తెలంగాణలో ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం కూడా లేదు. అప్పుడే ప్రధాన పార్టీలలో సార్వత్రిక ఎన్నిక సందడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటిస్తామని ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు కేసీఆర్ కూడా సిట్టింగులందరికీ తిరిగి టికెట్లు ఖాయమన్నారు. అయితే రాష్ట్రంలో కొన్నిస్థానాలప ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే అన్నిపార్టీలు ఒకటిరెండుసార్లు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. సర్వేలు చేయిస్తూ అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. ఖమ్మం జిల్లాలో పొంగులేటి బీఆర్‌ఎస్‌ను సవాల్ చేస్తుండగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్, ఈటల రాజేందర్‌లకు చెక్ పనిలో బీఆర్‌ఎస్ ఉన్నది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికారపార్టీ అన్ని అస్త్రాలను ప్రయోగించినా ఈటలపై సానుభూతి పనిచేసింది. గతంలో కంటే మెజారిటీ తగ్గినా.. వచ్చే ఎన్నికల్లో ఈటల గెలుపు అంత ఈజీ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారపార్టీ కౌశిక్‌ను హుజురాబాద్‌లో పనిచేసుకోవాలని, ఎనిమిదినెలలు నియోజకవర్గంలోనే విస్తృతంగా పర్యటించాలని సూచించింది.
అయితే ఈటల రాజేందర్‌ను కౌశిక్ కట్టడి చేయగలరా? కేసీఆర్ అంచనాలను ఆయన అందుకుంటారా? అక్కడ కాంగ్రెస్ పార్టీ బరిలో ఉంటుండటంతో ఈ ముక్కోణపు పోటీలో ఎవరు లాభపడుతారు? ఎవరు నష్టపోతారనే చర్చ జరుగుతున్నది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మరో విద్యార్థి నేత బల్మూరి వెంకట్ పోటీలో ఉండొచ్చు. కాబట్టి కౌశిక్‌రెడ్డి దూకుడు వ్యవహారశైలి బీఆర్‌ఎస్‌ను గెలుపు బాటలో తీసుకెళ్తుందా? అంటే అంత తేలిక కాదంంటున్నారు. ఈటల రాజేందర్ ఉద్యమకారుడిగానే అధికారపార్టీ నేతలతో పాటు నియోజకవర్గ ప్రజలు కూడా భావిస్తుంటారు. ఉద్యమకాలంలో కౌశిక్ వ్యవహరించిన తీరు ఇప్పటికీ చర్చనీయాంశమే. రాజేందర్ కూడా ఉప ఎన్నిక ప్రచారంలో అధికారపార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై విమర్శలు చేయకుండా కౌశిక్‌ను, మంత్రి హరీశ్‌రావుపై ధ్వజమెత్తిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఎందుకంటే విద్యార్థి ఉద్యమనేతగా గెల్లు ఎంపికపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. పైగా ఉద్యమకారుడికి అవకాశం దక్కిందని నిత్యం కేసీఆర్‌పై ఒంటికాలిపై లేచిన వాళ్లు కూడా గెల్లుకు టికెట్ దక్కడాన్ని స్వాగతించారు. అయితే నియోజకవర్గంలో రాజకీయంగా ప్రాబల్యవర్గంగా ఉన్న సామాజిక సమీకరణాల దృష్ట్యా కౌశిక్‌కు ఈసారి ఈటలపై పోటీలో నిలబెట్టాలని పార్టీ అధిష్టానం ప్రాథమికంగా నిర్ణయించి ఉండొచ్చు. కానీ అది ఈటలకే మేలు చేస్తుందనే వాదనలు లేకపోలేదు.
గెల్లుకు ఈటల, కౌశిక్ వలె అంగబలం, అర్థబలం లేకపోవచ్చు.కానీ నియోజకవర్గంలో ఆయనపై సానుభూతి వ్యక్తమౌతున్నది. బీఆర్‌ఎస్ తరఫున కౌశిక్ కంటే గెల్లుకే గ్రౌండ్ రిపోర్ట్ అనుకూలంగా ఉన్నదట. ఓ సీనియర్ జర్నలిస్టు దీనిపై స్పందిస్తూ.. గెల్లు కింది నుంచి ఎదిగివచ్చిన బలహీనవర్గాలకు చెందిన నాయకుడు. ఆయన మరో అవకాశం ఇస్తే హుజురాబాద్‌లో అధికారపార్టీకి గెలుపు ఖాయమని కచ్చితంగా చెప్పకున్నా... సానుకూల అంశాలు అనేకం ఉన్నాయి అంటున్నారు. ఎన్నికలకు ఇంకో ఎనిమిది నెలల సమయం ఉన్నది. కాబట్టి అప్పటివరకు పార్టీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడే అంచనాకు రావడం సరికాదంటున్నారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఆయన టికెట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.