న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు మరో ఆరుగురిపై ఆదివారం కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రధాన కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈఓడబ్ల్యూ ఈ చర్య తీసుకుంది. మరోవైపు, ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించే అంశంపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ ఛార్జిషీట్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్యామ్ పిట్రోడా, సుమన్ దూబే తదితరుల పేర్లను ఈడీ చేర్చింది.
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) సంస్థకు సంబంధించిన ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వీరు నేరాలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపించింది. ఈ అంశంపై కోర్టు తన తీర్పును డిసెంబర్ 16న ప్రకటించనుంది. ఈడీ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే ముందు, నిందితులకు తమ వాదన వినిపించుకునే 'హక్కు' ఉందని కోర్టు గతంలో ప్రకటించింది. ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త క్రిమినల్ చట్టం సెక్షన్ 223 ప్రకారం నిందితులకు ఈ హక్కు లభిస్తుందని, ఇది క్రిమినల్ విచారణలలో పారదర్శకతను, న్యాయబద్ధతను బలోపేతం చేస్తుందని చెప్పారు.
కేసు మూలం
ఈ కేసు మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా మొదలైంది. ఏజేఎల్‌కు సంబంధించిన నిధులను కాంగ్రెస్ నాయకులు, సంస్థలు దుర్వినియోగం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐపీసీ సెక్షన్లు 403, 406, 420, 120బీ కింద నమోదైన ప్రాథమిక నేరం రౌస్ అవెన్యూ కోర్టులోనే విచారణలో ఉంది. పీఎంఎల్‌ఏ నిబంధనల ప్రకారం, ప్రాథమిక నేరం, మనీ లాండరింగ్ కేసు రెండింటినీ ఒకే కోర్టులో విచారించాల్సి ఉంటుంది.



