Tuesday, 16 June 2026

జూన్ 19న స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పంద సదస్సు


  • బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌ వేదికగా అవగాహన ఒప్పందంపై అధికారిక సంతకాలు
  • గల్ఫ్ యుద్ధానికి స్వస్తి పలికే మెగా దౌత్య పర్వానికి ముస్తాబవుతున్న స్విస్ వేదిక!


అమెరికా , ఇరాన్ దేశాల మధ్య పశ్చిమాసియా భీకర యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలికే చరిత్రాత్మక అవగాహన ఒప్పందం  అధికారిక సంతకాల వేదిక ఖరారైంది. అంతర్జాతీయ దౌత్య రంగానికి అత్యంత నమ్మకమైన చిరునామాగా నిలిచే స్విట్జర్లాండ్ దేశం ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వబోతోంది. జూన్ 19వ తేదీ శుక్రవారం నాడు స్విట్జర్లాండ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన, సుందరమైన ‘బర్గెన్‌స్టాక్’ (Burgenstock) రిసార్ట్‌లో ఈ అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పంద సంతకాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబోతోందని స్విస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారంఅధికారికంగా ప్రకటించింది.  కొన్నిరోజులుగా ఈ దౌత్యపరమైన వేదికపై అంతర్జాతీయ మీడియాలో రకరకాల ఊహాగానాలు రాగా.. వాటన్నింటికీ తెరదించుతూ స్విస్ ప్రభుత్వం ఈ అధికారిక ప్రకటనను వెలువరించింది.



ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన 15 వారాల గల్ఫ్ సంక్షోభాన్ని ముగించడంలో,  చమురు రవాణాకు ఆయువుపట్టైన హార్ముజ్ జలసంధిని తిరిగి అంతర్జాతీయ నౌకల కోసం తెరిపించడంలో ఈ అవగాహన ఒప్పందం అత్యంత కీలకమైన మైలురాయిగా మారనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని వాషింగ్టన్ దౌత్య ప్రతినిధులు,  టెహ్రాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ శాంతి పత్రాలపై బర్గెన్‌స్టాక్ వేదికగా సంతకాలు చేయనున్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని విజయవంతం చేయడానికి , ఇరు దేశాల రక్షణ ప్రతినిధులకు అత్యున్నతస్థాయి భద్రతతో కూడిన నిష్పాక్షిక వాతావరణాన్ని కల్పించడానికి స్విస్ విదేశాంగ శాఖ ఇప్పటికే అన్నిరకాల పరిపాలనాపరమైన, రక్షణ ఏర్పాట్లను ముమ్మరం చేసింది.


గతంలో కూడా అనేక అంతర్జాతీయ శాంతి చర్చలకు, వివాదాల పరిష్కారాలకు వేదికగా నిలిచిన చరిత్ర బర్గెన్‌స్టాక్ పర్వత రిసార్ట్‌కు ఉంది. ఈ ప్రతిపాదిత ఒప్పందం కుదిరిన తర్వాత.. ఇరాన్ అణు కార్యక్రమాల పరిమితులు, అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల శాశ్వత రద్దు ,ఫ్రీజ్ చేసిన ఇరాన్ అంతర్జాతీయ ఆస్తుల బదిలీ వంటి అత్యంత సంక్లిష్టమైన రక్షణ అంశాలపై ఇరు దేశాల మధ్య 60 రోజుల పాటు సుదీర్ఘ సాంకేతిక చర్చలు ప్రారంభం కానున్నాయి. పాకిస్థాన్, కతార్ వంటి దేశాల తెరవెనుక మధ్యవర్తిత్వంతో సాధ్యమైన ఈ అంతర్జాతీయ దౌత్య విజయం.. జూన్ 19న స్విట్జర్లాండ్ వేదికగా అధికారిక చట్టరూపం దాల్చబోతుండటంతో యావత్ అంతర్జాతీయ సమాజం ఈ చరిత్రాత్మక రోజు వైపు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఫిఫా వరల్డ్ కప్ 2026 అల్బమ్‌లో నోరా ఫతేహి సరికొత్త రికార్డు



  • ‘సీర్ సీర్’ అఫీషియల్ సాంగ్‌తో ఇంటర్నేషనల్ రేంజ్‌లో దుమ్మురేపిన బాలీవుడ్ స్టార్
  • కెనడా, మొరాకో, ఇండియన్ సంస్కృతుల కలయికగా నిలిచిన ఫుట్‌బాల్ ఆంథెమ్


ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కోట్లాదిమంది అభిమానించే క్రీడా పండుగ ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ (FIFA World Cup 2026) అధికారిక మ్యూజిక్ ప్రాజెక్టులో భారతదేశానికి అద్భుతమైన గుర్తింపు లభించింది. బాలీవుడ్ స్టార్ అండ్ గ్లోబల్ పెర్ఫామర్ నోరా ఫతేహి (Nora Fatehi) ఈ మెగా టోర్నమెంట్  అఫీషియల్ మ్యూజిక్ అల్బమ్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ.. తన సరికొత్త అంతర్జాతీయ సింగిల్ సాంగ్ ‘సీర్ సీర్’ (Siir Siir) ను వైభవంగా విడుదల చేసింది. ప్రసిద్ధ అంతర్జాతీయ మ్యూజిక్ ప్రొడ్యూసర్ సంజోయ్ (Sanjoy), ఫ్రెంచ్ సింగర్ వెజెడ్రీమ్ (Vegedream) లతో కలిసి నోరా చేసిన ఈ క్రేజీ కొల్లాబరేషన్ సాంగ్.. ఫిఫా విడుదల చేసిన అధికారిక 18 ట్రాక్‌ల మ్యూజిక్ అల్బమ్‌లో చోటు దక్కించుకుంది. టోర్నమెంట్‌లో భాగంగా కెనడా, మెక్సికో, అమెరికా దేశాలలో సాగబోయే ఈ అతిపెద్ద ఫుట్‌బాల్ సంబరానికి ఈ సాంగ్ మరింత ఊపును తీసుకువస్తోంది. 



ఈ అంతర్జాతీయ మైలురాయిపై నోరా ఫతేహి ఎంతో భావోద్వేగంగా స్పందిస్తూ.. ఫిఫా వరల్డ్ కప్ వంటి ప్రతిష్టాత్మక ప్రపంచ వేదికపై ‘సీర్ సీర్’ పాట ద్వారా భారతదేశానికి, దక్షిణాసియా (సౌత్ ఏషియన్) పాప్ సంస్కృతికి ఒక బలమైన ప్రాతినిధ్యాన్ని అందించడం తనకెంతో గర్వకారణంగా ఉందని పేర్కొంది. తన కెరీర్ ఎదుగుదలలో స కీలకపాత్ర పోషించిన, తనకు అపరిమితమైన ప్రేమాభిమానాలను అందించిన భారతదేశ ప్రభావంతో పాటు, తన సొంత మొరాకో, కెనడియన్ మూలాలను కూడా కలిపి.. యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకునేలా ఒక గ్లోబల్ ఆంథెమ్‌గా దీనిని తీర్చిదిద్దినట్లు వివరించింది. మొరాకో స్టేడియాల్లో అభిమానులు గట్టిగా అరిచే ‘సీర్ సీర్’ (అంటే పదండి.. పదండి లేదా ముందుకు సాగండి) అనే ఫుట్‌బాల్ నినాదం ఆధారంగా ఈ పాటను కంపోజ్ చేశారు. కేవలం మైక్రోఫోన్ ముందు పాడటమే కాకుండా.. ఈ పాట వెనుక ఉన్న క్రూ, కొరియోగ్రాఫర్, బ్యాక్ గ్రౌండ్ డాన్సర్లు , స్టైలింగ్ టీమ్‌లలో అత్యధిక శాతం మంది భారతీయులనే ఉంచి.. తెర వెనుక కూడా ఒక బలమైన ‘ఇండియన్ కనెక్ట్’ ను నోరా నిరూపించింది. 


మొరాకో దేశపు అందమైన లోకేషన్లలో అద్భుతమైన నిర్మాణ విలువలతో, అత్యంత ఎనర్జిటిక్ డాన్స్ స్టెప్పులతో రూపొందించిన ఈ మ్యూజిక్ వీడియో అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఫిఫా తన ‘ఫిఫా సౌండ్’ (FIFA Sound) ఇనిషియేటివ్‌లో భాగంగా విడుదల చేసిన ఈ అల్బమ్‌లో షకీరా, లిసా, టైలా, డాడీ యాంకీ వంటి ప్రపంచస్థాయి దిగ్గజాల సరసన నోరా ఫతేహి నిలవడం విశేషం. గత 2022 ఖతార్ వరల్డ్ కప్ ముగింపు వేడుకల్లో అదరగొట్టిన నోరా.. ఈసారి తన స్వస్థలమైన కెనడాలోని టొరంటో నగరంలో జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ లైవ్ ఓపెనింగ్ సెరిమనీలో కూడా ఈ పాటతో స్టేజ్ ఫైర్ చేయబోతోంది. బాలీవుడ్ ద్వారా తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న నోరా.. ఈ ‘సీర్ సీర్’ విజయంతో సరిహద్దులను బద్దలు కొడుతూ గ్లోబల్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇండియన్ టాలెంట్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. 


Sunday, 14 June 2026

అమెరికా ఆర్డర్లకు లొంగిపోయిన ప్రధాని


  • గల్ఫ్‌లో ముగ్గురు భారతీయ నావికుల మృతిపై మోడీ మౌనాన్ని నిలదీసిన రాహుల్ 
  • అగ్రరాజ్యం క్షమాపణలు చెప్పకపోగా హుకుం జారీ చేస్తోందని ఆగ్రహం

ఒమన్ తీరంలో అమెరికా నావికాదళం జరిపిన భీకర సైనిక దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన దారుణ ఉదంతంపై దేశీయంగా రాజకీయ సెగలు రేగుతున్నాయి. ఈ  అంశంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీని, అమెరికా ప్రభుత్వ వైఖరిని లక్ష్యంగా చేసుకుని  ఘాటుగా విమర్శలు గుప్పించారు. అమెరికా వైమానిక, నావికా దాడుల వల్ల ముగ్గురు నిర్దోషులైన భారతీయ నావికులు దారుణంగా హత్యకు గురై రోజులు గడుస్తున్నా.. అగ్రరాజ్యం నుంచి ఎలాంటి పశ్చాత్తాపం గానీ, కనీస క్షమాపణలు గానీ రాలేదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ.. తప్పు చేసిన అమెరికా క్షమాపణ చెప్పాల్సింది పోయి, ఎదురుగా భారతదేశానికి తీవ్రమైన ఆర్డర్లు జారీ చేస్తోందని ధ్వజమెత్తారు. "యూఎస్ మిలిటరీ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే పాటించండి, ఎలాంటి ఉల్లంఘనలనూ సహించేది లేదు" అంటూ అమెరికా వాడుతున్న దురహంకార భాషను ఒక స్వతంత్ర దేశం ఎన్నటికీ సహించదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కానీ దేశాన్ని వేరొకరి వద్ద తాకట్టు పెట్టిన మన ‘దాసోహం ప్రధాని’  మాత్రం ఈ దారుణంపై నోరు మెదపకుండా పూర్తిగా మౌనం వహిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఒక విధేయుడైన సేవకుడిలా అమెరికా ఆర్డర్లను వింటూ మన ప్రధాని మోడీ లొంగిపోతున్నారని.. దేశ గౌరవాన్ని కాపాడటంలో మోడీ ఘోరంగా విఫలమయ్యారని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.



ఈ రాజకీయ దుమారానికి కారణమైన అసలు ఘటన గత బుధవారం గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చోటుచేసుకుంది. ఇరాన్ రేవులపై అమెరికా విధించిన అంతర్జాతీయ సముద్ర దిగ్బంధనాన్ని (నావల్ బ్లాకేడ్) ఉల్లంఘించిందనే ఆరోపణలతో.. ‘ఎంటీ సెట్టెబెల్లో’ (MT Settebello) అనే వాణిజ్య చమురు నౌకపై అమెరికా సైన్యం క్షిపణులతో భీకర దాడి జరిపింది. ఈ నౌకలో ప్రయాణిస్తున్న మొత్తం 24 మంది భారతీయ సిబ్బందిలో 21 మందిని రక్షక దళాలు ప్రాణాలతో కాపాడగా.. మిగిలిన ముగ్గురు భారతీయ నావికులు ఈ దాడిలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భారత రక్షణ వర్గాలలో తీవ్ర కలకలం రేపింది.


ఈ దారుణ ఉదంతంపై అటు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) కూడా అత్యంత తీవ్రంగా స్పందించింది. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం నిరంతరాయంగా జరుపుతున్న దాడులపై మరియు భారతీయ నావికుల మరణాలపై తీవ్ర నిరసన తెలియజేయడానికి.. దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ తాత్కాలిక అధిపతి (ఛార్జ్ డి అఫైర్స్) జేసన్ మెక్స్‌కు విదేశాంగ శాఖ శుక్రవారం అత్యవసర సమన్లు జారీ చేసింది. కేవలం 48 గంటల వ్యవధిలో అమెరికా రాయబారిని విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి గట్టిగా హెచ్చరించడం ఇది వరుసగా రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు కూడా 20 మంది భారతీయ సిబ్బంది ఉన్న మరో వాణిజ్య నౌకపై గల్ఫ్ ప్రాంతంలో అమెరికా దళాలు దాడి చేసినప్పుడు కూడా భారత ప్రభుత్వం అమెరికా రాయబారిని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. 

Saturday, 13 June 2026

ఆదివారమే ఇరాన్‌తో చరిత్రాత్మక ఒప్పందం


  • హార్ముజ్ జలసంధి అందరికీ ఓపెన్
  • ట్రంప్ సంచలన ప్రకటనతో విభేదించిన టెహ్రాన్
  • నేడు సంతకాలు జరగడం లేదంటూ విదేశాంగ శాఖ స్పష్టీకరణ!

పశ్చిమాసియా భీకర యుద్ధానికి తెరదించే చరిత్రాత్మక శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమ వేదికగా మరోసారి  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అంతర్జాతీయ శాంతి ఒప్పందం ఆదివారమే (జూన్ 14, 2026) ఖరారు కాబోతున్నదని, ఈ ముసాయిదాపై సంతకాలు ముగిసిన తక్షణమే ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ లాంటి ‘హార్ముజ్ జలసంధి’ని ప్రపంచ దేశాల రవాణా కోసం పూర్తిస్థాయిలో తెరిచి ఉంచుతామని ట్రంప్ ప్రకటించారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’ (Truth Social) లో పెట్టిన పోస్ట్‌లో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇరాన్‌తో కుదుర్చుకున్న ‘జేసీపీఓఏ’ (JCPOA) అణు ఒప్పందాన్ని తీవ్రంగా ఎండగట్టారు. ఒబామా చేసిన తప్పుడు ఒప్పందం ఇరాన్ సులువుగా అణుబాంబు తయారు చేసుకోవడానికి, ఆ దేశ అణు లక్ష్యాలను వేగంగా చేరుకోవడానికి ఒక అందమైన రాజమార్గాన్ని పరిచిందని.. దానికి భిన్నంగా తన ప్రస్తుత ఒప్పందం ఇరాన్ అణుబాంబును తయారు చేయకుండా అడ్డుకునే ఒక బలమైన గోడ లాంటిదని ఆయన అభివర్ణించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇరాన్ ఇకపై అణు ఆయుధాలను కోరుకోవడం లేదని, భవిష్యత్తులో కొనుగోలు ద్వారా లేదా స్వంత అభివృద్ధి ద్వారా ఇరాన్ అణుబాంబును సాధించలేదని ట్రంప్ స్పష్టం చేశారు.



ఈ ఒప్పందంలో భాగంగా ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను (Enriched Uranium) అమెరికా తన స్వాధీనంలోకి తీసుకుని పూర్తిగా నాశనం చేయబోతోందనే కీలక సంకేతాన్ని కూడా ట్రంప్ ఇచ్చారు. అంతా ప్రశాంతంగా మారిన తర్వాత.. అత్యంత శక్తివంతమైన గ్రానైట్ పర్వతాల కింద భూగర్భంలో దాచిన ‘అణు ధూళి’ని (యురేనియంను) తమ అద్భుతమైన బి-2 బాంబర్ విమానాలు, మేధావులైన పైలట్ల సహాయంతో వెలికితీస్తామని.. ఆ నిల్వలను ఇరాన్‌లో లేదా అమెరికాలో పూర్తిగా నిర్వీర్యం చేసి నాశనం చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇరాన్ , యావత్ పశ్చిమాసియాతో కలిసి పనిచేయడానికి తాము ఎదురుచూస్తున్నామని చెబుతూనే.. ఈ శాంతి ప్రణాళికను ఇరాన్ పూర్తిగా అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఈ ప్రక్రియ అంతా త్వరగా, సాఫీగా సాగుతుందని ఆశిస్తున్నానని.. ఒకవేళ అలా జరగకపోతే తమ వద్ద అత్యంత భయంకరమైన ప్రత్యామ్నాయ మార్గం (సైనిక చర్య) సిద్ధంగా ఉందని, దానిని ఉపయోగించాల్సిన అవసరం రాకూడదని కోరుకుంటున్నట్లు ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు.


అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ఆకస్మిక ప్రకటనను ఇరాన్ ప్రభుత్వం తక్షణమే తోసిపుచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయ్ శనివారం రాత్రి టెహ్రాన్‌లో మాట్లాడుతూ.. అమెరికాతో కుదుర్చుకోబోయే ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’ (Islamabad Memorandum) పై ఆదివారం సంతకాలు జరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ చరిత్రాత్మక ఒప్పందం ఖరారయ్యే అవకాశాలను తాము తోసిపుచ్చడం లేదని.. అయితే అవతలి పక్షం (అమెరికా) ఊగిసలాట ధోరణి , కొన్ని సాంకేతిక అంశాలపై వారి సంకోచాల కారణంగా, ఒప్పందం జరిగే కచ్చితమైన తేదీపై ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని, మీడియా ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు. ట్రంప్ ఆదివారమే సంతకాలు అంటూ హడావిడి చేస్తుండగా.. ఇరాన్ మాత్రం ఆ తేదీని తిరస్కరించడంతో ఈ అంతర్జాతీయ శాంతి ఒప్పందం చుట్టూ ఉన్న ఉత్కంఠ మరింతగా పెరిగింది.

Wednesday, 10 June 2026

పల్లెటూరి ఆత్మకు అద్దం పట్టిన దృశ్య కావ్యాలు



  • భారతీరాజాకు ముందు.. భారతీరాజాకు తర్వాత
  • తమిళ సినిమాను రెండు యుగాలుగా విడదీసిన ‘సృజనాత్మక విప్లవం’
  • వెండితెరపై మట్టి వాసనలను అమరత్వం చేసిన భారతీరాజా సినీ ప్రస్థానం!

భారతీయ చలనచిత్ర రంగంలో ఒక దర్శకుడి ప్రస్థానాన్ని కేవలం ఆయన అందుకున్న అవార్డుల సంఖ్యతోనో, లేక ఆయన సినిమాలు సాధించిన వసూళ్ల రికార్డులతోనో కొలవలేము అనడానికి లెజెండరీ దర్శకుడు భారతీరాజా జీవితమే సజీవ సాక్ష్యం. జూన్ 10వ తేదీన ఈ లోకాన్ని విడిచివెళ్లిన ఆయన, తమిళ సినిమా రూపురేఖలను సమూలంగా మార్చివేసి ఒక సరికొత్త చరిత్రను లిఖించారు. ఎంతలా అంటే, తమిళ చలనచిత్ర చరిత్రను ‘భారతీరాజాకు ముందు.. భారతీరాజాకు తర్వాత’ అని స్పష్టంగా రెండు యుగాలుగా విభజించవచ్చునని సినీ విశ్లేషకులు ముక్తకంఠంతో చెప్తారు. నాలుగు దశాబ్దాల కాలంలో ఆయన తెరకెక్కించిన 40 కి పైగా సినిమాలు కేవలం కథలు మాత్రమే కావు.. అవి తమిళ సంస్కృతికి, పల్లెటూరి ఆత్మకు అద్దం పట్టిన దృశ్య కావ్యాలు.



భారతీరాజా 1977 లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందు వరకు తమిళ సినిమాలు ఎక్కువగా స్టూడియో సెట్లు, నాలుగు గోడల మధ్యే సాగేవి. పల్లెటూళ్లు అంటే కేవలం వెనుక వైపు ఉండే ఒక రంగుల పరదా  మాత్రమే అనే భావన ఉండేది. కానీ, తన తొలి చిత్రం '16 వయదినేలే' (తెలుగులో పదహారేళ్ల వయసు) సినిమాతో ఆయన ప్రేక్షకులను ఒక్కసారిగా మంత్రముగ్ధులను చేశారు. తమిళనాడు పల్లెటూరి సహజ సౌందర్యాన్ని, అక్కడి మనుషుల జీవన విధానాన్ని ఆయన కెమెరా కంటితో బంధించారు. నడవలేని, అమాయకుడైన ‘చప్పాని’ (కమల్ హాసన్), బయటి ప్రపంచం నుండి వచ్చిన గడుగ్గాయ్ ‘పరట్టై’ (రజనీకాంత్), పల్లెటూరి ముక్కుసూటి పిల్లను ప్రతిబింబించే ‘మయిల్’ (శ్రీదేవి) పాత్రలు కాలాతీతంగా నిలిచిపోయాయి. ఆ తర్వాత కిళక్కే పోగుమ్ రైల్, పుదియ వార్పుగల్, అలైగల్ ఓయివదిల్లై, మణ్ వాసనై వంటి చిత్రాలతో పల్లెటూరి ప్రతిబింబాన్ని మరింత పటిష్టం చేశారు. కేవలం అందాలనే కాకుండా ‘కరుత్తమ్మ’ చిత్రం ద్వారా ఆడశిశు హత్యల వంటి సామాజిక మహమ్మారిని ఎత్తిచూపారు, ఇది చివరికి ప్రభుత్వం అనేక కఠినమైన చట్టాలు చేయడానికి కారణమైంది. తేని అల్లిగారంలో జన్మించిన భారతీరాజాకు పల్లెటూరి రాజకీయం, అక్కడి అపనమ్మకాలు, సమస్యలపై ఉన్న అవగాహన అసాధారణమైనది. ఆయన సినిమాల్లో వర్షం, పచ్చని పొలాలు, చిన్న ఇళ్లు, నదులు, సంధ్య సూర్యుడు కేవలం నేపథ్యాలు కాదు.. అవి కథలో ప్రయాణించే ప్రాణం ఉన్న పాత్రలు.


భారతీరాజా చిత్రాల గురించి మాట్లాడేటప్పుడు ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా అద్భుతమైన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ముదల్ మరియాదై’ లోని ‘పూంగాట్రు తిరుంబుమా’, ‘కడలోర కవితైగల్’ లోని ‘కొడియిలే మల్లియపూ’ వంటి ఎన్నో గీతాలు ఇప్పటికీ శ్రోతల గుండెల్లో అమరరాగాలుగా మారుమోగుతూనే ఉన్నాయి. కేవలం పల్లెటూరి ప్రేమే కాకుండా, సమాజంలో నిషేధించబడిన ప్రేమకథలను (ఫర్బిడెన్ లవ్) ఎంతో హుందాగా చూపించడం భారతీరాజా ప్రత్యేకత. ‘ముదల్ మరియాదై’ లో ఒక వివాహిత గ్రామ పెద్దకు, తక్కువ కులానికి చెందిన పడవ నడిపే స్త్రీకి మధ్య ఉన్న నిగూఢమైన బంధాన్ని, ‘అలైగల్ ఓయివదిల్లై’ (సీతాకోకచిలుక) లో హిందూ అబ్బాయి, క్రైస్తవ అమ్మాయి ప్రేమను, ‘వేదం పుదిదు’ లో తేవర్ అబ్బాయి , బ్రాహ్మణ అమ్మాయి ప్రేమకథను సామాజిక ఉద్రిక్తతల మధ్య ఎంతో సున్నితంగా ఆవిష్కరించారు. ఆయన సినిమాల్లో ప్రేమ కేవలం ఒక అద్భుత లోకం కాదు.. అది సమాజాన్ని, దాని కట్టుబాట్లను ప్రశ్నించే ఒక పవర్‌ఫుల్ అస్త్రం.


మరోవైపు, పరిశ్రమకు సరికొత్త తరాన్ని పరిచయం చేసిన గొప్ప దార్శనికుడు ఆయన. రాధిక, రాధ, అంబిక, రేవతి వంటి స్టార్ హీరోయిన్లను పరిచయం చేసి, వారికి కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం కాకుండా కథను నడిపించే బలమైన మహిళా పాత్రలను ఇచ్చారు. అలాగే శివాజీ గణేషన్, కమల్ హాసన్ లాంటి అగ్ర నటులను సైతం తమ పాత స్టీరియోటైప్ ఇమేజ్ నుండి బయటకు తీసుకువచ్చి సరికొత్తగా నటింపజేశారు. తన జీవిత చరమాంకంలో కెమెరా వెనుక నుండి కెమెరా ముందుకు వచ్చి నటుడిగా ఆయన ప్రారంభించిన సెకండ్ ఇన్నింగ్స్ కూడా అద్భుతంగా సాగింది. ఆయుధ ఎళుత్తు (యువ), తిరుచిత్రంబలం (తిరు) వంటి చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలలో ఒక నిశ్శబ్దమైన నిజాయితీ, గాంభీర్యం కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక నటుడిగా, దర్శకుడిగా భారతీరాజా సృష్టించిన ఈ మహా సామ్రాజ్యం రాబోయే తరాల సినీ దర్శకులకు ఎప్పటికీ ఒక మార్గదర్శక గ్రంథం (బ్లూప్రింట్) గా నిలిచిపోతుంది.

‘క్లైమాక్స్ ఊహించండి చూద్దాం!’



  •  సినీ విమర్శకులకు ‘దర్శక శిఖరం’ భారతీరాజా విసిరిన ఆ చరిత్రాత్మక సవాలు.. 
  • ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలిచిన ‘బొమ్మలాట్టం’ ప్రెస్ మీట్ జ్ఞాపకాలు!

  • భారత చలనచిత్ర రంగంలో ఒక యుగం ముగిసింది
  • తమిళ సినిమాను స్టూడియోల నుండి పల్లెటూళ్లకు నడిపించిన మహోన్నత దర్శకుడికి దేశం కన్నీటి నివాళి!

సినిమా రంగంలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి క్లైమాక్స్ అనేది ఎంతటి కీలకమైన ఆయుధమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి క్లైమాక్స్‌ను ఏకంగా సినిమా సగభాగం చూసిన తర్వాత, ఇండస్ట్రీలోని కరుడుగట్టిన సినీ విమర్శకులకు , జర్నలిస్టులకు చూపిస్తూ ‘చేతనైతే ముగింపును ఊహించండి’ అని ఒక దర్శకుడు బహిరంగంగా సవాలు విసిరితే.. అది ఆయనకు తన కథపై ఉన్న అపారమైన నమ్మకానికి, గుండె ధైర్యానికి నిదర్శనం. సరిగ్గా 2008వ సంవత్సరంలో తన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘బొమ్మలాట్టం’ ప్రెస్ స్క్రీనింగ్ సందర్భంగా లెజెండరీ దర్శకుడు భారతీరాజా సరిగ్గా ఇలాంటి ఒక అసాధారణమైన సాహసమే చేశారు. ఆనాటి చెన్నై నుంగంబాక్కంలోని ‘ఫోర్ ఫ్రేమ్స్’ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన ఆ ఆసక్తికరమైన సంఘటన నేటికీ సినీ పరిశ్రమలో ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది.


ఆ రోజు థియేటర్‌లో ‘బొమ్మలాట్టం’ సినిమా ఇంటర్వెల్ కాగానే, ఎంతో ఉత్సాహంగా అడుగులు వేస్తూ స్టేజ్ పైకి వచ్చిన భారతీరాజా.. అక్కడ కూర్చున్న జర్నలిస్టుల వైపు చూస్తూ ఒక గంభీరమైన ప్రశ్న వేశారు. “మీరంతా ఇప్పటివరకు ఈ సినిమాను చూశారు కదా.. చివర్లో ఏం జరుగుతుందో మీలో ఎవరైనా ఊహించగలరా? ఒకవేళ ఎవరికైనా ఆ నమ్మకం ఉంటే బయటకు వచ్చి నన్ను కలవండి” అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. 1978 లోనే కమల్ హాసన్‌తో ‘సిగప్పు రోజాక్కల్’ (ఎర్ర గులాబీలు) వంటి మైండ్ బ్లోయింగ్ సైకో థ్రిల్లర్ తీసిన అనుభవం ఉన్న ఒక అగ్ర దర్శకుడి నోటి నుండి అలాంటి సవాలు రాగానే థియేటర్ లోని మీడియా ప్రతినిధులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. చాలా మంది జర్నలిస్టులు తమకు తోచిన కథనాలను, ఊహలను ఒక డైరీలో రాసుకుని ఆయనతో చర్చించడానికి క్యూ కట్టారు. విలేఖరులు చెబుతున్న రకరకాల ఊహలను వింటూ భారతీరాజా కేవలం చిరునవ్వు నవ్వారు. ఎందుకంటే ఆ సినిమాలో ఎవరూ ఊహించని, మేధావుల బుర్రలకు కూడా అందని ఒక విభిన్నమైన ముగింపును తాను దాచిపెట్టానని ఆయనకు ముందే తెలుసు.



సాధారణంగా ప్రెస్ మీట్లలో దర్శకులు తమ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘మేము మా శాయశక్తులా ప్రయత్నించాం, దయచేసి మా సినిమాపై సానుకూల సమీక్షలు రాయండి’ అని కోరడం సర్వసాధారణం. కానీ ఆ సాయంత్రం భారతీరాజా విసిరిన సవాలు మీడియా వర్గాల్లో పెద్ద చర్చకు, సరికొత్త సిద్ధాంతాలకు దారితీసింది. ప్రస్తుత తమిళ చిత్రసీమలో ట్విస్టులు, మర్డర్ మిస్టరీల ట్రెండ్ నడుస్తోంది కానీ.. ఇలాంటి వినూత్నమైన ప్రయోగాలకు భారతీరాజా దశాబ్దాల క్రితమే పునాది వేశారు. అర్జున్ సర్జా, నానా పటేకర్, రుక్మిణి విజయకుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బొమ్మలాట్టం’ చిత్రం ఆయన కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రాల జాబితాలోకి చేరకపోవచ్చు, కానీ తాను ఎలాంటి భిన్నమైన జోనర్లు అయినా, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్లనైనా ఎంత సులువుగా హ్యాండిల్ చేయగలనో ఈ సినిమాతో ఆయన నిరూపించారు. ఆ సమయంలో ‘ది హిందూ’ పత్రిక తన సమీక్షలో.. ‘ఈ సినిమా ముగింపు సరికొత్తగా ఉంది. ఒక హంతకుడు అంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఇది ప్రేక్షకులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది’ అని ప్రత్యేకంగా ప్రశంసించింది.


నేటి కాలంలో వెబ్ సిరీస్‌ల లోనూ, సినిమాల్లోనూ ఊహించని ట్విస్టులు ఇవ్వడం అనేది ఒక సాధారణ భాగమైపోయింది. మరీ ముఖ్యంగా ‘దృశ్యం’ వంటి చిత్రాల తర్వాత ప్రేక్షకులు కూడా చివరి నిమిషంలో వచ్చే ఒక భారీ షాక్ కోసమే ఎదురుచూస్తున్నారు. అయితే ఇలాంటి కథన వ్యూహాలు ఇంకా చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్‌గా మారని 2008 లోనే, భారతీరాజా ఒక ప్రధాన స్రవంతి కమర్షియల్ సినిమాలో కథను మలుపు తిప్పే అద్భుతమైన ప్రయోగాన్ని చేసి చూపించారు. విభిన్నమైన ఆలోచనలతో, కొత్తదనంతో ప్రయోగాలు చేయడానికి ఆయన ఎప్పుడూ వెనుకాడలేదని, ప్రేక్షకులు ఖచ్చితంగా తనను ఆదరిస్తారనే బలమైన నమ్మకమే ఆయనను ఒక ‘దర్శక శిఖరం’గా నిలబెట్టిందని ఈ ఒక్క సంఘటన చాటిచెబుతోంది.





దర్శకులలో హిమాలయ శిఖరం భారతీరాజా కన్నుమూత

భారతీయ చలనచిత్ర రంగాన్ని, ముఖ్యంగా తమిళ సినిమా రూపురేఖలను మార్చివేసిన లెజెండరీ దర్శకుడు భారతీరాజా (84) బుధవారం (జూన్ 10, 2026) చెన్నైలో కన్నుమూశారు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సినిమా అంటే కేవలం నాలుగు గోడల మధ్య, స్టూడియో సెట్లలోనే తీసేది కాదని.. పచ్చని పల్లెటూళ్లు, అక్కడి మనుషులు, వారి సహజసిద్ధమైన భావోద్వేగాలే సినిమాకు నిజమైన ప్రాణమని నిరూపించిన సృజనాత్మక విప్లవకారుడు ఆయన. తన గంభీరమైన స్వరంతో “యెన్ ఇనియ తమిళ్ మక్కలే” (నా ప్రియమైన తమిళ ప్రజలారా) అంటూ ఆయన ఇచ్చే ప్రారంభ వాయిస్ ఓవర్ ఇండస్ట్రీలోనే ఒక ట్రేడ్‌మార్క్‌గా నిలిచిపోయింది. చిత్ర పరిశ్రమలో ఆయనను అందరూ ఎంతో గౌరవంగా ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శకులలో హిమాలయ శిఖరం) అని పిలుచుకుంటారు. సినిమా రంగానికి ఆయన చేసిన అద్భుతమైన సేవలకు గాను 6 జాతీయ చలనచిత్ర అవార్డులు, 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 6 తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులతో పాటు మన తెలుగు ఇండస్ట్రీ నుండి ప్రతిష్టాత్మక 'నంది అవార్డు'ను కూడా సొంతం చేసుకున్నారు.



సినీ పరిశ్రమకు ఎంతోమంది అద్భుతమైన నటీనటులను పరిచయం చేసిన ఘనత భారతీరాజాది. తాను పరిచయం చేసే హీరోయిన్ల పేర్లు 'ఆర్' (R) అక్షరంతో ప్రారంభం కావాలనే సెంటిమెంట్‌తో.. రాధిక, రేవతి, రాధ, రంజిత, రేఖ వంటి స్టార్ నటీమణులను ఆయనే వెండితెరకు గిఫ్ట్‌గా ఇచ్చారు. వీరితో పాటు కార్తీక్, పాండ్యన్, చంద్రశేఖర్, నెపోలియన్, జనకరాజ్ వంటి ప్రముఖ నటులు కూడా ఆయన హ్యాండ్ ద్వారానే పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన భారతీరాజా (అసలు పేరు చిన్నసామి), అప్పట్లోనే సంగీత జ్ఞాని ఇళయరాజా , ఆయన సోదరుడు గంగై అమరన్‌లతో గాఢమైన స్నేహాన్ని పెంచుకున్నారు. చెన్నైలో ఒకే గదిలో ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ నాటకాలు వేశారు. ఆ తర్వాత వీరి కలయికలో వచ్చిన సినిమాలు మ్యూజికల్ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. మధ్యలో వీరిద్దరూ విడిపోయినప్పటికీ, ఆ తర్వాత భారతీరాజా ‘వేదం పుదిదు’ చిత్రం ద్వారా దేవేంద్రన్‌ను, ‘కిళక్కు సీమయిలే’ చిత్రం ద్వారా ఏఆర్ రెహమాన్‌ను సంగీత దర్శకులుగా వాడుకుని అద్భుతమైన హిట్స్ కొట్టారు. కేవలం దర్శకత్వమే కాకుండా 'కల్లుక్కుళ్ ఈరమ్' చిత్రంలో హీరోగా నటించిన ఆయన, ఇటీవల ధనుష్ నటించిన ‘తిరుచిత్రంబలం’ (తెలుగులో తిరు) చిత్రంలో తాతగా చేసిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.


కాలం చెరగని వెండితెర అద్భుతాలు

భారతీరాజా తొలి చిత్రం '16 వయదినేలే' (తెలుగులో పదహారేళ్ల వయసు) తమిళ సినిమా చరిత్రను మలుపు తిప్పింది. శ్రీదేవి, కమల్ హాసన్, రజనీకాంత్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం పల్లెటూరి ముక్కుసూటితనాన్ని, అక్కడి కుతంత్రాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇందులో మైలు, చప్పాని, పరట్టై పాత్రలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఆయన రెండో చిత్రం 'కిళక్కే పోగుమ్ రైల్' (తూర్పు వెళ్లే రైలు) సమాజంలోని కులవివక్షను, మహిళలపై జరిగే అన్యాయాన్ని ఎంతో సున్నితంగా చర్చించింది. గ్రామీణ కథలకే పరిమితం కాకుండా 'సిగప్పు రోజాక్కల్' (ఎర్ర గులాబీలు) సినిమాతో సైకోపాథ్ సీరియల్ కిల్లర్ కథను అప్పట్లోనే తెరకెక్కించి సంచలనం సృష్టించారు. ఇందులో కమల్ హాసన్ పాడిన “నినైవో ఒరు పరవై” పాట నేటికీ ఎవర్‌గ్రీన్. ఆయన శిష్యులైన భాగ్యరాజ్, మణివన్నన్ తర్వాతి కాలంలో స్టార్ దర్శకులుగా ఎదిగారు.


కుల వ్యవస్థపై , బ్రాహ్మణ ఆధిపత్యంపై ఆయన తీసిన 'వేదం పుదిదు' సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇది ఒక బ్రాహ్మణ అబ్బాయి, క్రైస్తవ అమ్మాయి ప్రేమకథ నేపథ్యంలో వచ్చిన 'అలైగల్ ఓయివదిల్లై' (సీతాకోకచిలుక) చిత్రానికి సమాంతరంగా సాగుతుంది. ఇక మహానటుడు శివాజీ గణేషన్‌ను ఎంతో సంయమనంతో కూడిన పాత్రలో చూపిస్తూ ఆయన తీసిన 'ముదల్ మరియాదై' చిత్రం రష్యన్ రచయిత ఫ్యోడర్ దోస్తోయెవ్స్కీ జీవితం ఆధారంగా తెరకెక్కి క్లాసిక్‌గా నిలిచింది. 'ఎన్ ఉయిర్ తోళన్' చిత్రం ద్వారా తమిళనాడు రాజకీయాల్లో కార్యకర్తలు ఎలా బలైపోతున్నారో కళ్లకు కట్టారు. 'కడలోర కవితైగల్' (ఆరాధన) చిత్రంలో సత్యరాజ్, రేఖల మధ్య సాగే ఉపాధ్యాయురాలు-కరుడుగట్టిన జాలరి ప్రేమకథ అందరి హృదయాలను టచ్ చేసింది. సినిమాలతోనే కాకుండా 'తమిళర్ కలై ఇలక్కియ పన్పాడు మైయం' బ్యానర్ కింద కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డ్ కోసం సినీ ప్రముఖులందరినీ ఏకం చేసి నిరసనలు నడిపిన సామాజిక చైతన్యం ఆయనది. తన కుమారుడు మనోజ్ (తాజ్ మహల్ హీరో) కొన్నేళ్ల క్రితమే మరణించగా, ప్రస్తుతం భారతీరాజాకు భార్య , కుమార్తె జనని ఉన్నారు. ఆయన మరణం భారతీయ సినిమాకు ఎప్పటికీ పూడ్చలేని లోటు.





నటుడిగా మారడమే నా మొదటి కల

ఆకట్టుకునే అందం లేదనే రిజెక్ట్ చేశారు

నాలుగు దశాబ్దాల తర్వాత ‘నటుడు’ భారతీరాజా మనసులోని మాట!

“ఎన్ ఇనియ తమిళ్ మక్కలే” (నా ప్రియమైన తమిళ ప్రజలారా).. ఈ ఒక్క మాట వింటే చాలు మనకు గుర్తొచ్చేది లెజెండరీ దర్శకుడు భారతీరాజా. గత నాలుగు దశాబ్దాలుగా వెండితెరపై మట్టి వాసనలను (మణ్ వాసనై), పల్లెటూరి స్వచ్ఛతను గుప్పించడమే కాకుండా.. కెమెరా వెనుక, కెమెరా ముందు వందలాది కొత్త ప్రతిభను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన అద్భుత సృష్టికర్త ఆయన. దర్శకుడు తంగర్ బచ్చన్ తెరకెక్కించిన ‘కరుమేగంగల్ కలై గిండ్రన’ అనే చిత్రంలో గౌతమ్ మీనన్, అదితి బాలన్‌లతో కలిసి భారతీరాజా ఒక ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్ల నేపథ్యంలో జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఒక దర్శకుడిగా కాకుండా, తన మనసుకు ఎంతో ఇష్టమైన ‘నటుడి’ కోణంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఒక దర్శకుడిగా వందలాది ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ, తనలోని నటుడితో మాట్లాడటమే తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని ఆయన పేర్కొన్నారు.


సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొత్తలో తాను ఒక దర్శకుడిగా కాకుండా.. ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనే బలమైన కోరికతోనే ఉన్నానని భారతీరాజా ఈ సందర్భంగా ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని బయటపెట్టారు. కానీ ఆ రోజుల్లో ఒక నటుడు కావాలంటే జెమిని గణేశన్, ఏవీఎమ్ రాజన్ లాంటి అందమైన ముఖం, భావాలను పలికించే పెద్ద కళ్లు ఉండాలనే నిబంధనలు ఇండస్ట్రీలో ఉండేవని గుర్తుచేసుకున్నారు. భావోద్వేగాలను పండించడం కంటే కూడా కేవలం బాహ్య సౌందర్యానికే (లుక్స్) అక్కడ ఎక్కువ ప్రాధాన్యం ఉండేదన్నారు. దాంతో ఆ కాలపు నటుడి ప్రమాణాలకు తాను ఏమాత్రం సరిపోనని, ఒక నటుడిగా పనికిరానని రియలైజ్ అయ్యానని చెప్పారు. అందం లేదనే కారణంతో నటుడిగా అవకాశం దక్కకపోవడంతోనే తాను విధిలేక మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారాల్సి వచ్చిందని, అయితే కాలక్రమేణా ఆ నిర్ణయమే తన జీవితాన్ని మార్చేసిందని వివరించారు.


దర్శకుడిగా శిఖర సమానమైన కీర్తిని అందుకున్నప్పటికీ, ఇటీవలి కాలంలో తనలోని నటుడిని ప్రేక్షకులు మళ్లీ ఆదరిస్తుండటం తనకు ఎంతో తృప్తినిస్తోందని భారతీరాజా హర్షం వ్యక్తం చేశారు. మణిరత్నం లాంటి అగ్ర దర్శకుడు కూడా ఒకసారి తన వద్దకు వచ్చి.. మీకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఉందా? అని అడిగారని, ఆ సంభాషణల నేపథ్యంలోనే ‘ఆయుధ ఎళుత్తు’ (తెలుగులో యువ) చిత్రంలో ఒక పవర్‌ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రను తనకు ఆఫర్ చేశారని గుర్తుచేసుకున్నారు. కేవలం పరిమితమైన సినిమాల్లోనే నటించినప్పటికీ ‘కురంగు బొమ్మై’, ‘తిరుచిత్రంబలం’ వంటి చిత్రాలలో తాను పోషించిన పాత్రలు ఐకానిక్‌గా నిలిచిపోయాయన్నారు. రాబోయే ‘కరుమేగంగల్ కలై గిండ్రన’ చిత్రంలో తన క్యారెక్టర్ ఎంతో లోతైన భావోద్వేగాలతో సాగుతుందని, తన నటన కెరీర్‌లో ఇదొక అత్యంత ముఖ్యమైన పాత్రగా మిగిలిపోతుందని ‘దర్శక శిఖరం’ భారతీరాజా ధీమా వ్యక్తం చేశారు.

Sunday, 7 June 2026

బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ వరుణ్ ధావన్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’..


  • ‘పెద్ది’ ప్రభంజనం ముంగిట తేలిపోయిన డేవిడ్ ధావన్ చిత్రం
  • రెండు రోజుల్లో రూ. 23 కోట్లు మాత్రమే వసూలు

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ ల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోతోంది. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం మొదటిరోజు అతి సాధారణ వసూళ్లతో సరిపెట్టుకోగా, రెండో రోజైన శనివారం నాడు కూడా అదే మందకొడి ధోరణిని కొనసాగించింది. ప్రముఖ ట్రేడ్ ట్రాకర్ 'శాక్‌నిల్క్' నివేదికల ప్రకారం, ఈ సినిమా శనివారం భారతదేశంలో కేవలం రూ. 7.25 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించింది. దీంతో రెండు రోజుల్లో దేశీయంగా ఈ సినిమా మొత్తం నెట్ వసూళ్లు రూ. 4.75 కోట్లుగా, గ్రాస్ వసూళ్లు రూ. 17.70 కోట్లుగా నమోదయ్యాయి. ఓవర్సీస్ మార్కెట్ నుండి వచ్చిన రూ. 3 కోట్లను కలుపుకుంటే, రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన మొత్తం గ్రాస్ కలెక్షన్లు కేవలం రూ. 23.20 కోట్లు మాత్రమే.



దేశవ్యాప్తంగా దాదాపు 8,813 షోలలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రానికి శనివారం కేవలం 21.38 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ మాత్రమే లభించడం ట్రేడ్ వర్గాలను నిరాశకు గురిచేసింది. ఆశ్చర్యకరంగా ఉత్తరాది మార్కెట్ల కంటే దక్షిణాదిలోనే ఈ సినిమాకు కొంత మెరుగైన ఆదరణ కనిపించింది. చెన్నైలో 49 షోలలో అత్యధికంగా 47 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, హైదరాబాద్‌లో 192 షోలలో 31.8 శాతం, బెంగళూరులో 219 షోలలో 29 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ముంబైలో 548 షోలకు గానూ 24 శాతం ఆక్యుపెన్సీ రాగా, దిల్లీ పరిసర ప్రాంతాలలో (NCR) ఏకంగా 980 షోలు ఉన్నప్పటికీ కేవలం 16.3 శాతం మంది మాత్రమే థియేటర్లకు వచ్చారు. వరుణ్ ధావన్ గత చిత్రం ‘బోర్డర్ 2’ మొదటి రోజే రూ. 30 కోట్లు, రెండో రోజు రూ. 36.50 కోట్లు సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేయగా.. దానితో పోలిస్తే ఈ సినిమా వసూళ్లు చాలా వెనుకబడి ఉన్నాయి.


ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెమ్మదించడానికి ప్రధాన కారణం.. అదే సమయంలో థియేటర్లలోకి వచ్చిన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీయేనని విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు యాక్షన్ డ్రామా అయిన ‘పెద్ది’ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 191 కోట్లకు పైగా వసూళ్లతో థియేటర్లను శాసిస్తుండటంతో, వరుణ్ ధావన్ సినిమాకు గట్టి పోటీ ఎదురైంది. రమేష్ తౌరానీ నిర్మాణంలో, డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ ధావన్‌తో పాటు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. జిమ్మీ షెర్గిల్, మౌనీ రాయ్, చంకీ పాండే, మనీష్ పాల్ కీలకపాత్రలు పోషించగా.. జానీ లీవర్, రాజ్‌పాల్ యాదవ్, మనోజ్ పహ్వా, కృతి సనన్ , వరుణ్ సూద్ ప్రత్యేక పాత్రలలో మెరిశారు. భారీ తారాగణం ఉన్నప్పటికీ కంటెంట్‌లో పస లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమా పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

Featured post

‘మెయిన్ వాపస్ ఆవుంగా’ ట్రోల్స్‌కు ఆస్కార్ విజేత అదిరిపోయే కౌంటర్!

నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్‌.. రెహమాన్‌కు మద్దతుగా నిలుస్తున్న అభిమానులు! ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన తాజా పీరియడ్ లవ్ స్ట...