Monday 10 September 2012

లేఖపై ఎందుకీ గోల?


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణపై స్పష్టత ఇవ్వనున్నారనే వార్తలు కొన్నిరోజులుగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆయన అన్ని ప్రాంతాల నాయకులతో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుని, తెలంగాణపై మరోసారి కేంద్రానికి లేఖ రాస్తారు అనేది ఆ వార్తల సారాంశం. ఇంత వరకు బాగానే ఉన్నది. తెలంగాణ సంక్లిష్ట సమస్య అని, సున్నిత సమస్య అని ఎంత కాలం సాచివేత ధోరణి మంచి పద్ధతి కాదు. ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు పెరగకుముందే రాజకీయ నేతలు పరిణతి ప్రదర్శించాలి. బహుశా బాబు కూడా తెలంగాణపై చేస్తున్న ప్రయత్నం అదే కాబోలు. దీనికి అందరి ఆమోదం ఉండకపోయినా పరవాలేదు, కానీ అనవసర రాద్ధాంతమే సరికాదు. ఎందుకంటే బాబు ఇంతవరకు తెలంగాణపై ఒక నిర్ణయానికి రాలేదు, కేంద్రానికి లేఖ ఇవ్వనూ లేదు. కానీ అప్పుడే మీడియాల్లో చర్చల మీద చర్చలు చేస్తున్నారు. అయితే ఆ చర్చలు ప్రజలకు ఉపయోగపడేవి కావు సుమా! ఒకరిపై మరొకరి ద్వేషాగ్నిని రగిలించేవి మాత్రమే. అందుకే కొన్ని టీవీ ఛానళ్లు పనిగట్టుకొని బాబుపై సీమాంధ్ర నేతల నిరసన గళం అని ప్రసారం చేస్తున్నాయి. చంద్రబాబు చేస్తున్న అభిప్రాయ సేకరణలో అనుకూల, ప్రతికూల వాదనలు ఉంటాయి. అందులో తప్పులేదు. ఎందుకంటే తెలంగాణపై తాను చెప్పిందే ఫైనల్ అని గతంలో చంద్రబాబు చెప్పారు కూడా. అందరి అభిప్రాయాలు సేకరించాక ఆయన ఏం చెబుతాడో వేచిచూస్తే బాగుంటుంది. కానీ తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది అన్నట్టు చంద్రబాబు లేఖపై, తెలంగాణకు గూర్ఖాలాండ్ తరహా ప్యాకేజీలపై చర్చలు పెట్టడం ఏ పత్రికా విలువలో ఆలోచించాలి.

ఇక తెలంగాణపై బాబు స్పష్టత ఇస్తానన్న విషయంలోనూ కొత్తేమీ లేదు. ఇప్పుడు ప్రాంతాల వారీగా ఆయన సేకరిస్తున్న అభిప్రాయాల్లోనూ వింతేమీ లేదు. గతంలో ఆ పార్టీ మూడు ప్రాంతాల నాయకులతో కలిసి ఒక కమిటీ వేసి, అన్ని ప్రాంతాల కార్యకర్తల మనోభావాలు తెలుసుకున్నాకే మహానాడులో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన విషయం విదితమే. అయితే తెలంగాణపై 2009 డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన తర్వాత సీమాంధ్ర ప్రజల్లో వచ్చిన నిరసన కంటే ఆ ప్రాంత నాయకులు హడావుడే ఎక్కువ. అందుకే ఇప్పుడు బాబు తెలంగాణకు అనుకూలంగా మరోసారి లేఖ ఇచ్చినా ప్రజాప్రతినిధుల్లో నిరసన గళాలు వినిపిస్తాయేమో గానీ ప్రజల్లో మాత్రం కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు మానసికంగా ఎప్పుడో విడిపోయారు. ఇక మిగిలింది భౌగోళిక విభజన మాత్రమే. దీనిపై  ఎలాంటి శషబిషలు అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని, పెట్టుబడులు వెనక్కివెళుతున్నాయని గగ్గోలు పెట్టే వాళ్లు అందులో వాస్తవాలు ఎలా ఉన్నా.. తెలంగాణ సమస్య పరిష్కారానికి కూడా సహకరించాలి. మీడియా పారదర్శకంగా వ్యవహరించాలి తప్ప ప్రజల్లో విద్వేషాలను పెంచిపోషించకూడదు. అట్లాగని మీడియాలో పనిచేసే వ్యక్తులకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండకూడదనేది ఏమీ లేదు. కానీ వాటిని ప్రజాభిప్రాయం చూపెట్టడమే తప్పు. అందుకే దాదాపు మూడేళ్లుగా మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న పార్టీల ద్వంద్వ విధానాలను మీడియా ప్రశ్నించాలి. తెలంగాణ సమస్య ఏనుగులా కళ్లముందు కనబడుతున్నా దాని పరిష్కారానికి ప్రయత్నించని ప్రజాప్రతినిధులను నిందించాలి. ఒక ప్రాంతానికి  అనుకూలంగా నిర్ణయం వస్తే మరో ప్రాంతం ఓడిపోయినట్టు కాదు. తమ అవకాశవాద రాజకీయాల కోసం ప్రజల ఆకాంక్షలతో ఆడుకున్న పార్టీల వైఖరులను ఎండగట్టిన నాడే ప్రాంతీయ విముక్తి, ప్రజలకు మనశ్శాంతి లభిస్తుంది.
-రాజు

Labels: ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home