గాల్లో ఎనిమిది గంటల ప్రయాణం
చైనా గగనతలం నుంచి యూ-టర్న్
సాంకేతిక లోపంతో ఢిల్లీకి తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న వారికి ఒక భయానక, నరకప్రాయమైన అనుభవం ఎదురైంది. దాదాపు 230 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరిన ఆ విమానం.. గాల్లో ఏకంగా ఎనిమిది గంటల పాటు ప్రయాణించిన తర్వాత సాంకేతిక లోపం కారణంగా తిరిగి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. మే 27 బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన విమానయాన రంగంలో తీవ్ర కలకలం రేపింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ173 (AI173) నంబర్ గల బోయింగ్ విమానం ఢిల్లీ నుంచి టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత, చైనా వైమానిక పరిధిలోకి ప్రవేశించిన సమయంలో విమానంలో ఒక తీవ్రమైన సాంకేతిక లోపాన్ని పైలట్లు గుర్తించారు. విమాన భద్రతా నిబంధనల ప్రకారం ప్రయాణాన్ని ముందుకు కొనసాగించడం ప్రమాదకరమని భావించిన క్రూ సిబ్బంది, చైనా ఆకాశం నుంచే విమానాన్ని వెనక్కి మళ్లించారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ అనంతరం విమానాన్ని పూర్తిగా ఎయిర్ ఇండియా రక్షణ ప్రమాణాల ప్రకారం సాంకేతిక తనిఖీల కోసం పంపినట్లు యాజమాన్యం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికుల , సిబ్బంది భద్రతే తమకు అన్నింటికంటే 'అత్యంత ప్రాధాన్యం' అని సంస్థ స్పష్టం చేసింది. ఈ హఠాత్ పరిణామం వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ల్యాండ్ అయిన ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలైనంత త్వరగా ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ లోగా విమానాశ్రయంలో ఉన్న తమ గ్రౌండ్ టీమ్స్ ప్రయాణికులకు అవసరమైన అల్పాహారం, హోటల్ వసతి లేదా వారి ఇష్టప్రకారం టికెట్ల రీషెడ్యూలింగ్ సదుపాయాలను అందిస్తున్నట్లు పేర్కొంది.
ఎయిర్ ఇండియా విమానాల్లో ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. కేవలం వారం రోజుల క్రితం, మే 21న బెంగళూరు నుంచి దిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం దిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్న తరుణంలో దాని ఒక ఇంజిన్‌లో మంటలు అంటుకున్న సంకేతాలు కాక్‌పిట్ సిబ్బందికి అందాయి. ఆ సమయంలో కూడా పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులందరినీ సురక్షితంగా ల్యాండ్ చేశారు. వరుసగా విమానాల్లో ఇలాంటి లోపాలు తలెత్తుతుండటంపై విమాన ప్రయాణికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
No comments:
Post a Comment