Wednesday, 6 May 2026

ఐ-ప్యాక్‌కు చెక్ పెట్టిన అఖిలేష్ యాదవ్


  • యూపీ ఎన్నికల వ్యూహాల్లో పెను మార్పు



వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ తన వ్యూహాలను అనూహ్యంగా మార్చుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఐ-ప్యాక్ (I-PAC) సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. నిధుల కొరత వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన సరదాగా వ్యాఖ్యానించినప్పటికీ, దీని వెనుక బలమైన రాజకీయ , న్యాయపరమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత నెలలో జరిగిన పశ్చిమ బెంగాల్ , తమిళనాడు ఎన్నికల్లో ఐ-ప్యాక్ వ్యూహరచన చేసిన తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం ఈ నిర్ణయంపై ప్రభావం చూపినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ వంటి హేమాహేమీలు తమ సొంత కోటల్లోనే ఓడిపోవడం ఐ-ప్యాక్ పనితీరుపై అనుమానాలను రేకెత్తించింది.



మరోవైపు, ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్ పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ కావడం సమాజ్‌వాదీ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. ఈ సంస్థ హవాలా మార్గాల్లో నగదు లావాదేవీలు జరిపిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆరోపించడంతో, ఎన్నికల సమయంలో అనవసర వివాదాల్లో చిక్కుకోవడం ఇష్టం లేక అఖిలేష్ యాదవ్ ఈ సంస్థకు దూరం జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఎస్పీ తన ఎన్నికల నిర్వహణ బాధ్యతలను 'షోటైమ్' అనే మరో సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ సంస్థకు అప్పగించింది. బెంగాల్, తమిళనాడులో ప్రతిపక్షాల పతనం తర్వాత, దేశంలో బీజేపీకి ధీటుగా నిలబడగలిగే అతికొద్ది మంది నేతల్లో అఖిలేష్ ఒకరు కావడంతో, 2027 యూపీ ఎన్నికలు ఆయనకు జీవన్మరణ సమస్యగా మారాయి. అందుకే గ్రౌండ్ రిపోర్ట్స్ ఆధారంగా ఐ-ప్యాక్ టీమ్‌ను తగ్గించుకోవడం కంటే పూర్తిగా పక్కన పెట్టడమే శ్రేయస్కరమని ఎస్పీ భావించింది.

No comments:

Post a Comment

Featured post

నమ్మకద్రోహానికి పరాకాష్ట

మిత్రధర్మాన్ని కాలరాశారంటూ తీవ్ర ఆగ్రహం కాంగ్రెస్‌పై డీఎంకే నిప్పులు తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న డీఎంకే-కాంగ్రెస్ మైత్...