Friday 9 September 2022

మునుగోడులో ముందంజ‌లో ఉన్న‌ది ఎవ‌రు?



రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, శాస‌న స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌డంతో రాష్ట్ర రాజ‌కీయ మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో ఆ పార్టీ త‌ర‌ఫున ఆయ‌న ఇప్ప‌టికే ప్ర‌చారం మొద‌లుపెట్టారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ దివంగ‌త పాల్వాయి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి కూతురు స్ర‌వంతిని అభ్య‌ర్థిగా అధికారికంగా ప్ర‌క‌టించింది. అలాగే రాజ‌గోపాల్ రాజీనామా ఆమోదం పొందిన త‌ర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆ స్థానంపై దృష్టి సారించింది. ప్ర‌జాదీవెన స‌భ పేరుతో ఇప్ప‌టికే ఆ పార్టీ అక్క‌డ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది. ఆ రోజే అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తార‌ని అనుకున్నారు. కానీ కేసీఆర్ ఆ జోలికి పోలేదు. ఎందుకంటే ఆ సీటు ఆశిస్తున్న ఆశావ‌హుల జాబితా ఎక్కువ‌గా ఉండ‌టంతో ఆ స‌భ‌లో అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న జోలికి వెళ్ల‌లేదు. 


బీజేపీ, కాంగ్రెస్ పార్టీల  అభ్య‌ర్థులు ఖ‌రారు కావ‌డంతో ఇక టీఆర్ఎస్ ఈ రెండు మూడు రోజుల్లో అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌వ‌చ్చు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి పేరునే దాదాపుగా ఖ‌రారు అయ్యింది అంటున్నారు.  ఇప్ప‌టికే సీపీఐ, సీపీఎం పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టిన అధికార పార్టీ అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న త‌ర్వాత ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేయ‌నున్న‌ది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా అనంత‌రం ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అధికార‌పార్టీకి కొంత అనుకూలంగా ఉన్న‌ద‌ని వివిధ స‌ర్వేలు వెల్ల‌డించాయి. అయితే మునుగోడులో స‌భ పెట్టి,  అమిత్ స‌మ‌క్షంలో చేరిన ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. అలాగే ఆయ‌న సోద‌రుడు ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా రాజ‌గోపాల్‌కు ఓటు వేయాల‌ని కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లకు, నేత‌ల‌కు ఫోన్ చేస్తున్నార‌ని ఇటీవ‌ల ఆ పార్టీ నేత‌లు ఆరోపించారు. ఆ వార్త‌లు పేప‌ర్ల‌లో వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో మునుగోడు ఉప ఎన్నిక‌ల రోజుకో మ‌లుపు తిరుగుతున్న‌ది. 


ప్ర‌స్తుతం అక్క‌డ‌ ఏ పార్టీకి అనుకూలంగా ఉన్న‌ద‌నేది స్ప‌ష్టంగా ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. అయితే కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్టు అధికార‌పార్టీ ఇప్ప‌టికీ ముందంజ‌లో ఉన్న‌ద‌ని తెలుస్తోంది. రెండు మూడు స్థానాల్లో నిలిచేది ఎవ‌ర‌నేది మ‌రికొన్నిరోజుల్లో తేలుతుంది. రెండో స్థానంలో ఉండే పార్టీనే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌తో పోటీ ప‌డుతుంద‌నే టాక్ కూడా ఉన్న‌ది. బీజేపీ నేత‌లు చెబుతున్న‌ట్టు హుజురాబాద్ ఫ‌లితం పునరావృతమ‌వుతుందా?  టీఆర్ఎస్ నేత‌లు వాద‌న ప్ర‌కారం నాగార్జున‌సాగ‌ర్ ఉప‌ ఫ‌లితం వ‌లె ఉంటుందా? అన్న‌ది చూడాలి. 

Labels: , , , , , , ,

ప్రాంతీయ పార్టీలు ఆ ప‌ని చేస్తాయా?

 


ఇప్పుడు అంద‌రి దృష్టి 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పైనే ఉన్న‌ది. ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర‌కు పైగా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన పార్టీల‌న్నీ వ‌చ్చే ఎన్నిక‌ల కోసం కార్యాచ‌ర‌ణ రూపొందించుకుని ముందుకు క‌దులుతున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేత‌లు బీజేపీపై దూకుడు పెంచిన‌ట్టు క‌నిపిస్తున్న‌ది. 

బీహార్‌లో జేడీయూ అధినేత బీజేపీతో తెగ‌తెంపులు చేసుకున్న త‌ర్వాత ప్ర‌ధాని ప‌ద‌విపై ఆశ లేదంటూనే హ‌స్తిన‌వైపు చూస్తున్నారు. 40 లోక్‌స‌భ‌ స్థానాలున్న ఆ రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మెజారిటీ స్థానాలు ద‌క్కించుకోవాలనుకుంటున్నారు. ఇప్ప‌టికే కేజ్రీవాల్‌, అఖిలేశ్‌, శ‌ర‌ద్ ప‌వార్, వామ‌ప‌క్ష నేత‌ల‌ను క‌లిసిన ఆయ‌న కూట‌మికి ఎవ‌రు నాయ‌క‌త్వం వ‌హిస్తార‌నేది స‌మ‌స్య కాద‌ని, బీజేపీని క‌ట్ట‌డి చేయ‌డ‌మే త‌క్ష‌ణ క‌ర్త‌వ్య‌మ‌ని అంటున్నారు. 


ఇక కేసీఆర్ చాలా కాలం నుంచి క‌మ‌లం పార్టీ ని టార్గెట్ చేశారు. దేశ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు రావాల‌ని కోరుతున్నారు. ఆయ‌న కూడా ప‌లు ప్రాంతీయ పార్టీల అధినేత‌ల‌తో ఇప్ప‌టికే అనేక‌సార్లు స‌మావేశ‌మై జాతీయ రాజ‌కీయాల గురించి చ‌ర్చ‌లు జ‌రిపారు. బీజేపీ యేత‌ర‌, కాంగ్రెసేత‌ర కూట‌మి కోసం ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 


కేజ్రీవాల్ టార్గెట్ హ‌స్తినే. అందుకే ఆయ‌న ముందుగా గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో స‌త్తా చాటాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఆప్ ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న‌ది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం ద‌క్కించుకుంటే పార్టీకి జాతీయ హోదా వ‌స్తుంద‌ని అప్పుడు దేశ‌మంతా పార్టీని సులువుగా విస్త‌రించ‌వ‌చ్చ‌ని అనుకుంటున్నారు. 


కాంగ్రెస్ పార్టీని కోలుకోల‌ని విధంగా దెబ్బ‌తీసిన బీజేపీ ప్ర‌స్తుతం ప్రాంతీయ పార్టీల నుంచి గ‌ట్టి పోటీ ఎదుర్కొంటున్న‌ది. త‌మిళ‌నాడులో డీఎంకే, మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన‌, ఎన్సీపీ, తెలంగాణ‌లో టీఆర్ఎస్‌, బీహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, యూపీలో ఎస్పీ, బీఎస్పీ, ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్‌, ఒడిషాలో బీజూ జ‌న‌తాద‌ళ్, క‌ర్ణాట‌క‌లో జేడీఎస్ ల రూపంలో బీజేపీకి వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ త‌ప్ప‌దు.


వ‌రుస వైఫ‌ల్యాల‌తో, నేతల నిష్క్ర‌మ‌ణ‌ల‌తో బ‌ల‌హీన‌ప‌డిన కాంగ్రెస్ పార్టీ భార‌త్ జోడో యాత్ర పేరుతో చేప‌డుతున్న కార్య‌క్ర‌మంతో మ‌ళ్లీ పార్టీకి పూర్వ‌వైభ‌వం వ‌స్తుంద‌ని అనుకుంటున్న‌ది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజ‌స్థాన్లో త‌ప్పా ఎక్క‌డా కూడా కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలో లేదు. ఈ ఏడాదిలో జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో గెలిచి సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి  కార్య‌క‌ర్త‌ల‌ను స‌మాయ‌త్తం చేయాల‌ని అనుకుంటున్న‌ది. 

ప్రాంతీయ పార్టీలు మాత్రం ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాల్లో ఉన్న రాజ‌కీయ శూన్య‌త‌ను సొమ్ము చేసుకోవాల‌నుకుంటున్నాయి. అందుకే ఆయా పార్టీల అధినేత‌లు ఇప్ప‌టికే ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. ఒక‌వేళ వాళ్లంతా ఏక‌తాటిపైకి వ‌చ్చి బీజేపీని క‌ట్ట‌డి చేయ‌గ‌లిగితే కేంద్రంలో మ‌ళ్లీ సంకీర్ణ ప్ర‌భుత్వం త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేషకులు అంచ‌నా వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల‌కు ఆ బ‌లం ఉన్న‌దా? అవి ఆ ప‌ని చేయ‌గ‌లుగుతాయా? అనే రాజ‌కీయ‌ చ‌ర్చ కొంత‌కాలంగా జ‌రుగుతున్న‌ది. 

Labels: , , , , , , , , , , , , , , ,

Tuesday 2 August 2022

క‌మ‌లం గూటికి కోమ‌టిరెడ్డి


అంద‌రూ అనుకున్న‌దే జ‌రిగింది. రాజ‌గోపాల్ రెడ్డి ముందునుంచీ చెబుతున్న‌దే ఇవాళ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఆయ‌న ఏపార్టీ లో చేరబోతున్నారు అనేదానిపై క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి క‌మ‌లం కండువా క‌ప్పుకోనున్న‌ట్టు, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌న‌ని, ప్ర‌జ‌ల కోస‌మే తాను ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు, కాబ‌ట్టి మునుగోడు నియోజక‌వ‌ర్గ ప్ర‌జ‌లు త‌న వెంట న‌డ‌వాల‌ని ఆయ‌న కోరారు. దీంతో రాష్ట్రంలో మ‌రో ఉప ఎన్నిక ఖాయ‌మైంది. 


మునుగోడు శాస‌న‌స‌భ్యులు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేస్తున్నాన‌ని, త్వ‌ర‌లో స్పీక‌ర్‌ను క‌లిసి రాజీనామా లేఖ ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇవాళ హైద‌రాబాద్‌లోని ఆయ‌న నివాసంలో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. నా రాజీనామాతోనైనా ప్ర‌భుత్వానికి క‌నువిప్పు క‌ల‌గాలి. ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా నిధులు ఇవ్వాల‌న్నారు. ప్ర‌జ‌లు ఇత‌ర పార్టీల‌ను గెలిపించ‌డం త‌ప్పా? ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాలు అభివృద్ధి చెందాల్సిన అవ‌స‌రం లేదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

నా రాజీనామాతో నా ప్ర‌జ‌ల‌కు మేలు క‌లుగుతుంద‌ని, మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అర్థం చేసుకుంటార‌ని భావిస్తున్నాన‌ని, నా నిర్ణ‌యం వ‌ల్ల బాధ క‌లిగితే క్ష‌మించండని నా నిర్ణ‌యాన్ని స్వాగ‌తించి నాతో రావాల‌ని కోరుతున్నాను అన్నారు. మీరు ఏ పార్టీలో చేర‌బోతున్నార‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ..రాష్ట్రంలో అరాచ‌క పాల‌నను అంతం చేయ‌డం మోదీ, అమిత్ షాతోనే సాధ్యమ‌న్నారు. 

ఇక మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమ‌ని స్ప‌ష్ట‌మైంది. రాజ‌గోపాల్‌రెడ్డి చెప్పిన దాని ప్ర‌కారం ఉప ఎన్నిక‌లు జ‌రిగే చోటే అభివృధ్ధి జ‌రుగుతున్న‌ద‌న్నారు. హుజురాబాద్‌లో వ‌లె మునుగోడులో కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల కోసం, అభివృద్ధి ప‌నుల కోసం కోట్లాది రూపాయ‌లు ఖర్చు చేస్తుంద‌ని భావిస్తున్నారు. అయితే అక్క‌డ సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌క‌ట‌న‌లు, శంకుస్థాప‌న‌లు, ర‌హ‌దారుల నిర్మాణ‌మే కాదు పార్టీల ప‌రంగా భారీగానే ఖ‌ర్చుపెట్టారు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ దేశంలోనే అత్య‌ధిక ఖ‌ర్చుతో జ‌రిగిన ఎన్నిక అనే చ‌ర్చ జ‌రిగింది. ప్ర‌స్తుతం రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అంత బాగా లేద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. వీటికి బ‌లంలో చేకూర్చేలా ఉద్యోగుల జీతాలు నెల‌నెలా ఆల‌స్య‌మౌతున్నాయ‌ని ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇన్ని ప‌రిణామాల  మ‌ధ్య జ‌ర‌గ‌బోయే మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో పార్టీలు గెలుస్తాయా?  ప్ర‌జ‌లు గెలుస్తాయా?  చూడాలి. 


Labels: , , , ,

Monday 1 August 2022

మునుగోడు ఉప ఎన్నిక ఆ మూడు పార్టీల‌కూ కీల‌క‌మే

తెలంగాణ రాష్ట్రంలో మ‌రో ఉప ఎన్నిక రానున్న‌దా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తున్న‌ది. మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి కాషాయ కండువా క‌ప్పుకోవ‌డం దాదాపు ఖ‌రారైంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న చేరిక‌తో న‌ల్గొండ జిల్లాలో బీజేపీ బ‌లోపేతమ‌వుతుంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీకి న‌ల్గొండ జిల్లాలో మొద‌టి నుంచి చాలా ప‌ట్టున్న‌ది. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిప‌త్యం సాధించ‌బోయే జిల్లాల జాబితాలో అదే ప్ర‌థ‌మ స్థానంలో ఉన్న‌ది. అంతేకాదు ఒక‌వేళ రాజ‌గోపాల్‌రెడ్డి పార్టీ వీడితే ఆ పార్టీ ప్ర‌చార క‌మిటీ కీల‌క బాధ్య‌త‌లు తీసుకున్న‌కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి కొంత ఇబ్బంది త‌ప్ప‌దు. రేవంత్‌రెడ్డి రాష్ట్ర‌ పీసీసీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ బాహాటంగానే వ్య‌తిరేకించిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఇటీవ‌ల కాలంలో అధికార‌పార్టీ అసంతృప్తులు రేవంత్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారం కాంగ్రెస్ పార్టీకి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. 

అందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయ‌న పార్టీ వీడ‌కుండా చూసేందుకు ఒక‌వైపు బుజ్జ‌గింపు ప్ర‌య‌త్నాలు చేస్తూనే... ఒక‌వేళ ఉప ఎన్నిక అనివార్యమైతే ఆ స్థానాన్నినిల‌బెట్టుకోవ‌డానికి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ది. మ‌రోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టికే ఆ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి సారించింది. 2014 లో ఆ స్థానాన్ని ద‌క్కించుకున్న టీఆర్ఎస్ 2018 మాత్రం కోల్పోయింది. అందుకే ఈసారి ఉప ఎన్నిక వ‌స్తే నిల‌బెట్టుకోవాల‌ని య‌త్నిస్తున్న‌ది. ఇందుకోసం స‌ర్వేలు కూడా చేప‌ట్టింద‌ని స‌మాచారం. ఆ స్థానంలో పోటీ చేయ‌డానికి ఆశావ‌హుల జాబితా కూడా పెద్ద‌గానే ఉన్న‌ది. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నేతలు కర్నె ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి త‌దిత‌ర నేత‌ల‌ పేర్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారంలో ఉన్నాయి. 

అనారోగ్యంతో క‌న్నుమూసిన ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రాతినిధ్యం వ‌హించిన నాగార్జుసాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచిన బీజేపీ ఈసారి మునుగోడులో స‌త్తా చాటాల‌ని భావిస్తున్న‌ది. దుబ్బాక‌, హుజురాబాద్‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు సాధించి టీఆర్ఎస్‌కు తాము ప్ర‌త్యామ్నాయం అని చెబుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో మునుగోడు లో విజ‌యం సాధించి వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే స‌మ‌ర శంఖం పూరించాల‌ని క‌మ‌ళ‌నాథులు ఉవ్విళ్లూరుతున్నారు. హుజురాబాద్‌, దుబ్బాక‌లో ఓట్ల వేట‌లో చ‌తికిల ప‌డిన కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఉప ఎన్నిక స‌వాల్ కాబోతున్న‌ది. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక త‌ప్ప‌నిస‌రి అయితే త్రిముఖ పోరు త‌ప్పేలా లేదు. రాజ‌గోపాల్‌రెడ్డి పార్టీ మారుతారు అని ప్ర‌చారం జ‌రుగుతున్న నాటి నుంచే మునుగోడులో రాజ‌కీయాలు వేడెక్కాయి. మ‌రికొన్ని రోజుల్లో దీనికి సంబంధించి మ‌రింత స‌మాచారం రానున్న‌ది. ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారం చేప‌ట్టేది తామేన‌ని ప‌దే ప‌దే చెబుతున్న టీఆర్ఎస్‌కు, అధికార పార్టీకి ప్ర‌త్యామ్నాయం మేమే అనే బీజేపీకి, న‌ల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచు కోట అంటున్న ఆ పార్టీ నేత‌ల‌కు ఈ ఉప ఎన్నిక కీల‌కం కానున్న‌ది.

Labels: , , , ,