నీట్ పేపర్ లీకేజీపై కేంద్రంపై రాహుల్ గాంధీ నిప్పులు..
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'నీట్'పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ భారీ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను మోడీ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిందని సామాజిక మాధ్యమాల వేదికగా రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య విద్యా ప్రవేశ పరీక్ష 'నీట్' లీకేజీ వెనుక పెద్ద ఎత్తున అవినీతి నెట్‌వర్క్ దాగి ఉందని, దీనివల్ల రాత్రింబవళ్లు కష్టపడి చదివిన 22 లక్షల మంది విద్యార్థుల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ పలు పరీక్షల పేపర్లు లీక్ అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, కేవలం తమకు అనుకూలమైన బ్యూరోక్రాట్లను కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. ఈ దేశ యువత భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు , ఈ కుంభకోణంలో ఉన్న పెద్ద తలకాయలను జైలుకు పంపే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం విచారణల పేరుతో కాలయాపన చేయకుండా, తక్షణమే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని లేదా ఆయనే స్వచ్ఛందంగా తప్పుకోవాలని రాహుల్ గాంధీ గట్టిగా డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment