Monday 9 August 2021

ఆ పార్టీలకు ఇక్కడ ఆదరణ ఉంటుందా?

 


ఒక రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప‌నిచేసే ప్రాంతీయ పార్టీ మ‌రో రాష్ట్రంలో మ‌నుగ‌డ సాగించ‌లేదు. తెలుగువారి ఆత్మ‌గౌర‌వం పేరు మీద టీడీపీ ఆవిర్భావించింది. ఉమ్మ‌డి రాష్ట్రాన్ని దాదాపు రెండు ద‌శాబ్దాలు పాలించింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత మెల్ల‌మెల్ల‌గా ఆ పార్టీ ప్ర‌భావం త‌గ్గిపోయింది. 2014, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కొన్ని సీట్లు గెలుచుకున్న‌ది. అయితే ఆ పార్టీ మూలాలు ఆంధ్ర‌లో ఉన్నాయి. అందుకే  2014 నుంచి 2019 వ‌ర‌కు ఏపీలో టీడీపీ అధికారంలోకి ఉండ‌టం, చంద్ర‌బాబు తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌డంతో పార్టీ ఇక్క‌డ ఉన్నా ప్ర‌భావాన్నికోల్పోయింది. దాదాపు సీనియ‌ర్ నేత‌లంతా టీఆర్ఎస్‌, కాంగ్రెస్, బీజేపీల‌లో చేరిపోయారు. 


ఇప్పుడు ఆ పార్టీలో కొన‌సాగుతున్ననేత‌లు కొంత‌మంది మాత్ర‌మే. రానున్న రోజుల్లో తెలంగాణ‌లో టీడీపీ త‌న అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోనున్న‌ది.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉండి, అక్క‌డి ప్ర‌యోజ‌న‌ల కోసం ప‌నిచేస్తూ తెలంగాణ‌లో రాజ‌కీయం చేసినా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌నే వాస్త‌వాన్ని బ‌హుశా జ‌గ‌న్ పార్టీ గ్ర‌హించి ఉంటుంది. అందుకే  ఒక్క తెలంగాణ‌లోనే కాదు ప‌క్క‌రాష్ట్రాల రాజ‌కీయాల‌లో వేలు పెట్ట‌మ‌ని క‌రాఖండిగా చెప్పారు. వైఎస్ ఆర్ తెలంగాణ‌కు కూడా ఇదే సూత్రం వ‌ర్తిస్తుంది. ఆ పార్టీ అధినేత్రి ష‌ర్మిల కొన్నిరోజులుగా చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు చూస్తే వారి ఆశ‌లు వ‌మ్ము అవుతాయే త‌ప్పా అధికారంలోకి రావ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని. ఎందుకంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. వీటి విష‌యంలో వారు తెలంగాణ వైపే నిల‌బ‌డ‌తామ‌ని స్ప‌ష్టంగా చెప్ప‌డం లేదు. రొటీన్ కామెంట్ల లెక్క రెండు రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగ‌వ‌ద్ద‌నేదే మా పార్టీ విధానం అని స‌మ‌స్య‌ల‌ను దాట‌వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది గ‌తంలో చంద్ర‌బాబు చెప్పిన రెండు కండ్ల సిద్ధాంతం వంటిదే.  ఉమ్మ‌డి పాల‌కుల విధాన నిర్ణ‌యాల వ‌ల్ల‌నే తెలంగాణ ప్రాంతం అన్నిరంగాల్లో అన్యాయానికి, అణిచివేత‌కు గురైంది. అందుకే వారి పాల‌న‌కు వ్య‌తిరేకంగా తెలంగాణ ప్ర‌జ‌లు పోరాడారు. ఉమ్మ‌డి రాష్ట్ర పాల‌కులు అంటే వారి తండ్రి దివంగ‌త వైఎస్ పాల‌న‌ను కూడా తెలంగాణ వ్య‌తిరేకించారు. వారి తండ్రి అధికారంలో ఉన్న‌స‌మ‌యంలోనే ఉద్య‌మాన్ని అణిచివేసే, ఉద్య‌మ‌పార్టీలో చీలిక‌లు తెచ్చే అనేక కుట్ర‌లు చేశారు. ఇదంతా తెలంగాణ ప్ర‌జ‌ల అనుభ‌వంలో ఉన్న‌దే. ఇప్పుడు వైఎస్ కూతురు ష‌ర్మిల రాజ‌న్న రాజ్యం తెస్తామ‌న్న నినాదం తెలంగాణ‌లో ఫ‌లించ‌దు. 


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత ఉద్య‌మ‌పార్టీనే అధికారంలోకి వ‌చ్చింది. ఉద్య‌మ స‌మ‌యంలో నినాదాల‌ను ఇక్క‌డి పాల‌నా విధానాల్లో చూపెట్ట‌లేదు.  ఇక్క‌డ ఉన్న అన్నిప్రాంతాల ప్ర‌జ‌లు మావాళ్లే అని ప్ర‌క‌టించ‌డ‌మే కాదు భ‌ధ్ర‌త‌, భ‌రోసా క‌లిగించింది. కొంద‌రు ప‌నిగ‌ట్టుకొని ప్ర‌చారం చేసిన భ‌యాందోళ‌న‌ల‌ను తొలిగించింది. అందుకే ఈ ఏడేండ్ల కాలంలో రాష్ట్రంలో అన్నిప్రాంతాల ప్ర‌జ‌ల మ‌ధ్య స‌హృద్భావ వాతావ‌ర‌ణ‌మే ఉన్న‌ది. బాబు హ‌యాంలో సెక్ష‌న్ 8 పేరుతో రెండు రాష్ట్రాల‌ ప్ర‌జ‌ల మ‌ధ్య అపోహ‌లు సృష్టించి, రాజ‌కీల ల‌బ్ధి పొందాల‌నే కుట్ర‌ల‌ను కూడా తెలంగాణ ప్ర‌భుత్వం చేధించింది. 


అయితే తెలంగాణ‌లో ఎవ‌రైనా పార్టీ పెట్ట‌వ‌చ్చు. విస్త‌ర‌ణ కోసం ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. త‌మ‌కు అవ‌కాశం ఇవ్వ‌మ‌ని ప్ర‌జ‌లను కోర‌వ‌చ్చు. అయితే ఇక్క‌డ ఏ పార్టీ మ‌న‌గ‌డ సాగించాలంటే తెలంగాణ సోయితోనే ప‌నిచేయాలి. తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించాలి. ద్వంద్వ విధానాలు విడనాడాలి. అప్పుడే తెలంగాణ ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పొంద‌గ‌లుగుతారు. ఇవేవీ లేకుండా రాజ‌కీయాలు చేస్తామ‌ని అనుకుంటే వారి ఆశ‌లు అడియాశ‌లే అవుతాయ న్నది చరిత్ర చెప్తున్న సత్యం.

 

Labels: , , , ,

2 Comments:

At 9 August 2021 at 07:17 , Blogger Bikshapathi said...

షర్మిల పార్టీ కేసీఆర్ ప్లాన్ B అంట కదా..!

అంటే రాజకీయ వర్గాల్లో టాక్.

 
At 9 August 2021 at 07:35 , Blogger Raju asari said...

రాజకీయ పునరేకీకరణ పేరుతో కేసీఅర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రాలు అయ్యాయి. ఈ ప్లాన్ బీ నిజమైతే నష్టపోయేది కూడా టీఆర్ఎస్సే.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home