బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను 2023 జూలై 31న మంత్రివర్గం సిఫార్సు చేసింది. వీళ్లద్దరూ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని, ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనలేదన్న వంటి సాంకేతిక కారణాలతో గవర్నర్ తమిళిసై వీరిద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. రాజ్యాంగంలోని 171(3), 171(5) అధికరణాల్లో నిర్దేశించిన ప్రకారం సాహిత్యం, వైజ్ఞానిక శాస్త్రం, కళలు, సహకార ఉద్యమం, సమాజ సేవ రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యం లేదా ఆచరణాత్మక అనుభవం వీళ్లిద్దరికిలేదని అందుకే వారి అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తున్నామని గవర్నర్ 2023 సెప్టెంబర్ 25 ప్రకటించారు.
రాజ్యాంగంలో సెక్షన్ 171(5) లో ప్రస్తావించిన రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యం, అనుభవం కలిగి, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వారు రాష్ట్రంలో చాలామంది ఉన్నారని, వారిని ఎమ్మెల్సీలుగా నియమించవచ్చని ఆ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు. అంతేగాకుండా రాజ్యాంగంలోని సెక్షన్ 171 (5) కింద వారికి కల్పించిన ప్రయోజనాలు కూడా నీరుగారిపోతాయన్నారు. అర్హుల అవకాశాలను లాక్కున్నట్టు అవుతుందని, ఇది రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు విరుద్ధమన్నారు. ఇకపై సెక్షన్ 171 (5) కింద నామినేట్ చేసే పదవుల కోసం రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులను పరిగణనలోకి తీసుకోవద్దని ముఖ్యమంత్రి, మంత్రివర్గానికి విజ్ఞప్తి చేశారు.
గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్,నత్యనారాయణలు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసుపై వాదోపవాదాలు జరిగాయి. ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్నది.కేసు విచరణలో ఉండగానే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్‌ను, మీర్ అమీర్ అలీఖాన్‌లను ఎంపిక చేసింది. తమ కేసు తేలేవరకు కొత్తగా నియమితులైన ఎమ్మెల్సీల నియామకాలపై స్టే విధించాలని కోరారు. ఈ మేరకు తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా నియమితులైన విషయం విదితమే.
నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన అభ్యర్థుల అర్హతలపై గవర్నర్ లేవనెత్తిన అంశాలే ప్రస్తుతం ప్రొఫెసర్ కోదండరామ్‌కు వర్తిస్తాయని ఆ పార్టీ నేతల వాదన. ఎందుకంటే రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని తెలిపిన గవర్నర్ మరి కోదండరామ్ అయితే ఏకంగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కూడా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని గుర్తుచేస్తున్నారు. నాటి ప్రభుత్వ సిఫార్సులను పక్కనపెట్టడానికి గవర్నర్ లేవనెత్తిన అంశాలు ప్రస్తుతం కొత్తగా నియామకమైన ఎమ్మెల్సీలకు ప్రతిబంధకంగా మారాయా? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
No comments:
Post a Comment