ఎమ్మెల్సీ ఎన్నికలు ఏం చెబుతున్నాయి?



తెలంగాణను యాచించి కాదు, శాసించి తెచ్చుకుందాం. వంద అసెంబ్లీ, పదిహేడు పార్లమెంటు స్థానాలు సాధిద్దాం. ఇవి తెలంగాణ రాష్ట్ర సమితి కొంత కాలంగా వినిపిస్తున్న నినాదాలు. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉన్న టీఆర్‌ఎస్ ఎన్ని‘కల’ నినాదాలు ఫలిస్తాయా? ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెబుతున్న వంద అసెంబ్లీ, పదిహేడు పార్లమెంటు స్థానాలు సాధ్యమేనా? ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్న సామాన్యుల మదిని తొలుస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనే టీఆర్‌ఎస్ నల్గొండ టీచర్స్‌ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురుకావడమే దీనికి కారణం. ఉత్తర తెలంగాణలో జరిగిన పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవా కొనసాగినా, దక్షిణ తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ  ఓటమితో ఆ పార్టీ చతికిలపడింది. ఇది సగటు తెలంగాణవాదిని ఆందోళనకు గురిచేస్తున్నది.

గతంలో పాలమూరు, పరకాల ఫలితాలు టీఆర్‌ఎస్ పార్టీని కలవరపాటుకు గురిచేశాయి. ఆ ఎన్నికలను గుణపాఠంగా తీసుకుంటే ఇప్పుడు నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ, సహకార ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వచ్చి ఉండేవి కాదన్న రాజకీయ విశ్లేషకుల, తెలంగాణ ఉద్యమకారుల వాదన. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో పాతూరి సుధాకర్‌రెడ్డి, స్వామిగౌడ్‌లు మొదటి ప్రాధాన్య ఓట్లతోనే రికార్డు విజయాన్ని నమోదు చేసుకున్నారు. స్వామిగౌడ్‌కు తొలి ప్రాధాన్యంలోనే 4,470 ఓట్లు లభించాయి. మిగిలిన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఉద్యోగ సంఘాల ఐకాస ఛైర్మన్‌గా స్వామిగౌడ్ పనిచేయం ఆయనకు కలిసి వచ్చింది. ఇక పీఆర్‌టీయూ అభ్యర్థి మోహన్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ బలపరిచిన పాతూరి సుధాకర్‌రెడ్డి ఐదువేలకు పైగా మొదటి ప్రాధాన్య ఓట్లతో గెలిచి రికార్డు సృష్టించారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ అభ్యర్థులే పోటీ చేస్తున్నప్పటికీ గెలిచిన అభ్యర్థులు నిజమైన తెలంగాణవాదులకే ప్రజలు పట్టం కట్టారని ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో ఎంతోకొంత వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో టీఆర్‌ఎస్ నుంచి వరదారెడ్డి, పీఆర్‌టీయూ నుంచి పూల రవీందర్, యూటీఎఫ్ నుంచి నారాయణ ఉన్నారు. మొదటి నుంచి ఇక్కడ పోటీ వరదారెడ్డి, పూల రవీందర్‌ల మధ్యే ఉంటుందని అంతా భావించారు. అయితే ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ మాత్రం చివరి వరకు కొనసాగింది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో విజయానికి అవసరమైన ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టారు. నాలుగో రౌండ్ ఎలిమినేషన్‌లో పూల రవీందర్ 2,57 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పూల రవీందర్ తెలంగాణ ఉపాధ్యాయ ఐకాస ఛైర్మన్‌గా పనిచేశారు. అలాగే సకల జనుల సమ్మెలో ఉపాధ్యాయులు సంపూర్ణంగా పాల్గొనడంలో రవీందర్ కృషి చేశారని, సమ్మె సమయంలో వరదారెడ్డి సహకరించకపోగా పోలీసులను పెట్టి తన విద్యా సంస్థలను నడిపారని విమర్శలు వచ్చాయి. అందుకే కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతికి టీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వడం పొరపాటని తెలంగాణవాదుల ఆరోపణ. ఫలితం అనంతరం  పార్టీలో కొంతమంది ఒత్తిడి వల్లే వరదారెడ్డికి టికెట్ ఇచ్చామని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కానీ ఇవి ఉద్యమానికి విఘాతం కలిగిస్తున్నాయి. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికి, త్యాగధనులకు పట్టం కట్టిన, కడుతున్న చరిత్ర మన కళ్లముందు కనబడుతున్నది. ఇప్పటికే పాలమూరు ఫలితం, పరకాలలో చావుతప్పి కన్నులొట్టబోయిన ఉదంతాలు ఉన్నాయి. ఆ ఎన్నికల ఫలితాలు  క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్ బలహీనతలను తెలియజేశాయి. అయినా పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోలేదనే వాదనలున్నాయి. సూర్యపేటలో పెద్ద బహిరంగ సభ తర్వాత స్తబ్ధుగానే తయారైంది. టీఆర్‌ఎస్ పల్లె బాట కార్యక్రమం కూడా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దక్షిణ తెలంగాణలో ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పటికీ ఉద్యమ పార్టీ తన బలాన్ని పెంచుకోలేకపోయింది. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉపాధ్యా సంఘాలు విభజనను తెచ్చాయని ప్రభుత్వ ఉపాధ్యాయుల చెబుతున్నారు. తెలంగాణ కోసం సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె, తెలంగాణ మార్చ్ ఏ కార్యక్రమం తీసుకున్నా అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. అందుకే సకల జనుల సమ్మె మైలురాయిగా నిలిచింది. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ సమైక్య సంఘాలకు స్థానం లేదని ఆర్టీసీ, సింగరేణి ఎన్నికల్లో రుజువైంది. అలాగే తెలంగాణలో ఉద్యమ కారులు, ఉద్యమ ద్రోహులు ఎవరో స్పష్టమైంది. ఆ సోయి తెలంగాణ ప్రజలకు వచ్చింది. కానీ పార్టీలకే ఇంకా కనువిప్పు కలగనట్టున్నది. ఏకపక్ష నిర్ణయాలు టీఆర్‌ఎస్ పార్టీకే ఉద్యమానికి ముప్పును తెస్తాయి. ఎందుకంటే ఆంధ్రాలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు బలపరిచిన అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయినా సీమాంధ్ర మీడియా దానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ వరదారెడ్డి ఓటమిని తెలంగాణవాదానికి ముడిపెట్టి చర్చల మీద చర్చలు పెట్టింది. అలాంటి అవకాశం మనం సీమాంధ్ర నేతలకు, మీడియాకు ఎందుకు ఇవ్వాలి అనేది సగటు తెలంగాణవాది ప్రశ్న.

పొరపాటు, గ్రహపాటు, అలవాటు వీటిలో మనం ఇప్పటికే పొరపాట్లు చేశాం. తిరిగి ఆ తప్పులను దిద్దుకోకుంటా మళ్లీ అవే పునరావృతం చేశాం. ఇక ఆ పొరపాట్లే అలవాటుగా మారితే కష్టమే. నిజమే ఆ పార్టీ చెబుతున్నట్టు ఉద్యమం కావాలి, ఓట్లు సీట్లు కావాలి. కానీ అవి ఉద్యమానికి ఊపిరి పోయాలి. లక్ష్య సాధనకు ఉపయోగపడాలి. అంతేకానీ అవరోధం కాకూడదు. ఉద్యమంలో అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు తీసుకెళ్లాలి. ఉద్యమ నేతల్లో ఉన్న అభిప్రాయభేదాలను, ఎన్నికల ఫలితాలను సాకుగా చూపి మన ఐక్యతను దెబ్బతీసేందుకు సీమాంధ్ర శక్తులు కాచుకుని కూర్చున్నాయి. దాన్ని అధిగమించకపోతే మునగడం ఖాయం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసరమైతే మళ్లీ సమ్మెకు సిద్ధమని ఉద్యోగ, ఉపాధ్యా, కార్మిక సంఘాలు ఇప్పటికే చాలాసార్లు ప్రకటించాయి. గతంలో మాదిరిగా సమ్మె సక్సెస్ కావాలంటే అంతా ఒకే గొడుగు కిందికి రావాలి. లేకపోతే ఒకవేళ మళ్లీ సమ్మె అంటే తెలంగాణలోని అన్ని సంఘాలు కలిసిరాకపోవచ్చు. తెలంగాణ కోసం గల్లీకో జేఏసీ ఏర్పడి తమవంతు ప్రయత్నాలు చేస్తున్న సందర్భమిది. ఈ సమయంలో మన అనైక్యత శత్రువుకు ఆయుధం కాకూడదు. తెలంగాణ కోసం ఆర్‌ఎస్‌ఎస్ నుంచి మావోయిస్టుల దాకా ఎవరినైనా కలుపుకుని పోతాం అన్న మాటలను ఆచరణలో చూపాలి. కనుక ఈ మూడేళ్ల ఉద్యమాన్ని మరోసారి సమీక్షించుకోవాలి. ఎక్కడ లోపాలున్నాయో వాటిని గుర్తించాలి. అవి పునరావృతం కాకుండా చూడాలి. రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తూనే తెలంగాణ ప్రాంతలోని సమస్యలపై పోరాడాలి. ఉద్యమంలోకి అన్ని శక్తులను తీసుకుని రావాలి. మనం ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా అది మొదటికే మోసం తెస్తుంది. బడితె ఉన్నవాడిదే బర్రె అన్నట్టు ఉండవల్లి రాజమండ్రి సభలో చెప్పిండు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపుతున్నారు. అవి అవాస్తవాలు అయినా, ఈ ఎన్నికల ఫలితాలను తెలంగాణ అంశాన్ని తేల్చకుండా కొంతకాలం వాయిదా వేయడానికి తెలంగాణ వ్యతిరేకులకు పనిచేస్తాయి. అంతేకాదు కీలక సమయంలో టీఆర్‌ఎస్ కొంతమంది ఒత్తిడి మేరకు టికెట్లు ఇవ్వకుండా తెలంగాణకోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికి ప్రోత్సాహం అందించాలి. అది ఉద్యమానికి, రాష్ట్ర సాధనకు దోహదపడుతుంది.

Comments

Popular posts from this blog

ఏపీలో కూటమిలోకి బీజేపీ చేరిక లాభమెవరికి? నష్టమెవరికి?

కేబినెట్‌ కూర్పులో ఆ మూడు రాష్ట్రాలకు పెద్దపీట... ఎందుకంటే?

ఆరు నెలల్లో అస్తవ్యస్త నిర్ణయాలు