బనకచర్లపై వివాదం కొనసాగుతున్న సమయంలో ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందాం ఏపీ సీఎం చంద్రబాబు కొన్నిరోజుల కిందట అన్నారు. కేంద్రంలో మా మద్దతు తోనే మోడీ ప్రభుత్వం నడుస్తున్నదని మేము ఏమీ చెప్పినా నడుస్తుంది అని నారా వారు భావించారు. గోదావరి లో మిగులు జలాలు లేకున్నా చంద్రబాబు సముద్రంలో కలిసే నీటినే వాడుకుంటామని చెప్తూ చేసిన కుట్రలను బీఆర్ఎస్ పసిగట్టి ఎండగట్టింది. దీన్ని అడ్డుకోవాల్సిన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ మీద పడి ఏడ్చాడు. తెలంగాణ నీటిని ఏపీకి తరలించుకుపోండని కేసీఆర్ వదిలేశారని రేవంత్‌రెడ్డి వాదించారు. ఇది తెలంగాణ వాడు ఎవడైనా నమ్ముతాడా? అబద్ధమాడితే అతికినట్టు ఉండాలి కదా!
కానీ బనకచర్ల వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగే అన్యాయంపై కేసీఆర్, బీఆర్‌ఎస్ వాదనను కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకున్నది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టింది. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని, అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) తీర్పును పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులకు సీడబ్ల్యూసీని సంప్రదించడం అత్యవసరమని కమిటీ అభిప్రాయపడింది.
బడితె ఉన్నవాడిదే బర్రె అనే రోజులు పోయాయి బాబు. మీరు ఏది అనుకుంటే అది జరిగిపోవడానికి ఇది ఉమ్మడి రాష్ట్రం కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలి. మీ సహచరుడు మీకు పరోక్షంగా సహరించినా తెలంగాణ నీటి హక్కుల విషయంలో కేసీఆర్‌ది, బీఆర్‌ఎస్‌ది ఎప్పుడూ రాజీలేని పోరాటమే. ఇక్కడి ప్రజల చైతన్యంతో బనకచర్ల విషయంలో కేంద్రం ఏపీకి అనుమతి ఇవ్వకుండా వెనకడుగు వేసింది. అయితే ఈ విజయం పాక్షికమే. బాబు కుట్రలపై నిత్యం అప్రమత్తంగా ఉండాలి.
అన్న కొడుకు చంద్రశేఖర్ పెండ్లి చూపుల చర్చ మూడు రోజులుగా జరిగింది. చివరికి ఆ ఘడియ నేడు రానే వచ్చింది. పెండ్లి చూపులు, మాట ముచ్చట సిటీ కి పల్లెటూరి వాతావరణానికి చాలా తేడా స్పష్టంగా కనిపించింది. ప్రధానంగా అక్కడి వచ్చిన వాళ్లలో చాలామంది తరుచూ ఎక్కడో ఒక చోట కలుసుకోవడమో, కొంతమంది కామన్ బంధువులు ఉండటమో జరుగుతుంది. అందుకే మాట ముచ్చటే సందడిగా కనిపించింది. గొల్లపల్లి టూ గంగిపెల్లి ఎపీసోడ్ పాత తరం పెండ్లి చూపులను తలపించింది. ఎంత ఆధునిక యుగం వచ్చినా, సెల్‌ఫోన్‌లోనే ప్రపంచాన్ని దర్శించినా మానవసంబంధాలను అవేవీ భర్తీ చేయలేవు. మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడాలు అవి నేర్పించలేవు.
పిల్లనిచ్చే ముందు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడాలన్నది నానుడి. కానీ వచ్చిన వాళ్లను ఎలా అర్సుకున్నాం. వాళ్ల అభిమానం పొందామన్నది నేటి నానుడి. మూడు ముళ్ల బంధానికి ముందే రెండు కుటుంబాల సంబంధ బాంధవ్యాలు దానికి బాటలు వేస్తుంది. తెలంగాణలో పెండ్లే కాదు సుట్టాలు వచ్చినా, మాట ముచ్చట మాట్లాడుకున్నా మర్యాద చేయడం ఆనవాయితీ. పెండ్లికి రెండు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపి చేయి కడగడానికి ముందు జరిగే చర్చలు సంపూర్ణం కాగానే ఆ సంతోషాన్ని స్వీటుతో, ముందుతో సెలబ్రేట్ చేసుకోవడమే.
చాలారోజుల తర్వాత ఈ పెండ్లి చూపుల తతంగంలో భాగమవడమే కాదు ఆసాంతం చూసిన తర్వాత అక్కడ చూసిన భావోద్వేగాలు, పెద్దల అభిప్రాయాలు చూసిన తర్వాత నాలుగు విషయాలు రాయాలని అనిపించింది. నిజానికి ప్రతి మనిషి ఒక యూనిక్. ప్రతి మనిషి జీవితం ఒక కథ. అన్న మొండయ్య కొడుకు పెండ్లి కుదర్చడానికి చేసిన ప్రయత్నంతోపాటు మాట ఇచ్చిన కాబట్టి దానికే కట్టుబడి ఉండటం విశేషమే. మన అభిప్రాయం అందరికీ నచ్చవచ్చు. నచ్చకపోవచ్చు. కానీ పెండ్లి అంటే కట్నకానుకలు మాత్రమే కాదు మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఆయన నమ్మకం. దీనిపై మేం కొన్ని అంశాలపై విభేదించినా అంతిమంగా వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక పెండ్లి చేయాలనే నానుడిని చివరికి అందరూ నిజం చేశారు. ముందే చెప్పినట్టు ఈ మూడు పెండ్లి చూపుల తతంగం పాత తరాన్ని మరిపించింది. చాలారోజుల తర్వాత మా ఆసరి కుటుంబలోని చాలామందిని ఒక్కచోటికి చేర్చింది. 80లలో పడిన పెద్దనాయిన రాజయ్య చిన్నాన్నలు గట్టయ్య, ఓదెలు, అయిలయ్య, వెంకయ్యలు ఒక చోట కనిపించారు. మా తరం మా అయిలయ్య, నేను, శ్రీనన్న, రాజన్న, మా అక్షర కుమార్, మా తమ్ముళ్లు ఇద్దరు కుమార్‌లు,వెంకన్న కొడుకు రాజశేఖర్, అయిలయ్య కొడుకు రాజశేఖర్, కాబోయే వరుడు చంద్రశేఖర్, పెద్దవ్వ, మా అవ్వ, చిన్నమ్మలు, వదినలు, బంధువులమంతా ఇవాళ ఒక ఫ్రేమ్‌లో ఒదిగిపోయాం.
ఎర్ర బండల కాడ భూమిలో బాయి తవ్వాలి. అక్కడ మూడున్నర ఎకరాల చెలక ను రెండు పంటల భూమిగా మార్చాలన్నది ఆయన కల. తద్వారా ఆర్థికంగా కొంత బలోపేతమైతే పుట్టి పెరిగిన ఊరిలో కొన్ని పనులు చేయాలి అన్నది ఆయన ప్లాన్. అప్పటికే సింగరేణి నౌకరీ చేస్తున్నా కుటుంబ పోషణతో పాటు తన తమ్ముళ్లు, చెల్లె, బంధువుల్లో కొంతమంది బాధ్యతలు తీసుకున్నాడు. అందుకే రాంనగర్ లోని మా ఇల్లు జనతా గ్యారేజ్ ని తలపించేది.
మనిషి ఒకటి తలిస్తే విధి మరొకటి తలుస్తుంది. అదే జీవితం. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. బ్రెయిన్ ట్యూమర్ (మెడికల్ అధ్యయనం ప్రకారం) వ్యాధి ఆయన ఆరోగ్యాన్ని కుంగదీసింది. ఆ వ్యాధి తో మూడేళ్ళు పోరాడారు. చివరికి ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ కాలంలో ఇప్పుడున్న టెక్నాలజీ లేదు. అందుకే డాక్టర్లు కూడా ఈ పిడి స్ మీ ఇంట్లో ఎవరికైనా ఉన్నదా,.చిన్నప్పుడు తలకు.గాయమైందా అని ప్రశ్నించారు. అవి చెప్తే తనకు ఆపరేషన్ చేయరేమో అని ఆ రెండు నిజాలను నాయిన దాచారు. ఫలితంగా ఆపరేషన్ ఫెయిల్ ఫాదర్ డెడ్. మా జీవితాలు మళ్ళీ జీరో కు వచ్చాయి. కానీ అవ్వ సంకల్పం మమ్మల్ని అనేక సమస్యల నుంచి బైట పడేసింది. నాయిన పోయాక మేము ఏమై పోతామో అన్న చాలామంది సందేహాలకు అవ్వ 20 ఏండ్ల తన కష్టంతో సమాధానం చెప్పింది.
ఇల్లు కట్టినా మమ్మల్ని బాగా చదివించినా,మా పెండ్లిల్లు చేసినా ఏదో లోటు అవ్వను నిత్యం వెంటాడింది. అది ఒకటి నాయిన కల బాయి తవ్వడం. రెండోది గొల్ల పల్లి లో చిన్న ఇల్లు కట్టడం. అందులో మొదటి దానికి ఈ నెల 8న బీజం పడింది. జియాలజిస్ట్ సర్వే చేయడం పనులు మొదలు పెట్టడం చక చకా జరిగిపోయాయి. అన్న, నేను, చిన్నన వెంకయ్య, మా తమ్ముడు ఐలయ్య, తాత బండి ఓదెలు కొబ్బరి కాయ కొట్టి పనులు మొదలు పెట్టాం. మనం చేసే పనికి నలుగురి సహకారం దొరికితే ఆ సంతోషమే వేరు. మా బిడ్డలు రాజశేఖర్, చంద్రశేఖర్ (ఐలయ్య, మొండయ్య కొడుకులు) చేదోడు వాదోడుగా నిలిచారు.
కొబ్బరికాయ కొట్టి అన్న, నేను వెళ్ళిన తర్వాత 13 తేదీ నుంచి 26వరకు అక్కడే ఉండి మొత్తం పనులు పర్యవేక్షణ చేసింది మా డైరెక్టర్ అక్షర కుమార్. సినిమా మేకింగ్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ ఎక్కడ తను మెయింటెయిన్ చేశాడు. అందరినీ కో ఆర్డినేట్ చేస్తూ.. మాట్లాడుతూ, అప్ డేట్స్ ఎప్పటికప్పుడు మాకు షేర్ చేస్తూ పని పూర్తి అయ్యి గుమ్మడి కాయ కొట్టే వరకు బాధ్యత తీసుకున్నాడు. ఏదైనా దిగితే తప్పా లోతు తెలువదు అంటారు కదా ఇల్లు కట్టినప్పుడు అన్నీ చూసుకున్నాం. మా ఇంట్లో పెండ్లిళ్ళు, ఫంక్షన్స్ అన్నీ పనులు చేసుకున్న అనుభవం మాది. కానీ బాయి తవ్వడం మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు లోతుపాతులు అన్నీ అక్షర చూసాడు. పడుతూ లేస్తూ ఇక్కడి దాకా వచ్చిన మాకు మా అవ్వే అన్నీ. ఆమె బలంగా ఏదైనా కోరుకుంటే అది పూర్తి అవుతుంది మా నమ్మకం. బహుశా ఆమె సంకల్పానికి దైవం కూడా సహకరిస్తుంది అనిపిస్తుంది. నాయిన 35 ఏండ్ల కిందట జల సాకారం అయ్యింది అంటే అది అవ్వ, అక్షర పదిహేను రోజుల సహనం ఒకటి అయితే నాట్ నౌ నెవర్ అనుకున్న మా అభిప్రాయం కారణం. ఈ పదిహేను రోజుల ప్రయాణంలో చిన్న చిన్న ఆటంకాలు తప్పా సక్సెస్ ఫుల్ గా పని పూర్తి అయ్యింది. మా ఈ భగీరథ ప్రయత్నంలో మాకు అన్ని రకాలుగా సహరించిన మా కొడుకు బండి శ్రీనివాస్ (జేసీబీ ఓనర్) మా అల్లుళ్లు గెల్లు శేఖర్, గెల్లు అజయ్, జేసీబీ ఆపరేటర్ మహేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.
అనుకోకుండా వచ్చిన జర్నలిజం వృత్తిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. రాయడంలో మెళకువలు చెప్పిన పెద్దలు చాలామంది ఉన్నారు. కొవిడ్ సమయంలో ఉద్యోగాన్ని వదిలి కొంతకాలం రెస్ట్ తీసుకున్నాను. ఆ సమయంలోనే నా బ్లాగ్ లో నిత్యం నా అభిప్రాయాలు రాసేవాడిని. హుజురాబాద్ ఉప ఎన్నిక, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై అనేకం రాసిన. ఆ సమయంలో ఫీల్డ్‌లో ఉండి క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకున్న మా కామెర నవీన్, యాకయ్యలు ఇచ్చిన ఇన్ పుట్స్ చాలా ఉపయోగపడినాయి. 2018లో 88 సీట్లతో భారీ విజయాన్ని అందుకున్న కేసీఆర్‌కు ఆ ఉప ఎన్నిక ఫలితం కొంత చేదు అనుభవాన్ని మిగిల్చింది. అలా కొంతకాలం గడిచిన తర్వాత తిరిగి మళ్లీ నగరానికి చేరాను. ప్రారంభంలోనే కొన్నిరోజులు నవీన్ రూమ్ లోనే ఖాళీగా ఉన్న సమయంలోనే మా కట్టా శేఖర్ రెడ్డి సార్ 'విధాత'లో పనిచేయమని చెప్పాడు. అప్పటికి ఆ వెబ్‌సైట్ రొద్దం శ్రీనివాస్ అన్న చూస్తున్నారు. అలాస మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన. ఆ సమయంలో అనేక ఆర్టికల్స్ రాసే అవకాశం లభించింది.
అలా సాగుతున్న ప్రయాణం సమయంలోనే ఒకరోజు ఎర్రోజు శ్రీనివాస్ అన్న తన యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పారు. స్టార్ట్ చేసిన తర్వాత కంటెంట్ విషయం, వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ వంటి సమాచారం చెప్పారు. నువ్వు కూడా మొదలుపెట్టు. వ్యూస్ గురించి పట్టించుకోవద్దు. రోజూ ఛానల్‌ను యాక్టివ్‌లో ఉంచాలి. వార్తలు, విశ్లేషణలు నిత్యం ఉండేలా చూసుకోవాలి. ఆటోమేటిక్‌గా ఛానల్ పుంజుకుంటుంది అని చెప్పారు. రాయడం అలవాటు ఉన్న నాకు యూట్యూబ్‌లో వీడియోలు చేయడం కంటే ఆ కంటెంట్‌నే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రీల్ చేసి అప్‌లోడ్ చేసిన. ప్రారంభంలో కొంత నెమ్మదించినా క్రమంగా వ్యూస్ పెరిగాయి. వ్యూస్ బాగా రావడంపై ఎర్రోజు శ్రీనివాస్ అన్న, డాక్టర్ పారిపెల్లి శంకర్ సార్ లతో ఉన్న చర్చకు వచ్చింది. యూట్యూబ్ కంటెంట్‌లో నీదో పద్ధతి. అది కూడా కొంతమందికి నచ్చుతున్నది. అందుకే ఛానల్‌కు కొత్త సబ్‌స్క్రైబర్స్ తో పాటు వ్యూస్ వస్తున్నాయి. గో ఎహెడ్ అని ప్రోత్సహించారు.
నా యూట్యూబ్ ఛానల్ గురించి ఎన్నడూ వ్యక్తిగతంగా ప్రచారం చేసుకోలేదు. ఇటీవల నా హితం కోరే కొంతమంది స్నేహితులకు లింక్ షేర్ చేసి సబ్‌స్క్రైబ్ చేయడంతో పాటు అభిప్రాయం చెప్పమని కోరాను. వాళ్లంతా సానుకూలంగా స్పందించారు. కొన్ని సూచనలు చేశారు. వెయ్యి మంది సబ్‌స్క్రైబర్స్ అయ్యాక ఈ జర్నీ గురించి రాద్దామని అనిపించింది. 970కి పైగా సబ్‌స్క్రైబర్స్ వచ్చాక ఛానల్ పై చిన్న వీడియో ఒకటి వాట్సప్ లో షేర్ చేసిన. అలాగే తెలంగాణలో నియోజకవర్గాల పెంపుపై వీడియో చేసిన ఒక లింక్ ఒకటి కూడా షేర్ చేసిన. చాలామంది మిత్రులు సబ్‌స్క్రైబ్ చేసి మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు.
మనం ఏదీ ఆశించకుండా ఒక ప్రయత్నం మొదలుపెడితే దానికి మన వెల్ విషర్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. యూట్యూబ్ అనగానే థంబ్ నెయిల్స్, కాంట్రవర్సీ కాలంలో ఛానల్‌ను మంచి కంటెంట్‌తో నడపడం కత్తి మీద సామే. కానీ వ్యక్తిగత భావ స్వేచ్ఛలో భాగమైన ఈ మాధ్యమానికి బారికేడ్లు మనమే పెట్టుకోవాలన్నది నా అభిప్రాయం. మనం రాసే రాతలు అయినా, వీడియోలు అయినా ఇతరులకు నష్టం చేయకుండా ఉంటే అదే చాలు. ప్రారంభంలో చెప్పినట్టు అనుకోకుండా వచ్చిన ఈ వృత్తి ప్రస్థానంలో ఇది మరో మైలురాయి. నవలోకాన్ని స్వప్నించిన నాకు కాలం నిర్మించిన రహదారి 2025. థాంక్స్ టు ఆల్ మై సబ్‌స్క్రైబర్స్
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశారు. తన ఆడియో వైవీ సుబ్బారెడ్డి వద్ద ట్యాప్ అయి ఉందని, ఇది నిజమో కాదో సుబ్బారెడ్డి తన కుటుంబసభ్యుల మీద ప్రమాణం చేసి చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సుబ్బారెడ్డి చేతికి ఆ ఆడియో ఎలా వచ్చిందో విచారణకు పిలిచి ప్రశ్నించాలని, ట్యాపింగ్‌లో నిజాలు నిగ్గు తేల్చాలని షర్మిల అన్నారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
"కేసీఆర్, జగన్‌ల నీచ రాజకీయాలు"
"కేసీఆర్, జగన్ ఆనాడు నీచ రాజకీయాలు చేశారు. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ చేశారు. నేను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదని నాపై నిఘా పెట్టారు. నేను ఎవరిని కలుస్తున్నానో గ్రహించి నాకు మద్దతు ఇవ్వకుండా పెద్ద పెద్ద నాయకులను ఆపేశారు. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ చేసి జరిపిన కుట్రనే" అని షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.
సుబ్బారెడ్డి చేతిలో తన ఆడియో
"సుబ్బారెడ్డి చేతిలో నా ఆడియో ఉంది. స్వయంగా నేనే విన్నా. ఆస్తుల విషయంలో కుట్రలు పన్ని సుబ్బారెడ్డితో జగన్ అబద్ధాలు చెప్పించారు" అని షర్మిల వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయం వెలుగులోకి వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో విచారణ జరుగుతోందని ఆమె తెలిపారు. చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని షర్మిల స్పష్టం చేశారు.
జగన్ తీరుపై విమర్శలు
జగన్ తీరును "అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది" అంటూ షర్మిల విమర్శించారు. "ఇంత చేసిన జగన్‌కు ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం లేదు అంటే ఎలా? దొంగలు ఎక్కడైనా దొంగతనం చేశామని ఒప్పుకుంటారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో సుబ్బారెడ్డిని కూడా పిలిచి విచారణ జరపాలి" అని ఆమె డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్ణీత గడువులోగా జరగకపోవడంతో ఏడాదికి పైగా స్పెషల్ అధికారుల పర్యవేక్షణ కొనసాగుతున్నాయి. దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సరిగ్గా జరగడం లేదని, అభివృద్ధి పనులు జరగడం లేదని విపక్షాల విమర్శలకు తోడు తాము చేసిన పనులకు బిల్లులు రావడం లేదని మాజీ సర్పంచుల నిరసనలు జరుగుతున్నాయి. అయితే బీసీ రిజర్వేషన్ల ఖరారు అయ్యాకే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు అసెంబ్లీ బీసీ రిజర్వేషన్ల బిల్లు కూడా పెట్టింది. 18 నెలల రేవంత్ సర్కార్ పాలనపై అన్నివర్గాల ప్రజల్లో అసంతృప్తి ఉన్నదనే వాదన ఉన్నది. అయితే రుణమాఫీ, ఏడాది కాలంలోనే 50 వేలకుపైగా నియామకాలు చేపట్టామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఫ్రీ కరెంటు ఇస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. రేపు లేదా ఎల్లుండి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు ఒకేసారి విడుదల చేసి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై సర్కార్ క్లారిటీ ఇచ్చింది.
ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని చెప్పారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.
స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని.. కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పొంగులేటి సూచించారు. గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామన్నారు. వారం రోజుల్లో ‘రైతు భరోసా’, సన్నాలకు బోనస్‌ను రైతుల ఖాతాల్లో జమచేస్తామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నేతలదేనని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అందుకే ఎవరూ ఏమైనా మాట్లాడుతారనే నానుడి ఉండనే ఉన్నది. దాన్ని అప్పుడప్పుడు పార్టీ నేతలు నిజం చేస్తుంటారు. ఖైరతాబాద్ టికెట్ ఆశించిన దివంగత జనార్ధన్ రెడ్డి కూతురు కార్పొరేటర్ విజయారెడ్డి బీఆర్ఎస్‌పై అసంతృప్తితో హస్తం గూటికి చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన విజయారెడ్డి బీఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ చేతిలో 22,010 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో ఆయన కారు దిగి కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నడుస్తున్నది. దానం నాగేందర్ , కార్పొరేటర్ విజయా రెడ్డి అనుచరులు బాహాటంగానే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నేడు కూడా బంజారాహిల్స్ లేక్ వ్యూలో జరిగిన నియోజకవర్గ స్థాయిసభలో దానం నాగేందర్, విజయా రెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో ఇరువర్గాల అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ పరిణామాలు చూసిన డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారని అసంతృప్తితో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆంధ్రజ్యోతిలో జర్నలిజం విద్యార్థిగా మొదలైన నా ప్రస్థానం ఆ తర్వాత నమస్తే తెలంగాణలో సుమారు దశాబ్దకాలం పాటు సాగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక ఘట్టాల అన్నింటిపై వ్యాసాలురాసే అవకాశం నాకు దక్కింది. అలాగే నేను రాయగలను అని మొదటిసారి గుర్తించి కీ.శే. కార్టూనిస్టు శేఖర్ గారు. వారు నేను రాసిన చిన్న ఆర్టికల్ జనపక్షం జంగారెడ్డి కి పంపారు. అలా మొదటిసారి నా పేరుతో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. అప్పటి నుంచి ప్రధాన పత్రికలతో పాటు, జనం సాక్షి, జన పక్షం, వెలుగు, మిషన్ తెలంగాణ, విధాత, తెలుగు స్క్క్రైబ్, తెలుగు గ్లోబల్ ఇలా అనేక వేదికల ద్వారా నా అభిప్రాయాలు రాసిన. ఆయా యాజమాన్యాలు నాకు అందించిన సహకారానికి ధన్యవాదాలు.
అలాగే జర్నలిజం స్కూల్ లో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ మాకు క్లాసులు చెప్పేవారు. అప్పటికి ఆయన ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ఉన్నారు. ఆ సమయంలోనే వివిధ అంశాలపై మీ అభిప్రాయాలు రాసుకోండి. అయితే అందరికీ ప్రధాన పత్రికల్లో స్పేస్ దొరకకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో పోస్టు చేసుకోవచ్చు అని సూచించారు. అప్పటికి ఆర్కూట్, గూగుల్ ఫ్లస్ వంటివి ఉన్నాయి. ఆ తర్వాత ఫేస్ బుక్, ట్విటర్, ఇన్ స్టా, లింక్ డిన్ లాంటివి అనేకం వచ్చాయి. ఉద్యమసమయంలో సోషల్ మీడియాతో పాటు నా బ్లాగ్ లో వాటిని పోస్టు చేసే వాడిని. వివిధ పత్రికలకు రాసినవి కూడా ఇందులో పోస్టు చేసే వాడిని. ఈ బ్లాగ్ క్రియేట్ చేసింది. దీనికి సంబంధించి అవగాహన కల్పించింది మిత్రుడు బీ రెడ్డి నగేశ్ రెడ్డి. మిత్రుడికి ధన్యవాదాలు.
ఈ పాత్రికేయ ప్రయాణంలో అనేక ఉత్థానపతనాలు చూసిన. అయితే వేణుగోపాలస్వామి, జ్యోతింద్రనాథ్ గార్లు నాకు మంచి సహకారాన్ని అందించారు. ఎడిటింగ్ విషయంలో, వివిధ అంశాలపై నాకు అవగాహన కల్పించారు. వారికి ధన్యవాదాలు. ఈ మొత్తం ప్రయాణంలో నమస్తే తెలంగాణ లో పనిచేస్తేనే అదే సమయంలో రైతుబడి పేజీ చూసే బాధ్యత మా అప్పటి ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి నాకు కల్పించారు. ఎడిట్ పేజిలో ఆర్టికల్ రాయమని అల్లం నారాయణ సార్, శేఖర్ రెడ్డిలు ప్రోత్సహించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ వాదాన్ని వినిపించడం, రైతు బడి ద్వారా సాగు సమస్యలతో పాటు, రైతుల సక్సెస్ స్టోరీలో అనేకం రాసిన. మొన్న ఎన్నికల సమయంలో విధాతలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలపై అనేక విశ్లేషణలు రాసిన. నన్ను ఎంకరేజ్ చేసిన కోటి రెడ్డి, జగన్ అన్నలకు థ్యాంక్స్. ఇక గత ఏడాది కాలంగా తెలుగు గ్లోబల్ లో వివిధ అంశాలపై నా అభిప్రాయాలు రాస్తున్న. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై అనేకం రాసిన. నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన సరిత మేడమ్, మా కామెర నవీన్ లకు కృతజ్ఞతలు. ఈ మొత్తం పదిహేడు ఏండ్ల ప్రయాణంలో రైతు నేస్తం వాళ్లు ఇచ్చిన అవార్డు తర్వాత వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా వాళ్లు ఇచ్చి అవార్డులు వృత్తిలో నా కృషికి గౌరవంగా భావిస్తాను.
పనిచేయడమే తప్పా, ఎన్నడూ ఏ గుర్తింపు కోరుకోలేదు. అందుకే ఇప్పటివరకు నా గురించి రాసుకోలేదు. ఇన్నేండ్ల తర్వాత వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చిన తర్వాత ఒకసారి మననం చేసుకుని వాటన్నింటినీ అక్షర రూపంలో పెట్టిన. ఈ అవార్డుకు నా పేరు ప్రతిపాదించిన రాణా ప్రతాప్ అన్నకు, నిత్యం నాకు అండగా ఉండే డాక్టర్ పారిపెల్లి శంకర్, డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్, డాక్టర్ పడాల లక్ష్మణ్, బెక్కం వేణు లకు శనార్థులు. నేను పనిచేసినా, నేనంటే ఇష్టపడే మా కుటుంబసభ్యులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. అవ్వ కు స్పెషల్ థ్యాంక్స్. ఇక ఇవాళ ఫాదర్స్ డే అంట కదా. నాకే మా అందరికీ రోల్ మోడల్ మా నాయన కొమరయ్య. ఈ చిన్న అవార్డు నాయనకు అంకితం.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన నాటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది. కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్నది. ఇప్పటికే ఈ కమిషన్ గడువును ఆరు సార్లు పొడిగించింది. ఈ కమిషన్ కేసీఆర్ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నెల 5న ఆయన విచారణకు హాజరుకావాల్సింది. అయితే వాయిదా కోరడంతో నేడు (జూన్ 11న) రావాలని చెప్పింది. ఈ నేపథ్యంలోనే బుధవారం మాజీ సీఎం కేసీఆర్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఉదయం 11:30 గంటలకు ఈ విచారణ ప్రారంభంకానున్నది. ఈ నెల 6న ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్, 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణకు హాజరయ్యారు. ఇప్పటివరకు మీడియా, కమిషన్‌లోని ఇంజినీర్ల సమక్షంలోనే విచారణ జరిగింది.
కమిషన్ విచారణకు హాజరయ్యే ముందే కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతలు మంగళవారం మరోసారి సమావేశమై పలు అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. హరీశ్‌రావుతో కమిషన్ చర్చించిన విషయాలతోపాటు అదనంగా అడిగే అవకాశం ఉన్న అంశాల గురించి కూడా లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టింది. కేసీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు బూర్గుల రామకృష్ణారావు భవన్ వద్దకు చేరుకుంటారని తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొణతం ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వైఫల్యాలపై పోస్టులు పెడుతున్న ఆయనపై ప్రభుత్వం ఇప్పటికే 15 కేసులు నమోదు చేసింది. వివిధ కేసుల్లో ఆయన న్యాయస్థానాల ద్వారా ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఆయా కేసుల్లో విచారణకు హాజరవుతున్నారు. హైకోర్టు అనుమతి తీసుకుని అమెరికా వెళ్లిన దిలీప్ కొణతం తిరిగి వస్తుండగా నిన్న హైదరాబాద్ విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావడానికి కొన్ని గంటల ముందే దిలీప్ కొణతంను అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ కుట్రలో భాగమేనని గులాాబీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
బీఆర్ఎస్ సోషల్ మీడియాను చూసి భయపడుతున్న కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అంటున్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ తో రేవంత్ సర్కార్ ప్రశ్నించే గొంతులను అడ్డుకోలేదని దిలీప్ కొణతం సహా చాలామంది నినదిస్తున్నారు. ఉద్యమ సమయంలో ఇలాంటి కేసులు, నిర్బంధాలను అనేక ఎదుర్కొన్నామని, ఇవేవీ మాకు కొత్తకాదు అంటున్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా ఎన్ని కేసులు పెట్టినా ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తామంటున్నారు. మేము నిజం వైపే నిలబడుతామంటున్నారు.
ఆర్టీసీ బస్‌పాస్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జాగృతి కార్యకర్తలు బస్‌భవన్‌ను ముట్టడించారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కవితను అరెస్ట్ చేసి చంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బస్‌పాస్ ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. ‘‘ప్రభుత్వం నిర్ణయంతో విద్యార్థులు, చిరుద్యోగులపై ఆర్థిక భారం పడుతుంది. ఈ పెంపుతో ఒక్కో ప్రయాణికుడిపై నెలకు దాదాపు రూ.300కిపైగా భారం పడుతుందని అంచనా. ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటు పడింది. అనేక రూట్లలో విద్యార్థుల కోసం బస్సులు నడపడం లేదని ఫిర్యాదులున్నాయి’’అని కవిత అన్నారు.
నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్, అప్పటి ఎడిటర్ అల్లం నారాయణ, సీఈవో కట్టాశేఖర్ రెడ్డి, ఎండీ సీఎల్ రాజం తదితరుల చేతుల మీదుగా నమస్తే తెలంగాణ పేపర్ ప్రతి విడుదలైంది. 2007లో ఆంధ్రజ్యోతిలో జర్నలిజం విద్యార్థిగా మొదలు పెట్టి ట్రైనింగ్ పూర్తికాగానే కొన్ని రోజులు (బహుశా 15 రోజులే అనుకుంటా) రంగారెడ్డి డెస్క్ లో సబ్ ఎడిటర్‌గా పనిచేసిన. ఆ తర్వాత మా జర్నలిజం ప్రిన్సిపల్ సూచన మేరకు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో పనిచేయడానికి ఎడిట్‌పేజీ డెస్క్ కు మారాను. జర్నలిజంలో నేర్చుకున్న దానికంటే ఎడిట్ పేజీలో వచ్చే ఆర్టికల్స్ (మేమే ప్రథమ పాఠకులం మా జ్యోతింద్రనాథ్ అన్నట్లు) ద్వారా అనేక విషయాలపై అవగాహన పెరిగింది. మా సీనియర్లు, మా బ్యాచ్ వాళ్లు జిల్లాల్లో, సెంట్రల్ డెస్క్ లో పనిచేస్తుంటే నేను మాత్రం ఎడిట్ పేజీలో చేయడం ప్రారంభంలో కొంత అసంతృప్తి ఉండేది. కానీ అది తాత్కాలికమే అయ్యింది.
అప్పటి నుంచి నమస్తే తెలంగాణలో 2011 ఏప్రిల్ చేరే వరకు చాలా విషయాలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఎడిట్ పేజీలో పనిచేస్తున్న కాలంలోనే వేణుగోపాల స్వామి తో పరిచయం. వర్తమాన, సామాజిక అంశాలపై సార్ నిత్యం చెప్పేవారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలని సొంత పార్టీ, సొంత పత్రిక ఉండాలని జయశంకర్ సార్ నొక్కి చెప్పేవారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో సీమాంధ్ర యాజమాన్యంలో నడుస్తున్న పత్రికలు అసత్యాలు ప్రచారం చేసేవి. వాటికి కౌంటర్ ఇచ్చే తెలంగాణ పత్రికలు అంతగా లేవు. అల్లం నారాయణ ఎడిటర్‌గా, కట్టా శేఖర్ రెడ్డి సీఈవోగా నమస్తే తెలంగాణ పత్రిక రానున్నదని తెలిసింది. అయితే అప్పటికి తెలంగాణ రాలేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ సమయంలో నమస్తేలో పనిచేయడానికి చాలామంది సీనియర్లు సాహసం చేయలేదు. తెలంగాణను బలంగా కోరుకునే కొంతమంది నమస్తేలో జాయిన్ అయ్యారు. ఆ సమయంలోనే వేణుగోపాల స్వామి సార్ జ్యోతికి రిజైన్ చేసి అక్కడికి వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లిన కొన్నిరోజులకు నన్ను రమ్మని అడిగారు. ఎడిట్‌పేజీలో పనిచేయడం వల్ల అల్లం నారాయణ, కట్టాశేఖర్ రెడ్డి సార్లతో పాటు కృష్ణమూర్తి (అప్పటి సెంట్రల్ డెస్క్ ఇన్ ఛార్జి, ప్రస్తుత విజయక్రాంతి ఎడిటర్), మార్కండయ (నెట్‌వర్క్ ఇన్ ఛార్జి, ప్రస్తుత దిశ పేపర్ ఎడిటర్) కి నేను కొత్తగా పరిచయం చేసుకునే అవకాశం రాలేదు. వేణుగోపాల స్వామి గారు నా కోసం గట్టిగా ప్రయత్నించడం వల్ల అక్కడికి వెళ్లాను. అదే సమయంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్‌గా ఉన్న కె. శ్రీనివాస్ సార్‌కు వెళ్తాను అనగానే ఆలోచించు అన్నారు కానీ వద్దని అనలేదు.
అలా నమస్తే అడుగుపెట్టిన నాకు అనతికాలంలోనే చాలామందితో సన్నిహితం పెరిగింది. ఆ పత్రికలో పనిచేయడం ఆ సమయంలో ఒక ఉద్వేగం. ఎందుకంటే తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడు, లోక్‌సభలో, రాజ్యసభలో బిల్లు పాసైనప్పుడు ఆఫీసు ముందు సంబరాలు చేసుకున్నాం. ఎడిట్ పేజీ, న్యూస్ ద్వారా అనేక వాస్తవ అంశాలను నమస్తే తెలంగాణ పాఠకుల దృష్టికి తీసుకెళ్లింది. అందుకే అనతి కాలంలో ఆ పత్రికకు మంచి ఆదరణ దక్కింది. ఎడిట్ పేజీలో పనిచేస్తూనే 'రైతుబడి' ద్వారా రైతులకు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సక్సెస్ స్టోరీలు అందించాం. నమస్తే లో పనిచేస్తున్న సమయంలోనే దీక్షాదివస్, రాష్ట్ర ఆవిర్భావం మొదలు తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక ఘట్టాలపై ఆర్టికల్ రాసే అవకాశం నాకు దక్కింది. ఆ పత్రికతో నాది దాదాపు తొమ్మిదేళ్ల (2011-2020) ప్రయాణం. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి మారాను. కెరీర్‌లో అక్కడ పనిచేసిన కాలంలో ముఖ్యంగా 2011-2016 వరకు చాలా సంతృప్తి కలిగింది. ఎందుకంటే కొన్ని నమస్తే తెలంగాణ మాత్రమే రాయగలదు అన్నది అప్పుడు రుజువువైంది. ఆ పత్రిక పురుడు పోసుకుని 14 ఏండ్లు అవుతున్న సందర్భంగా అనేక జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడాయి. అందుకే కొన్ని అంశాలను రాసే ప్రయత్నం చేసిన. నమస్తే తెలంగాణ మిత్రులకు పత్రిక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించాలని కేబినెట్ నిర్ణయించించి. ప్రస్తుతం ఒక డీఏ, ఆరునెలల తర్వాత మరో డీఏ చెల్లిస్తాం.
రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మేలు చేసే విధంగా క్యాబినెట్ నిర్ణయాలు
ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. బీమాకు ఉద్యోగులు ప్రతినెలా రూ.500చెల్లిస్తే.. ప్రభుత్వం కూడా కొంత చెల్లిస్తుంది. ఉద్యోగులు, ప్రభుత్వం చెల్లించే డబ్బులను ట్రస్టులో జమ చేస్తాం. ఉద్యోగులకు ఏవైనా ఆరోగ్య ససమస్యలు వస్తే ట్రస్టు ద్వారా డబ్బులు చెల్లిస్తాం.
ఉద్యోగులకు సంబంధించిన బిల్లుల పెండింగ్ బకాయిలను నెలకు రూ.700 కోట్లకు తగ్గకుండా చెల్లిస్తాం. పెండింగ్ బకాయిలను నెలల వారీగా క్లియర్ చేస్తాం.
గతేడాది 385 మంది మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు మరణించారు. మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు మరణిస్తే రూ.10లక్షలు ఇచ్చేందుకు నిర్ణయం.
కొత్తగూడెంలోని ఎర్త్ సైన్స్ వర్సిటీకి మన్మోహన్‌సింగ్ పేరు పెట్టేందుకు క్యాబినెట్ నిర్ణయం
హోమ్ విధానంలో రోడ్ల ఆధునికీకరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఆర్‌అండ్‌బీ పరిధిలో 5,100 కి.మీ, పంచాయతీరాజ్ పరిధిలో 7,947 కి.మీ రహదారులు ఆధునికీకరణ.
రూ.19,575 కోట్లతో సుమారు 86 కి.మీ మెట్రో నిర్మాణానికి కేబినెట్ నిర్ణయం
ఈ మధ్య నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజేంద్రప్రసాద్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆయన కూతురు చనిపోయిన బాధలో ఉన్నారని అందుకే ఆయన అలా వ్యవహరిస్తున్నారని అలీ వివరణ ఇచ్చారు. అన్నివర్గాల నుంచి ఆయన వ్యవహారశైలిపై, వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ తన వ్యాఖ్యలపై విమర్శల నేపథ్యంలో ఎమోషనల్‌గా స్పందించారు. ఇకపై ఎవరినీ 'నువ్వు' అని పిలవనని, అందరినీ గౌరవంగా 'మీరు' అని సంబోధిస్తానని వాగ్దానం చేశారు.
అయితే బూతులు మాట్లాడటం, సినిమా ఫంక్షన్లలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజేంద్రప్రసాద్ తోనే మొదలు కాలేదు. ఆయనతోనే ముగిసిపోవు. అయితే జనంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడన్నలన్న సోయి వాళ్లకు ఉండకపోవడమే దీనికి కారణం అంటున్నారు. పైగా తాము స్టార్స్ అని, మేము ఏమి మాట్లాడినా చెల్లుతందనే భావనలో కొంతమంది ఉంటారని పౌర సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. సినిమా, క్రికెట్, రాజకీయ నాయకులంటే ప్రజలకు కొంత అభిమానం ఉంటుంది. అందుకే వాళ్లను అనుకరించే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే వీళ్లు అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొంతమంది నటుల తీరుతో జనాలు విస్తుపోతున్నారు.
రాజేంద్రప్రసాద్ అయితే ఒకసారి కాదు ఇటీవల కాలంలో వరుసగా నోటికి వచ్చినట్లు మాట్లాడి వార్తల్లో నిలిచారు. అంతా అయిపోయాక ఇప్పుడు అందరినీ గౌరవంగా మీరు అని పిలుస్తానని వివరణ ఇచ్చారు. ఇది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుంది. ఎందుకంటే నాలుగు దశాబ్దాలుగా నటుడిగా ముఖ్యంగా తన కామెడీతో అందరి అభిమానం పొందిన ఆయన ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో అభాసుపాలయ్యారు. ఆయనపై ఉన్న గౌరవాన్ని ఆయనే తగ్గించుకున్నారు. ఇంత జరిగాక పశ్చాత్తపపడ్డ ఆయన ఇక నుంచైనా పద్ధతిగా ఉంటారని ఆశిద్దాం.
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి కోసం ఊళ్లను వదిలి వచ్చిన వాళ్లు లక్షల్లో ఉంటారు. అందుకే ఆ ప్రాంతంలో సింగరేణి గనుల్లో ప్రత్యక్షంగా లక్షకు పైగా మందికి ఉపాధి కల్పిస్తే పరోక్షంగా వేలాది మందికి ఆశ్రయం కల్పించింది. కానీ చంద్రబాబు హయాంలో ప్రవేశపెట్టి వీఆర్ఎస్ ఫలితంగా ఆ సంఖ్య క్రమంగా తగ్గుతూ.. ప్రస్తుతం సుమారు 40 వేల వరకు వచ్చింది. సంస్థ ఉత్పత్తి వేటలో పడి కార్మికుల సంక్షేమాన్ని మరిచింది. ఫలితంగా పదవీ విరమణ చేసిన కార్మికులు పది పన్నెండేళ్ల కంటే ఎక్కువగా బతకడం లేదు. దీనికి కారణం అక్కడ పెరిగిపోయిన కాలుష్యం.
అండర్ గ్రౌండ్ గనులు, ఓపెన్ కాస్టులకు తోడు ఎన్టీపీసీ, తాజాగా ఎఫ్ సీ ఐ వల్ల అక్కడ పర్యావరణలో చాలా మార్పులు వచ్చాయి. ఎండాకాలంలో ఏసీలు కూడా పనిచేయని పరిస్థితి వచ్చింది. ఉడుకపోతకు తోడు గాలిలో తేమ వల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అక్కడి వాతావరణం అనుకూలించడం లేదు. ముఖ్యంగా అక్కడి కాలుష్యం వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. కాలుష్యం వల్ల కోల్ మైన్స్ లో పనిచేసిన వారికి గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు కార్పొరేట్ హాస్పిటల్స్ లో సర్వీసులు అందడం లేదనే విమర్శలున్నాయి. సింగరేణి ఉత్పత్తి, అభివృద్ధిలో భాగస్వాములైన కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత సంస్థ యాజమాన్యంపై ఉన్నది.
కోల్ బెల్డ్ ఏరియాలో కొత్తగా ఉపాధి అవకాశాలు లేకపోయినా నష్టం లేదు. ఎందుకంటే డిపెండెంట్ ఉద్యోగాలు లేవన్న నాడే కార్మికులు వారి పిల్లలను ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్య కోర్సులు చదివించారు. దీంతో 90వ, 2000వ దశకం నుంచి అక్కడి విద్యార్థుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు చాలామంది యూత్ వారి వారి వృత్తుల్లో స్థిరపడ్డారు. అయితే ప్రస్తుతం రామగుండం, గోదావరిఖనిలో జరగాల్సిన పని ఒకటి ఉన్నది. అది ప్రజల భాగస్వామ్యంతో పాలకులు చేయాల్సింది ఏమింటే అక్కడ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. మొక్కలు విరివిగా పెంచాలి. వాటిని సంరక్షించాలి. నీటి కాలుష్యాన్ని తగ్గించాలి. అక్కడి ప్రభుత్వ, సింగరేణి ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. మంచి వైద్యం అందించాలి. అలాగే జూనియర్, డిగ్రీ కాలేజీలు కూడా పెరగాలి. పర్యావరణ పరిరక్షణ అనేది నినాదంగా కాకుండా విధానంగా మారాలి. ప్రజల్లో ఆ చైతన్యాన్ని పెంపొందించాలి. అప్పుడే ఆ పారిశ్రామిక ప్రాంతం నిజంగా ప్రగతి పథంలో నడిచినట్టు అవుతుంది.
ఉక్రెయిన్ క్రిమియా వంతెనపై చేసిన తాజా దాడిపై రష్యా అధికారికంగా స్పందించింది. పేలుడును ధృవీకరించింది కానీ నిర్మాణ నష్టం లేదని పేర్కొన్నది. ఉక్రెయిన్ SBU సపోర్ట్ పిల్లర్ కింద పేలిన ఘటనను నీటి అడుగున ఫుటేజీని విడుదల చేసింది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పేలుడును అంగీకరించారు. అయితే వంతెన పనిచేస్తుందని చెప్పారు. 2022 నుండి సింబాలిక్ నిర్మాణంపై ఇది మూడవ ఉక్రేనియన్ స్ట్రైక్ . ఈ వంతెనను రష్యన్ సైనిక ఆస్తులను రవాణా చేయడానికి ఉపయోగించే వ్యూహాత్మక లక్ష్యంగా పరిగణిస్తుంది.