- ఐరాస భద్రతా మండలిలో దిల్లీ విశ్వరూపం..
- అఫ్గానిస్తాన్‌లో అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఇస్లామాబాద్‌పై భారత్ నిప్పులు!
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) వేదికగా భారతదేశం మరోసారి పొరుగుదేశమైన పాకిస్తాన్ ఉగ్రవాద మూలాలను, దాని ద్వంద్వ విధానాలను ప్రపంచం ముందు ఘోరంగా ఎండగట్టింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీష్ పర్వతనేని పాకిస్తాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత దేశ ప్రజలపైనే బాంబులు వేసుకునే ప్రవృత్తి ఉన్న పాకిస్తాన్‌కు.. చరిత్రలోనే పెద్ద ఎత్తున 'నరమేధాలు' (Genocidal Acts) సాగించిన ఒక నల్లని మచ్చ ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. "సాయుధ ఘర్షణలలో పౌరుల రక్షణ" అనే అంశంపై జరిగిన వార్షిక బహిరంగ చర్చలో పాల్గొన్న భారత్, అంతర్గత విషయాలను వదిలేసి పక్క దేశాలపై పగ పెంచుకుంటున్న పాకిస్తాన్ ప్రచార ఆర్భాటాలను తీవ్రంగా ఖండించింది.
ఐక్యరాజ్యసమితి అసిస్టెన్స్ మిషన్ ఇన్ అఫ్గానిస్తాన్ (UNAMA) విడుదల చేసిన తాజా నివేదికల ఆధారంగా భారత్ ఈ ఘాటు విమర్శలు చేసింది. 2026 సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే పాకిస్తాన్ సైనిక బలగాలు జరిపిన సరిహద్దు సాయుధ దాడులు, ప్రధానంగా వైమానిక దాడుల (Air Strikes) కారణంగా అఫ్గానిస్తాన్‌లో సుమారు 750 మంది అమాయక పౌరులు మరణించడం లేదా తీవ్రంగా గాయపడటం జరిగిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పౌరుల మరణాలకు కారణమైన మొత్తం 95 ఘోర సంఘటనలలో.. ఏకంగా 94 సంఘటనలు కేవలం పాకిస్తాన్ భద్రతా దళాల వల్లే జరిగాయని యూనామా (UNAMA) నిర్ధారించింది. శాంతి, కరుణకు ప్రతీకగా నిలిచే పవిత్ర రంజాన్ మాసంలో కూడా పాకిస్తాన్ ఏమాత్రం మానవత్వం లేకుండా కాబూల్‌లోని 'ఓమిద్ అడిక్షన్ ట్రీట్‌మెంట్ హాస్పిటల్' (Omid Addiction Treatment Hospital) పై ఘోరమైన వైమానిక దాడికి తెగబడిందని గుర్తుచేశారు. ఈ పిరికిపంద చర్య వల్ల 269 మంది రోగులు, పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 122 మంది గాయపడ్డారని, ఆసుపత్రిని మిలిటరీ టార్గెట్‌గా చూపించడం ఏ చట్టాల కింద సమర్థనీయమని హరీష్ పర్వతనేని ప్రశ్నించారు.
సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, అమాయక అఫ్గాన్ పౌరులను బలితీసుకుంటున్న పాకిస్తాన్ తీరును తీవ్రంగా ఖండించిన భారత్.. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలను అంతర్జాతీయ సమాజం చట్టబద్ధంగా జవాబుదారీ చేయాలని డిమాండ్ చేసింది. పాకిస్తాన్ చేస్తున్న అకృత్యాల వల్ల అఫ్గానిస్తాన్‌లో ఇప్పటివరకు 94,000 మందికి పైగా సాధారణ ప్రజలు నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు తన స్వంత పౌరులపైనే అణచివేతకు పాల్పడిన చరిత్ర ఉందని, 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో 'ఆపరేషన్ సెర్చ్‌లైట్' పేరుతో పాక్ సైన్యమే స్వయంగా 4 లక్షల మంది, నరమేధానికి పాల్పడిందని అంతర్జాతీయ వేదికపై గుర్తుచేశారు. నైతికత, చట్టం, విశ్వాసం లేని పాకిస్తాన్.. తన అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే దశాబ్దాలుగా సరిహద్దులు దాటి హింసను ప్రేరేపిస్తోందని, ఆ దేశం చేసే తప్పుడు ప్రచారాలను ప్రపంచం నమ్మే స్థితిలో లేదని భారత్ స్పష్టం చేసింది. వివాదాస్పద ప్రాంతాలలో ఆసుపత్రులు, పాఠశాలలు, మానవతావాద సిబ్బంది రక్షణే ధ్యేయంగా అంతర్జాతీయ చట్టాలను కఠినంగా అమలు చేయాలని భద్రతా మండలిని భారత్ కోరింది.
No comments:
Post a Comment