మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈసారి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తేవడానికి కృష్టి చేస్తున్నది. భారత్ జోడో యాత్రలో ఆ రాష్ట్ర నాయకత్వం, స్థానిన నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దక్షిణాదిలో బీజేపీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో ఆపార్టీకి ఇప్పటికీ పెద్ద దిక్కు మాజీ సీఎం యడ్యూరప్పనే. కొన్నిరాజకీయ పరిణామాలతో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత యడ్యూరప్ప సీఎం అయ్యారు. అయితే బీజేపీ అధిష్టానం అనూహ్యంగా ఆయనను దించి బసవరాజు బొమ్మైని సీఎంగా చేసింది. నాటి నుంచి ఆయన అసంతృప్తితోనే ఉన్నారు. ఆయనను సంతృప్తిపరచడానికి యడ్డీని బీజేపీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీలో చోటు కల్పించింది.
మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీ కొంతకాలంగా పక్కన పెట్టడంతో పార్టీ అధిష్టాన వైఖరిపై అసంతృప్తితో కొద్ది రోజుల కిందట ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో కొత్త పార్టీ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ ద్వారా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. గాలిని బళ్లారి ప్రాంతంలో గట్టి పట్టున్నది. వచ్చే ఎన్నికల్లో కొప్పల్ జిల్లాలోని గంగావతి స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రమంతా పర్యటిస్తానని అన్నారు.
కర్ణాటక కమలనాథులలో అంతర్గత ముసలం, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటం, గాలి జనార్దన్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టడం వంటివి బీజేపీ అధిష్టానాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. దీంతో ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి, ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి కేంద్ర బడ్జెట్‌లో కర్ణాటక రాష్ట్రానికి పెద్దపీట వేసింది.
ఆ రాష్ట్రంలో కరువు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి అప్పర్ భద్ర ప్రాజెక్టు కోసం రూ. 5,300 కోట్లు కేటాయించింది అంటే అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. నీటిపారుదల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో తనకు మానీ ప్రధాని దేవేగౌడ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆరే స్ఫూర్తి అని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ఇటీవల రాయచూర్‌లో నిర్వహించిన పంచరత్న రథయాత్రలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్నో జిల్లాలకు నిరంతరం నీళ్లు అందిస్తున్న కేసీఆర్ తనకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, మిషన్ భగీరథ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జల్‌జీవన్ మిషన్‌కు ఏమాత్రం తీసిపోదని తెలిపారు. తనకు మరోసారి అవకాశం కల్పిస్తే తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ప్రకటించారు. కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆవిర్బావ సభకు కుమారస్వామి హాజరు కాలేదు. దీంతో బీఆర్‌ఎస్‌కు, జేడీఎస్‌కు మధ్య దూరం పెరిగిందా? అనే చర్చ జరిగింది. కానీ కేసీఆర్ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పేరును అధికారికంగా ప్రకటించిన రోజే వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు.బీజేపీ, కాంగ్రెస్ యేతర కూటిమి కోసం కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లి అక్కడ ఉద్ధవ్‌ఠాక్రే (అప్పుడు ఆయన సీఎం), ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లతో భేటీ అయ్యారు. అప్పుడు కేసీఆర్ వెంట వారిలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారు. ఆయన బీఆర్‌ఎస్‌లో క్రియాశీలంగా పనిచేస్తారని, కర్ణాటకలో పార్టీ విస్తరణ కోసం పనిచేస్తారని, ఆయనకు కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది. తాజాగా మాజీ సీఎం కుమారస్వామి చేసిన వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్-జేడీఎస్ కలిసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. గడిచిన మూడు నెలలగా కర్ణాటకలో జరుగుతున్నరాజకీయ పరిణామాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీని ఓటు బ్యాంకు గండికొడుతుంది? ఏ పార్టీకి మేలు చేస్తుంది అనేది అక్కడి రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.
No comments:
Post a Comment