Monday, 18 May 2026

నాటి ఎండాకాలం సెలవుల జ్ఞాపకాలు




ఎనభై, తొంభై దశకం పిల్లలకు మొబైల్‌, టీవీ లాంటివి విలాస వస్తువులే. ప్రపంచీకరణ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. ప్రపంచమే ఇప్పుడు కుగ్రామంగా మారిపోయింది. మొబైల్‌, టీవీలు ఇప్పటి జనరేషన్‌ ను మాత్రమే కాదు పెద్దవాళ్లను కట్టిపడేస్తున్నాయి. మార్పు మంచిదే. కానీ బైటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి వీటితోనే కాలక్షేపం చేస్తూ బందీగా మిగిలిపోతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆదిత్యా 369 సినిమాలో టైం మిషన్‌ లెక్క నాకు ఎండకాలం సెలవుల్లో ఏం చేసేవాడినో గిర్రున గుర్తుకు వచ్చింది. అవ్వ పొద్దున్నే డ్యూటీకి వెళ్లేది. ఆదివారం తనకు కూడా సెలవు కావడంతో పొద్దుగాలనే పని అంతా చేసుకుని గేటు మూసివేసేది. పొద్దుగాల లేస్తే మొదలు ఆడటానికి  పోతే సాయంత్రం వరకు పత్తా లేకుండా అటే. ఇప్పుడంటే ఫొన్‌ కొట్టి ఎక్కడున్నావు? ఎప్పుడు వస్తున్నావు అని ఇరిటేట్‌ చేసే పరిస్థితులు అప్పుడు లేవు. అందుకేనేమో మా వారంలో ఒక్కరోజైనా పిల్లలతో ఉండాలని గేటు బందు వెట్టేది. మా అన్న, తమ్ముడితో ఆమెకు ఇబ్బంది లేదు. వాళ్లు పెద్దగా బైటకి పోయేవాళ్లు కాదు. వాళ్లను ఆటల కోసం ఎవరూ పిలిచేవారు కాదు. కానీ నా కోసం బ్యాచ్‌ దిగేది. ఒక్క మ్యాచ్‌ ఆడి వస్తం అవ్వా పంపించు అని అడిగేవారు. ఆమె మొదట ససేమిరా అన్నా చివరికి సరే అనేది. గోదావరిఖని సింగరేణి స్టేడియంలో మ్యాచ్‌ కోసం పోతే కార్క్‌ బాల్‌తో మ్యాచ్‌లు ఆడేవాళ్లం. దెబ్బలు తాకినా పెద్దగా పట్టించుకునేవాళ్లం కాదు. పోరగాండ్ల కదా అలిసిపోవుడు లాంటివి ఉండేవి కాదు. దూప అయితే మంచినీళ్లు తాగి మళ్లీ ఫీల్డ్‌ లోకి వచ్చేవాళ్లం. మా టీంలో పల్లె మధు గాడు బీభత్సమైన బ్యాట్స్‌మెన్‌. వాడు ఔట్‌ అయితే స్కోర్‌ బోర్డు నత్తనడకన సాగేది. అట్లా ఒక్క మ్యాచ్‌ అని పోతే నాలుగైదు మ్యాచ్‌ లు ఆడేవాళ్లం. 



క్రికెట్‌ సంగతి అట్లా ఉంటే... ఇంటికాడ ఉంటే కూడా టైం పాస్‌ అయ్యేది. పోలు వీరమల్లు మామ రేడియోలో మధ్యాహ్నం వచ్చే శ్రోతలు కోరిన పాటలు పెట్టేవాడు. బహుశా అది అరగంట ఉండేది అనుకుంటా. మంచి మంచి పాటలు వచ్చేవి. ఆయన ఒక్కసారి ట్యూన్‌ చేసి రేడియో అక్కడ పెడితే ఎవరినీ టచ్‌ చేయనిచ్చే వాడు కాదు. ఆయనకు పాటలు, పాత సినిమాలు అంటే చాలా ఇష్టం ఉండేది. టీవీలో సినిమా వస్తే ఫైటింగ్‌ సమయంలో ఆయన ఎమోషన్‌ అయ్యేవాడు. సినిమాలో కనిపించే సీన్ల కంటే మామ హావభావాలే మాకు నవ్వు తెప్పించేది. ఇక ఆదివారం క్యారం బోర్డు ఆడటానికే అన్నట్టు మా ఇంటి ముందు ఉన్న వేప చెట్టు వేదిక అయ్యేది. స్టూలు మీద బోర్డు పెట్టి రాజయ్య తాత, నేను, ఆ టైంకు ఎవరు వస్తే వాళ్లు మ్యాచ్‌ లు ఆడేవాళ్లం. ప్రతి గేమ్‌ సీరియస్‌ గా సాగేది. ఒక్కసారి స్ట్రైకర్‌ వస్తే నాలుగైదు పడేసే వాడు తాత. మా కాంబో బాగా ఉండేది. తాతా మనం గెలువాలె అని ప్రోత్సహించేవాడు. మధ్యాహ్నం ఆయనకు డ్యూటీ ఉంటే లేదా నైట్‌ షిప్ట్‌ అయితే తప్ప పొద్దంతా ఆడేవాళ్లం. ఇవి కాకుండా గోలీలు బాగా ఆడేవాళ్లం. తీసుకొచ్చిన గోలీలన్నీ దాచిపెడితే మా అవ్వ ఇంటి ముందు ఉన్న బాయిలో పోసేది. ఇవి ఉంటే వీడు ఇంట్ల ఉండటం లేదని. పారేసినప్పుడు కొంచెం బాధ అనిపించేది. కానీ మళ్లీ ఆడటం, మళ్లీ జమ చేయడం నిత్యకృత్యంగా మారేది. ఆ బాయి నాలుగిండ్లకు ఆధారం. అందుకే ఎండకాలం పూటికి తీయించేవాళ్లు. అప్పుడు అందులో పడిన బోల్లతో పాటు గోలీలు ఎక్కువగా ఉండేవి. లచ్చక్క కొడుకు ఆడుతున్నాడని నువ్వు పారేసిన గోలీలు చూడు ఎన్ని ఉన్నాయో అని వీరమల్లు మామ సెటైర్లు వేసేవాడు. 



ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాయంత్రం భగత్‌సింగ్‌ స్కూల్‌లో షటిల్‌ ఆడేవాళ్లం. పాటలు పాడేవాళ్లం. మా శంకర్‌ సార్‌ , రాజనర్సు పాటలు పాడుతుంటే రాజేష్‌ సార్‌ పాటకు తగ్గట్టు కంజర కొట్టేవాడు. బండి శ్రీను, చిలుకు మల్లేశ్‌, ఎనగంటి సమ్మయ్య, పిడుగు కృష్ణ లాంటివాళ్లు స్కూల్ లో ఉన్న బార్‌ వద్ద ఎక్సర్‌సైజ్‌ చేసేవాళ్లు. పాటలు పాడటం నేర్పించిన గురువు శంకర్‌ సారే. ఆయన శిష్యరికంలో  చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం చిన్నప్పటి నుంచే అలవాటైంది. రాయలసీమ కరువు మీద మల్లిక్‌ రాసిన 'రాయలేలిన నాటి రతనాల సీమ' పాట ట్యూన్‌ నే బహుశా ఆయనే రాశాడు అనుకుంటా. మహారాష్ట్రలో వచ్చిన భూకంపంపై  'ఆదమరిచి జనులు నిదురించు వేళలో' పాటకు ట్యూన్‌ కట్టాడు. అదే పాట నేను మండలస్థాయి పాటల పోటీల్లో (వాణివిద్యవిహార్‌ వాళ్లు నిర్వహించారు) పాల్గొన్నాను. మా స్కూల్‌ నుంచి సీనియర్లకు అవకాశం వచ్చింది. కానీ నేను స్వతంత్రంగా అందులో పాల్గొన్నాను. పొద్దున వెళ్తే సాయంత్రం వరకు నా పేరు పిలిచారు. బామ్మర్ది పోలు సంపత్‌ గాడు నాతోనే ఉన్నాడు. నేను పాడి స్టేజి కిందికి రాగానే అందరూ చుట్టుముట్టారు. బాగా పాడావు అని ప్రశంసించారు. కానీ నాకే మండలస్థాయి ఫస్ట్‌ ప్రైజ్‌ వస్తుందని తెలియదు. ఒకరోజు పొద్దున్నేనిర్వాహకులు మా స్కూల్‌కు ఫోన్‌ చేసి మా ప్రిన్సిపల్‌ శేషవేణికి చెప్పారు. ఆమె పిలిచి చెప్పి శభాష్‌ అంటే కొంచెం సిగ్గుపడ్డాను. స్టేజ్‌ మీద అందరి ముందు ఆ షీల్డ్‌ అందుకోవడం ఇప్పటికీ గొప్ప అనుభూతి. 



ఇదంతా ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే.. ఎండకాలం సెలవుల్లో ఆటలు, పాటలు 80,,90 దశకం పిల్లల అనుభవంలో ఉంటుంది. నా లాగే చాలామందికి ఇలాంటి చాలా జ్ఞాపకాలు ఉంటాయి. అప్పుడు ఇప్పటిలెక్క మొబైల్‌, టీవీల లొల్లి లేదు. ఉన్నకాడనే ఇండోర్‌ గేమ్స్‌, బైటికి పోతే క్రికెట్‌ ఇలా అనేకం ఆడేవాళ్లం. ప్రపంచీకరణ తర్వాత విలాసవస్తువులన్నీ నిత్యావసర వస్తువులు అయిపోయాయి. అభివృద్ధితో పాటు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పొల్యూషన్‌ పెరిగిపోయింది. గ్లోబల్‌వార్మింగ్ పెరిగిపోయి మే నెలలో భానుడి భగభగల వార్తలు నిత్యకృత్యం అయ్యాయి. మొన్న మా ఇంటర్‌ క్లాస్‌ మేట్‌ స్వామిగాడు గోదావరిఖనిలో కొన్నిరోజుల తర్వాత ఉండలేమురా అన్నాడు. అంతలా అక్కడ పర్యావరణ విధ్వంసం జరిగిందని వాపోయాడు. సరిగ్గా మూడు దశాబ్దాల కిందట మేము చిన్నప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆ ఆటలు లేవు. నాటి సంబురం లేదు. ఇప్పుడు సెలవులు అంటే సమ్మర్‌ క్లాస్‌ లు, హోం వర్క్‌ లు, లేదా మొబైల్‌, టీవీల ముందు గంటల తరబడి అతుక్కుపోవడాలు. ప్రారంభంలో చెప్పినట్టు మార్పు మంచిదే.. కానీ మనుగడే ప్రశ్నార్థకం అవడం ఆధునిక అభవృద్ధి అందించిన విషాదం కదా!

No comments:

Post a Comment

Featured post

ఓస్లోలో భారత్ వర్సెస్ నార్వే మీడియా

పత్రికా స్వేచ్ఛపై ప్రశ్నించిన విదేశీ జర్నలిస్ట్‌కు భారత విదేశాంగ శాఖ గట్టి కౌంటర్ "అజ్ఞాన ఎన్జీవోల నివేదికలు చదివి మాట్లాడకండి" అం...