Saturday, 23 May 2026

పది రోజుల్లోనే మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు


సీఎన్‌జీ ధర కూడా రూపాయి పెంపు

ఇంధన ధరల పెరుగుదలపై మండిపడుతున్న ప్రజలు


అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో నెలకొన్న తీవ్ర అస్థిరతల ప్రభావం దేశీయంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలపై స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా చమురు కంపెనీలు శనివారం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌ పై 87 పైసలు, డిజిల్‌పై 91 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గత పది రోజుల్లోనే ఇంధన ధరలను పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం.



తాజాగా పెరిగిన పెట్రోల్‌ ధరల ప్రకారం ఢిల్లీలో 99.51 (+0.87), కోల్‌కతాలో 110.64 (+0.94), ముంబైలో రూ. 108.49 (+0.90), చెన్నైలో రూ. 105.31 (+0.82)గా ఉండనున్నాయి.  అలాగే డీజిల్‌ ధరలు ఢిల్లీలో రూ. 92.49 (+0.91), కోల్‌కతాలో రూ.97.02 (+0.95), ముంబయిలో రూ.95.02 (+0.94), చెన్నైలో రూ.96.98 (+0.87)గా ఉండనున్నాయి. ఇక, తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.112.84కు చేరగా, లీటర్‌ డీజిల్‌ ధర రూ.100.94కి పెరిగాయి. మరోవైపు సీఎన్‌జీ ధరను కేంద్రం మరోసారి పెంచింది . కిలో సీఎన్‌జీపై రూ.1 పెంచుతున్నట్లు శనివారం ప్రకటన జారీ చేసింది. 10 రోజుల వ్యవధిలో సీఎన్‌జీ ధరలను పెంచడం ఇది మూడోసారి. 


ధరలను నియంత్రించాలని ప్రజల డిమాండ్‌

ప్రముఖ నగరాలన్నింటిలోనూ ఈ ధరల పెరుగుదల అమలులోకి రావడంతో, నిత్యావసరాల ఖర్చులు ఎక్కడ పెరిగిపోతాయోనని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా మారుతున్న ఈ ధరల వల్ల రోజువారీ ప్రయాణికులు, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ పూర్తిగా తలకిందులవుతోందని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఇంధన ధరలను నియంత్రించాలని ప్రజల నుంచి గట్టి డిమాండ్ వినిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోని నివాసితులు ఈ తాజా ధరల పెరుగుదలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆదాయాలు పెరగనప్పటికీ, నిరంతరం పెరుగుతున్న ఇంధన ఖర్చులు తమ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తున్నాయని వారు వాపోతున్నారు. సామాన్యుల ఇబ్బందులను పట్టించుకోకుండా ధరలను పెంచుకుంటూ పోవడంపై కొందరు పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనం వాడటం అనేది విలాసం కాదని, రోజువారీ పనుల కోసం తప్పనిసరి అని, ప్రత్యామ్నాయంగా ఉన్న ఎలక్ట్రిక్ కార్లు కూడా సాధారణ ప్రజలు కొనే స్థాయిలో అందుబాటులో లేవని స్థానికులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న ఈ ఇంధన ధరల భారం నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం శాశ్వత నియంత్రణ వ్యవస్థను తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

No comments:

Post a Comment

Featured post

ఇవాంకా ట్రంప్‌ను హతమార్చేందుకు కుట్ర

   నిఘా వర్గాల చేతికి ఫ్లోరిడా నివాస నమూనా అమెరికాలో ఐఆర్‌జీసీ ఉగ్రవాది అరెస్ట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను...