- పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
- సమగ్ర విచారణ జరిపే బాధ్యత సీబీఐకి అప్పగింత
- తిరిగి నిర్వహించే పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామన్న ఎన్‌టీఏ
- మళ్లీ పరీక్ష రానున్న సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు
- పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- దేశానికి విష కాలంగా మోడీ అమృత కాలమని మండిపాటు
- దేశవ్యాప్తంగా ఎన్‌ఎస్‌యూఐ భారీ నిరసనలు
- విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్
మే 3వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా రద్దు చేసింది. రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పేపర్ లీక్ అయినట్లు వచ్చిన తీవ్ర ఆరోపణలు, ప్రాథమిక విచారణలో వెల్లడైన ఆధారాల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరీక్షా విధానంలో పారదర్శకతను కాపాడేందుకు, లక్షలాది మంది విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఈ చర్య తప్పలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఈ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.
పరీక్ష రద్దు కావడంతో దాదాపు 22.79 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. రద్దు చేసిన పరీక్షకు బదులుగా దేశవ్యాప్తంగా తిరిగి నిర్వహించే పరీక్ష తేదీలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఎటువంటి అదనపు రుసుము చెల్లించనక్కర్లేదని అధికారులు వివరించారు. పేపర్ లీక్ ఆరోపణల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు రాజస్థాన్ ఎస్ వో జీ తో పాటు ఇప్పుడు సీబీఐ కూడా రంగంలోకి దిగడంతో విద్యార్థులు మ,తల్లిదండ్రుల్లో కొంత ఊరట లభిస్తోంది. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్ది, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం భరోసా ఇచ్చింది.
యువత భవిష్యత్తుతో ఆడుకోవడం నేరమని రాహుల్ ధ్వజం
నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ గొప్పగా చెప్పుకునే 'అమృత కాలం' దేశ యువతకు శాపంగా మారిందని, అది ఇప్పుడు 'విష కాలం'గా రూపాంతరం చెందిందని ఆయన విమర్శించారు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, నీట్ పరీక్ష రద్దు కావడం కేవలం వైఫల్యం మాత్రమే కాదని, ఇది దేశ భవిష్యత్తు అయిన యువతపై జరిగిన నేరమని అభివర్ణించారు. ఈ అవినీతి బీజేపీ పాలనలో సుమారు 22 లక్షల మంది విద్యార్థుల కష్టం, వారి తల్లిదండ్రుల త్యాగాలు , కలలు ఛిన్నాభిన్నమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిజాయితీగా చదివే విద్యార్థులకు శిక్ష
లక్షలాది మంది విద్యార్థులు రాత్రనక పగలనక కష్టపడి చదివారని, వారి తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆభరణాలు అమ్ముకుని మరీ కోచింగ్ ఇప్పించారని రాహుల్ గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం వారికి ప్రతిఫలంగా పేపర్ లీకులు, నిర్లక్ష్యం , వ్యవస్థీకృత అవినీతిని బహుమతిగా ఇచ్చిందని మండిపడ్డారు. దేశంలో 'పేపర్ మాఫియా' యథేచ్ఛగా తిరుగుతోందని, ప్రతిసారీ తప్పు చేసిన వారు తప్పించుకుంటుంటే, నిజాయితీగా చదివే విద్యార్థులు మాత్రం శిక్ష అనుభవిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడే తత్వానికి కాకుండా డబ్బుకు, పరపతికే విలువ ఉండేలా విద్యారంగాన్ని మార్చేశారని, దీనివల్ల విద్యా వ్యవస్థకే అర్థం లేకుండా పోతోందని విమర్శించారు.
ఈ దారుణాలపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్
నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించడం వల్ల విద్యార్థులు మరోసారి తీవ్రమైన మానసిక ఒత్తిడికి, ఆర్థిక భారాన్ని లోనవుతారని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును అంధకారం చేస్తున్న ఈ దారుణాలపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పక్షాన తాము నిలబడతామని, ఈ అన్యాయంపై పోరాటం చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
భగ్గుమన్న విద్యార్థి లోకం
నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ మంగళవారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఢిల్లీలోని శాస్త్రి భవన్ ఎదుట పెద్ద సంఖ్యలో విద్యార్థులు, కార్యకర్తలు తరలివచ్చి విద్యాశాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. పేపర్ లీక్ మాఫియా వెనుక ఉన్న అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాలంటూ నిరసనకారులు గళమెత్తారు. కేవలం ఢిల్లీలోనే కాకుండా జైపూర్, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో విద్యార్థులు రహదారులపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి పరీక్ష రాసిన తమకు ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాల్సి రావడం తీరని మానసిక వేదన కలిగిస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ టీఏ పనితీరుపై నమ్మకం పోయిందని, ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. శాంతియుతంగా సాగుతున్న నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఎన్‌ఎస్‌యూఐ స్పష్టం చేసింది.
No comments:
Post a Comment