సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నది. అయితే అప్పుడే కొత్త కూటములు, బీజేపీ యేతర పార్టీల సమావేశాల వంటివి జరుగుతున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే వివిధ ప్రాంతీయపార్టీలతో భేటీ అయి చర్చలు జరిపారు. తాజాగా పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభానికి ఆయన ఇచ్చిన సలహాతోనే కాంగ్రెస్ పార్టీ సిద్ధూను ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక జరిగింది అంటున్నారు. అంతేకాదు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ రాబోయే కాలంలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించిన రూట్ మ్యాప్‌పై కాంగ్రెస్ పెద్దలతో చర్చించారని, వాటికి వారు ఆమోదం తెలిపారు అన్నది వారంరోజులుగా వార్తల్లో కనిపిస్తున్న ప్రధాన వార్తలు.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం గత కొంతకాలంగా గతానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇందుకు ఉదాహరణ తెలంగాణలో ఆ పార్టీ అధ్యక్షుడి ఎంపిక. అట్లనే పంజాబ్‌లోనూ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ వర్గం వ్యతిరేకించినా సిద్ధూకే పార్టీ రాష్ట్ర బాధ్యతలు కట్టబెట్టింది. వచ్చే ఏడాది జరుగనున్న ఆరు రాష్ర్టాల ఎన్నికలు, తెలంగాణలోనూ పార్టీ పటిష్ఠత, రాష్ట్రంలో అధికారంలోకి రావడం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి గణనీయంగా ఎంపీ స్థానాలు దక్కించునే వ్యూహంలోనే భాగంగా రేవంత్‌రెడ్డి ఎంపిక జరిగింది అంటున్నారు. పార్టీలో ప్రక్షాళన చర్యలు ప్రారంభించడమే కాకుండా మొన్న బెంగాల్‌లో బీజేపీని మట్టికరిపించిన మమతా బెనర్జీతో సోనియా, రాహుల్‌లు చర్చలు జరిపారు. ఆ సందర్భంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటయ్యే కూటమికి సారథి ఎవరైనా సై అనే సంకేతాలు ఇచ్చారు. ఆ కూటమిలో సాధారణ కార్యకర్తలా పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
వరుసగా రెండుసార్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారు. ప్రజల ఆకాంక్షలు ఈ ఏడేండ్ల కాలంలో కేంద్రం నెరవేర్చిందనే చర్చ ఇప్పుడు జాతీయస్థాయిలో నడుస్తున్నది. మోదీకి ప్రత్యామ్నాయంగా బలమైన నేత ప్రతిపక్షాల నుంచి కనిపించకపోవడం కూడా బీజేపీకి కలిసి వచ్చింది. అయితే ఈ ఏడాదిన్నర కాలంలో కరోనా కట్టడి విషయంలోనూ, పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం, నిరుద్యోగ రేటు నలభై ఏండ్ల గరిష్ఠ స్థాయికి చేరడం వంటివి మోదీ ప్రభుత్వానికి ప్రతికూలంగా మారాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జరిగింది. కొంతకాలంగా ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోతున్నది. దీనికి తోడు బెంగాల్‌లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆ పార్టీలోని పెద్దలంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మమత వైపే నిలిచారు. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షాలతో కాకుండా సొంతంగా అధికారంలో ఉన్న యూపీ, కర్ణాటక, గుజరాత్, మధప్రదేశ్ వంటి రాష్ర్టాల్లో కూడా వచ్చే ఎన్నికల నాటికి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా యూపీలో వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టణ ప్రాంతంలోఆ పార్టీ మంచి మెజారిటీనే సాధించింది. అయితే గ్రామీణ ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీ తన పట్టును నిలుపుకున్నది. కాబట్టి అక్కడ ఎలా ఉండబోతున్నది ఇప్పుడే చెప్పలేము. కర్ణాటకలో యడ్యూరప్ప వైదొలిగారు. బసవరాజు బొమ్మై కొలువుదీరారు. అయితే అక్కడ కాంగ్రెస్, జేడీయూల సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇందులో యడ్యూరప్ప కీలకంగా వ్యహరించారు. ఇప్పుడు ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం రానున్నరోజులు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చారు. తాజా మంత్రివర్గంలో ఆయనకు మంత్రిగా అవకాశం కల్పించారు. రాష్ర్టాల్లో అధికారంలోకి రావడానికి బీజేపీ తన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి గతంలో కాంగ్రెస్ పార్టీ విధానాలనే అనుసరిస్తున్నది అనడానికి కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ర్టాల్లో జరిగిన పరిణామాలే ఉదాహరణ. రాం విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. నితీశ్ కుమార్ ఎన్నికల సమయానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన ఎన్డీఏలో ఎంత కాలం కొనసాగుతారు అన్నది వచ్చే ఏడాది జరిగే ఆరు రాష్ర్టాల ఎన్నికల తర్వాత తేలుతుంది. ఇట్లా కేంద్రంలో అధికారం రావడానికి కావాల్సిన మెజారిటీ స్థానాలు ఉండే యూపీ, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ర్టాల్లో బీజేపీకి అనుకూలతల కంటే ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బహుశా ఈ మారిణ పరిస్థితుల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్‌తో కలిసి వ్యూహరచన చేస్తూ కొత్త కూటముల ఏర్పాటు దిశగా వెళ్తున్నది.
ఇప్పటికీ మోదీకి ప్రత్యామ్నాయంగా విపక్ష కూటమిలో ముందే కూటమి ప్రధాని అభ్యర్థిని ప్రకటించకూడదనుకుంటున్నారు. దీనివల్ల జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువనే అభిప్రాయం వివక్ష నేతల్లో ఉన్నది. అందుకే అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సీట్ల గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఆయా రాష్ర్టాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో కలిసి నడువాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తుండవచ్చు. ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న రాష్ర్టాల్లో మాత్రం రాష్ర్టాల్లో అధికారాన్ని దక్కించుకోవడంతో పాటు ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకోవడంపైనే ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా విపక్ష నేతలు చేస్తున్న కూటమి ప్రయత్నాలు ఫలిస్తే మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న కమలనాథులకు చెక్ పడటం ఖాయం అంటున్నారు.
- రాజు
No comments:
Post a Comment