వుతుంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీకి న‌ల్గొండ జిల్లాలో మొద‌టి నుంచి చాలా ప‌ట్టున్న‌ది. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిప‌త్యం సాధించ‌బోయే జిల్లాల జాబితాలో అదే ప్ర‌థ‌మ స్థానంలో ఉన్న‌ది. అంతేకాదు ఒక‌వేళ రాజ‌గోపాల్‌రెడ్డి పార్టీ వీడితే ఆ పార్టీ ప్ర‌చార క‌మిటీ కీల‌క బాధ్య‌త‌లు తీసుకున్న‌కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి కొంత ఇబ్బంది త‌ప్ప‌దు. రేవంత్‌రెడ్డి రాష్ట్ర‌ పీసీసీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ బాహాటంగానే వ్య‌తిరేకించిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఇటీవ‌ల కాలంలో అధికార‌పార్టీ అసంతృప్తులు రేవంత్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారం కాంగ్రెస్ పార్టీకి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. 

అందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయ‌న పార్టీ వీడ‌కుండా చూసేందుకు ఒక‌వైపు బుజ్జ‌గింపు ప్ర‌య‌త్నాలు చేస్తూనే... ఒక‌వేళ ఉప ఎన్నిక అనివార్యమైతే ఆ స్థానాన్నినిల‌బెట్టుకోవ‌డానికి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ది. మ‌రోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టికే ఆ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి సారించింది. 2014 లో ఆ స్థానాన్ని ద‌క్కించుకున్న టీఆర్ఎస్ 2018 మాత్రం కోల్పోయింది. అందుకే ఈసారి ఉప ఎన్నిక వ‌స్తే నిల‌బెట్టుకోవాల‌ని య‌త్నిస్తున్న‌ది. ఇందుకోసం స‌ర్వేలు కూడా చేప‌ట్టింద‌ని స‌మాచారం. ఆ స్థానంలో పోటీ చేయ‌డానికి ఆశావ‌హుల జాబితా కూడా పెద్ద‌గానే ఉన్న‌ది. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నేతలు కర్నె ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి త‌దిత‌ర నేత‌ల‌ పేర్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారంలో ఉన్నాయి. 

అనారోగ్యంతో క‌న్నుమూసిన ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రాతినిధ్యం వ‌హించిన నాగార్జుసాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచిన బీజేపీ ఈసారి మునుగోడులో స‌త్తా చాటాల‌ని భావిస్తున్న‌ది. దుబ్బాక‌, హుజురాబాద్‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు సాధించి టీఆర్ఎస్‌కు తాము ప్ర‌త్యామ్నాయం అని చెబుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో మునుగోడు లో విజ‌యం సాధించి వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే స‌మ‌ర శంఖం పూరించాల‌ని క‌మ‌ళ‌నాథులు ఉవ్విళ్లూరుతున్నారు. హుజురాబాద్‌, దుబ్బాక‌లో ఓట్ల వేట‌లో చ‌తికిల ప‌డిన కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఉప ఎన్నిక స‌వాల్ కాబోతున్న‌ది. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక త‌ప్ప‌నిస‌రి అయితే త్రిముఖ పోరు త‌ప్పేలా లేదు. రాజ‌గోపాల్‌రెడ్డి పార్టీ మారుతారు అని ప్ర‌చారం జ‌రుగుతున్న నాటి నుంచే మునుగోడులో రాజ‌కీయాలు వేడెక్కాయి. మ‌రికొన్ని రోజుల్లో దీనికి సంబంధించి మ‌రింత స‌మాచారం రానున్న‌ది. ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారం చేప‌ట్టేది తామేన‌ని ప‌దే ప‌దే చెబుతున్న టీఆర్ఎస్‌కు, అధికార పార్టీకి ప్ర‌త్యామ్నాయం మేమే అనే బీజేపీకి, న‌ల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచు కోట అంటున్న ఆ పార్టీ నేత‌ల‌కు ఈ ఉప ఎన్నిక కీల‌కం కానున్న‌ది.

0 comments:

Post a Comment