- మెజారిటీ నిరూపణపై గవర్నర్ అసంతృప్తి
- విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (TVK)కు సాంకేతిక చిక్కులు ఎదురవుతున్నాయి. లోక్ భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని హక్కును కోరినప్పటికీ, ప్రస్తుతానికి ఆయన వద్ద స్పష్టమైన సంఖ్యా బలం లేదని గవర్నర్ భావిస్తున్నట్లు సమాచారం. 234 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మెజారిటీ మార్కు 118 కాగా, టీవీకే 108 స్థానాలు సాధించింది (విజయ్ రెండు చోట్లా గెలవడంతో ఒక సీటు తగ్గనుంది). ఇప్పటికే కాంగ్రెస్ తన 5 మంది ఎమ్మెల్యేల మద్దతును అధికారికంగా ప్రకటించినప్పటికీ, కూటమి బలం 112 వద్దే నిలిచిపోయింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే ఇంకా 6 సీట్ల తక్కువగా ఉండటంతో, రేపు జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం రెండు సీట్లు ఉన్న వీసీకే పార్టీ అంతర్గత చర్చల్లో ఉండగా, చెరో రెండు సీట్లు ఉన్న లెఫ్ట్ పార్టీలు (CPI, CPI-M) మే 8వ తేదీ వరకు సమయం కోరాయి. మరోవైపు, 47 స్థానాలు ఉన్న ఏఐఏడీఎంకే (AIADMK)లోని సుమారు 30 మంది ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విజయ్‌కు మద్దతు ప్రకటించడంపై మాజీ మిత్రపక్షం డీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమిళ ప్రజల వీపులో పొడిచిందని, కేవలం రెండు మంత్రి పదవుల కోసం ఆ పార్టీ ఆత్మహత్య సదృశ్య నిర్ణయం తీసుకుందని డీఎంకే విమర్శించింది. అటు బీజేపీ సైతం ఈ పరిణామాలను ‘ఇండియా’ (INDIA) కూటమి పతనానికి సంకేతంగా అభివర్ణించింది. మొత్తానికి దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న డీఎంకే-ఏఐఏడీఎంకే ద్వంద్వాధిపత్యానికి తెరదించిన విజయ్, అధికారం చేపట్టడానికి మరికొన్ని గంటల పాటు ఉత్కంఠను ఎదుర్కోవాల్సి రావచ్చు.
No comments:
Post a Comment