Monday 3 September 2012

అంధకారంలో ఆంధ్రప్రదేశ్



రాష్ట్రంలో కిరణ్ సర్కార్ తీరు ఆగమ్యగోచరంగా తయారైంది. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ‘ఇందిరమ్మ’ పేరుతో ఈ మధ్యనే ఒక కొత్త కార్యక్రమాన్ని కిరణ్ చేపట్టారు.  విశేషమేమంటే ఇందిరమ్మ పేరుతో కిరణ్ జిల్లాల పర్యటనలు చేస్తుంటే.. ప్రజలు తమ సమస్యలు తీర్చాలంటూ నగర బాట పడుతున్నారు. మిన్ను విరిగి మీదపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదు. ప్రజా సమస్యలపై నిలదీస్తే ప్రతిపక్షాలకు ఏమీ పనిలేదు అని వెటకారంగా మాట్లాడుతారు ముఖ్యమంత్రి. తమ ప్రభుత్వ పనితీరు బాగుందని వారికి వారే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు. రోశయ్య తర్వాత  వచ్చిన కిరణ్ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని గాడీలో పెడతాడని ఆ పార్టీ అధిష్ఠానం భావించింది. కిరణ్ వెలుగులతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లోఅంధకారం నుంచి బయటపడుతుందని అనుకున్నారు. కానీ కిరణ్ కాంగ్రెస్ పెద్దల నమ్మకాన్నే కాదు ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోతున్నారు.

తాజాగా ఎన్డీటీవీ రాష్ట్ర నాయకత్వంపై వెలువరించిన సర్వే తాలూకు విశేషాలు చూస్తే రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న కిరణ్‌కు 11 శాతం మంది ప్రజలే మద్దతు తెలిపారు. సర్వేల్లో శాస్త్రీయత లేదన్నది అందరూ అనుకుంటున్నదే. కానీ మిగతా వారి సంగతి ఏమో గానీ కిరణ్ మాత్రం సమస్య తీవ్రత తెలిసినా దానిపై ఆయన స్పందన చూస్తే ప్రజల్లోనే కాదు అధికార పార్టీలోని ప్రజాప్రతినిధులకే నీరసం వచ్చేస్తుంది. దీనికి విద్యుత్ సమస్యపై ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరే ఉదాహరణ. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ సంక్షోభం ఉందన్న విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. అలాగే ఈ ఏడు రాష్ట్రంలో ఆశించిన మేరకు వర్షాలు కురవలేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలు పంట తడి కోసం కంట తడి పెడుతున్నారు. ఇటు వర్షాలు కురవక అటు విద్యుత్ లేక వాళ్లు నానా అవస్థలు పడుతున్నారు. అయినా ముఖ్యమంత్రి మాత్రం నివారణ చర్యల కంటే పొదుపు సూత్రాలనే వల్లిస్తున్నారు. ముఖ్యమంత్రి చెబుతున్నట్టు పొదుపు అనేది ఒక్కరోజులో సాధ్యం కాదు. అలాగే పొదుపు గురించి పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఉన్నదాంట్లో సర్దుకోవడం ఈ వర్గాల్లో మెజారిటీ ప్రజలకు అలవాటే. అట్లా అని ఉన్నత వర్గాలు కూడా విద్యుత్ దుబారా చేస్తామని అనలేము. కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో విద్యుత్ పొదుపు మాటేమిటని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇంట్లో అంటే పెద్దవాళ్లు హెచ్చరిస్తే పిల్లలు దాన్ని ఆచరిస్తారు. కానీ ప్రభుత్వ సిబ్బందిని ఎవరు గైడ్ చేయాలి. ఒకవేళ చెప్పినా వారు వింటారా? ఏళ్ల తరబడి ఒక ఛట్రంలో ఉన్న వాళ్లు ఉన్నపళంగా పొదుపు మంత్రం పాటిస్తారని అనుకోవడం భ్రమే అవుతుంది. వాళ్ల చేతి నుంచి కరెంటు బిల్లులు కడితే దాని గురించి ఆలోచిస్తారేమో! కానీ సర్కారు సొమ్మే కదా మాకేంటి అనే అలసత్వం వారిని ఆవరిస్తుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు బాధ్యత లేదన్నది మన ఉద్దేశం కాదు. వారి ఆలోచన కూడా యధా రాజా తథా ప్రజా అన్నట్టు ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి ఆశించిన పొదుపు మార్పు రావడానికి ఇంకా కొంత కాలం పడుతుంది.

రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఏనుగులాగా కళ్లముందు కనబడుతుంటే ముఖ్యమంత్రి ఆ సమస్య తీర్చకుండా సర్దుకుపోండి అంటున్నారు. ప్రభుత్వాధినేతగా ఉంటూ ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం కిరణ్‌కుమార్‌రెడ్డికే చెల్లింది. చాలా రోజుల తర్వాత సమావేశమైన కేబినేట్ సమావేశంలోనూ విద్యుత్ సమస్యపై ఎక్కువ చర్చ జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ సమస్యపై ఒకరు ఇద్దరు జూనియర్ మంత్రులు మినహా కిరణ్‌కు బాసటగా నిలవలేదంటే ఆయన వ్యవహారశైలిపై ప్రజలకే కాదు సహచర మంత్రుల్లోనూ అసంతృప్తి ఉన్నదని అర్థమవుతున్నది. తాను ఇరవై ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని బీరాలు పలికిన చంద్రబాబును విద్యుత్ ఉద్యమాలు దెబ్బతీశాయంటే అతిశయోక్తి కాదు. ‘ఉల్లి’ఘాటుకే ఢిల్లీలో ప్రభుత్వం కుప్పకూలిపోయిన విషయం మనకు విదితమే. ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కొట్టుమిట్టాడుతుంటే, కిరణ్ తన కుర్చీని కాపాడుకునేందుకు పాకులాడకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. లేకపోతే రచ్చబండ, ప్రజాపథం, ఇందిరమ్మ ఇలా ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల పేర్లు మారుతాయేమో కానీ ప్రజల తలరాతలు మారవనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తెరగాలి.
-రాజు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home