బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో గెలిచిన సీట్లు నిలబెట్టుకోగలదా?
బీజేపీని ఆపగలిగే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉన్నదని, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు గెలవడం అనుమానమే అన్న మమతా బెనర్జీ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఎందుకు కట్టబెట్టారు? బీఆర్‌ఎస్ ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎందుకు ఆదరించలేదు? బీఆర్‌ఎస్ పాలన దేశానికి దిక్సూచీ అని ప్రచారం చేసుకున్నా ప్రజలు ఎందుకు పట్టించుకోలేదు? ఇత్యాది విషయాలపై ఆ పార్టీ సమీక్ష చేసుకోవాలి. ఇంట గెలిచి రచ్చ గెలువాలని అంటారు. టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారి పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే సొంత రాష్ట్రంలోనే అధికారం కోల్పోయిన విషయంపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బలం, బలహీనతల గురించి మాట్లాడితే బాగుంటుంది.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. జార్ఖండ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్నది. అలాంటి పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాదని కేటీఆర్ ఎలా చెబుతున్నారు? రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు స్థానిక అంశాలతో ముడిపడి ఉంటాయి. కానీ లోక్‌సభ ఎన్నికలు జాతీయ అంశాలతో పాటు కూటములపైనే ఆధారపడి ఉంటాయి. అంతెందుకు ఆర్జేడీ, డీఎంకే, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్‌వర్గం), వాపమక్షాలు ఇప్పటికీ కాంగ్రెస్‌తోనే ఉన్నాయి. ఈ విషయాన్ని కేటీఆర్ మరిచిపోయారా? మమతా బెనర్జీ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నాని అన్న ఆయన గత లోక్‌సభ ఎన్నికల్లో గెలుచుకున్న 9 సీట్లను తిరిగి నిలబెట్టుకుంటుందా? అన్నది కూడా చూడాలి.
Comments
Post a Comment