- అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందమే లక్ష్యంగా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం..
- ఇరాన్ నిధులపై ఇస్లామాబాద్ కన్ను!
తీవ్ర ఆర్థిక సంక్షోభం, సుమారు 100 బిలియన్ డాలర్లకు పైగా ఉన్న విదేశీ అప్పులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్, తన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించుకోవడానికి ఒక వినూత్న వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఎలాగైనా శాంతి ఒప్పందం కుదిరేలా చేసి, ఆ తర్వాత ఇరాన్ నుండి భారీగా ఆర్థిక సహాయం పొందాలని ఇస్లామాబాద్ గట్టిగా ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్ మీడియా సంస్థ 'C14' ఒక సంచలన నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు టెహ్రాన్ , ఇస్లామాబాద్ల మధ్య ఒక అంతర్గత అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం, అమెరికాతో జరుగబోయే ఒప్పందంలో ఇరాన్‌కు అనుకూలమైన షరతులు ఉండేలా పాకిస్తాన్ మధ్యవర్తిగా సహాయం చేస్తుంది. ఇందుకు ప్రతిఫలంగా, భవిష్యత్తులో అమెరికా ఆంక్షలు తొలగిపోయిన తర్వాత ఇరాన్‌కు వచ్చే భారీ నిధుల నుండి పాకిస్తాన్ అప్పులను తీర్చడానికి ఇరాన్ ఆర్థిక సాయం అందించాల్సి ఉంటుంది.
ఈ దౌత్యపరమైన వ్యూహంలో భాగంగానే పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి సయ్యద్ మొహ్సిన్ నఖ్వీ ఒకే వారంలో రెండోసారి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు చేరుకున్నారు. ఆయన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ , అక్కడి అంతర్గత వ్యవహారాల మంత్రితో కలిసి ఈ పరోక్ష చర్చల పురోగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. అమెరికా పంపిన సరికొత్త ప్రతిపాదనలను పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారానే ఇరాన్ అందుకున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయ్ ధృవీకరించారు. ఇరాన్ తన పాత 14 సూత్రాల ప్రణాళిక ఆధారంగానే అమెరికాతో చర్చలు జరుపుతోందని, అయితే ప్రస్తుతానికి తీవ్రమైన అపనమ్మకం మధ్యే ఈ ప్రక్రియ సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ పర్యటనలో ఉన్న మంత్రి నఖ్వీ చర్చల విజయవంతంపై ఆధారపడి, పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ కూడా త్వరలోనే టెహ్రాన్ చేరుకునే అవకాశం ఉందని ఇరాన్ మీడియా సంస్థ 'ISNA' వెల్లడించింది.
మరోవైపు పశ్చిమ ఆసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తాము ఆశించిన వంద శాతం సరైన సమాధానాలు ఇరాన్ నుండి రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఒప్పందానికి రాకుంటే ఆధునిక చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా అమెరికా సైన్యం నుండి కఠినమైన శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అడ్వైజర్ స్టీఫెన్ మిల్లర్ హెచ్చరించారు. ఈ తీవ్రమైన ఆంక్షలు , సైనిక ఒత్తిళ్ల వల్ల ఇరాన్ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో శాంతి ఒప్పందం వైపు మొగ్గు చూపుతోంది. ఎలాగైనా ఈ రెండు దేశాల మధ్య రాజీ కుదిరితే, ఇరాన్ ఆర్థికంగా పుంజుకుంటుందని, తద్వారా తమ దివాలా తీసే స్థితిలో ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు లైఫ్ లైన్ లభిస్తుందని ఇస్లామాబాద్ గట్టిగా నమ్ముతోంది.
No comments:
Post a Comment