మరో కొన్ని గంటల్లోనే ప్రపంచానికి శుభవార్త..
భారత్ వేదికగా ఇరాన్ శాంతి ఒప్పందంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక సంకేతాలు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా చరిత్రాత్మక పరిణామం చోటుచేసుకోనున్నది. నాలుగు రోజుల పర్యటన కోసం భారతదేశంలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై మరికొన్ని గంటల్లోనే ప్రపంచానికి ఒక "శుభవార్త" అందే అవకాశం ఉందని ఢిల్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కలిసి దాదాపు 53 నిమిషాల పాటు సాగిన సంయుక్త విలేకరుల సమావేశంలో రూబియో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకుముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇజ్రాయెల్ , ఇతర మధ్యప్రాచ్య మిత్రదేశాలతో మాట్లాడిన తర్వాత ఇరాన్‌తో శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని, తుది వివరాలపై చర్చలు జరుగుతున్నాయని తన సామాజిక మాధ్యమం 'ట్రూత్ సోషల్' వేదికగా ప్రకటించారు. మూడు నెలలుగా సాగుతున్న ఈ భీకర యుద్ధానికి ఈ ఒప్పందం ద్వారా తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ప్రతిపాదిత శాంతి ఒప్పందం ద్వారా అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన, ప్రస్తుతం ఇరాన్ దిగ్బంధనంలో ఉన్న 'హార్ముజ్ జలసంధి'ని తిరిగి పునరుద్ధరించనున్నట్లు అమెరికా పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా వాణిజ్య నౌకలను అడ్డుకోవడం కుదరదని, హోర్ముజ్ జలసంధిని అంతర్జాతీయ జలమార్గంగానే ఉంచాలని రూబియో స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకోవడమే అమెరికా అంతిమ లక్ష్యమని, ఈ ఒప్పందం ఆ దిశగానే సాగుతుందని ఆయన వివరించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ జరిపిన చర్చలు కూడా ఫలప్రదమవ్వడంతో ఈ శాంతి ముసాయిదా దాదాపు కొలిక్కి వచ్చినట్లు అమెరికా వర్గాలు భావిస్తున్నాయి.
అయితే, అమెరికా చేస్తున్న ఈ ప్రకటనలను ఇరాన్ విప్లవాత్మక గార్డ్స్ (ఐఆర్‌జీసీ) తోసిపుచ్చింది. ట్రంప్ చేసిన పోస్ట్ కేవలం ఒక రాజకీయ "ప్రచార ఆర్భాటం" మాత్రమేనని ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ పేర్కొంది. హార్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనని, కేవలం యుద్ధానికి ముందు ఉన్న స్థాయిలో నౌకల రాకపోకలకు మాత్రమే అంగీకరించామని, దీని అర్థం మునుపటిలా అక్కడ ఉచిత రవాణాకు అనుమతించడం కాదని ఇరాన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా, అమెరికా ఆశిస్తున్నట్లు ఈ చర్చలలో ఇరాన్ అణు కార్యక్రమం గురించి తాము ఎలాంటి చర్చలు జరపలేదని, అణ్వాయుధాల విషయంలో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదని ఇరాన్ మిలిటరీ వర్గాలు స్పష్టం చేయడంతో ఈ ఒప్పందంపై ఇంకా కొన్ని సవాళ్లు మిగిలే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలిసి నడుస్తాం: రూబియో
అమెరికాతో ఒప్పందంలోని కొన్ని అంశాలపై భారత్ అభ్యంతరం చెబుతోందన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. గల్ఫ్ సంక్షోభం, రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించినట్లు రూబియో వెల్లడించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్- అమెరికా కలిసి నడుస్తాయన్నారు.‘‘భారత్, అమెరికా రెండూ ఉగ్రవాద బాధిత దేశాలే. ఈ రెండూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు. వ్యూహాత్మక భాగస్వాములు. భారత్‌లో పర్యటించడం గర్వంగా ఉంది’’ అని అమెరికా విదేశాంగ మంత్రి అన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఆ దేశ బృందం భారత్‌కు రాబోతోందని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు
భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసేవారంతా మూర్ఖులు
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అమెరికాలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న జాత్యహంకార వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్రంగా స్పందించారు.ఆన్‌లైన్ లేదా ఇతర ప్రదేశాలలో భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారంతా 'మూర్ఖులు' అని, ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఇలాంటి వారు ఉంటారని అన్నారు. కేవలం కొద్దిమంది బుద్ధిహీనులు చేసే పనుల వల్ల అమెరికా సంస్కృతిని తప్పుబట్టలేమని స్పష్టం చేశారు. అమెరికా ఆర్థికవృద్ధిలో ఇండో-అమెరికన్ల పాత్రను కొనియాడిన రూబియో.. వారు అందిస్తున్న 20 బిలియన్ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అభినందించారు. ఇదే సమయంలో హెచ్-1బీ , ఎఫ్1 , జె1 వీసా నిబంధనలలో వస్తున్న మార్పులపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాజా వలసల సంక్షోభం నేపథ్యంలో అమెరికా తన జాతీయ ప్రయోజనాల కోసమే వీసా వ్యవస్థను ఆధునీకరిస్తోందని, ఈ సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకూ వర్తిస్తాయని, ప్రత్యేకంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని చేసినవి కావని స్పష్టం చేశారు. భారత్-అమెరికాల మధ్య ఉన్న వ్యూహాత్మక బంధం అత్యంత పటిష్టమైనదని ఆయన పునరుద్ఘాటించారు.
No comments:
Post a Comment