కమలం గూటికి కోమటిరెడ్డి
అందరూ అనుకున్నదే జరిగింది. రాజగోపాల్ రెడ్డి ముందునుంచీ చెబుతున్నదే ఇవాళ కుండబద్దలు కొట్టారు. ఆయన ఏపార్టీ లో చేరబోతున్నారు అనేదానిపై క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి కమలం కండువా కప్పుకోనున్నట్టు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననని, ప్రజల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు, కాబట్టి మునుగోడు నియోజకవర్గ ప్రజలు తన వెంట నడవాలని ఆయన కోరారు. దీంతో రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక ఖాయమైంది.
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నానని, త్వరలో స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నా రాజీనామాతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా నిధులు ఇవ్వాలన్నారు. ప్రజలు ఇతర పార్టీలను గెలిపించడం తప్పా? ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు.
నా రాజీనామాతో నా ప్రజలకు మేలు కలుగుతుందని, మునుగోడు నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని, నా నిర్ణయం వల్ల బాధ కలిగితే క్షమించండని నా నిర్ణయాన్ని స్వాగతించి నాతో రావాలని కోరుతున్నాను అన్నారు. మీరు ఏ పార్టీలో చేరబోతున్నారనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ..రాష్ట్రంలో అరాచక పాలనను అంతం చేయడం మోదీ, అమిత్ షాతోనే సాధ్యమన్నారు.
ఇక మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమని స్పష్టమైంది. రాజగోపాల్‌రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఉప ఎన్నికలు జరిగే చోటే అభివృధ్ధి జరుగుతున్నదన్నారు. హుజురాబాద్‌లో వలె మునుగోడులో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం, అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని భావిస్తున్నారు. అయితే అక్కడ సంక్షేమ పథకాల ప్రకటనలు, శంకుస్థాపనలు, రహదారుల నిర్మాణమే కాదు పార్టీల పరంగా భారీగానే ఖర్చుపెట్టారు. హుజురాబాద్ ఉప ఎన్నిక దేశంలోనే అత్యధిక ఖర్చుతో జరిగిన ఎన్నిక అనే చర్చ జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీటికి బలంలో చేకూర్చేలా ఉద్యోగుల జీతాలు నెలనెలా ఆలస్యమౌతున్నాయని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఇన్ని పరిణామాల మధ్య జరగబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీలు గెలుస్తాయా? ప్రజలు గెలుస్తాయా? చూడాలి.
Comments
Post a Comment