తెలంగాణలో 2014లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఉద్యమకారులు, తెలంగాణ తెచ్చిన పార్టీ, ఇచ్చిన పార్టీ అనే అంశాల ప్రాతిపదికన జరిగాయి. 2018లో అధికారపార్టీ సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, రైతు బీమా ప్రచారాస్త్రాలుగా.. ప్రభుత్వ వైఫల్యాలే అజెండా మహాకూటమి బరిలోకి దిగాయి. కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికలు గత రెండుసార్ల కంటే భిన్నంగా జరగబోతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీలోసిట్టింగులందరికీ తిరిగి సీట్లు ఇస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు. అయితే 20-30 మంది సిట్టింగులను మారిస్తేనే బీఆర్‌ఎస్ వంద సీట్లకు చేరువ అవుతుందని ఆ మధ్య మంత్రి ఎర్రబెల్లి చేసిన కామెంట్లు సంచలనం సృష్టించాయి. అవి ఆయన యాధృచ్ఛికంగా చేశారా? లేక పార్టీ అధిష్ఠానం ఆలోచనా అనేది తెలియదు. కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీల తరఫున పోటీ చేయాలని భావిస్తున్న సినీ ప్రముఖుల జాబితా రోజురోజుకూ పెరుగుతున్నది. ఈసారి సార్వత్రిక ఎన్నికలకు అన్నిపార్టీలు సినీ సొబగులు అద్దనున్నాయి.
ఇదే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
దీనికి కారణం లేకపోలేదు. గత రెండు పర్యాయాలు అధికారపార్టీని ప్రజలు ఆదరించారు. కానీ ఈసారి ఆ పరిస్థితి తిరిగి పునరావృతమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్‌ఎస్, ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఎన్నికల్లో గెలువాల్సిందేనని బీజేపీ అధిష్ఠానాలు కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. దీంతో సిట్టింగ్‌లతో పాటు కొత్తగా టికెట్ ఆశిస్తున్న సినీ ప్రముఖులు కూడా తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఆయా పార్టీల అధినేతలను, ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. సినీ నటులు ప్రకాశ్‌రాజ్, విజయశాంతి, బాబుమోహన్, నితిన్ జీవిత, దర్శకుడు ఎన్. శంకర్, నిర్మాతలు దిల్‌రాజు, తాళ్లూరి రామ్, బిగ్‌బాస్ ఫేం కత్తికార్తికలు టికెట్ ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. ఈసారి ఎన్నికల బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీలు కూడా వీరికి టికెట్లు ఇచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం.
బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న ప్రకాశ్ రాజ్ గత లోక్‌సభ ఎన్నికల్లో సెంట్రల్ బెంగళూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఏ పార్టీలో చేరకున్నా తన వాదనలు వినిపిస్తున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమి ప్రయత్నాల్లో భాగంగా ఆ మధ్య మహారాష్ట్రకు వెళ్లారు. అప్పటి సీఎం ఉద్ధవ్‌ఠాక్రే తో పాటు, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కలిశారు. ఆ సమయంలో సీఎం వెంట ప్రకాశ్‌రాజ్ ఉండటం చర్చనీయాంశమైంది. టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత కేసీఆర్ వివిధ రాష్ట్రాలకు అధ్యక్షులను ప్రకటించారు. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తో కలిసి పోటీచేస్తామని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రకాశ్‌రాజ్ కర్ణాటకలో ఏదో అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? లేక ఎంపీగా పోటీ చేస్తారా? అన్నది త్వరలో తేలనున్నది. నిర్మాత దిల్‌రాజు నిజామాబాద్ జిల్లా నర్సింగ్‌పల్లి వాసి. ఆయన బీఆర్‌ఎస్ నుంచి ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ అధికార పార్టీ అసంతృప్తులతో పాటు సినీ ప్రముఖులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పుడెప్పుడో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు హీరో నితిన్ ఆయనతో సమావేశమయ్యారు. దీంతో ఆయన ఆపార్టీ నుంచి ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా బరిలో నిలుస్తారనే చర్చ కొంతకాలంగా జరుగుతున్నది. ఇక విజయశాంతి బీజేపీ మహిళా విభాగంలో జాతీయస్థాయి నాయకురాలిగా పనిచేశారు. ఆమె టీఆర్‌ఎస్ తరఫున 2009లో మెదక్ ఎంపీగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆమె 2014లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బాబు మోహన్ కూడా 2014లో టీఆర్‌ఎస్ నుంచి ఆందోల్ లో పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో ఆయను టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ అధిష్ఠానంపై తీవ్ర విమర్శలు చేసి బీజేపీలోకి వెళ్లారు. తిరిగి ఆయన ఆందోల్ నుంచే పోటీ చేయనున్నారు. దాదాపు అన్నిపార్టీలు తిరిగి వచ్చిన జీవిత ఈసారి బీజేపీ తరఫున జహీరాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన సినీ నిర్మాత తాళ్లూరి రామ్ చుట్టాల అబ్బాయి, నేలటికెట్, డిస్కోరాజా వంటి సినిమాలు నిర్మించారు. ఆయన జనసేన తరఫున ఖమ్మం పార్లమెంటు లేదా అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో ఉన్నారు. దర్శకుడు ఎన్. శంకర్ 2014లో కాంగ్రెస్‌పార్టీ నుంచి ఆయనకు మిర్యాలగూడ నుంచి అవకాశం వచ్చినా వదులుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆయన ఈసారి బీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. బిగ్‌బాస్ ఫేం, టీవీ యాంకర్ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి ఆమె అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారు. జైబోలో తెలంగాణ సినిమాలో నటించిన రోషన్ బాలు గత ఎన్నికల సమయంలో ముషీరాబాద్ టికెట్ ఆశించినా దక్కలేదు. ఈసారి మరోసారి అదే నియోజకవర్గం నుంచి అధికార పార్టీ తరఫున టికెట్ దక్కించుకోవడానికి యత్నిస్తున్నారు.
No comments:
Post a Comment