ఇప్పుడు అందరి దృష్టి 2024 సార్వత్రిక ఎన్నికలపైనే ఉన్నది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలన్నీ వచ్చే ఎన్నికల కోసం కార్యాచరణ రూపొందించుకుని ముందుకు కదులుతున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలు బీజేపీపై దూకుడు పెంచినట్టు కనిపిస్తున్నది.
బీహార్‌లో జేడీయూ అధినేత బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత ప్రధాని పదవిపై ఆశ లేదంటూనే హస్తినవైపు చూస్తున్నారు. 40 లోక్‌సభ స్థానాలున్న ఆ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే కేజ్రీవాల్, అఖిలేశ్, శరద్ పవార్, వామపక్ష నేతలను కలిసిన ఆయన కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది సమస్య కాదని, బీజేపీని కట్టడి చేయడమే తక్షణ కర్తవ్యమని అంటున్నారు.
ఇక కేసీఆర్ చాలా కాలం నుంచి కమలం పార్టీ ని టార్గెట్ చేశారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని కోరుతున్నారు. ఆయన కూడా పలు ప్రాంతీయ పార్టీల అధినేతలతో ఇప్పటికే అనేకసార్లు సమావేశమై జాతీయ రాజకీయాల గురించి చర్చలు జరిపారు. బీజేపీ యేతర, కాంగ్రెసేతర కూటమి కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.
కేజ్రీవాల్ టార్గెట్ హస్తినే. అందుకే ఆయన ముందుగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆప్ ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్నది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకుంటే పార్టీకి జాతీయ హోదా వస్తుందని అప్పుడు దేశమంతా పార్టీని సులువుగా విస్తరించవచ్చని అనుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీని కోలుకోలని విధంగా దెబ్బతీసిన బీజేపీ ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నది. తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, బీహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, యూపీలో ఎస్పీ, బీఎస్పీ, ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్, ఒడిషాలో బీజూ జనతాదళ్, కర్ణాటకలో జేడీఎస్ ల రూపంలో బీజేపీకి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గట్టి పోటీ తప్పదు.
వరుస వైఫల్యాలతో, నేతల నిష్క్రమణలతో బలహీనపడిన కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర పేరుతో చేపడుతున్న కార్యక్రమంతో మళ్లీ పార్టీకి పూర్వవైభవం వస్తుందని అనుకుంటున్నది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్లో తప్పా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలో లేదు. ఈ ఏడాదిలో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి సార్వత్రిక ఎన్నికల నాటికి కార్యకర్తలను సమాయత్తం చేయాలని అనుకుంటున్నది.
ప్రాంతీయ పార్టీలు మాత్రం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఉన్న రాజకీయ శూన్యతను సొమ్ము చేసుకోవాలనుకుంటున్నాయి. అందుకే ఆయా పార్టీల అధినేతలు ఇప్పటికే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఒకవేళ వాళ్లంతా ఏకతాటిపైకి వచ్చి బీజేపీని కట్టడి చేయగలిగితే కేంద్రంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలకు ఆ బలం ఉన్నదా? అవి ఆ పని చేయగలుగుతాయా? అనే రాజకీయ చర్చ కొంతకాలంగా జరుగుతున్నది.
No comments:
Post a Comment