Monday 29 April 2024

కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చిన ఇండోర్‌ అభ్యర్థి

 కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఆ పార్టీ అధిష్ఠానానికి షాక్‌ల మీద షాక్‌ ఇస్తున్నారు. మొన్న సూరత్‌ ఏకగ్రీవ ఎన్నిక ఉదంతాన్ని మరిచిపోకముందే మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో హస్తంపార్టీ అభ్యర్థి అక్షయ్‌ కాంతి బమ్‌ అనూహ్యంగా పోటీ నుంచి వైదొలిగారు. 


ఇండోర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి నాలుగో దశలో భాగంగా మే13న పోలింగ్‌ జరగనున్నది. నామినేషన్ల  విత్‌ డ్రాకు నేడే (ఏప్రిల్ 29) చివరి రోజు. ఈ క్రమంలోనే సోమవారం పొద్దున అక్షయ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్‌ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. ఆ వెంటనే బీజేపీలో చేరారు.   ఆ సమయంలో ఆయన వెంట బీజేపీ ఎమ్మెల్యే రమేశ్‌ మెండోలా ఉండటం గమనార్హం. 


అక్షయ్‌ బీజేపీలో చేరిన విషయాన్ని ఆ రాష్ట్ర మంత్రి కైలాశ్‌ విజయ్‌ వర్గీయ ధృవీకరించారు. ఆయనతో ఒకే కారులో వెళ్తున్న ఫొటోను షేర్‌ చేసి పార్టీలోకి స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇండోర్‌ నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్‌ ఎంపీ శంకర్‌ లల్వానీ బరిలో ఉన్నారు. ఇక్కడ బీఎస్పీతో పాటు స్వతంత్రులు కొంతమంది పోటీ చేస్తున్నారు. 


ఎన్నికల వేళ బీజేపీ చేస్తున్న రాజకీయాలపై విమర్శలు వస్తున్నాయి. ప్రజా క్షేత్రంలో తేల్చుకోలేక ఇలాంటి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికలే లేకుండా ఏకగ్రీవం ద్వారా అంతటా బీజేపీ హవా ఉన్నదనే ప్రచారం కల్పించడానికే ఇలాంటివి చేస్తున్నదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


No comments:

Post a Comment