- గుళ్లు, పాఠశాలలకు సమీపంలోని 717 టాస్మాక్ దుకాణాల మూసివేతకు ఆదేశం
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సి. జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆయన ఒక భారీ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థనా మందిరాలతో పాటు విద్యా సంస్థలు , బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను (TASMAC) తక్షణమే మూసివేయాలని మంగళవారం అధికారులను ఆదేశించారు. రాబోయే రెండు వారాల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన డెడ్ లైన్ విధించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు, మద్యం మహమ్మారి నుంచి సామాన్య ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను రక్షించడమే లక్ష్యంగా ఈ కీలక అడుగు వేశారు.విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గత ప్రభుత్వాలు మద్యం ద్వారా వచ్చే ఆదాయానికే ప్రాధాన్యం ఇచ్చాయని, కానీ తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం , సామాజిక భద్రతకే మొదటి స్థానం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,765 టాస్మాక్ దుకాణాల్లో ఈ 717 దుకాణాలను తొలగించడం ద్వారా తొలి దశలోనే భారీ మార్పుకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయం పట్ల మహిళా సంఘాలు , విద్యార్థి లోకం నుంచి హర్షం వ్యక్తమవుతోంది. కేవలం మద్యం నియంత్రణే కాకుండా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళల రక్షణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ , డ్రగ్స్ వ్యతిరేక విభాగాల ఏర్పాటు వంటి కీలక హామీల అమలుపై కూడా సీఎం విజయ్ వేగంగా దృష్టి సారిస్తున్నారు.
No comments:
Post a Comment