Saturday 19 November 2011

నిలబెడితే.... పడిపోతారు జాగ్రత్త



జగన్ వర్గ ఎమ్మెల్యేలు కొంత మంది మళ్లీ కాంగ్రెస్ గూటిలోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది అబద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొట్టిపారేసినా, ప్రస్తుత పరిణామాలను చూస్తే ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రతిపక్ష నేతల నుంచి మాటలు వినిపిస్తున్న ఈ తరుణంలో జగన్ వర్గ ఎమ్మెల్యేల రాక కిరణ్ సర్కారుకు సంతోషం కలిగించవచ్చు. కానీ జగన్ వర్గ ఎమ్మెల్యేలు మాత్రం చెబుతున్న కారణాలు తెలంగాణ ప్రజాప్రతినిధుల బానిసత్వాన్ని సూచిస్తున్నాయి. ప్రభుత్వం పడిపోతే తెలంగాణావాదం బలపడుతుంది. కాబట్టి తెలంగాణ వాదాన్ని బలపడనీయం అంటున్నారు. సీమాంద్ర ప్రజప్రతినిదులు అలా మాట్లాడితే, వారి ప్రయోజనాల కోసం వారు ఈ పని చేస్తుండవచ్చు. కానీ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏమి అవసరం వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మోయడానికి. ఒక పక్క కిరణ్ సర్కార్ ఉద్యమాన్ని అణచడానికి చాప కింద నీరులా ఉద్యమకారులపై నల్ల చట్టాలు ప్రయోగిస్తుంటే, ఈ ప్రాంత నేతలు మిన్నకుండడం దేనికి సంకేతం. ప్రజలు ఏమైనా మాకు పరవాలేదు మాకు మాత్రం మా పదవులే ముఖ్యం అనుకుంటున్నారు. అధికారం ఉంది కదా ఇక మాకు ఎలాంటి డోకా లేదనుకుంటే పొరపాటే. యిప్పుడు తెలంగాణ వ్యతిరేకులతో కలిసి ఈ ప్రభుత్వాన్ని కాపాడినా రేపు ఎన్నికల్లో ఓట్లు వేసేది మాత్రం ఈ ప్రాంత ప్రజలే. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఈ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ . దీనికి వంత పాడుతున్నది ఈ ప్రాంత కాంగ్రెస్ బానిస నేతలు. అయితే మేము తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పే మాటలకు కాలం చెల్లింది. వచ్చిన తెలంగాణ ను అడ్డుకున్న సీమాంద్ర నాయకత్వంతో నడుస్తున్న నేతలకు ఇక శంకరగిరి మాన్యాలే దిక్కు.  సీమాంద్ర అవకాశవాద రాజకీయాలకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలయ్యేది రేపు  మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతలే, దీనికి టిడిపి నేతలు మినహాయింపు కాదు.


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home