కడుపుపై కొట్టాడు.. కాలితో తన్నాడు: స్వాతి మాలీవాల్‌


దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో  సంచలన విషయాలు బైటికి వస్తున్నాయి. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి  పాల్పడినట్లు బాధితురాలు స్వాతి మాలీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. కడుపుపై కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో స్వాతి ఆరోపించినట్లు సమాచారం. అంతేకాకుండా సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు బిభవ్‌ కుమార్‌ కొట్టినట్లు ఆరోపించారు. 


ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడికి పాల్పడిన ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు బిభవ్‌ కుమార్‌ కొట్టినట్లు స్వాతి ఆరోపించారు. దీనిపై ఆమె వాంగ్మూలం తీసుకున్న పోలీసులు బిభవ్‌ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసులు గురువారం మాలీవాల్‌ ఇంటికి వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా దాడి జరిగిన ఘటనను ఆమె పోలీసులకు వివరించారు. సీఎం కేజ్రీవాల్‌ నివాసంలో బిభవ్‌ తన చెంపపై కొట్టి కాలితో తన్ని కర్రతో కొట్టినట్టు  స్వాతీ మాలీవాల్‌ వాపోయారని పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి. దాడి ఆరోపణలు నేపథ్యంలో ఆప్‌ ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గతంగా గాయాలైనట్టు ఈ పరీక్షల్లో తేలిందని వైద్యవర్గాలు తెలిపాయి. 


అటు ఈ ఘటనపై స్వాతి మాలీవాల్ మొదటిసారి స్పందించారు. తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని సోషల్‌ మీడియా ఎక్స్ వేదికగా ద్వారా పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు దీనిపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు రాసుకొచ్చారు. ఇటీవల రోజులు చాలా కష్టంగా గడిచాయని, తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ముఖ్యమైన ఎన్నికలు జరుగుతున్నాయని ఈ తరుణంలో స్వాతి మాలీవాల్‌ అంత ముఖ్యం కాదన్నారు. దేశంలో సమస్యలే ముఖ్యమని ఈ ఘటనను రాజకీయాల్లోకి  లాగవద్దని బీజేపీ శ్రేణులకు ప్రత్యేకంగా విన్నవించారు. 


గతంలో తనకు ఇలాంటి అనుభవాలే ఎదురైనట్టు ఆప్‌ మాజీ నాయకురాలు షాజియా ఇల్మి సంచలన ఆరోపణలు చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీలో కొట్టడం సర్వసాధారణమన్నారు. కేజ్రీవాల్‌ చెప్పింది చేయడమే బిభవ్‌ పని అని, అక్కడ కొట్టడం మామూలేనని ఆరోపించారు. ప్రశాంత్‌ కుమార్‌, యోగేంద్ర యాదవ్‌ లాంటి వాళ్లను గతంలో బౌన్సర్ల తో గెంటేశారని  ఈసారి హద్దులు దాటారని ఇల్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏతో ఒక మహిళను కొట్టించడం సరైనదేనా అని, ఘటనకు బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్‌ స్వాతి మాలీవాల్‌కు క్షమాణలు చెప్పి, సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Comments

Popular posts from this blog

ఏపీలో కూటమిలోకి బీజేపీ చేరిక లాభమెవరికి? నష్టమెవరికి?

ఆరు నెలల్లో అస్తవ్యస్త నిర్ణయాలు

కేబినెట్‌ కూర్పులో ఆ మూడు రాష్ట్రాలకు పెద్దపీట... ఎందుకంటే?