- రత్లాం సమీపంలో ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు
- అప్రమత్తతతో తప్పిన పెద్ద ముప్పు, ప్రయాణికులంతా సురక్షితం
మధ్యప్రదేశ్‌లోని రత్లాం రైల్వే డివిజన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఘోర రైలు ప్రమాదం తప్పింది. కేరళలోని తిరువనంతపురం నుంచి దేశ రాజధాని దిల్లీకి బయలుదేరిన '12431 రాజధాని ఎక్స్‌ప్రెస్' (Rajdhani Express) లో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రైలు మధ్యప్రదేశ్ దాటుతున్న సమయంలో ఒక ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, రైల్వే సిబ్బంది, ప్రయాణికుల సకాలం అప్రమత్తత వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పశ్చిమ మధ్య రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటించారు.
రైల్వే వర్గాల సమాచారం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున సుమారు 5:15 గంటల సమయంలో విక్రమ్‌గఢ్ ఆలోట్ - లూనీ రిచ్చా స్టేషన్ల మధ్య రైలు ప్రయాణిస్తుండగా బి-1 (B-1) ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆ కోచ్‌లో 68 మంది ప్రయాణికులు నిద్రిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ కోచ్ వెనుక భాగంలో అనుసంధానించబడి ఉన్న లగేజీ-కమ్-గార్డ్ వ్యాన్ (SLR) కూడా పూర్తిగా దెబ్బతింది. ప్రమాదాన్ని గమనించిన వెంటనే లోకో పైలట్ రైలును నిలిపివేశారు. భద్రతా చర్యల్లో భాగంగా తక్షణమే ఓవర్‌హెడ్ విద్యుత్ సరఫరాను (OHE) నిలిపివేసి, మంటలు అంటుకున్న కోచ్‌ను మిగిలిన రైలు పెట్టెల నుంచి వేరు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలలో రైలు పెట్టె నుండి దట్టమైన నల్లటి పొగలు ఆకాశంలోకి ఎగబాకడం, మంటల తీవ్రతకు ట్రాక్ పక్కన ఉన్న చెట్లు కూడా తగలబడటం కనిపించింది.
ప్రమాదానికి గురైన కోచ్‌లోని ప్రయాణికులను సురక్షితంగా ఖాళీ చేయించి, వారిని రైలులోని ఇతర కోచ్‌లలోకి సర్దుబాటు చేశారు. రాజస్థాన్‌లోని కోట రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత వారి కోసం అదనంగా మరొక ఏసీ కోచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన రెండు పెట్టెలను తొలగించిన అనంతరం ఉదయం 9:45 గంటల ప్రాంతంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ మళ్లీ దిల్లీకి పయనమైందని పశ్చిమ మధ్య రైల్వే సీపీఆర్ఓ హర్షిత్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఈ రైలు శుక్రవారం కేరళలో బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంది. సుమారు 2,500 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని, ఢిల్లీకి కేవలం 650 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా ఆ రూట్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అవధ్ ఎక్స్‌ప్రెస్, ముంబై సెంట్రల్-దురంతో ఎక్స్‌ప్రెస్, నిజాముద్దీన్-పుణె స్పెషల్, హరిద్వార్-బాంద్రా ఎక్స్‌ప్రెస్, ఢిల్లీ-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ సహా సుమారు 18 రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేయడంతో వాటి షెడ్యూల్స్ తలకిందులయ్యాయి. అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై రైల్వే ఉన్నతాధికారులు లోతైన దర్యాప్తునకు ఆదేశించారు.
No comments:
Post a Comment