Thursday, 1 November 2012

నిర్బంధం నీడలో ....

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం పేరుతో కిరన్ సర్కార్ చేసిన చర్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. నిర్బంధం నీడలో అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకునే దుస్థితి దాపురించింది. ప్రభుత్వం  చేసిసిన ఆర్భాటంలో ప్రజలు లేరు, ప్రజాప్రతినిధులు లేరు. పోలీసులతోనే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఇక తెలంగాణ ప్రాంతమంత్రా విద్రోహ దినాన్ని పాటించింది. ప్రభుత్వ కార్యాలయాలపై నల్లజెండాలతో ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేశారు. తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాంను హౌస్ అరెస్టు , చాలామంది ఉద్యమకారులను అరెస్ట్‌చేసి ప్రభుత్వం తన దమననీతిని మరోసారి చాటింది. ఇందిరాపార్క్ వద్ద రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిరసిస్తూ తమ నిరసనను తెలియజేస్తామని జేఏసీ ముందే ప్రకటించింది. కానీ ప్రభుత్వం జేఏసీని అడ్డుకునే పేరుతో ఇందిరాపార్క్ ప్రాంతాన్ని పోలీసుల చేతిలో పెట్టింది. దీంతో ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి నెలకొన్నది. లేని సమైక్య భావనను తలకెత్తుకున్న రాష్ట్ర సర్కార్‌కు అవతరణ వేడుకలు అసంతృప్తినే మిగిలిచ్చాయని చెప్పవచ్చు.

ఒప్పందాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది త్యాగాల వల్ల ఏర్పడిందనే దుష్ప్రచారాన్ని  మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో తెలిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ ప్రకటనలో తెలుగుతల్లితో పాటు పొట్టిశ్రీరాములు బొమ్మను ముద్రించింది. అసలు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సంబంధంలేని వ్యక్తిని ఈ వివాదంలోకి లాగా ఆయన ఆంధ్ర ప్రజల కోసం చేసిన త్యాగాన్ని అగౌరవపరిచింది. శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేసిన విషయం విదితమే. ఆయన ప్రాణ త్యాగం ఫలితంగానే మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న ఏర్పాటైంది. పెద్దమనుషుల ఒప్పందంలో ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1న ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే చనిపోయిన వ్యక్తిని తమ స్వార్థం కోసం సీమాంధ్ర నేతలు వాడుకుంటున్నారు. దీనికి శ్రీరాములు ఆత్మ ఎంత క్షోభిస్తున్నదో. గాంధీ వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాలకు తిలదోకాలు ఇచ్చింది. శ్రీరాములు పేరు చెప్పుకుంటూ కొంతమంది సీమాంధ్ర పెట్టుబడిదారులు ఆయన ఆకాంక్షను అమ్ముకుంటున్నారు. మంత్రి టీజీ వెంకటేశ్ లాంటి వాళ్లయితే తన స్థాయిని మరిచి  అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. రాష్ట్ర అవతరణ వేడుకలను బహిష్కరించిన వారిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలంటున్నారు. దానికి సమాధానం కావాలంటే తన సహచర తెలంగాణ మంత్రులను అడిగితే బాగుంటుంది. అయినా తెలంగాణ ప్రజలు సీమాంధ్ర ప్రభుత్వాన్ని 2009 డిసెంబర్ 9వ తేదీనే బహిష్కరించారు.ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉల్లంఘనలు చూసే ఈ ప్రాంత ప్రజలు ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలను బహిష్కరించారు. ఇప్పుడు టీజీ కానీ సీమాంధ్ర నాయకులు కానీ కొత్తగా బహిష్కరించడానికి ఏమీ లేదు. భౌగోళిక విభజనకు సహకరించడం తప్ప.

No comments:

Post a Comment